ఇజ్రాయెల్- గాజా యుద్ధం: రఫా శిబిరంపై జరిగిన దాడిలో వాస్తవాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అహ్మద్ నూర్, అబ్దిరహీం సయీద్, షిరీన్ షరీఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ గాజాలోని రఫా నగరంలో పాలస్తీనియన్ల శిబిరంపై మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 45 మంది మరణించారని గాజాలో హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల్లో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పింది.
ఈ దాడికి ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న ఆ ప్రాంతం "సేఫ్ జోన్" అని పాలస్తీనియన్లు, అనేక సహాయ సంస్థలు చెబుతున్నాయి.
అయితే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దీనిని ఖండించింది. సామాన్య పౌరుల కోసం ఏర్పాటు చేసిన "మానవతా జోన్" బయట ఇద్దరు హమాస్ సీనియర్ లీడర్లను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది.
ఈ దాడిపై అంతర్జాతీయంగా పెరుగుతున్న వ్యతిరేకతల మధ్య ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పౌర మరణాలను "విషాద ఘటన"గా ప్రకటించారు.
ఇజ్రాయెల్ రాకెట్ శరణార్థి శిబిరాన్ని తాకిందని, మానవతా జోన్ లోపలే ఐడీఎఫ్ దాడి చేసిందని పలు పాలస్తీనా మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.
హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని కలవరపరిచే విషయాలు ఉన్నాయి

ఫొటో సోర్స్, Israelarmy
బీబీసీ పరిశీలనలో ఏం తేలింది?
మే 26న దాడి జరిగిన సమయంలో శిబిరం వద్ద ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ప్రత్యక్ష సాక్షుల కథనంతో పాటు ఇతర వీడియోలు, ఫోటోల ఆధారాలను బీబీసీ అరబిక్ సర్వీస్ పరిశీలించింది.
వాయువ్య రఫాలోని శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడికి సంబంధించిన మొదటి వీడియోలు మే 26న అక్కడి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలప్పుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ అయ్యాయి. తొలి వీడియో ఫుటేజీలో తాత్కాలిక శిబిరంలోని గుడారాల్లో మంటలు ఎగిసిపడ్డట్లు కనిపిస్తోంది. సైరన్‌లు, ప్రజల అరుపులు వినింపించాయి.
అక్కడి జనం కాలిపోయిన మృతదేహాలను బయటికి తీస్తున్నట్లు కొన్ని వీడియోలలో కనిపిస్తున్నాయి. వాటిలో తల లేని చిన్నారి మొండెం బయటికి తీస్తుండటం కూడా కనిపించింది.
రాత్రి పోస్టు చేసిన వీడియో ఫుటేజ్, పగటిపూట ఫోటోలు ఘటన లొకేషన్ "కువైట్ సలామ్ (శాంతి) క్యాంప్-1" అని నిర్ధరిస్తున్నాయి.
రఫాలోని తాల్ అల్-సుల్తాన్‌లో పాలస్తీనియన్ శరణార్థుల కోసం ఏర్పాటుచేసిన యూఎన్ఆర్‌డబ్ల్యూఏ లాజిస్టిక్స్ సెంటర్‌కు ఉత్తరాన ఈ శిబిరం ఉందని సోషల్ మీడియా పోస్ట్‌లు చూపిస్తున్నాయి.
ఈ రెండు ప్రాంతాలు ఒకదానికొకటి 200 మీటర్ల దూరంలో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Planet labs bbc
క్యాంపు లొకేషన్..
మే 28న దాడి జరిగిన ప్రదేశాన్ని నిర్ధరిస్తూ ఇజ్రాయెల్ సైన్యం ఒక మ్యాప్‌ను విడుదల చేసింది. అదే ప్రదేశాన్ని గతంలో బీబీసీ ధృవీకరించింది. అయితే, మే 27వ తేదీనే బయటికి వచ్చిన ఉపగ్రహ చిత్రాలలో ఆ ప్రాంతంలోని ఐదు నిర్మాణాలు దెబ్బతిన్నట్లు చూపించాయి.
ఈ దాడిలో "ఖచ్చితమైన" ఆయుధాలను ఉపయోగించామని, ఇద్దరు సీనియర్ హమాస్ కమాండర్లను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో మరణించిన పౌరుల కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.
దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో హమాస్ ఆయుధ డిపో ఉందని, పేలుళ్ల కారణంగా తాత్కాలిక గుడారాల్లో మంటలు చెలరేగాయని ఇజ్రాయెల్ అంటోంది.
బీబీసీ ఈ విషయాలను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.
ఈ క్యాంపు నిర్మించిన స్థలానికి సంబంధించి మరో వివాదం మొదలైంది. పాలస్తీనియన్లు, అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు ఈ ప్రాంతాన్ని "సేఫ్ జోన్"గా పరిగణించినట్లు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది.

ఫొటో సోర్స్, Planet labs bbc
సేఫ్ జోన్
దక్షిణ గాజాలో వేటినైతే ‘సేఫ్ జోన్’లుగా చెబుతున్నారో అవే ఇజ్రాయెల్ సైన్యం ‘మానవతా జోన్లు’గా చెబుతున్న ప్రాంతాలను సూచిస్తున్నాయి.
అల్-మవాసి నుంచి డెయిర్ అల్-బలాహ్, ఖాన్ యూనిస్ నగరాల వరకు విస్తరించి ఉన్న వ్యవసాయ భూమి ఇది.
గాజాలోని పాలస్తీనియన్లను ఈ ప్రాంతానికి రావాలని ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ నుంచి సూచిస్తోంది.
2024 మే ప్రారంభంలో ఇక్కడ భూతల దాడిని ప్రారంభించే ముందు, గాజాలోని ప్రజలను రఫాకు తూర్పున ఉన్న"మానవతా జోన్"కు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
తరలింపు హెచ్చరికల జారీ, మానవతా జోన్లను ప్రకటించడానికి ఇజ్రాయెల్ సైన్యం గాజా మ్యాప్‌ను ఉపయోగించింది. దీనిలో గాజాలోని కొన్ని భాగాలను అనేక బ్లాక్‌లుగా విభజించింది.
ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి మే 22న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో "మానవతా జోన్ ఖాన్ యూనిస్‌కు దక్షిణంగా విస్తరించింది" అని చెప్పారు. వాటిలో 2360, 2371, 2373 నంబర్లు గల బ్లాకులూ ఉన్నాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న గుడారాల స్థానాన్ని మేం ఖచ్చితంగా అంచనా వేయడానికి ప్రయత్నించాం. ఆ ప్రాంతం బ్లాక్ నంబర్ 2372లో ఉంది, ఈ స్థలం ఇజ్రాయెల్ సైన్యం నిర్దేశించిన మానవతా జోన్‌కు కొద్దిగా వెలుపల ఉంది.
ఆదేశాల్లో అస్పష్టత
కొందరు పాలస్తీనియన్లు మీడియాతో మాట్లాడుతూ.. టెంట్లు వేసిన ప్రాంతాన్ని సేఫ్ జోన్ అని నమ్ముతున్నట్లు చెప్పారు.
ప్రత్యక్ష సాక్షి, జమాల్ అల్-అత్తర్ మాట్లాడుతూ "ఈ ప్రాంతం సురక్షితమైనదని, మేం ఈ ప్రదేశంలో ఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం మాకు చెప్పింది, ఎందుకంటే ఇది సేఫ్ జోన్. కానీ గాజాలోని ఏ ప్రదేశం కూడా సురక్షితం కాదు" అని అన్నారు.
"సేఫ్ జోన్ అని పిలిచే ఈ ప్రాంతంలో వారు మా పిల్లలను చంపారు. మా మహిళలు, వృద్ధులను కాల్చారు" అని ఆయన ఆరోపించారు.
మునుపటి తరలింపు ప్రకటనలు తప్పుగా ఉన్నాయని బీబీసీ ఇటీవలి విశ్లేషణలోనే వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం దాని మునుపటి తరలింపు హెచ్చరికలు గందరగోళంగా ఉన్నాయని లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయనే వాదనలను ఖండించింది.
శిబిరం ఉన్న ప్రదేశం ‘ప్రకటించిన మానవతా జోన్‘ కు దగ్గరగా ఉందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే, ఈ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో శరణార్థులు ఉన్నారని, వారు ఇక్కడ నిర్మించిన తాత్కాలిక గుడారాలలో నివసిస్తున్నారని, ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.
ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక తర్వాత, చాలామంది పాలస్తీనియన్లు రఫా తూర్పు భాగం వైపు కూడా వెళ్లారు.
ఐక్యరాజ్యసమితి పనిచేస్తున్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉన్నారని యుఎన్‌ఆర్‌డబ్ల్యూఏ మీడియా అధికారి అద్నాన్ అబు హస్నా బీబీసీతో చెప్పారు.
మరో విషయం ఏమిటంటే, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం నుంచి హెచ్చరికలూ అందకపోవడంతో ఈ ప్రాంతం సురక్షితమైనదని శిబిరంలో నివసిస్తున్న ప్రజలు విశ్వసించారు.
మే 6న నగరంలోని తూర్పు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించే ముందు సుమారు 15 లక్షల మంది రఫాలో ఆశ్రయం పొందారు.
"యుద్ధంలో పౌరుల ప్రాణనష్టంపై చింతిస్తున్నాం" అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడికి కొన్ని గంటల ముందు, రఫా నుంచి టెల్ అవీవ్ వైపు హమాస్ ఎనిమిది రాకెట్లను ప్రయోగించింది. జనవరి తర్వాత ఇజ్రాయెల్ నగరంపై జరిగిన తొలి సుదూర దాడి ఇదే.
మూడు వారాల క్రితం అంటే రఫాలో భూతల దాడులు ప్రారంభమయ్యే ముందు, ప్రజలంతా "విస్తరించిన మానవతా జోన్"కు వెళ్లాలని ఐడీఎఫ్ చెప్పింది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, దీని తరువాత 8 లక్షల మందికి పైగా ప్రజలు రఫాకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్‌కు జో బైడెన్ సూచనలు
గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్ చేసిన కొత్త ప్రతిపాదనలను అంగీకరించాలని హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు..
ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
ఈ ప్రతిపాదనలో మూడు భాగాలు ఉన్నాయి. ఆరు వారాల కాల్పుల విరమణతో పాటు, మానవతా సహాయాన్ని పెంచడం, పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా బందీలను విడిపించడం వంటివి అందులో ఉన్నాయి.
ఈ ఒప్పందం క్రమంగా శాశ్వత కాల్పుల విరమణకు, గాజా పునర్నిర్మాణ ప్రణాళికకు దారి తీస్తుంది.
ఈ ప్రతిపాదనను సానుకూలంగా చూస్తున్నట్లు హమాస్ తెలిపింది.
ఈ పరిణామాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెర్రెస్ స్వాగతించారు. ‘‘ఇప్పటికే గాజాలో తీవ్రమైన విధ్వంసాన్ని చూశాం. ఇక దీనిని ఆపాల్సిన సమయం వచ్చింది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దోషిగా తేలిన డోనల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యకుడు కావొచ్చా? మరో 4 కీలక ప్రశ్నలు-సమాధానాలు
- ‘స్టార్ వార్ సినిమాలో చూపించినట్టు గాలి నుంచి నీటిని తయారు చేస్తున్నాం...’
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















