మాగ్నెట్ ఫిషింగ్: గాలానికి చిక్కిన వస్తువును చూసి ఆ జంట ఆశ్చర్యపోయింది, ఆపై పోలీసులకు చెబితే..

మాగ్నెట్ ఫిషింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరస్సు,నదులలో మాగ్నెట్ ఫిషింగ్ చేస్తారు

మాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఓ జంటకు అనుకోని అదృష్టం వరించింది. వారు తాడుకు అయస్కాంతాన్ని కట్టి సరస్సులోకి విసిరితే ఏకంగా డబ్బులతో నిండిన ఓ బీరువానే బయటకు వచ్చింది. ఆ బీరువాలో లక్ష డాలర్ల (రూ.83 లక్షలు) సొమ్ము ఉంది. ఈ ఘటన న్యూయార్క్ సరస్సులో జరిగింది.

న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ ప్రాంతంలోని ఫ్లషింగ్ మీడౌస్ కరోనా పార్కులో గల సరస్సులోకి జేేమ్స్ కేన్, బార్బీ అగోస్టిన్ జంట సూదంటురాయికి తాడు కట్టి జారవిడిచారు.

కొద్దిసేపటి తరువాత బరువుగా అనిపించడంతో తాడు బయటకు లాగారు. పైకి లాగిన తాడుతో పాటు ఓ ఇనుప బీరువా కూడా వచ్చింది. అందులో బాగా తడిసి, పాడైన వంద డాలర్ల నోట్లు ఉన్నాయి.

వారు ఈ విషయాన్ని న్యూయార్క్ వన్ పోలీసులకు తెలిపారు. ఏ నేరంతోనూ ఈ బీరువాకు సంబంధం లేదని వారు పోలీసులకు తెలిపారు.

‘‘గతంలోనూ ఇటువంటి అనేక బీరువాలను కనుగొన్నాం’’ అని కేన్ చెప్పారు.

‘‘మేం దాన్ని బటయకు తీశాం. అదో వందల డాలర్ల గుట్ట’’ అని ఆయన చెప్పారు.

‘‘అవి తడిసిపోతున్నాయి, చాలామటుకు దెబ్బతిన్నాయి. ఈ బీరువా యజమాని ఎవరో కనుక్కోవడానికి అందులో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు’’ అని అగోస్టిన్ చెప్పారు.

ఈ వివరాలు చెప్పిన తరువాత పోలీసులు వారికి అభినందనలు చెప్పి, ఆ బీరువాను తీసుకోవడానికి అనుమతిచ్చారు.

చెరువులు, నదులు, సముద్రాలలో అయస్కాంతాన్ని జారవిడిచి వస్తువులను బయటకు తీయడాన్ని మాగ్నెట్ ఫిషింగ్ అంటారు.

కోవిడ్ 19 మహమ్మారి వేళ ఈ జంట మాగ్నెట్ ఫిషింగ్ మొదలుపెట్టింది.

గతంలో తమకు రెండో ప్రపంచ యుద్ధం నాటి గ్రెనేడ్స్ 19వ శతాబ్దం నాటి తుపాకులు, ఓ మోటారు బైక్ కూడా ఇలాగే దొరికాయని ఈ జంట తెలిపింది.

మ్యాగ్నెటిక్ ఫిషింగ్

ఫొటో సోర్స్, MARK MCGEACHIN

ఇక్కడ గాలం వేస్తే బాంబులు, తుపాకులు, కత్తులు పడుతుంటాయి

నదులు, జలాశయాల్లో అరుదైన, వింత వస్తువులు గాలానికి చిక్కిన ఘటనలు చాలానే ఉన్నాయి.

ఐదేళ్ల కిందట స్కాట్లాండ్‌లోని నదులు, కాలువలు, చెరువుల్లో ఓ వ్యక్తి, ఆయన కొడుకు కలిసి మాగ్నెట్ ఫిషింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ బాంబుల నుంచి కత్తుల వరకు రకరకాల ఆయుధాలు బయటపడుతూనే ఉన్నాయి.

42 ఏళ్ల మార్క్ మెక్‌జియాచిన్, ఆయన తొమ్మిదేళ్ల కొడుకు జేమ్స్ ప్రతివారం స్కాట్లాండ్‌లోని కాలువలను జల్లెడ పడుతుంటారు.

తాడుకు ఒక పెద్ద అయస్కాంతంను కట్టి నీటిలోకి దింపి దానికి అతుక్కునే లోహాలతో తయారు చేసిన వస్తువుల కోసం వీరు గాలిస్తారు.

తమకు దొరికిన ప్రతి తుపాకీ, కత్తి లేదా బాంబును స్కాట్లాండ్ పోలీసులకు రిపోర్టు చేస్తామని ఆయన తెలిపారు.

తాము బయటకు తీసిన కొన్ని ఆయుధాలు పేలే అవకాశం ఉన్నవి కూడా ఉన్నాయని, వాటిని నిర్వీర్యం చేసేందుకు బాంబ్ స్క్వాడ్‌లను పిలుస్తుంటామని మార్క్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, అందరూ నదిలో చేపలు పడతారు, ఈయన మాత్రం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)