IPL Final 2024: ఆఖరి మెట్టుపై బోల్తా పడిన సన్‌రైజర్స్, కోల్‌కతాకు టైటిల్

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది.
చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది.
తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
వెంకటేశ్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 52 పరుగులు చేశాడు.
కోల్‌కతా జట్టుకు ఇది మూడో ఐపీఎల్ టైటిల్. చివరిసారి ఆ జట్టు 2014 సీజన్‌లో విజేతగా నిలిచింది. అంతకుముందు 2012లోనూ ఈ జట్టే టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
చేతులెత్తేసిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్
హైదరాబాద్ జట్టుకు తొలి ఓవర్‌లోనే పెద్ద షాక్ తగిలింది. ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో అభిషేక్ వెనుదిరిగాడు.
రెండో ఓవర్‌లో ట్రావిస్ హెడ్ కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
అభిమానులు ఆశలు పెట్టుకున్న రాహుల్ త్రిపాఠి (9), నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్) కూడా నిరాశ పరిచారు.
ఎయిడెన్ మార్క్‌రమ్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులే చేశాడు.
క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన హెన్రిచ్ క్లాసెన్ (16)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.
చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విలువైన 24 పరుగుల్ని జోడించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ చేసిన పరుగులే అత్యధికం.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అబ్దుల్ సమద్ 4 పరుగులకే అవుటయ్యాడు.
కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ 3 వికెట్లతో చెలరేగగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
అలవోకగా
స్వల్ప పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అలవోకగా ఛేదించింది.
రెండో ఓవర్‌లోనే సునీల్ నరైన్ (6) అవుటవ్వడం మినహా కోల్‌కతా ఎక్కడా తడబడలేదు.
ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.
వెంకటేశ్ అయ్యర్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91 పరుగులు జోడించారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా 6 పరుగులతో నిలిచాడు.
హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ చెరో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














