టీ20 ప్రపంచ కప్: రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్, క్రికెట్‌లో ఎన్ని రకాలుగా అవుట్ చేయొచ్చంటే..

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెటర్ రిషబ్ పంత్, టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్ కావడం చర్చల్లో నిలిచింది.
శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు రిటైర్డ్ అవ్వడం కొత్త విషయమేం కాదు. కానీ, రిషబ్ పంత్ కేసులో దీన్ని రిటైర్డ్ అవుట్‌గా పిలిచారు.
రిటైర్డ్ అవుట్ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. అలాగే, క్రికెట్‌లో బ్యాటర్లను 11 రకాలుగా అవుట్ చేయొచ్చు. వాటి గురించి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
అవుట్ చేయడంలోని 11 రకాల్లో అయిదు చాలా సాధారణం. క్రికెట్ చూసే వారందరికీ దాదాపు ఇవి తెలిసి ఉంటాయి. మరో 5 రకాలు అరుదుగా సంభవిస్తాయి.


ఫొటో సోర్స్, Getty Images
బ్యాటర్లను అవుట్ చేసే విధానాలు
1. క్లీన్ బౌల్డ్: బౌలర్ సంధించిన బంతి, బ్యాట్స్‌మన్ డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ వెళ్లి వికెట్లను తగలడంతో స్టంప్స్ నేలరాలతాయి. దీన్ని క్లీన్ బౌల్డ్ అని అంటారు.
2. క్యాచ్ అవుట్: బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని ప్రత్యర్థి ఆటగాళ్లు అందుకుంటే క్యాచ్ అవుట్‌గా పరిగణిస్తారు. అయితే, బంతి గాలిలో ఉండగానే ఫీల్డర్ అందుకోవాలి. బంతి నేలను తగలకూడదు.
3. లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ): బౌలర్ వేసిన బంతి నేరుగా స్టంప్స్ వైపు వచ్చి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తగిలితే దాన్ని ఎల్బీడబ్ల్యూ అని పిలుస్తారు.
4. రనౌట్: బ్యాట్స్‌మన్ పరుగు పూర్తి చేసేలోపే ఫీల్డర్, బంతితో వికెట్లను గిరాటేస్తే ఆ బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌గా పరిగణిస్తారు.
5. స్టంప్ అవుట్: బ్యాట్స్‌మన్ క్రీజు నుంచి బయటకు వచ్చి షాట్ కొట్టడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు, వికెట్ కీపర్ చేతుల్లో పడ్డ బంతితో స్టంప్స్‌ను గిరాటేస్తే సదరు బ్యాట్స్‌మన్ స్టంప్ అవుట్ అవుతాడు.
అయితే, బంతిని ఆడేందుకు ముందుకు వెళ్లిన బ్యాట్స్‌మన్ మళ్లీ క్రీజులో కాలు పెట్టేలోగానే వికెట్‌కీపర్ స్టంప్స్‌ను పడగొట్టాలి. అలా కాకుండా బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చాక స్టంప్స్‌ను పడగొడితే అవుట్‌గా పరిగణించరు.
ఇవన్నీ సర్వసాధారణంగా బ్యాట్స్‌మన్ అవుటయ్యే విధానాలు. ఇప్పుడు అరుదుగా బ్యాట్స్‌మెన్ అవుటయ్యే తీరు గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
6. మన్కడింగ్:
ఇదొక రకమైన రనౌట్. బౌలర్ బంతిని వేయడానికి ముందే నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్, క్రీజును దాటి బయటకు వస్తే బౌలర్ బంతిని వేయడానికి బదులుగా దానితో నాన్‌స్ట్రయికర్ బ్యాట్స్‌మన్ స్టంప్‌ను పడగొట్టవచ్చు. ఈ సందర్భంలో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్ అవుట్ అవుతాడు. దీన్నే మన్కడింగ్ అంటారు.
బౌలర్ ఇలా చేసినప్పుడు స్టంప్స్ కిందపడకపోతే, ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. భారత మాజీ క్రికెట్ వినూ మన్కడ్ పేరు మీద ఈ రకమైన అవుట్‌ను మన్కడింగ్ అని పిలుస్తారు.
టీమిండియా 1947లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. వినూ మన్కడ్ ఆ సమయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బిల్ బోవెన్‌ను ఈ తరహాలోనే అవుట్ చేశారు. అప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో ఈ రకమైన అవుట్‌ను మన్కడింగ్‌గా పేర్కొంటూ కథనాలు వచ్చాయి.
అయితే, చాలా సందర్భాల్లో ఈ రకంగా అవుటైన నాన్‌స్ట్రయికర్‌పై అప్పీల్‌ను ప్రత్యర్థి జట్టు వెనక్కి తీసుకుంటుంది. అతన్ని ఆడేందుకు అనుమతిస్తుంది.
2023 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు న్యూజీలాండ్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. న్యూజీలాండ్ బ్యాట్స్‌మన్ ఇష్ సోధిని బంగ్లా బౌలర్ హసన్ మొహమ్మద్ మన్కడింగ్ విధానంలో అవుట్ చేశాడు. అయితే, బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకొని సోధి బ్యాటింగ్ కొనసాగించేలా చేశాడు.
7. హిట్ వికెట్: బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ శరీరంలోని ఏదైనా భాగం స్టంప్స్‌కు తగిలి బెయిల్స్ కింద పడిపోతే సదరు బ్యాట్స్‌మన్ హిట్ వికెట్‌గా అవుటై పెవిలియన్ చేరతాడు.
8. డబుల్ హిట్: ఒకవేళ బ్యాట్స్‌మన్ బంతిని రెండుసార్లు బ్యాట్‌తో కొడితే అతన్ని డబుల్ హిట్ అవుట్‌గా పరిగణిస్తారు. 2023 ఆగస్ట్‌లో మాల్టా, రొమేనియా జట్ల మధ్య మ్యాచ్‌లో మాల్టా ఓపెనర్ ఫహియాన్ ఈ విధంగానే అవుటయ్యాడు.
9. అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్: ఒక బ్యాట్స్‌మన్, ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ పనికి ఆటంకం కలిగిస్తే, ఫీల్డ్ నియమాల ఉల్లంఘన కింద ఆ బ్యాట్స్‌మన్‌ను ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుట్ అయినట్లు పరిగణిస్తారు.
10. టైమ్ అవుట్: ఒక ప్లేయర్ అవుటైన తర్వాత, కొత్తగా వచ్చే బ్యాట్స్‌మన్ నిర్ణీత సమయంలోగా క్రీజులోకి చేరాలి. బ్యాట్స్‌మన్ అవుటైన రెండు నిమిషాల్లోపు కొత్త బ్యాట్స్‌మన్ క్రీజులోకి రాకపోతే అతన్ని టైమ్ అవుట్‌గా పరిగణిస్తారు.
2023 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ నిబంధన చర్చల్లో నిలిచింది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో టైమ్ అవుట్ అయిన తొలి బ్యాట్స్‌మన్‌గా శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
రిటైర్డ్ అవుట్ అంటే ఏంటి?
ఇప్పుడు రిటైర్డ్ అవుట్ గురించి తెలుసుకుందాం. రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్ అయ్యాక ఈ పదంపై బాగా చర్చ జరిగింది.
మ్యాచ్ జరుగుతుండగా ఒకవేళ ఒక బ్యాట్స్‌మన్ మళ్లీ బ్యాటింగ్ చేయకూడదనే ఉద్దేశంతో అవుట్ కాకుండానే పెవిలియన్ చేరితే అతన్ని రిటైర్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. అంపైర్‌కు సమాచారమిచ్చి ఒక బ్యాట్స్‌మన్ ఎప్పుడైనా పెవిలియన్‌కు తిరిగి రావొచ్చు. ఇలాంటి సందర్భాన్ని రిటైర్డ్ అవుట్‌గా పిలుస్తారు.
రిటైర్డ్ అవుట్ అనేది రిటైర్డ్ హర్ట్ కంటే భిన్నం. ఒకవేళ బ్యాట్స్‌మెన్ గాయపడిన తర్వాత పెవిలియన్‌లోకి వస్తే దాన్ని రిటైర్డ్ హర్ట్‌గా పిలుస్తారు. ఇలాంటి సందర్భంలో టీమ్ ఆలౌట్ అయ్యేలోపు గాయపడిన బ్యాట్స్‌మన్ మళ్లీ క్రీజులోకి వచ్చి తన ఆటను కొనసాగించవచ్చు. సదరు బ్యాట్స్‌మన్‌ను ‘రిటైర్డ్ అవుట్’గా పరిగణించకూడదు.
ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం బ్యాట్స్‌మన్ అవుట్ అవ్వకుండానే పెవిలియన్‌కు తిరిగి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే.
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా ఒక్కసారి మాత్రమే జరిగింది. 2001లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య ఆడిన టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్డ్ అయ్యారు. శ్రీలంక ప్లేయర్లు మార్వన్ ఆటపట్టు, మహేలా జయవర్ధనేలను రిటైర్డ్ అవుట్‌గా పరిగణించారు. అయితే, వాళ్లిద్దరూ అలా చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అప్పట్లో చర్చ జరిగింది.
ఒకవేళ బ్యాట్స్‌మెన్ గాయం కాకుండా ఇతర ఏదైనా కారణాలతో క్రీజును వదిలి పెవిలియన్‌కు వెళితే, మళ్లీ అతను క్రీజులోకి వచ్చేందుకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఒప్పుకోని పక్షంలో కూడా రిటైర్డ్ అవుట్‌గానే ప్రకటిస్తారు.
అయితే, ఈ కేసులో ఒక మినహాయింపు ఉంది. టీమిండియా 1982లో వెస్టిండీస్‌లో పర్యటించింది. అయిదో టెస్టు తొలిరోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ గార్డన్ గ్రీనిజ్ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కానీ, అతని రెండేళ్ల కూతురు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ఆయన విమానం ఎక్కి పాప దగ్గరకు వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత గార్డన్ కూతురు చనిపోయారు. గార్డన్ కూతురి స్మారకార్థం స్కోర్‌బోర్డులో ‘గార్డన్ రిటైర్డ్ నాటౌట్’ అని రాశారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














