ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్, ఫలితాలపై ఆయన ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, APCMO/FB
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంపై ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
తాము ఇన్ని మంచి పనులు చేసినా.. ఓటమి తప్పలేదని, కోట్ల మంది ప్రజల ఆప్యాయత ఏమైందో తెలియడం లేదంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.
ఏం జరిగిందో దేవుడికి తెలుసని, తాను చేయగలిగింది ఏమీ లేదని అన్నారు.
ప్రజల తీర్పును స్వీకరిస్తామని, కానీ, ప్రజలకు మంచి చేయడానికి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామన్నారు.
తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జగన్ స్పీచ్ ఆయన మాటల్లోనే..
‘‘అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు.
66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు గతంలో ఎన్నడూ లేనంతగా మంచి చేశా.
వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారికి తోడుగా ఉన్నాం.
అవ్వాతాతల ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు.
వారి కష్టాలనే మా కష్టాలుగా భావించా. ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్నిరకాలుగా వారికి అండగా ఉంటూ.. ఆసరాగా ఉన్నా.
కోటి 5 లక్షల అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు.
ఎన్ని మంచి పనులు చేసినా, వారి ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు.
చదువులో ఎన్నడూ లేనంత మార్పులు తీసుకొచ్చాం.
ఆ పిల్లల, తల్లుల అభిమానం ఏమైందో తెలియదు.
అమ్మఒడితో కోటి 53 లక్షల మందికి మంచి చేశాం..
రైతన్నలకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాం. కానీ, అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు.
మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం.
ఎప్పుడూ జరగని విధంగా పేదరికం పోవాలంటే.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారితో యుద్ధం చేసి, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు తోడుగా, అండగా ఉండాలని, వారి చరిత్రను మార్చాలని చూశాం.
ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్ధాయిలోనే సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చి వివక్ష, కరప్షన్ లేకుండా ప్రతి ఇంటికీ సేవలందించాం. దాదాపుగా రూ.2.70 లక్షల కోట్లు ఇంటి వద్దకే అందించగలిగాం.
అన్ని రంగాల్లోనూ ఏ పేదవాడు ఎఫ్పుడూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా నిల్చున్నాం.
మహిళా సాధికారత అంటే ఇదీ అని ప్రపంచానికి సాటి చెప్పాం.
సామాజిక న్యాయం అంటే ఇదని ప్రపంచానికి చూపించాం.
ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు.
ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ, మంచి చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటాం.
పేదవాడికి అండగా ఉండే విషయంలో వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాం. మా గళం వినిపిస్తూ వారికి అండగా నిలుస్తాం.
పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. దిల్లీని శాసించే వారి కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీకి, చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు, వారి గొప్ప విజయానికి అభినందనలు.
ఓడిపోయినా నా ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్‌కు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఏం జరిగిందో తెలియదు కానీ, ఏం చేసినా, ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు.
మళ్లీ కచ్చితంగా ఇక్కడి నుంచి లేస్తాం. ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిల్చుంటాం.
ఈ ఐదు సంవత్సరాలు తప్ప, నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలో గడిపా. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను భరించా.
ఇప్పుడు అంతకన్నా ఏమన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా, భరించేందుకు సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్‌లోకి వచ్చిన వారికి అభినందనలు’’ అని జగన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- టీ20 ప్రపంచ కప్: రిషబ్ పంత్ రిటైర్డ్ అవుట్, క్రికెట్లో ఎన్ని రకాలుగా అవుట్ చేయొచ్చంటే..
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- బీబీసీ పరిశోధన: లగ్జరీ పెర్ఫ్యూమ్ల వెనుక దారుణ నిజాలు, మల్లె తోటల్లో వాడిపోతున్న బాల్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








