ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచిందంటే..

మూడు వారాల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజల నిరీక్షణకూ జూన్ 4తో ముగింపు రానుంది.

ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించే ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది.

ఏపీలోని 175 నియోజకవర్గాలలో పోటీ చేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది.

3.33 కోట్ల మంది ఆంధ్రులు ఎలాంటి తీర్పిచ్చారో తెలుస్తుంది.

పిఠాపురంలో కౌంటింగ్ ఏర్పాట్లు

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, పిఠాపురంలో కౌంటింగ్ ఏర్పాట్లు
BBC News Telugu Whatsapp Channel
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రగిరి, రంపచోడవరం 29 రౌండ్లు.. కొవ్వూరు, నరసాపురం 13 రౌండ్లు

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 20 కంటే తక్కువ రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తయ్యేవి 111 స్థానాలున్నాయి.

61 స్థానాలలో కౌంటింగ్ 21 నుంచి 24 రౌండ్లలో పూర్తికానుంది. మూడు స్థానాల కౌంటింగ్ మాత్రం 25 రౌండ్లకు మించనుంది.

కొవ్వూరు, నర్సాపురం నియోజకవర్గాల కౌంటింగ్ మిగతా అన్నిటికంటే తక్కువగా 13 రౌండ్లలోనే పూర్తి కానుంది.

అన్నిటికంటే ఎక్కువగా చంద్రగిరి, రంపచోడవరం నియోజకవర్గాలలో కౌంటింగ్‌కు 29 రౌండ్లు పట్టనుంది.

భీమిలి, పాణ్యం నియోజకవర్గాల లెక్కింపు 25 రౌండ్ల పాటు సాగనుంది.

ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికొస్తే 102 స్థానాలలో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ రెండు రౌండ్లలోనే ముగియనుంది. 48 చోట్ల మాత్రం 3 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది. 25 నియోజకవర్గాలలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు 4 రౌండ్లు పడుతుంది.

కాగా జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8.30 నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుపెడతారని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

లెక్కింపు కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కింపు ప్రక్రియను ఈసీ నియమించిన 119 మంది అబ్జర్వర్లు పరిశీలించనున్నారు.

ఈవీఎంలు

ఫొటో సోర్స్, Getty Images

సుదీర్ఘంగా సాగిన ఎన్నికలు

దేశవ్యాప్తంగా ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఎలక్షన్ కమిషనర్లలో ఒకరైన అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.

ఈసారి ఎన్నికలు ఏడు విడతలలో 44 రోజుల పాటు సాగాయి. షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి వరకు 82 రోజులు పట్టింది. దేశ చరిత్రలో ఇన్ని రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగడం ఇది రెండోసారి.

ఇంతకుముందు 1951-52లో ఎన్నికలు 120 రోజుల పాటు కొనసాగాయి.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఫొటో సోర్స్, ECI

ఫొటో క్యాప్షన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

‘దేశంలో 64.2 కోట్ల మంది ఓట్లేసి ప్రపంచ రికార్డ్ సృష్టించారు’

ప్రస్తుత ఎన్నికలలో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది ప్రపంచ రికార్డ్ అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

ఈ సంఖ్య జీ7 దేశాలలోని మొత్తం ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువని ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.

ఓటేసిన వారిలో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు.

ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, AP I&PR

ఫొటో క్యాప్షన్, కాకినాడలో కౌంటింగ్ కేంద్రం

‘రీపోలింగ్ అవసరం తగ్గింది’

2019 ఎన్నికలలో 540 చోట్ల రీపోలింగ్ అవసరం కాగా ఈసారి కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ అవసరమైనట్లు కమిషన్ ప్రకటించింది.

మరోవైపు ఎన్నికలలో ధనప్రవాహాన్ని మరింతగా అడ్డుకున్నట్లు కమిషన్ చెప్పింది.

2019లో రూ. 3,500 కోట్ల నగదు ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకోగా ఈసారి రూ.10 వేల కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)