అరుణాచల్‌లో అధికారం మళ్లీ బీజేపీదే, సిక్కింలో ఒక్కటి తప్ప అన్ని సీట్లూ గెలిచిన ఎస్‌కేఎం

ఫొటో సోర్స్, ANI
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ-బీజేపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) విజయం సాధించాయి.
సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 సీట్లలో ఎస్‌కేఎం పార్టీ 31 స్థానాలు గెలుచుకుంది.
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 46 సీట్లు, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ - ఎన్‌పీఈపీ 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ -ఎన్సీపీ 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ - పీపీఏ 2, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.
స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
బమెంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుమార్ వయ్ బీజేపీ అభ్యర్థి డోబా లామినో మీద విజయం సాధించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ గెలుచుకున్న సీటు ఇదొక్కటే.
బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంది. పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా ఎన్నికల్లో బీజేపీకి 54.57 శాతం ఓట్లు దక్కాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ 16.11 శాతం ఎన్సీపీకి 10.43 శాతం ఓట్లు వచ్చాయి.
2019లో అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుంది. ఎన్‌పీపీ 5, ఎన్సీపీ 4, జనతాదళ్ యునైటెడ్ 7 చోట్ల విజయం సాధించాయి.

సిక్కింలో ఏం జరిగింది?
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది.
సిక్కింలో ఒక్కటి తప్ప మిగతా అన్ని స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా-ఎస్‌కేఎం గెలుచుకుంది.
మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎస్‌కేఎం పార్టీ అభ్యర్థులు 31 చోట్ల విజయం సాధించారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.
షియారీ నియోజకవర్లంలో ఎస్‌డీఎఫ్ అభ్యర్థి టెంజింగ్ నోర్బు లామ్తా 6.633 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎస్‌కేఎం తరపున పోటీ చేసిన కుంగా నిమా లెప్చాకు 5319 ఓట్లు వచ్చాయి.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా అభ్యర్థులు 17 మంది, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున 15 మంది విజయం సాధించి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ అడుగు పెట్టారు.

విజయంపై మోదీ ఏమన్నారు?
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించినందుకు అరుణాచల్‌ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు.
“అరుణాచల్ ప్రదేశ్‌కు ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి మద్దతిస్తూ తీర్పు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మా పార్టీ చేస్తున్న పనిని కొనసాగిస్తుంది” అని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో మోదీ పోస్ట్ చేశారు.
“బీజేపీ పట్ల విశ్వాసం ఉంచినందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు రుణపడి ఉంటాం” అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మెసేజ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
పెమాఖండూ ఎవరు?
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ నాయకత్వంలో ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. పెమా ఖండూ తన స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెమా ఖండూ తండ్రి దోర్జీ ఖండూ కూడా ముఖ్యమంత్రిగా పని చేశారు.
పెమా ఖండూ అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2016లో బాధ్యతలు చేపట్టారు. అప్పుడాయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్‌ను విడిచిపెట్టి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేరారు. రెండు నెలల తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు.
ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన టూరిజం, పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా పని చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













