SRH vs RR: హైదరాబాద్ స్పిన్ సమస్యకు పరిష్కారం ఏంటి? రాజస్థాన్ చేస్తూ వస్తోన్న తప్పేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐపీఎల్ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 11 మంది స్నిన్నర్లను బరిలోకి దింపగా వారు పడగొట్టిన వికెట్ల సంఖ్య 13.
స్పిన్నర్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. ఏ జట్టు పరంగా చూసినా ఇది చాలా తక్కువ ప్రదర్శన.
ఈ సీజన్ అంతా మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు దూసుకొచ్చిన హైదరాబాద్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తడబడింది. క్వాలిఫయర్-1లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలిద్దరూ విఫలమయ్యారు.
నాణ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను నిలువరిస్తోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో నేడు చెన్నై వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో హైదరాబాద్ జట్టు తలపడనుంది.
మరి ఫైనల్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బలబలాలు ఏంటో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ బ్యాటర్లు X రాజస్థాన్ బౌలర్లు
ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు రికార్డులు సృష్టించారు. మళ్లీ వాటిని తిరగరాశారు. దీనికంటే ముందు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 263/5. ఈ మార్కును సన్‌రైజర్స్ ఈ సీజన్‌లోనే మూడుసార్లు అధిగమించింది.
హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసక భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోర్లను అందించింది.
ఈ జోడీ 13.65 రన్‌రేట్‌తో పరుగులు చేస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యంత దూకుడైన జోడీగా పేరు పొందింది. వీరిద్దరి దూకుడైన తీరు ఈ సీజన్‌లో పవర్‌ప్లేలోనే 100 పరుగులు చేసిన ఏకైక జట్టుగా హైదరాబాద్‌ను నిలిపింది. ఈ సీజన్‌లోనే రెండుసార్లు ఈ ఫీట్‌ను అందుకుంది హైదరాబాద్.
వీరిద్దరితో పాటు మరో టి20 అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ కూడా జట్టులో ఉన్నాడు. హైదరాబాద్ గత మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి ఫామ్‌లోకి రావడం మరింత కలిసొచ్చే అంశం.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ స్థాయిలో దూకుడుగా లేకపోవచ్చు. కానీ, రాజస్థాన్ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉంది. జట్టులో రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు, లెఫ్టార్మ్ స్వింగర్ బౌల్ట్‌తో పాటు డెత్‌లోనూ రాణించే సీమ్ బౌలర్లు ఉన్నారు. స్పిన్నర్ అశ్విన్‌కు చెపాక్ సొంత మైదానం. కాబట్టి చెన్నైలో అశ్విన్ ప్రమాదకరంగా మారగలడు.
రాజస్థాన్ బౌలర్లు, హైదరాబాద్ బ్యాటర్ల మధ్య పోరు ఎవరు ఫైనల్ చేరుతారో నిర్ణయిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరిది పైచేయి
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి పోటీపడగా సన్‌రైజర్స్ జట్టు ఒక పరుగు తేడాతో గెలుపొందింది.
చెన్నై వేదికగా ఈ రెండు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. చెన్నైతో జరిగిన ఆయా మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 134 పరుగులు, రాజస్థాన్ 141 పరుగులు చేసి ఓటమి పాలయ్యాయి.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్టు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్, 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి.
రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 217, అత్యల్ప స్కోరు 127 పరుగులు. సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102.
పేలవంగా స్పిన్ బౌలింగ్
భువనేశ్వర్ కుమార్, కమిన్స్, నటరాజన్‌లతో కూడిన హైదరాబాద్ పేస్ బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. సమస్యంతా స్పిన్ బౌలింగ్‌తోనే.
సీజన్ ఆరంభం నుంచి హైదరాబాద్ చాలామంది స్పిన్నర్లను పరీక్షించింది. మొదట మయాంక్ మార్కండే, తర్వాత హసరంగ, ఆ తర్వాత విజయకాంత్‌లకు అవకాశమిచ్చినా వారి నుంచి ఆశించినంత గొప్ప ప్రదర్శన ఇంకా రాలేదు. షాబాజ్ అహ్మద్‌తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం.
ఈ సీజన్‌లో అన్ని జట్లలోకెల్లా అత్యంత దారుణమైన బౌలింగ్ సగటు (54.38), ఎకానమి రేట్ (11.20) నమోదు చేసింది హైదరాబాద్ స్పిన్నర్లే.
ఒకవేళ ఈరోజు చెపాక్‌లో మంచు ప్రభావం ఉన్నప్పుడు వారు బౌలింగ్ చేయాల్సి వస్తే ఈ గణాంకాలు మరింత ఘోరంగా మారే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పేసర్లకు కలిసొస్తుందా?
చెన్నైలోని స్పిన్ అనుకూల పరిస్థితులు రాజస్థాన్ రాయల్స్‌కు సంతోషం కలిగిస్తుండొచ్చు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం వారికి మరింత ఉత్సాహాన్ని కలిగించవచ్చు.
కానీ, రాజస్థాన్ ఇక్కడొక విషయం మర్చిపోకూడదు. బంతి వేగంలో వైవిధ్యాన్ని చూపించే పేసర్లకు చెన్నై మైదానం బాగా అచ్చొచ్చిందనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి.
ఈ సీజన్‌లో కనీసం నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన వేదికల పరంగా చూసుకుంటే, స్లోవర్ బంతులకు అతితక్కువ పరుగులు వచ్చింది చెన్నైలోనే. ఈ వేదికపై ఫాస్ట్ బౌలర్లు 60 వికెట్లు దక్కించుకోగా, స్పిన్నర్లు 17 వికెట్లు తీశారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్పిన్నర్లకు అనుకూలంగా తయారుచేసిన పిచ్ మీద పేసర్ కమిన్స్ కట్టర్లతో భారత్‌ను కట్టడి చేశాడు. స్పిన్నర్ల లోటు కారణంగా ఇప్పుడు కూడా కమిన్స్ ఇదే ప్రయోగం చేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్ బంతుల్ని వదిలేయకూడదు
బౌలింగ్ పటిష్టంగా ఉండటం మూలానా బౌలింగ్‌తో నెగ్గుకురావొచ్చనే భావనతో మిగతా జట్ల తరహాలో రాజస్థాన్ బ్యాటర్లు ప్రతీ బంతిని బాదాలనే రిస్క్ తీసుకోవడం లేదు.
కొన్ని మ్యాచ్‌లను బౌలర్లు త్వరగా ముగించడం మూలానా బ్యాటర్లు తమ కోటాలోని అన్ని బంతుల్ని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో మొదట బ్యాటింగ్ చేస్తూ తాము ఎదుర్కొన్న బంతుల్లో రాజస్థాన్ కేవలం 36.8 శాతం బంతులపై మాత్రమే ఎదురుదాడి చేసి పరుగులు రాబట్టే ప్రయత్నం చేసింది.
ఈ విషయానికొస్తే దిల్లీ, కోల్‌కతా జట్లు 45 శాతం, హైదరాబాద్ 43.3 శాతం బంతుల్ని ఎదుర్కొన్నాయి. ఈ జాబితాలో రాజస్థాన్ తర్వాతి స్థానంలో చెన్నై నిలిచింది. చెన్నై కూడా పెద్దగా అటాక్ చేయలేదు.
అయితే, ఇలా జాగ్రత్తగా ఆడటం మూలాన భారీ స్కోర్లు చేసే అవకాశం ఉండనందున, రాజస్థాన్ అటాకింగ్ గేమ్ ఆడటం ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














