దోషిగా తేలిన డోనల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యకుడు కావొచ్చా? 5 కీలక ప్రశ్నలు- సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను మన్‌హటన్ కోర్టు దోషిగా ప్రకటించింది.
మాజీ శృంగార తార స్టోర్మీ డేనియల్స్‌తో తాను సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు డబ్బులు చెల్లించారని, ఈ చెల్లింపుల విషయంలో బిజినెస్ రికార్డులను తారుమారు చేశారనే అభియోగాలపై ట్రంప్‌ను మన్‌హటన్ కోర్టు దోషిగా తేల్చింది.
క్రిమినల్ కేసులో ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి.
ఈ కేసులో వాదనలు ముగిసిన రెండు రోజుల తరువాత న్యాయస్థానం మొత్తం 34 అభియోగాలలో ట్రంప్‌ను దోషిగా నిర్ధరిస్తూ తీర్పు ఇచ్చింది.
నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గా బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో ఈ తీర్పువచ్చింది.
కోర్టు విచారణను ‘సిగ్గుచేటు’ అని ట్రంప్ అభివర్ణించారు. నవంబర్ 5న ప్రజలు నిజమైన తీర్పు ఇస్తారని ఆయన చెప్పారు.
మరి ఈ కేసు ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రభావితం చేస్తుందా?

ఫొటో సోర్స్, REUTERS
1. ఇప్పుడేం జరుగుతుంది?
జులై 11న ఉదయం 10 గంటలకు ట్రంప్‌కు శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి జువాన్ మర్చన్ ప్రకటించారు.
శిక్షను నిర్ధరించే సమయంలో న్యాయమూర్తి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
వాటిల్లో ట్రంప్ వయసు (77), గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఆచరించడంలో విఫలం కావడం (ఈ విషయంలో ఇప్పటికే ట్రంప్‌కు జరిమానా పడింది) తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు.
శిక్షలో జరిమానా, లేదా పర్యవేక్షణలో ఉండే విడుదల, లేదంటే జైలు శిక్ష విధించవచ్చు.
మరోపక్క ట్రంప్ ఈ తీర్పుపై కచ్చితంగా అప్పీల్ చేస్తారు.
ఈ ప్రక్రియకు నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు.
ఆయన అప్పీలుకు వెళితే, బెయిల్‌పై ఆయన బయటే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
2. ట్రంప్ జైలుకు వెళతారా?
ట్రంప్ జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆయనపై మోపిన 34 అభియోగాలు న్యూయార్క్ చట్టం ప్రకారం తక్కువ తీవ్రత ఉన్న కేసులు.
ప్రతి అభియోగంపైనా గరిష్ఠంగా నాలుగేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ట్రంప్ వయసు, నేర చరిత్ర లేకపోవడం, ఈ కేసులో ఎటువంటి హింస లేకపోవడం వల్ల న్యాయమూర్తి తక్కువ శిక్ష వేసి, ట్రంప్‌ను జైలుకు పంపవచ్చు.
ఇక్కడ ఓ ప్రాక్టికల్ సమస్య కూడా ఉంది. అందరి మాజీ అధ్యక్షుల్లానే ట్రంప్‌కు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉంది. అంటే జైల్లో కూడా ట్రంప్‌ను కొంతమంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రక్షిస్తూ ఉండాలి.
పైగా ఓ మాజీ అధ్యక్షుడిని జైలులో ఉంచడం కష్టమైన విషయం. ఇదో అతిపెద్ద భద్రతా ముప్పు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా.
‘‘జైలు భద్రత, ఖర్చు తగ్గించుకోవడం అనే రెండు విషయాలపై జైలు వ్యవస్థ దృష్టి సారిస్తుంది’’ అని జస్టిన్ పాపెర్నీ చెప్పారు. ఆయన ప్రిజన్ కన్సల్టెన్సీ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
3. ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అవుతారా?
అమెరికా రాజ్యాంగం అధ్యక్ష అభ్యర్థికి కొన్ని అర్హతలను నిర్ణయించింది. అందులో ముఖ్యమైనది అభ్యర్థికి కనీసం 35 ఏళ్ళ వయసుండాలి. అమెరికాలో పుట్టిన పౌరుడై ఉండాలి, 14 ఏళ్ళుగా అమెరికాలో నివసిస్తూ ఉండాలి.
అయితే నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవు.
ట్రంప్‌పై వెలువడిన తీర్పు అధ్యక్ష పోటీని రాజకీయంగా ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే విషయం పెద్దగా ఎవరికీ తెలియదు.
ట్రంప్ కనుక దోషిగా తేలితే ఆయన రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాలలోని 53 శాతం ఓటర్లు ఈ ఏడాది ఆరంభంలో బ్లూమ్‌బర్గ్ - మార్నింగ్ కన్సల్ట్ పోల్‌లో చెప్పారు.
క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6 శాతం మంది ఓటర్లు చెప్పారు.
పోటాపోటీగా జరిగే అధ్యక్ష ఎన్నికలలో ఈ కొద్దిశాతమే కీలకం అవుతుంది.
గడిచిన ఎనిమిదేళ్ళుగా ట్రంప్‌కు ఉన్న బలమైన మద్దతును చూస్తే ఊహాజనితమైన ప్రశ్నలకు వచ్చే సమాధానాలు వాస్తవికతను ప్రతిబింబించవని చెప్పాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
4. శిక్షపై అప్పీలు ఎందుకు?
శిక్షపై ట్రంప్ అప్పీలుకు వెళ్ళేందుకు స్టోర్మీ డేనియల్స్ వాంగ్మూలాలు ఒక కారణం.
‘‘ఈ కేసుకు సంబంధించి అవసరానికి మించిన వివరాలు అందించారు’’ అని న్యూయార్క్ లా స్కూల్ ప్రొఫెసర్ అన్నా కమిన్‌స్కై వివరించారు.
‘‘వాంగ్మూలంలో చెప్పే వివరాలు అభియోగాలకు బలం చేకూరుస్తాయి. మీరు చెప్పింది న్యాయమూర్తి నమ్మడానికి తగిన ఆధారాలు సమర్పించాలి. అయితే, ఇక్కడొక సన్నని గీత ఉంటుంది. అవి అసంబద్ధంగానూ, హానికరంగానూ మారే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు.
డేనియల్స్ వాంగ్మూలాల నమోదు సందర్భంగా ట్రంప్ న్యాయవాదులు రెండుసార్లు కోరిన విచారణను న్యాయమూర్తి తిరస్కరించారు.
దీంతోపాటు జిల్లా న్యాయవాది ఈ కేసులో అవలంబించిన సరికొత్త న్యాయ వ్యూహం కూడా అప్పీల్‌కు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తోంది.
బిజినెస్ రికార్డులను తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో పెద్ద నేరమేమీ కాదు. కానీ ట్రంప్ అంతకంటే తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అందులో 2016 ఎన్నికలను ట్రంప్ అక్రమంగా ప్రభావితం చేశారనేది కూడా ఉంది.
ఈ కేసులో ఫెడరల్, స్టేట్ ఎన్నికల చట్టాల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వ న్యాయవాదులు విస్తృతార్థంలో చెప్పారు.
స్టేట్ లాకు సంబంధించి ప్రశ్నలు, అన్వయాన్ని ఆధారం చేసుకుని అప్పీల్‌కు వెళ్ళడానికి అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
దీంతోపాటు మన్‌హటన్ జిల్లా న్యాయవాది పరిధి కూడా ఒక కారణం కానుంది.

5. గెలిస్తే ట్రంప్ తనను తాను క్షమించుకోవచ్చా?
ఫెడరల్ క్రైమ్స్‌కు పాల్పడిన వారికి ఏ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించలేరు. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన సమస్య. అంటే దానర్థం రేపు ఒకవేళ ట్రంప్ గెలిచినా చేయడానికి ఆయన చేతుల్లో ఏమీ ఉండదు.
జార్జియాలో ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులోనూ ఇదే వర్తిస్తుంది. 2020 ఎన్నికలలో అధ్యక్షుడు జోబైడెన్ కారణంగా జరిగిన నష్టాన్ని తారుమారు చేసేందుకు కుట్ర పన్నినట్టు ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. ఇప్పడా కేసు అప్పీల్‌లో ఉంది.
ట్రంప్ మరో రెండు ఫెడరల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు.
కానీ ఎన్నికల ముందు అవి విచారణకు రాకపోవచ్చు.
ఒకవేళ ఈ రెండు కేసుల్లో కూడా ఆయన దోషిగా తేలితే, క్షమాభిక్ష ప్రసాదించే అధికారం నుంచి ట్రంప్ ప్రయోజనం పొందుతారనే విషయంపై నిపుణులు విభేదిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















