ఆర్సీబీ: వరుస ఓటముల నుంచి అనూహ్య విజయాలు.. 2010 రిపీట్ కానుందా?

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్‌ ఈ సీజన్‌లో మొదట వరుస పరాజయాలతో సతమతమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తర్వాత వరుసగా 6 విజయాలతో అనూహ్యంగా ప్లేఆఫ్స్‌‌కి చేరింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సీఎస్కేకి 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 54 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 47, రజత్ పాటీదార్ 41, కామెరాన్ గ్రీన్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకి ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. రచిన్ 61 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో ధోనీ పోరాడినా చెన్నై జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో గెలవకపోయినా కనీసం 201 పరుగులు చేసినా సరే, నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి ఉండేది. కానీ 20 ఓవర్లలో 191 పరుగులతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.

పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, సీఎస్కే చెరో 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్‌రేట్ కారణంగా సీఎస్కేను పక్కకు నెట్టేసి ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరింది.

ఐపీఎల్ టీ20 సిరీస్ ప్రారంభమైన 2008 నుంచి గత 16 సీజన్లుగా ఆర్సీబీ చాంపియన్‌గా నిలవాలని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, వారికి ప్రతిసారీ నిరాశే ఎదురైంది. బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేకపోయింది.

ఎప్పటిలాగే 2024 ఐపీఎల్ టీ20 సీజన్‌లోనూ ఆర్సీబీ జట్టుపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే, వేలంలో ఆ జట్టు చాలా మంది యువ విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయడంతో ఆర్సీబీ ఈసారి ఏదో మ్యాజిక్ చేస్తుందని భావించారు.

అల్సారీ జోసెఫ్, ట్యాప్లీ, కామెరాన్ గ్రీన్, ఫెర్గూసన్, టామ్ కుర్రాన్ లాంటి ఎందరో ఆటగాళ్లు జట్టులోకి రావడంతో ఈసారి ఆర్సీబీ జట్టు భారీ విజయాలు సాధిస్తుందని అభిమానులు భావించారు. కానీ, ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత నెల రోజుల పాటు ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

మొదట వరుస ఓటములతో విసుగు..

ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ఓడించడంతో ఆర్సీబీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత వరుసగా 6 పరాజయాలు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి, నిరాశకు గురిచేశాయి.

మూడు వారాల కిందటి వరకు కూడా 8 మ్యాచ్‌లలో 7 ఓడిపోయి ఆర్సీబీ సిరీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. దీంతో అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

వేలంలో ఆర్సీబీ ఫర్వాలేదనిపించినా, తుది జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ల ఎంపిక బాలేదు, బౌలింగ్ బాలేదు, ఆల్ రౌండర్లు లేరు, మంచి స్పిన్నర్లు లేరంటూ సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో అభిమానులు, విమర్శకులు ఎన్నో విమర్శలు చేశారు.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

అనూహ్య మార్పు..

ఆరు వరుస పరాజయాలతో ఆ జట్టు నిరాశలో కూరుకుపోయింది.

ఆర్సీబీ తన ఎలెవెన్ స్క్వాడ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే కొనసాగించింది, ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్‌, డెత్ ఓవర్ బౌలర్ సిరాజ్‌ ఉన్నప్పటికీ ఆ జట్టు ఓటముల నుంచి గట్టెక్కలేకపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా చెన్నై జట్టుపై నెగ్గలేక ఆర్సీబీ డీలా పడిపోయింది.‌

మరీముఖ్యంగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో 222 పరుగులు చేజింగ్ చేస్తూ కేవలం ఒక్క పరుగుతో ఓడిపోవడం ఆర్సీబీ ఆటగాళ్లను మరింత కుంగదీసింది. అయితే, ఆ పరాజయంతో ఇక చాలు అన్నట్లుగా తర్వాతి మ్యాచ్‌ల ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయి.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాక్ టు బ్యాక్ విజయాలు

ఏప్రిల్ 25 తర్వాత ఆర్సీబీ పూర్తిగా మారిపోయింది. వరుసగా 6 విజయాలు సాధించి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి 5 - 6 స్థానాలకు ఎగబాకింది.

తొలిరౌండ్‌లో ఓడించిన జట్లపై బెంగళూరు జట్టు ప్రతీకారం తీర్చుకుంది.

ఉదాహరణకు, ఏప్రిల్‌ 15న బెంగళూరులో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు చేసి ఆర్సీబీకి కంటతడి పెట్టించింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 262 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

ఆ తర్వాతి పది రోజుల్లోనే అంతా తల్లకిందులైంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 207 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ జట్టును 171 పరుగులకే ఆలౌట్ చేసి ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

వరుస ఓటములను చవిచూసిన ఆర్సీబీ తిరిగి పుంజుకుని వరుసగా 6 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

ఇదెలా సాధ్యమైంది? వరుసగా 6 విజయాలు ఎలా? బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులొచ్చాయి? నిలకడగా, సమష్టిగా ఎలా రాణించారనే విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఆ 'ఒక్క పరుగు' తర్వాత ఏం జరిగింది?

కోల్‌కతా చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ జట్టు తుది జట్టులో మార్పులు చేసింది. వేలంలో సొంతం చేసుకున్న యువ క్రికెటర్లకు తుది జట్టులో చోటు కల్పించింది.

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆశాజనకంగానే ఉంది. తర్వాతి ఆర్డర్‌లోని బ్యాట్స్‌మెన్ కూడా మంచి పరుగులే చేస్తున్నారు. దీంతో మిడిలార్డర్‌లో ఆర్సీబీ మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో విల్ జాక్స్‌ని తీసుకున్నారు. రూ.17.50 కోట్లకు దక్కించుకున్న కామెరాన్ గ్రీన్‌‌తో బ్యాటింగ్ లోయర్ ఆర్డర్‌ను పటిష్టం చేసింది.

ఓపెనర్ల తర్వాత రజత్ పాటీదార్‌ను రంగంలోకి దించారు. ఈ మార్పులు జట్టుకు మంచి ఫలితాలనిచ్చాయని ఆర్సీబీ సాధించిన వరుస విజయాలు రుజువు చేస్తున్నాయి.

ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విల్ జాక్స్ విధ్వంసకర బ్యాటింగ్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన జాక్స్, ఆ తర్వాతి 10 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 16 ఓవర్లలోనే 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి తమ నిర్ణయం సరైనదేనని ఆర్సీబీ నిరూపించింది.

అలాగే, బౌలింగ్‌లోనూ ఆర్సీబీ కొన్ని మార్పులు చేసింది. సిరాజ్‌కి కొన్ని మ్యాచ్‌లలో విశ్రాంతి కల్పించి.. ఫెర్గూసన్, యశ్ దయాళ్, కామెరాన్ గ్రీన్‌తో ఆడడం మొదలుపెట్టింది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

హసరంగ, చాహల్‌ లేకపోవడంతో ఐపీఎల్‌లో అనుభవం ఉన్న ఏకైక స్పిన్నర్ కరణ్ శర్మ. అతనితో పాటు యువ క్రికెటర్ స్వప్నిల్ సింగ్‌ను ఆర్సీబీ ఉపయోగించుకుంది. స్వప్నిల్ సింగ్ అనూహ్యంగా రాణించి, పవర్ ప్లే ఓవర్‌లో బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా పడగొట్టాడు.

రజత్ పాటీదార్‌‌కు మరింత స్వేచ్ఛనిస్తూ వన్‌డౌన్‌లో రంగంలోకి దింపడం కూడా జట్టుకి కలిసొచ్చింది. పాటీదార్ తన చివరి 5 ఇన్సింగ్స్‌లలో 4 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ, సీజన్ ప్రారంభంలో పాటీదార్‌ను ఓపెనర్, వన్‌డౌన్ స్థానాల్లో మారుస్తూ వచ్చింది.

ఫామ్‌లో లేకపోవడంతో మ్యాక్స్‌వెల్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేయడం ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సాహసోపేత నిర్ణయంగా చెప్పవచ్చు. అలాగే, మహిపాల్ లోమ్రోర్, మయాంక్, ఆకాశ్‌దీప్, విజయ్‌కుమార్ వంటి యువ ఆటగాళ్లను ఆర్సీబీ రొటేట్ చేసింది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

పుంజుకోవడంపై కెప్టెన్ ఏమన్నారు?

ఆర్సీబీ జట్టు తిరిగి పుంజుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ, ''ఈ సీజన్‌లో మొదట మా ప్రదర్శన అంత బాలేదు. కానీ, ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్నాం. ఈ విజయాల కోసం తెరవెనక చాలా కష్టపడ్డాం. మాకు వైవిధ్యమైన బౌలర్లు ఉన్నారని ఇప్పుడే తెలిసింది'' అన్నారు.

''యశ్ దయాళ్, ఫెర్గూసన్ బౌలింగ్ అద్భుతం. ఇలాంటి దీటైన క్రికెట్ ఆడాలనుకుంటున్నాం, సమష్టిగా రాణించి తర్వాతి రౌండ్‌కు వెళ్తాం'' అన్నారు డుప్లెసిస్.

జింబాబ్వేకి చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ ఆర్సీబీ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఫ్లవర్ గతంలో పీఎస్‌ఎల్, సీపీఎల్, హండ్రెడ్, ఐఎల్‌డీ20 వంటి సిరీస్‌లలో అనేక జట్లకు కోచ్‌గా వ్యవహరించడంతో పాటు చాంపియన్లుగా నిలిపారు. ఆర్సీబీ జట్టును యాండీ ఫ్లవర్ నూతన దిశలో నడిపించే అవకాశం ఉంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

2010 నాటి చరిత్ర రిపీట్ అవుతుందా?

2010 నాటి ఐపీఎల్ సీజన్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే, వరుసగా 4 ఓటములతో సీఎస్కే సిరీస్‌ నుంచి తప్పుకుంటుందని అంతా భావించారు. కానీ, ఆ తర్వాత వరుసగా 3 విజయాలు, ఒక ఓటమి, మళ్లీ విజయంతో 14 పాయింట్లకు చేరుకుంది. ఆ సీజన్‌లో 14 పాయింట్లతో ఆర్సీబీ, కోల్‌కతా, దిల్లీ జట్లు సీఎస్కేతో పోటీ పడ్డాయి. కానీ, అధిక నెట్ రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్ రౌండ్‌లో సీఎస్కే 3వ స్థానం, ఆర్సీబీ 4వ స్థానం దక్కించుకున్నాయి.

సెమీ-ఫైనల్స్‌లో డెక్కన్ చార్జర్స్‌ను, ఫైనల్స్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను గెలుచుకుంది.

అలాగే, ఈసారి ఆర్సీబీ జట్టు కూడా వరుసగా 6 ఓటములను చవిచూసి, ఆ తర్వాత 6 వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరింది.

2010లో సీఎస్కే తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నట్లుగా, ఈ సీజన్‌లో ట్రోఫీ గెలిచి తమ 16 ఏళ్ల దాహం తీర్చుకోవాలని ఆర్సీబీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)