మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, వెనెస్సా బుష్‌ష్లుటర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్ చరిత్రాత్మక విజయం సాధించారు. నగర మాజీ మేయర్ అయిన షీన్‌బామ్ , ఆదివారం నాటి ఎన్నికల్లో 58% నుంచి 60% ఓట్లను గెలుచుకున్నట్లు ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయని మెక్సికో అధికారిక ఎలక్టోరల్ అథారిటీ తెలిపింది.
ఆమె తన ప్రధాన ప్రత్యర్థి, వ్యాపారవేత్త జోచిల్ గాల్వెజ్ కంటే 30% పాయింట్ల ఎక్కువ ఆధిక్యతను సంపాదించారు.
షీన్‌బామ్ తన గురువు, పదవి వీడనున్న ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ స్థానంలో అక్టోబర్ 1న అధ్యక్షురాలిగా పదవీ స్వీకారం చేస్తారు.


ఫొటో సోర్స్, Getty Images
మాజీ ఇంధన శాస్త్రవేత్త అయిన షీన్‌బామ్ ప్రస్తుత అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ చేసిన అభివృద్ధి బాటలో తానూ కొనసాగుతానని అన్నారు.
విజయోత్సవ ప్రసంగంలో ‘నేను మిమ్మల్ని నిరాశపరచను’ అని ఆమె ఓటర్లతో అన్నారు.
ఆమె మద్దతుదారులు మెక్సికో సిటీ ప్రధాన కూడలిలోని జోకాలో వద్ద "క్లాడియా షీన్‌బామ్, ప్రెసిడెంట్" అని రాసి ఉన్న బ్యానర్‌లను ఊపుతూ సంబరాలు జరుపుకున్నారు.
అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ముందు, షీన్‌బామ్ మెక్సికో సిటీ మేయర్‌గా పని చేశారు. ఇది దేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ స్థానాలలో ఒకటి. ఈ పదవిని అధ్యక్ష పదవికి మార్గంగా భావిస్తారు.
షీన్‌బామ్ యూదు తల్లితండ్రులు బల్గేరియాలో నాజీల నుంచి తప్పించుకుని పారిపోయి మెక్సికోకు వలస వచ్చారు. వారు ఇద్దరూ శాస్త్రవేత్తలే.

ఫొటో సోర్స్, EPA
షీన్‌బామ్ ఎనర్జీ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పొందే ముందు ఫిజిక్స్ చదివారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు శాస్త్రవేత్తగా ఆమెకు మంచి పేరు ఉంది.
ఆమె మెక్సికన్ ఇంధన వినియోగ విధానాలను అధ్యయనం చేస్తూ కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ పరిశోధనా ప్రయోగశాలలో పని చేసి, వాతావరణ మార్పులపై నిపుణురాలు అయ్యారు.
ఆ అనుభవం, విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడంతో లోపెజ్ ఒబ్రాడోర్ మెక్సికో మేయర్‌గా ఉన్న సమయంలో ఆమెను మెక్సికో సిటీ పర్యావరణ కార్యదర్శిగా నియమించారు.
2018లో ఆమె మెక్సికో సిటీ మొదటి మహిళా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2023లో అధ్యక్ష పదవికి పోటీ చేయడం కోసం తన పదవికి రాజీనామా చేసే వరకు ఆమె మేయర్‌గా కొనసాగారు.
షీన్‌బామ్, గాల్వెజ్‌లు పోటీ చేసిన ఈ ఎన్నికలు, మెక్సికోలో మహిళల పరిస్థితిలో పెను మార్పులు తీసుకువస్తాయని భావిస్తున్నారు.
ఈ ఫలితాలపై 87 ఏళ్ల ఎడెల్మిరా మోంటియెల్ మాట్లాడుతూ..."మొదట మాకు ఓటు హక్కే ఉండేది కాదు. అది వచ్చాక, గతంలో మేము భర్తలు చెప్పిన వాళ్లకు ఓటు వేసేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మారిన ఈ పరిస్థితులను చూసేందుకు జీవించి ఉండడం మా అదృష్టం’’ అని రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.
మెక్సికోలో 1953 జాతీయ ఎన్నికల నుంచి మాత్రమే మహిళలకు ఓటు వేసే హక్కు ఉంది.

ఫొటో సోర్స్, Reuters
అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఇద్దరూ మహిళలే అయినా, ప్రచారం సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
కొత్త అధ్యక్షుడితో పాటు, ఓటర్లు మెక్సికో కాంగ్రెస్ సభ్యులను, ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లను, మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతిని, వేలాది మంది స్థానిక అధికారులనూ ఎన్నుకున్నారు.
ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా 20 మందికి పైగా మరణించారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇతర సర్వేలు మాత్రం మొత్తం 37 మంది మరణించారని అంటున్నాయి.
లోపెజ్ ఒబ్రాడోర్ 2018 నుంచి అధికారంలో ఉన్నారు. అయితే మెక్సికో రాజ్యాంగం ప్రకారం, ఆరేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత అదే అభ్యర్థి మళ్లీ పోటీ చేయలేరు.
దాదాపు 60% యాక్సెప్టెన్సీ రేట్ ఉన్న అధ్యక్షుడి మద్దతు పొందడం షీన్‌బామ్‌కు కలిసి వచ్చింది.
షీన్‌బామ్‌కు ఓటు వేసిన వారిలో చాలామంది పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన మోరెనా పథకానికి తాము మద్దతు ఇస్తామని, ఆమె దానిని కొనసాగించాలని కోరుకుంటున్నామని అన్నారు.
ఈ పథకం వల్ల గత ఆరేళ్లలో లక్షలమంది మెక్సికన్లు పేదరికం నుంచి ఎలా బయటపడ్డారో తెలుపుతూ షీన్‌బామ్ పార్టీ ప్రచారం చేసుకుంది.
అయితే, విదేశాల్లో నివసిస్తున్న మెక్సికన్లు స్వదేశంలో ఉన్న వారి కుటుంబాలకు డబ్బు పంపడం లాంటి అంశాలు దీనికి దోహదపడ్డాయని ఆర్థికవేత్తలు అంటున్నారు.
ఓటర్లు మాత్రం ఈ పథకం ఫలితాలు చూసే షీన్‌బామ్‌కు మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- టీ20 ప్రపంచ కప్: రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్, క్రికెట్లో ఎన్ని రకాలుగా అవుట్ చేయొచ్చంటే..
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- బీబీసీ పరిశోధన: లగ్జరీ పెర్ఫ్యూమ్ల వెనుక దారుణ నిజాలు, మల్లె తోటల్లో వాడిపోతున్న బాల్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














