టి20 వరల్డ్ కప్: టీమిండియా ఎంపిక గందరగోళంగా ఉందా?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ కోహ్లీ
    • రచయిత, అయాజ్ మెమన్
    • హోదా, క్రికెట్ రచయిత

టి20 వరల్డ్ కప్-2024 టోర్నీలో నంబర్ వన్ ర్యాంకు జట్టు భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

జూన్ 2న మొదలయ్యే ఈ టోర్నీ వచ్చే నాలుగు వారాల పాటు అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతుంది.

భారత జట్టుపై క్రికెట్ అభిమానులకు, నిపుణులకు ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఈ నాలుగు వారాల పాటు టీమిండియా ప్రదర్శన అందరి నోళ్లలో బాగా నానుతుంది.

ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ 2007లో తొలి టి20 వరల్డ్ కప్ టైటిల్‌ను సాధించిన భారత్ మరోసారి ఆ ఘనతను అందుకోలేకపోయింది.

జట్టులో సంపద, పరపతి, ప్రతిభ పెరుగుతున్నప్పటికీ మెగా టోర్నీల టైటిళ్లు భారత్‌కు అందకుండా పోతున్నాయి.

నిజానికి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత్ ఇంకో ఐసీసీ టైటిల్‌ సాధించలేదు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ విధ్వంసక ఓపెనింగ్ భారత విజయాలకు కీలకం

ఈ కాలంలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ముగ్గురు స్టార్ కెప్టెన్లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రముఖ కోచ్‌లు జట్టుకు అద్భుత ఫలితాలను అందించారు. కానీ, ఈ మెగా టైటిళ్ల రేసులో మాత్రం వెనుకబడ్డారు.

నిరుడు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్లో ఓడిపోయింది. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది.

ఈసారి భారత్ ఆ లోటును పూడ్చగలదా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా టి20 వరల్డ్ కప్‌, కొన్నిసార్లు వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తున్నారు.

ఐపీఎల్‌లో ఉండే తీవ్రమైన పోటీ, ఒత్తిడి అనేవి ఆటగాళ్ల సామర్థ్యం, వ్యక్తిత్వానికి ప్రామాణికంగా నిలుస్తాయి.

అయితే, 2024 ఐపీఎల్ సీజన్ ఆధారంగా టి20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టు గందరగోళాన్ని సృష్టించింది.

బుమ్రా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్‌లో బుమ్రా ప్రత్యర్థుల్ని కట్టడి చేశాాడు

ఉదాహరణకు, ఇప్పుడు భారత జట్టులో ఉన్న ఏ ఆటగాడు కూడా ఐపీఎల్ ఫైనల్లో ఆడలేదు.

రింకూ సింగ్ ఐపీఎల్ ఫైనల్ ఆడినప్పటికీ అతను టీమిండియా 15 మంది సభ్యుల బృందంలో లేడు. రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో పాటు ప్రయాణిస్తున్నాడు.

రెండేళ్లుగా భారత క్రికెట్‌లో మరో యువతారగా చెప్పుకుంటున్న శుబ్‌మన్ గిల్ కూడా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఈ సీజన్ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్ అసలు రిజర్వ్ కేటగిరీలో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు.

నిరుడు జరిగిన ఆసియా క్రీడల్లో టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

2022 టి20 ప్రపంచ కప్‌లో భాగమైన హర్షల్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీశారు. కానీ, ఇప్పుడు టీమిండియా జట్టుకు ఎంపిక కాలేదు.

రవీంద్ర జడేజా, కుల్దీప్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత స్పిన్ బౌలింగ్ విజయంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కీలకం

ఈ సీజన్ ఐపీఎల్‌ ఫామ్ ఆధారంగా కొంతమందిని ఎంపిక చేయడం, మరికొంతమందిని విస్మరించడం వంటివి టీమిండియా ఎంపిక ప్రక్రియను వేలెత్తి చూపిస్తున్నాయి.

ఐపీఎల్‌లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.

కోహ్లీ స్ట్రయిక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ, తన అద్భుత బ్యాటింగ్‌తో వాటిని పటాపంచలు చేశాడు కోహ్లీ. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచిన కోహ్లీ, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా తన స్థాయిని చూపించాడు.

అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. అతని బౌలింగ్ ప్రత్యర్థుల్ని భయపెట్టింది. లీగ్‌లో ముంబయి ఇండియన్స్ అట్టడుగు స్థానంలో నిలిచినప్పటికీ, బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే బుమ్రా బౌలింగ్ నైపుణ్యాలు, ఏ దశలోనైనా వికెట్లు తీసే సామర్థ్యం సమకాలీన ఫాస్ట్ బౌలర్లలో అతన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో వికెట్లు తీయడంలో విజయవంతం కావడంతో పాటు, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్

కోహ్లీ, బుమ్రా తరహాలోనే టీమిండియాలో ఉన్న మరో ఆటగాడు రిషబ్ పంత్ గురించి కూడా చెప్పుకోవాలి.

ఐపీఎల్‌లో అతని గణాంకాల పరంగానే కాకుండా, భయంకరమైన రోడ్డు ప్రమాదంలో గాయంతో దాదాపు 18 నెలలు ఆటకు పూర్తిగా దూరమైన తర్వాత అతను ఆటలోకి పునరాగమనం చేసిన తీరు అద్భుతం.

పంత్ స్వేచ్ఛగా, వినూత్నంగా చేసే బ్యాటింగ్ భారత్‌ను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించింది. ప్రపంచకప్ టీమ్‌లోకి అతని రాక జట్టుకు బలంగా మారింది.

ఐపీఎల్‌లో అబ్బురపరిచిన హార్డ్ హిట్టర్ శివమ్ దూబే, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు.

ఇక్కడి నుంచి ఇతర ఆటగాళ్లను చూస్తే భారత జోరు తగ్గుతున్నట్లు కనిపిస్తుంది.

సంజూ శామ్సన్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌లు ఈ సీజన్ ఐపీఎల్‌లో రాణించారు. కానీ, వారినుంచి గుర్తుండిపోయే ప్రదర్శనలేవీ నమోదు కాలేదు.

ఇక మిగిలిన వాళ్లలో యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌లు కూడా పరవాలేదనిపించారు. మొహమ్మద్ సిరాజ్ చాలా వరకు విఫలమయ్యాడు.

ధోని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధోని సారథ్యంలో 2007లొ భారత్ తొలి టి20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది

ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న పిచ్‌లు ఎలా వ్యవహరిస్తాయన్నది ఇప్పుడు అన్ని జట్లకు కీలకంగా మారింది.

కానీ, ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో పాటు అస్థిరంగా కనిపిస్తోన్న పేసర్లతో కూడిన బౌలింగ్ బృందంలో వైవిధ్యం పెద్దగా కనిపించట్లేదు.

ఇంకా ముఖ్యమైన ఆందోళన ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాల పేలవ ఫామ్. వీరిద్దరూ ఐపీఎల్‌లో స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్, భారత జట్టు విజయాలకు కీలకం. వన్డే వరల్డ్ కప్ దీనికి చక్కని ఉదాహరణ. అలాగే ఫీల్డర్‌గా, పేసర్‌గా, ఫినిషర్‌గా హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన కూడా అంతే ముఖ్యం. పాండ్యా అత్యుత్తమ ఫామ్‌లో లేకపోతే జట్టు బ్యాలెన్స్ దెబ్బతింటుంది.

సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, AFP

ఐపీఎల్ భారత ప్లేయర్లకు పరీక్షా స్థలంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టి20 ప్రతిభకు రంగస్థలంగా మారింది.

ఇప్పుడు టీమిండియా, ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టి జాతీయ జట్ల తరఫున రాణించేందుకు సిద్ధంగా ఉన్న పలువురు ఆటగాళ్లతో పోటీపడనుంది.

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు రెండుసార్లు టైటిల్ సాధించిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు గత ఏడాది కాలంగా గట్టి పోటీనిస్తున్నాయి. ఈ టోర్నీలో కూడా ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

టి20 వరల్డ్ కప్ గత ఎనిమిది ఎడిషన్లలో పాకిస్తాన్, శ్రీలంకతో సహా ఆరు వేర్వేరు దేశాలు చాంపియన్లుగా నిలిచాయి. అన్ని దేశాల మధ్య టైటిల్ కోసం ఎంత పోటీ ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అఫ్గానిస్తాన్ వంటి జట్లు వైట్ బాల్ క్రికెట్‌లో అత్యంత అనుభవజ్ఞులైన జట్లను కూడా బెదరగొట్టగలవు. కాబట్టి ఈ వరల్డ్ కప్ విజేతను ఊహించడం మూర్ఖత్వమే అవుతుంది. అన్ని జట్లూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాయి.

లీగ్ దశలో పాకిస్తాన్‌, భారత్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి. క్రికెట్ చరిత్రలో అతిపెద్ద మ్యాచ్‌గా పరిగణించే ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లకు పైగా వీక్షిస్తారని అంచనా.

ఈ మ్యాచ్‌లో ఏ జట్టూ ఓడిపోవాలని కోరుకోదు. అయితే, పాకిస్తాన్‌ను ఓడించడం కేవలం ఒక మెట్టు మాత్రమే. అసలైన మజా ప్రపంచకప్ టైటిల్‌ను గెలవడంలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)