భగభగ మండుతున్న ఎండలు, 15 మంది మృతి, ఆసుపత్రుల్లో బాత్‌టబ్స్..

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వారణాసిలో వడదెబ్బతో బాధపడుతున్న మహిళ శరీరాన్ని చల్లబర్చడానికి నుదురుపై నీళ్లు పోస్తున్న ఆసుపత్రి సిబ్బంది
    • రచయిత, చెరిలాన్ మోలాన్
    • హోదా, బీబీసీ న్యూస్ ముంబయి

దేశవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా గత రెండు రోజుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

గురువారం ఒక్కరోజే పది మంది చనిపోయినట్లు ఒడిశాలోని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

దేశ రాజధాని దిల్లీతో పాటు బిహార్, రాజస్థాన్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి.

ఉత్తర, మధ్య భారతంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు ఎండతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వడదెబ్బ కారణంగా గురువారం ముగ్గురు ఎన్నికల అధికారులతో పాటు ఒక పోలీసు చనిపోయినట్లు బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ మహేంద్ర కుమార్, వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.

అహ్మదాబాద్

ఫొటో సోర్స్, Reuters

‘‘గురువారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని కేంద్రాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వారు చనిపోయారు. ఒక హోం గార్డు కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు’’ అని మహేంద్ర కుమార్ చెప్పారు.

వడదెబ్బ సంబంధిత సమస్యలతో కారణంగా గురువారం ఒక్కరోజే దాదాపు 30 నుంచి 40 మంది వరకు అదే ఆసుపత్రిలో చేరారని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతంలో ఇలాంటి కారణాలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.

దిల్లీలో వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన ఒక కార్మికుడు చికిత్స పొందుతూ మరణించారు.

వడదెబ్బ ప్రాణాంతకమని, దీనివల్ల మరణాల రేటు 40-64 శాతం ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో వాటర్ ట్యాంకర్ చుట్టూ చేరిన ప్రజలు

గత రెండు వారాలుగా ఉత్తర, మధ్య భారతంతో పాటు పశ్చిమాన కొన్ని ప్రాంతాల్లో భరించలేనంత ఎండలు నమోదవుతున్నాయి. రోజుల తరబడి దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు కూడా దాటింది.

దిల్లీ సహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఏర్పడింది. విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

దిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దిల్లీలో నీళ్ల కోసం ప్రజలు వాటర్ ట్యాంకర్ల వద్ద గుమిగూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పైగా చాలా ప్రాంతాల్లో తరచుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు.

ముంగేశ్‌పూర్‌లో బుధవారం నమోదైన 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నిజమేనా? లేదా వాతావరణ కేంద్రంలోని సెన్సార్‌లో లోపం కారణంగా ఇలా జరిగిందా అనే విషయాన్ని ఇంకా అధికారులు పరిశోధిస్తున్నారు.

2000-2004, 2017-21ల మధ్య భారత్‌లో తీవ్రమైన వేడి కారణంగా నమోదైన మరణాల సంఖ్య 55 శాతం పెరిగిందని ద లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు.

రానున్న కాలంలో హీట్‌వేవ్స్ సుదీర్ఘకాలం పాటు, మరింత తీవ్రతతో, మరింత తరచుగా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

తీవ్రమైన ఎండలో తలను తడుపుకుంటున్న వ్యక్తి

నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు.. నిజమేనా?

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో శుక్రవారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పలు వార్తాసంస్థల్లో కథనాలు వచ్చాయి.

అయితే, ఇది నిజం కాదని నాగ్‌పుర్ ఐఎండీ స్పష్టం చేసింది.

నాగ్‌పుర్ సిటీ ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)‌లోని సెన్సార్‌ సరిగా పనిచేయడం లేదని, ఈ కారణంగానే తప్పుడు గణాంకాలు నమోదయ్యాయని వెల్లడించింది.

సెన్సార్‌ లోపాన్ని సరిచేస్తున్నామని తెలిపింది.

విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ సెన్సార్లు విఫలమవుతుంటాయని ఐఎండీ పేర్కొంది.

సెన్సార్లు పాడవ్వటంతో పాటు ఇతర పరిస్థితుల కారణంగా తప్పుడు రీడింగ్ నమోదు అవుతుందని తెలిపింది.

ఆస్పత్రిలో బాత్ టబ్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా బాత్ టబ్స్ ఏర్పాటు చేశారు

ఆసుపత్రుల్లో బాత్‌టబ్స్

వడదెబ్బతో ఆసుపత్రుల్లో చేరే ఎమర్జెన్సీ రోగుల కోసం దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వడదెబ్బ బారిన పడినవారి కోసం ప్రత్యేకంగా ఇన్‌ప్లేటబుల్ ట్యూబ్స్ ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్, డాక్టర్ సీమా బాలకృష్ణ వాస్నిక్ చెప్పారు.

గాలితో నింపే ఇన్‌ప్లేటబుల్ ట్యూబ్స్‌లలో మంచు ముక్కల్ని నింపుతారు. వడదెబ్బ బాధితుల చికిత్స కోసం వీటిని వాడతారు.

ఇదేకాకుండా బాధితుల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మంచు, చల్లటి నీటితో నింపిన బాత్‌టబ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

వడదెబ్బ తగిలిన వాళ్లకు వీలైనంత త్వరగా వైద్యం అందించకపోతే, మరణం సంభవించే రేటు 80 శాతం పెరుగుతుందని ఆమె చెప్పారు. కాబట్టి వీలైనంత త్వరగా వారి శరీరాన్ని చల్లబరిచేలా ఆసుపత్రిలో కావాల్సిన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఒక ఆసుపత్రిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)