బీబీసీ పరిశోధన: లగ్జరీ పెర్‌ఫ్యూమ్‌ల వెనుక దారుణ నిజాలు, మల్లె తోటల్లో వాడిపోతున్న బాల్యం

మల్లె తోటలో పనిచేస్తున్న బాలిక
ఫొటో క్యాప్షన్, పదేళ్ళ బస్మల్లా, ఆమె తోబుట్టువులు రాత్రివేళ మల్లెపూలు కోస్తూ కుటుంబం గడవడానికి తమ తల్లికి సాయపడతారు.
    • రచయిత, అహ్మద్ ఎల్షామీ, నటాషా కాక్స్
    • హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్

రెండు ప్రధాన సౌందర్య ఉత్పత్తుల కంపెనీలకు పూలను సరఫరా చేసేవారు బాలకార్మికులను ఉపయోగించుకున్నారని బీబీసీ పరిశోదనలో వెల్లడైంది.

ఈ పరిశోధనలో లాంకోమ్, ఏరిన్ బ్యూటీ సంస్థల పూల సరఫరాదారులు, పిల్లలు సేకరించిన మల్లెపూలను వీరికి సరఫరా చేసినట్లు వెల్లడైంది.

అన్ని లగ్జరీ పెర్‌ఫ్యూమ్‌ బ్రాండ్‌లు, బాల కార్మికుల విషయంలో తమది జీరో టాలరెన్స్‌ అని పేర్కొంటాయి.

దీనిపై బీబీసీ ఆ సౌందర్య ఉత్పత్తుల సంస్థలను సంప్రదించగా, తాము మానవ హక్కులను గౌరవించడానికి కట్టుబడి ఉన్నామని లాంకోమ్ యాజమాన్య సంస్థ లోరియల్ చెప్పింది. ఈ విషయంపై తమ సరఫరాదారులతో చర్చిస్తున్నామని ఏరిన్ బ్యూటీ యజమాని ఎస్టీ లాడర్ తెలిపారు.

లాంకోమ్ తయారు చేసే ‘ఇడొల్ ఇంటెన్స్‌’లోను, ఏరిన్ బ్యూటీ తయారు చేసే ‘ఇకత్ జాస్మిన్’, ‘లిమోన్ డి సిలికా’లో ఉపయోగించే మల్లెపూలు ఈజిప్ట్ నుంచి వస్తాయి.

ప్రపంచంలో పండే మల్లె పూలల్లో సగం ఈజిప్ట్ ఉత్పత్తి చేస్తోంది. పెర్‌ఫ్యూమ్ తయారీలో మల్లె కీలకమైన ముడిపదార్ధం.

అనేక లగ్జరీ బ్రాండ్‌ల యాజమాన్య సంస్థలు, బడ్జెట్‌లను తగ్గించుకోవడంలో భాగంగా కార్మికులకు చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు. ఈజిప్టులో మల్లె పూలను కోసేవాళ్లు, తక్కువ కూలీ వల్లే తాము తమ పిల్లలను ఈ పనిలోకి తీసుకొస్తున్నామని అంటున్నారు.

మల్లెపూల సరఫరా గొలుసును తనిఖీ చేయడానికి పెర్‌ఫ్యూమ్‌ పరిశ్రమ ఉపయోగించే ఆడిటింగ్ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉందని బీబీసీ పరిశోధనలో తేలింది.

ఆధునిక బానిసత్వపు రూపాలపై పని చేసే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి టొమోయా ఒకొకాటా, బీబీసీ వెల్లడించిన విషయాలను చూసి తాను కలవరపడ్డానని చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా ఈజిప్ట్ మల్లె తోటల్లో గత సంవత్సరం పూలను సేకరించే సీజన్‌లో బీబీసీ రహస్యంగా చిత్రీకరించింది.

"ఈ పెర్‌ఫ్యూమ్ సంస్థలు కాగితం మీద పారదర్శకత, బాల కార్మికులకు వ్యతిరేకంగా పోరాటం వంటి చాలా విషయాలను వాగ్దానం చేస్తున్నా, ఈ ఫుటేజీని చూస్తుంటే అవి నిజం అనిపించడం లేదు" అని ఒకొకాటా అన్నారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
మల్లెతోటలో పనిచేస్తున్న ఫోటో
ఫొటో క్యాప్షన్, చీకటిలో తాము ఎలా పనిచేస్తుంది గమనించడానికి హెబా కుటుంబం ఓ టార్చిలైట్‌ను వినియోగిస్తుంది.

మిగిలేది 125 రూపాయలే

ఈజిప్ట్‌లో మల్లె తోటలు ఎక్కువగా ఉండే ఘార్బియా జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్న హెబా - ఎండలకు పూలు పాడవడానికి ముందే, తన పిల్లలను వేకువజామున 03:00 గంటలకు నిద్ర లేపుతారు.

పనిలో సహాయం చేయడానికి తనకు 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల తన నలుగురు పిల్లలూ అవసరం అని ఆమె తెలిపారు.

ఈజిప్ట్‌లోని చాలా మంది మల్లెపూలు కోసేవారిలాగా, ఆమె ఒక చిన్న పొలంలో పని చేస్తారు. ఆమె, ఆమె పిల్లలు ఎన్ని పూలను కోస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు. మేము ఆమెను చిత్రీకరించిన రాత్రి, ఆమె, పిల్లలు కలిసి 1.5 కిలోల మల్లెపూలను కోయగలిగారు. ఆమె సంపాదనలో మూడవ వంతు ఆ తోట యజమానికి చెల్లించాక, ఆ రాత్రి చేసిన పనికి సుమారు 125 రూపాయలు మిగిలాయి.

ఈజిప్టులో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న సమయంలో ఈ మొత్తం చాలా తక్కువ. పూలు కోసే కూలీల్లో అత్యధికులు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు.

హెబా 10 ఏళ్ల కుమార్తె బస్మల్లాకు తీవ్రమైన కంటి అలెర్జీ ఉంది. మేము ఆమెతో కలిసి వైద్యుడిని సంప్రదించినప్పుడు, కంటికి చికిత్స చేయకుండా పూలు కోయడం కొనసాగిస్తే, ఆమె దృష్టి దెబ్బతింటుందని డాక్టర్ చెప్పారు.

మల్లెపూలను కోసి, తూకం వేసిన తర్వాత, వాటిని పూల నుంచి నూనెను తీసే స్థానిక ఫ్యాక్టరీలకు పంపుతారు. వాటిలో ప్రధానమైనవి - ఎ ఫక్రీ అండ్ కంపెనీ, హాషెమ్ బ్రదర్స్, మచాలికో. ఏటా హెబా లాంటి వాళ్లు కోసే మల్లెపూల ధరను ఈ ఫ్యాక్టరీలే నిర్ణయిస్తాయి.

మల్లెతోటల్లో బాలలు ఫోటో
ఫొటో క్యాప్షన్, పెర్ఫ్యూమ్ కోసం పిల్లలు మల్లెపూలు కోయడాన్ని బీబీసీ గమనించింది.

ఈజిప్టు మల్లెపూల పరిశ్రమలో పని చేస్తున్న సుమారు 30 వేల మందిలో ఎంతమంది పిల్లలు ఉంటారో కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ 2023 వేసవిలో బీబీసీ ఈ ప్రాంతం అంతటా తిరుగుతూ, అనేక మంది స్థానికులతో మాట్లాడినపుడు, వాళ్లు పూలు కోసినందుకు తక్కువ కూలీని ఇస్తున్నారు కాబట్టి తాము పిల్లలను పనిలో ఉపయోగించుకోవాల్సి వస్తోందని చెప్పారు.

మేము నాలుగు వేర్వేరు ప్రదేశాలలో, చిన్నచిన్న పొలాల్లో పని చేస్తున్న వాళ్లలో, 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను చూశాం. మచాలికో ఫ్యాక్టరీకి చెందిన సొంత పొలాల్లో పిల్లలు పనిచేస్తున్నారని అనేక మంది మాకు చెప్పారు. దాన్ని రహస్యంగా చిత్రీకరించడానికి బీబీసీ అక్కడికి వెళ్లినపుడు, 12 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు కనిపించారు.

ఈజిప్టులో రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల మధ్య 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు పని చేయడం చట్టవిరుద్ధం.

ఫ్యాక్టరీలు మల్లెపూల నూనెను అంతర్జాతీయ సౌందర్య సాధనాల సంస్థలకు ఎగుమతి చేస్తే, అక్కడ పెర్‌ఫ్యూమ్‌లను తయారు చేస్తారు. స్విట్జర్లాండ్‌లోని గివాడన్ అలాంటి అతిపెద్ద సంస్థలలో ఒకటి, దీనికి ఏ ఫక్రీ అండ్ కంపెనీతో దీర్ఘకాల సంబంధం ఉంది.

స్వతంత్రంగా పెర్‌ఫ్యూమ్‌లు తయారు చేసే క్రిస్టోఫ్ లౌడామియెల్, పరిశ్రమలోని ఇతర వ్యక్తుల ప్రకారం, వాటి పైన ఉన్న పెర్‌ఫ్యూమ్‌ యాజమాన్య సంస్థలు లోరియల్, ఏరిన్ బ్యూటీ యజమాని ఎస్టీ లాడర్‌ లాంటి వారి చేతుల్లోనే అధికారం ఉంటుంది.

"మాస్టర్స్" అని పిలిచే ఈ సంస్థలు, ఈ సుగంధ సరఫరాదారులకు ఇచ్చే డబ్బు విషయంలో చాలా తక్కువ బడ్జెట్‌ కేటాయిస్తాయని ఆయన తెలిపారు.

"బాటిల్‌లో ఉండే పెర్‌ఫ్యూమ్‌ను వీలైనంత తక్కువ ధరకు సేకరించడం పైనే ఈ మాస్టర్స్ దృష్టి." ఆపై సాధ్యమైనంత ఎక్కువ ధరకు విక్రయించడం వాళ్ల లక్ష్యమని ఆ సంస్థలలో చాలా ఏళ్ల పాటు పనిచేసిన లౌడామియెల్ అన్నారు.

"నిజానికి వాళ్లు పూలు కోసేవాళ్ల జీతాన్ని లేదా మల్లెపూల ధరను నియంత్రించలేరు, ఎందుకంటే అది వారి నియంత్రణలో ఉండదు," అని ఆయన వివరించారు.

కానీ అవి నిర్దేశించిన బడ్జెట్ కారణంగా ఒత్తిడి పెరిగి, ఫ్యాక్టరీలకు అందే సొమ్ము, వాటిని కోసే కూలీల వేతనాలు తగ్గిపోతాయి.

"వాళ్లు మార్కెటింగ్‌లో వాటి అమూల్యమైన విలువ గురించి చెప్పే పెద్ద పెద్ద మాటలు, పూలు కోసేవాళ్లకు ఇస్తున్న వేతనం మధ్య చాలా తేడా ఉంది," అన్నారు ఆయన.

మల్లెతోటలో బాలకార్మికుడు
ఫొటో క్యాప్షన్, మచాలికో పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకు చెందిన ఓ మల్లెతోటలో బీబీసీ రహస్యంగా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఓ బాలుడిని కలిసింది.

‘భీషణ ప్రతిజ్ఞలు బోలెడు’

తమ ప్రచారంలో పెర్‌ఫ్యూమ్ సంస్థలు నైతిక విధానాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాయి. సరఫరా గొలుసులోని ప్రతి ఒక్కరూ బాల కార్మికుల తొలగింపు, సురక్షితమైన పని పద్ధతులకు సంబంధించి, ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు.

కానీ గివాడన్‌లో పని చేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం, పెర్‌ఫ్యూమ్‌ కంపెనీలకు తమ సరఫరా గొలుసు సంస్థలపై పర్యవేక్షణ లేకపోవడమే అసలు సమస్య.

తన పేరు వెల్లడించకూడదన్న నియమం మీద మాట్లాడుతూ ఆయన, సుగంధ ద్రవ్యాలను సరఫరా చేసే సంస్థలు తగిన ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవడానికి ఈ పెర్‌ఫ్యూమ్‌ యాజమాన్య సంస్థలు థర్డ్ పార్టీ ఆడిటింగ్ మీద ఆధారపడుతున్నాయని చెప్పారు.

ఈ సంస్థలు తమ వెబ్‌సైట్‌లు, ఐక్యరాజ్యసమితికి పంపిన లేఖలలో సెడెక్స్, యూఈబీటీ ఆడిటింగ్ సంస్థల గురించి ఎక్కువగా పేర్కొన్నాయి. వాటి ఆడిట్ నివేదికలు బహిరంగంగా అందుబాటులో లేవు కానీ మల్లెపూల కోసం వెదుకుతున్న కొనుగోలుదారుగా నటిస్తూ, మేము ఏ ఫక్రీ అండ్ కంపెనీని నైతిక విధానంలో సేకరించిన ఆ నివేదికలను మాకు పంపేలా చేయగలిగాం.

యూఈబీటీ గత సంవత్సరం ఒక ఫ్యాక్టరీని సందర్శించి, దాని ఆధారంగా ఇచ్చిన నివేదికలో, ఒక మానవ హక్కుల సమస్య సూచన కనిపిస్తుంది, కానీ అది వివరంగా లేదు. అయినా, ఆ కంపెనీకి "వెరిఫికేషన్" ఇచ్చారు, అంటే అది "బాధ్యతతో కూడిన మల్లెపూల నూనె"ని అందజేసినట్లు చెప్పవచ్చు.

యూఈబీటీ ఇచ్చిన జవాబులో "ఒక కార్యాచరణ ప్రణాళికకు లోబడి, బాధ్యతాయుతంగా పూలను సేకరిస్తున్నట్లు ఈ సంస్థకు ధృవీకరణ జారీ చేశాము. ఇది 2024 మధ్యకాలం వరకు చెల్లుబాటు అవుతుంది, అప్పటికీ ఆ ప్రణాళికను అమలు చేయకపోతే, ధృవీకరణను ఉపసంహరించుకుంటాం." అని తెలిపింది.

సెడెక్స్ నివేదిక ఫ్యాక్టరీకి మంచి ధృవీకరణ సర్టిఫికేట్ ఇచ్చినా, ఆ ఫ్యాక్టరీ సందర్శనను ముందుగా చెప్పి మరీ చేశారని, ఫ్యాక్టరీ స్థలాన్ని మాత్రమే ఆడిట్ చేశారు తప్ప మల్లెపూలను సేకరించిన పొలాలను కాదని తెలుస్తోంది.

"మేము అన్ని రకాల కార్మిక హక్కుల ఉల్లంఘనలను దృఢంగా వ్యతిరేకిస్తాం. అయితే అన్ని పర్యావరణ, మానవ హక్కుల ఉల్లంఘన లేదా ప్రభావాలను పరిశీలించేందుకు ఒకటే సాధనం మీదే ఆధారపడకూడదు," అని సెడెక్స్ సమాధానం ఇచ్చింది.

అత్తరు తయారీ
ఫొటో క్యాప్షన్, సుగంధసరఫరా దారులకు పెద్ద కంపెనీలు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నాయి.

అంతర్జాతీయ సరఫరా గొలుసులలో మానవ హక్కులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్న రెస్పాన్సిబుల్ కాంట్రాక్టింగ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు లాయర్ సారా దాదుష్, "ఆ వ్యవస్థలు సరిగా పని చేయడం లేదని వెల్లడిస్తోంది" అని బీబీసీ ఇన్వెస్టిగేషన్‌కు చెప్పారు.

సమస్య ఏమిటంటే, "ఆడిటర్‌లు వారు ఆడిట్‌కు ఎంత చెల్లించారో, దాని వరకు మాత్రమే ఆడిట్ చేస్తున్నారు". ఆడిట్ చేస్తున్న అంశాలలో బాల కార్మికుల సమస్యకు ‘ప్రధాన మూల కారణం’ అయిన కార్మికుల వేతనాలు ఉండకపోవచ్చు.

ఏ ఫక్రీ అండ్ కంపెనీ తమ పొలాలు, కర్మాగారం రెండింటిలోనూ బాల కార్మికులు నిషేధమని, అయితే తాము ఎక్కువ భాగం స్వతంత్ర సేకరణదారుల నుంచి పూలను సేకరిస్తామని చెప్పింది. "2018లో, యూఈబీటీ పర్యవేక్షణలో, మేము జాస్మిన్ ప్లాంట్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ మిటిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాము, దీని ప్రకారం పొలాలలో 18 ఏళ్లలోపు వ్యక్తులు పని చేయడంపై నిషేధం ఉంటుంది." అని ఫక్రీ తెలిపింది. ‘‘ఈజిప్ట్‌లో మీరు ఏ ప్రమాణాల ప్రకారం పోల్చినా, మల్లెపూలు కోయడానికి మంచి వేతనం లభిస్తుంది," అని తెలిపింది.

పూలను కోయడానికి 18 ఏళ్లలోపు వ్యక్తులను ఉపయోగించడం లేదని, గత రెండేళ్లుగా మల్లెపూలకు ఇస్తున్న ధరను పెంచామని, ఈ ఏడాదీ అదే చేస్తామని మచాలికో అంది. బీబీసీ నివేదిక "తప్పుదోవ పట్టించే సమాచారం ఆధారంగా" తయారు చేశారని హాషెమ్ బ్రదర్స్ అంది.

లాంకోమ్ ఇడొల్ ఇంటెన్స్‌ను తయారు చేసే గివాడన్, బీబీసీ పరిశోధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "బాల కార్మికులను తొలగించడానికి చర్య తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని తెలిపింది. ఏరిన్ బ్యూటీ కోసం ఇకత్ జాస్మిన్, లిమోన్ డి సిసిలియాలను తయారు చేసే, 2023లో మచాలికో నుంచి మల్లెలను సేకరించిన ఫిర్మెనిచ్, ఇప్పుడు తాము ఈజిప్ట్‌లో కొత్త సరఫరాదారుని నుంచి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. "ఈ సమస్యను పరిశ్రమ భాగస్వాములు, స్థానిక మల్లె రైతులతో సమష్టిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము," అని పేర్కొంది.

బాల కార్మికురాలి ఫోటో
ఫొటో క్యాప్షన్, కంటి అలెర్జీ పెరగడంతో వైద్యుడిని సంప్రదించేందుకు వెళుతున్న బస్మల్లా

బీబీసీ తన విచారణలో వెల్లడైన వివరాలను పెర్‌ఫ్యూమ్ తయారీ సంస్థలతోనూ పంచుకుంది.

దీనికి ప్రతిస్పందనగా లోరియల్, "అంతర్జాతీయంగా గుర్తించిన మానవ హక్కుల ప్రమాణాలను గౌరవించడానికి కట్టుబడి ఉన్నాము," అని పేర్కొంది. "రైతులకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరను ఇవ్వవద్దని మేం సరఫరాదారులను ఎప్పుడూ ఆదేశించలేదు. ఈ నియమాలకు మేం గట్టిగా కట్టుబడి ఉన్నా, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న లోరియల్ సరఫరాదారులు మా నియమాలను అతిక్రమించే అవకాశం ఉందని మాకు తెలుసు."

"సమస్య తలెత్తినప్పుడల్లా, మేము అంతర్లీన కారణాలను, సమస్యను పరిష్కరించే మార్గాన్ని గుర్తించడానికి చురుకుగా పని చేస్తాం. జనవరి 2024లో, మానవ హక్కుల ఉల్లంఘనలను గుర్తించడానికి, బాల కార్మికులను ఉపయోగించుకొంటున్న సమస్యపై దృష్టి సారించి, దానిని నిరోధించడానికి మా భాగస్వామి క్షేత్రస్థాయిలో పరిశోధనను చేపట్టారు." అని కూడా లోరియల్ తెలిపింది.

ఎస్టీ లాడర్ మాట్లాడుతూ, "బాలల హక్కుల రక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ తీవ్రమైన విషయాన్ని పరిశోధించడానికి మేం మా సరఫరాదారులను సంప్రదించాం. స్థానిక మల్లెపూల సరఫరా గొలుసు చుట్టూ ఉన్న సంక్లిష్టమైన సామాజిక-ఆర్థిక వాతావరణాన్ని గుర్తించాం , వాటిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అన్నారు.

ఘార్బియాలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెర్‌ఫ్యూమ్‌ను విక్రయిస్తున్న ధరను మేం హెబాకు చెప్పినప్పుడు మల్లెపూలను కోసే ఆమె ఆశ్చర్యపోయారు.

"ఇక్కడి ప్రజలకు ఎలాంటి విలువా లేదు," అని ఆమె అన్నారు. "ప్రజలు పెర్‌ఫ్యూమ్‌ వాడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పెర్‌ఫ్యూమ్‌ వాడే వ్యక్తులు అందులో పిల్లల బాధను చూడాలని, దానిపై మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను."

అయితే ఆ బాధ్యత వినియోగదారుడిది కాదని న్యాయవాది సారా దాదుష్ అన్నారు. "ఇది మనం పరిష్కరించాల్సిన సమస్య కాదు. మనకు చట్టం కావాలి... మనకు కార్పొరేట్ జవాబుదారీతనం అవసరం, దానిని కేవలం వినియోగదారులపై వదిలేయకూడదు." అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇది ముమ్మాటికి బాలల హక్కుల హననమే అంటున్న హక్కుల సంఘాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)