ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్: రాష్ట్ర రాజకీయాలను ఎలా మలుపు తిప్పారంటే..

- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా ఏర్పడటంలో, అది ఘన విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు.
రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంతో జనసేనాని నిరూపించారనేది రాజకీయ విశ్లేషకుల మాట.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్‌కు మద్దతు ఇస్తారా లేదా అనే సందిగ్థం నెలకొంది.
అయితే, ఎమ్మెల్సీని చేస్తానని వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్మకు తగిన మద్దతు ఇస్తానని పవన్ కల్యాణ్ కూడా చెప్పడంతో తెలుగుదేశం, జనసేన కేడర్ కలసి పనిచేయడం సులువైపోయింది.
పవన్ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అక్కడ కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీతను బరిలోకి దించింది. దీని ద్వారా ఆ సామాజిక ఓట్లు భారీగా చీలిపోయి పవన్ ఓటమి చవిచూస్తారనే వైసీపీ భావించిందనేది విశ్లేషకుల మాట.
మరో పక్క ముద్రగడ పద్మనాభం లాంటివారు పవన్ కల్యాణ్‌ను ఓడించాలంటూ పిలుపునివ్వడంతో రాష్ట్రం మొత్తం పిఠాపురంపైనే దృష్టి సారించింది.


ఫొటో సోర్స్, JanaSena Party /FB
కూటమి హీరో పవన్ కల్యాణే
జనసేన పార్టీని స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో మార్చి 14, 2022లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ప్రకటించారు.
ఈ ప్రకటనే ఏపీ రాజకీయాలలో అనూహ్య మార్పుకు కారణమైందని భావిస్తారు. అప్పటిదాకా జనసేన 2019 తరహాలోనే 2024 ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేస్తుందనుకున్నారు.
కానీ, పవన్ ప్రకటనతో ఆ పార్టీ తెలుగుదేశంతో జట్టుకడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే తన ఒక్కడి వల్లే కాదని, అందుకు 2019 ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ అని తన శ్రేణులకు బహిరంగంగానే చెప్పారు.
‘‘నా సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు. కానీ ఓట్లేసేటప్పటికీ నన్ను వదిలేశారు. కానీ నాకు బాధ లేదు. ఎందుకంటే నేను మీ కోసం పని చేస్తున్నాను’’ అని పవన్ తన శ్రేణులకు చెప్పారు.
తనను రెండుచోట్లా ఓడించి, కేవలం ఒకే ఒక్కసీటులోనే పార్టీని గెలిపిస్తే, ఒంటరి పోరు ఎలా చేయగలమంటూ తన కేడర్‌ను ప్రశ్నించి వారిని ఒప్పించారు.
ఆ తరువాత ఆయన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు.
‘‘కూటమి కడదామని చెప్పినప్పుడు పార్టీలో వ్యతిరేకత వచ్చింది. కానీ ఆయన అందరినీ ఒప్పించారు’’ అని చెప్పారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాసరావు.

ఫొటో సోర్స్, JanaSena Party /FB
ఎక్కడ నెగ్గాలో కాదు..
ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలియాలి అని పవన్ కల్యాణ్ తరచూ చెబుతుంటారు. ఇందుకు తగ్గట్టే ఆయన తన బలాన్ని, బలహీనతలను సరిగ్గా అంచనా వేసుకుని, కూటమి కట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లను బీజేపీతో కలిసి సర్దుబాటు చేసుకున్నారు.
కూటమి పోటీలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలలోనూ, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు దక్కాయి.
2019 ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమైనా, పవన్ కు మాత్రమ తమ కూటమిపై గట్టి నమ్మకం ఉంది.
ఇప్పుడా నమ్మకమే నిజమవడమేకాక, తాము నిలబడిన స్థానాల్లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించగలిగింది.
ముఖ్యంగా జనసేన తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలోనూ, 2 పార్లమెంటు స్థానాల్లో నూ విజయం సాధించి నూరుశాతం ఫలితాలు సాధించిన పార్టీగా నిలిచింది. అలాగే బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 3 ఎంపీ స్థానాల్లోనూ గెలిచింది.
పవన్ కల్యాణ్ తనను తాను తగ్గించుకోవడం ద్వారా కూటమి విలువ పెంచారన్నది విశ్లేషకుల మాట.

ఫొటో సోర్స్, JanaSena Party /FB
ప్రజారాజ్యం తెచ్చిన మార్పు
‘‘ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను. నాతో కలసి ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమా’’- జనసేన వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్‌గా కనిపించే ప్రశ్న ఇది.
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణానికి పై ప్రశ్న ఓ అద్దంలా కనిపిస్తుంటుంది. తన బలమేమిటో, తన బలహీనతలేమిటో పవన్ కల్యాణ్ బాగానే ఆకళింపు చేసుకున్నారు.
తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఆయనకు ఈ అనుభవాన్ని ఇచ్చిందని అంటారు.
రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనే ఎరుకను పవన్ కల్యాణ్ గ్రహించగలిరాని చెబుతారు.
2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేశారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమ పార్టీ ఎన్నికలలో పోటీ చేయదని ఆయన అప్పట్లో ప్రకటించారు.
అభివృద్ధి కోసం తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇస్తామని చెప్పారు. ఆ ఎన్నికలలో చంద్రబాబు, మోదీలతో పవన్ ప్రచారం చేశారు.

ఫొటో సోర్స్, JanaSena Party /FB
పాచిపోయిన లడ్డూలు.. ఘోర ఓటమి
2014 ఎన్నికల నాటికి, 2019 ఎన్నికల నాటికి జనసేన ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామని ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పిందని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
దీని తరువాత పవన్ 2019 ఎన్నికలలో వామపక్షాలతోనూ, బిఎస్పీతోనూ కలిసి కూటమిగా బరిలోకి దిగారు.
గాజువాక, భీమవరం స్థానాలనుంచి పవన్ పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికలలో జనసేనాని ఘోర ఓటమి చవిచూశారు. ఆయన పోటీ చేసిన రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే జనసేన నుంచి గెలుపొందారు. తరువాత ఆయన కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోయారు.
ఆ ఎన్నికలలో జనసేన 6 శాతం ఓట్లు సాధించింది.

ఫొటో సోర్స్, JanaSena Party /X
2024 ఎన్నికలలో..
2024 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన తరువాత అందుకు తగిన కార్యాచరణ వైపు కదిలారు.
అయితే జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదా అనే సందిగ్ధం ఓ వైపు, దమ్ముంటే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీచేయాలంటూ వైసీపీ శ్రేణుల సవాళ్లు మరోవైపు కూటమి ఏర్పాటుపై సందేహాలు కలిగించాయి.
పైగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందించడం, వారాహి యాత్ర వంటి వాటివల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందని జనసైనికులలో నమ్మకం పెరిగింది.
అదే సమయంలో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
దీని తరువాత పవన్ కల్యాణ్ జైలులో చంద్రబాబును పరామర్శించి రావడం ఏపీ రాజకీయాలలో మలుపుకు బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
దీని తరువాత 2024 ఎన్నికలలో కలసి పోటీచేస్తామని పవన్ ప్రకటించారు.
తమతోపాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ప్రకటించారు.

ఫొటో సోర్స్, JanaSena Party /X
వలంటీర్లపై విమర్శలు...
ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టించడంలోనూ పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారనేది రాజకీయ విశ్లేషకుల మాట.
జనవాణి కార్యక్రమం కోసం వైజాగ్‌కు వెళ్ళిన పవన్‌ను పోలీసులు హోటల్ గదికే పరిమితం చేయడం, ఏపీలో మహిళల మిస్సింగ్‌కు వలంటీర్లే కారణమనే అర్థం వచ్చేలా ఆయన చేసిన ప్రసంగం తీవ్ర సంచలనంగా మారింది.
‘‘పవన్ ఆరోపణల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్ గురించి కేంద్ర హోం శాఖ రాజ్యసభకు వివరాలు సమర్పించడం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ’’ అని వివరించారు కూసంపూడి శ్రీనివాసరావు.
అలాగే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారికి చెప్పులు చూపించి మరో సంచలనానికి కారణమయ్యారు పవన్ కల్యాణ్.
కూటమి ఏర్పడిన తరువాత అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలు ఎక్కడా బయట పడకుండా పవన్ కల్యాణ్ జాగ్రత్త వహించారు. ఇప్పుడాయన అసెంబ్లీలో సరికొత్త ప్రయాణానికి సిద్దమవుతున్నారు.
ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని చెప్పే పవన్ ఇప్పుడా ప్రయాణంలో ఓ మజిలీని చేరారు.
కానీ ఆయన ప్రయాణం ఇంకా మిగిలే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- చంద్రుడిపై ఆవల వైపు దిగిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- తెలంగాణ అనే పదం ఎక్కడ పుట్టింది? మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















