IPL Final 2024: హైదరాబాద్‌కు కమిన్స్, కోల్‌కతాకు గౌతమ్ గంభీర్ సెంటిమెంట్‌లు కలిసొస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అషయ్ యోడ్గే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్‌లో టాస్ హైదరాబాద్‌ను వరించింది.
టాస్ నెగ్గిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ సీజన్‌లో మొదట బ్యాటింగ్ చేసి, స్కోరును డిఫెండ్ చేసుకోవడంలో హైదరాబాద్ ఎక్కువగా సఫలమైంది.
సన్‌రైజర్స్ తుది జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అబ్దుల్ సమద్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజేత ఎవరో తేలేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి.
సీజన్ ఆసాంతం ఈ రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. ఓవైపు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ టోర్నీలో పరుగుల వరద పారించగా, మరోవైపు కోల్‌కతా జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్ట ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు యువ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తుండగా, ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు.
ఇప్పటివరకు కోల్‌కతా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి విజేతగా నిలిచింది. ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన డెక్కన్ చార్జర్స్ కూడా ఒక టైటిల్‌ను అందుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సీజన్‌లో రెండు జట్ల ప్రదర్శన ఎలా ఉంది?
ఐపీఎల్ 2024 ప్రారంభంలో చాలాకొద్ది మంది అభిమానులు మాత్రమే హైదరాబాద్, కోల్‌కతా జట్లు ఫైనల్‌కు చేరతాయని ఊహించి ఉంటారు.
అయిదుసార్లు చొప్పున ఐపీఎల్ టైటిల్‌ను అందుకున్న, అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న జట్లను ఓడించి ఈ రెండు జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి.
నాకౌట్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి కాదు. క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నేరుగా ఫైనల్ చేరింది.
క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై నెగ్గిన హైదరాబాద్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఈ సీజన్‌లో హైదరాబాద్, కోల్‌కతా జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగగా, ఈ రెండింటిలోనూ కోల్‌కతానే నెగ్గింది. లీగ్ దశలో 4 పరుగులతో, తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది.
ఐపీఎల్‌లో ఓవరాల్‌గా ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా నెగ్గింది, 9 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలిచింది.
ఈ గణాంకాలను చూస్తుంటే కోల్‌కతా జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలిచే అనుభవం ఉన్న ప్యాట్ కమిన్స్ చాలా దూకుడైన కెప్టెన్.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్, ఆస్ట్రేలియా కెప్టెన్ల మధ్య సంబంధం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ముందు హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపీఎల్‌లో పాల్గొంది.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ చార్జర్జ్ జట్టు 2009లో విజేతగా నిలిచింది.
దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మీద 6 పరుగులతో డెక్కన్ చార్జర్స్ గెలుపొంది టైటిల్‌ను అందుకుంది.
2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్‌లో అడుగుపెట్టింది.
2016లో కూడా మళ్లీ ఆస్ట్రేలియా క్రికెటర్ సారథ్యంలోనే హైదరాబాద్ టైటిల్‌ను అందుకుంది. ఈసారి డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మీద 8 పరుగులతో నెగ్గింది.
ఆ తర్వాత సన్‌రైజర్స్ జట్టు చాలామంది కెప్టెన్లను మార్చింది.
కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే, ఎయిడెన్ మార్క్‌రమ్ వంటి ప్లేయర్లు హైదరాబాద్‌ను నడిపించారు. కానీ, వారు జట్టుకు ట్రోఫీని అందించలేకపోయారు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో హైదరాబాద్ పేలవ ప్రదర్శన తర్వాత, జట్టు కోచ్‌గా న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, కెప్టెన్‌గా మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ కమిన్స్‌ను ఎంచుకున్నారు.
ఈ సీజన్ ఆరంభం నుంచే హైదరాబాద్‌ను విజయపథంలో నడిపించిన ప్యాట్ కమిన్స్ మరోసారి హైదరాబాద్‌కు ఆస్ట్రేలియన్ కెప్టెన్‌లు అచ్చొస్తారని నిరూపించాడు.
నేటి ఫైనల్‌లో కూడా గెలిచి ఇదే నిజమని మరోసారి ప్యాట్ కమిన్స్ నిరూపిస్తాడో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
కోల్‌కతా హ్యాట్రిక్ టైటిల్ కొడుతుందా?
ఐపీఎల్ టోర్నీ తొలి సీజన్ నుంచి షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చాలామందికి ఫేవరెట్ టీమ్.
2008లో సౌరవ్ గంగూలీ ఈ జట్టుకు సారథ్యం వహించారు. జట్టులో చాలామంది గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికి తొలి నాలుగు సీజన్లలో కోల్‌కతా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
2011 సీజన్ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ చాలా మార్పులు చేసింది. 2011 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కు జట్టు పగ్గాలు అందించింది.
2012లో తొలిసారి ఫైనల్ చేరిన కోల్‌కతా జట్టు, ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
2014లో కూడా ఫైనల్లో గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా జట్టు 3 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించి రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.
2014 తర్వాత మళ్లీ ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలో 2021లో ఫైనల్ చేరిన కోల్‌కతా, చెన్నై చేతిలో ఓడిపోయింది.
కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండుసార్లు టైటిల్‌ను అందించిన గంభీర్, 2024 సీజన్‌లో కొత్త రూపంలో జట్టుతో చేరాడు. టీమ్‌కు మెంటార్‌గా సేవలు అందిస్తున్నాడు.
శ్రేయస్ అయ్యర్ మైదానంలో జట్టును నడిపిస్తున్నప్పటికీ, డగౌట్ నుంచి గంభీర్ మార్గనిర్దేశం చేస్తున్నాడు.
ఇదే జోరులో కోల్‌కతా ఈసారి మూడో టైటిల్‌ను కూడా అందుకుంటుందా చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ vs సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి
హైదరాబాద్ విషయానికొస్తే, అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్ ఉంది.
లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ శర్మ, హెడ్ జోడీ బౌలర్లపై విరుచుకుపడింది.
వీరి తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్‌లు కూడా దూకుడైన ఆటను చూపారు.
హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ కొండంత స్థాయిలో పరుగులు చేసినప్పటికీ, కొన్ని మ్యాచ్‌ల్లో వారు స్వల్ప పరుగులకే అవుటైన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాబట్టి, ఫైనల్లో ఈ ఆటగాళ్లు ఎలా ఆడతారనే అంశంపై చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి.
సునీల్ నరైన్‌ను ఓపెనర్‌ను చేయడం ద్వారా కోల్‌కతా జట్టు గతేడాది ఎదుర్కొన్న ఓపెనింగ్ సమస్యను ఈసారి పరిష్కరించింది.
కోచ్, కెప్టెన్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ సునీల్ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను గత 13 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలను నమోదు చేశాడు.
ఫిల్ సాల్ట్ లేనప్పటికీ కోల్‌కతా మిడిలార్డర్ నాణ్యమైన ప్లేయర్లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, నితీశ్ రాణాలు మిడిలార్డర్‌లో పరుగులు సాధించగలరు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక బౌలింగ్ విషయానికొస్తే, హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్‌ల రూపంలో మంచి భారత బౌలర్లు అందుబాటులో ఉన్నారు.
కోల్‌కతా స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు.
ఫైనల్ మ్యాచ్‌కు ముందు మిచెల్ స్టార్క్ ఫామ్‌లోకి రావడం కోల్‌కతాకు కలిసొచ్చే మరో అంశం.
ఫైనల్ మ్యాచ్ జరుగనున్న మైదానం స్పిన్నర్లకు అనుకూలం. ఈ మైదానంలో కోల్‌కతా స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. అయితే, క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మల బౌలింగ్‌ను బట్టి చూస్తే కోల్‌కతాకు కూడా వారినుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
మరీ ముఖ్యంగా అన్ని మ్యాచ్‌ల కంటే ఐపీఎల్ ఫైనల్ భిన్నమైనది.
అత్యంత ఉత్కంఠ రేకెత్తించే మ్యాచ్‌లో ఏ జట్టు ప్రశాంతంగా వ్యూహాలను విజయవంతంగా అమలు చేస్తుందో ఆ జట్టును విజయం వరించడం ఖాయం.
ఇవి కూడా చదవండి:
- మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?
- తొమ్మిది నెలల చిన్నారి హత్య కేసు, తీర్పు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న న్యాయమూర్తులు
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














