ఏపీ స్పెషల్ స్టేటస్: ముగిసిన అధ్యాయం తిరిగి తెరుచుకుంటుందా? చంద్రబాబు, నితీశ్ కుమార్ ఏం చేయనున్నారు?

చంద్రబాబు నాయుడు ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019లో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నల్లచొక్కా ధరించి నిరసనకు దిగారు.
    • రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఫ్రత్యేక హోదా అంశం మరోసారి చర్చల్లోకి వస్తోంది. ఈ ‘ముగిసిన అధ్యాయం’ తిరిగి తెరుచుకుంటుందా? అనే చర్చ మొదలైంది.

ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారడంతో ఈ అంశం ఆసక్తిగా మారింది.

కేంద్రంలో బీజేపీ 240 స్థానాలే సాధించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో, తెలుగు దేశం పార్టీ (16 ఎంపీ సీట్లు ), జేడీ (యూ) (12 ఎంపీ సీట్లు) మద్దతు ఆ పార్టీకి అనివార్యంగా మారింది.

చంద్రబాబు మరోసారి కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి, ఏపీ ప్రజల ప్రత్యేక హోదా కల నెరవేరుతుందా?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ పార్లమెంటులో ప్రకటించారు.

ఇప్పటిదాకా ఏం జరిగింది?

ఆంధ్ర, తెలంగాణలను విభజించిన సమయంలో ఏపీకి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రకటించారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని చేసిన ప్రకటన కాబట్టి ఆ హామీ నెరవేరుతుందని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావించారు.

కానీ ప్రజలు ఒకటి తలిస్తే, ప్రభుత్వాలు మరొకటి తలిచాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రంలోని బీజేపీ స్వరం మారింది.

ప్రత్యేక హోదా కాస్తా ప్రత్యేక ప్యాకేజీగా మారింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2016 సెప్టెంబర్ 7న అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జైట్లీ వివరించారు.

ప్రత్యేక హోదాకు సమానంగానే రాష్ట్రానికి 5 సంవత్సరాలపాటు ఆర్థిక సాయం ఉంటుందని జైట్లీ చెప్పారు.

అప్పటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ అంశం చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తూనే ఉన్నాయి.

ఫరూఖ్, చంద్రబాబు, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019లో చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షకు హాజరైన ఫరూఖ్, రాహుల్ గాంధీ

ముందు ‘ఎస్‘.. తర్వాత ‘నో‘

2014 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి విభజిత ఆంధ్రప్రదేశ్‌‌కు తొలి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు.

ప్యాకేజీని నిరాకరిస్తే నష్టపోతామని చంద్రబాబు పేర్కొన్నారు.

అయితే, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడానికి చంద్రబాబు ఎవరంటూ వైసీపీ తీవ్రంగా ప్రశ్నించింది.

అలా నాలుగేళ్ళు గడిచిపోయాక 2018లో చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు.

2018 జులైలో కేంద్రంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.

2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రత్యేక హోదా అంశంపై మోసం చేసిందంటూ నల్లచొక్కా ధరించి నిరసనకు దిగారు.

2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ చంద్రబాబు దేశరాజధాని దిల్లీలో ధర్మపోరాట దీక్షకు దిగారు.

ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ , ఫరూఖ్ అబ్డుల్లా తదితర నేతలు తరలివచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.

మోదీని కలిసిన జగన్

ఫొటో సోర్స్, YSRCPOFFICIAL/FACEBOOK

ఫొటో క్యాప్షన్, 2020 ఫిబ్రవరి 12న ప్రధాని నరేంద్ర మోదీని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు.

‘అడుగుతూనే ఉంటా’

ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా మడమ తిప్పారనే విమర్శలు ఉన్నాయి.

‘‘ఎన్డీయేకు 250 సీట్లు మించకూడదు అని దేవుడిని కోరుకున్నాను. కానీ మన ఖర్మ కొద్దీ వాళ్లుకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మన సహాయం వాళ్లకు అవసరం లేదు. కానీ ముందుముందు ప్రధానిని కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాను’’ అని జగన్ అప్పుడు చెప్పారు.

తమ అవసరం కేంద్రానికి లేకపోయినా ‘ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం’ గురించి అడుగుతూనే ఉంటామన్నారు.

అయితే, జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో ఎప్పుడు దిల్లీకి వెళ్లినా ప్రధానికి తాను అడుగుతూనే ఉంటానని చెప్పిన విషయాలపై వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలు బలపడ్డాయి.

ఒక దశలో ఆయన వినతిపత్రాలపై తేదీలు మాత్రమే మారుతున్నాయని, అందులోని అంశాలు మారడం లేదనే విమర్శలూ వచ్చాయి.

దీంతో 2014లో టీడీపీ, 2019లో వైసీపీ రెండు పార్టీలు ప్రత్యేక హోదా సాధించలేకపోయాయి.

అలా మొత్తం మీద ప్రత్యేక హోదా ఓ ముగిసిన అధ్యాయంగానూ, రాజకీయ ప్రయోజనాస్త్రంగానూ మారింది.

నితీశ్ కుమార్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీవ్రమైన దుర్భిక్షం, సహజ వనరుల కొరత కారణంగా బిహార్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తోంది.

బిహార్ కూడా...

బిహార్ కూడా ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. తాజాగా బిహార్ కులగణన 2022 ఆధారంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆ రాష్ట్రంలోని వివిధ రాజకీయపక్షాలు కూడా ఈ డిమాండ్‌ను చేస్తున్నాయి.

బిహార్‌లో సహజ వనరుల కొరత, నిరంతరాయంగా నీటిపారుదల సరఫరా లేకపోవడం, ఉత్తర బిహార్‌లో వరదల ముప్పు, దక్షిణ బిహర్‌లో తీవ్ర దుర్బిక్షం సాధారణ విషయాలుగా మారాయి.

మరోపక్క బిహార్ విభజన కారణంగా కీలకమైన పరిశ్రమలన్నీ ఝార్ఖండ్‌కు తరలిపోవడంతో నిరుద్యోగం ప్రబలిపోయింది. 54 వేల తలసరి ఆదాయంతో బిహర్ పేద రాష్ట్రంగా నిలుస్తోంది.

ఈ సమస్యల పరిష్కారానికి స్పెషల్ కేటగిరీ స్టేటసే పరిష్కారమని ఆ రాష్ట్రం భావిస్తోంది.

ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనమేంటి?

ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించేందుకు గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు కూడా ఉంటుంది.

పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలిస్తారు. ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరించడం కూడా చేస్తారు.

మోదీ, చంద్రబాబు, నితీశ్

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/FB

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కచ్చితంగా పట్టుబట్టే అవకాశం ఉంటుంది.

చంద్రబాబు, నితీశ్ కుమార్ ఏం చేస్తారు?

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ చంద్రబాబు, నితీశ్ కుమార్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో వీరిద్దరూ ఏం చేయనున్నారన్నది ఆసక్తిగా మారింది.

ఈ విషయంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీ.ఎస్.రామ్మోహన్ మాట్లాడారు.

‘‘చంద్రబాబు నాయుడు కచ్చితంగా ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే ఇది సంక్లిష్టమైన వ్యవహారం. 2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడానికి ఆయన చూపించిన కారణం ప్రత్యేక హోదానే.

ప్రత్యేక హోదాపై ఆయన వైఖరిలో గతంలో మార్పులొచ్చాయి. ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేశ్‌తో నేను మాట్లాడినపుడు, ప్రత్యేక హోదా ఇపుడెవరికి ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు అని చెప్పి ఉన్నారు.

వైఖరులు ఎలా ఉన్నా ఇపుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం మీద ఆధారపడాల్సిన స్థితి ఉన్నది కాబట్టి మీరెందుకు పట్టుబట్టరు? అనే ఒత్తిడి చంద్రబాబుపై కచ్చితంగా ఉంటుంది.

పార్లమెంట్‌లో నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా సాధనకైనా రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలను సాధించుకోవడానికైనా ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా అనే మాట ముందుకొస్తుంది. అదే సమయంలో అదంత సులభమైన వ్యవహారం అని కూడా చెప్పే స్థితిలేదు.

బిహార్ చాలా కాలంనుంచే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అనేది ముగిసి పోయిన అధ్యాయం అని మోదీ ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. మారిన సన్నివేశాల్లో వారి వైఖరి ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. నిజంగా వైఖరి మార్చుకుని ప్రత్యేక హోదా ఇస్తారా, లేక ప్రత్యామ్నాయాలను చూపెడతారా? అనేది చెప్పలేం’’ అని జీ.ఎస్.రామ్మోహన్ అన్నారు.

మన్మోహన్ సింగ్ కేబినెట్

ఫొటో సోర్స్, HTTP://PLANNINGCOMMISSION.NIC.IN/

ప్రత్యేక హోదా ఎప్పుడు మొదలైంది?

5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు.

అసోం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ప్రారంభంలో ఈ ప్రత్యేక హోదా ఉండేది.

తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడం, అక్కడి పరిస్థితులు కారణంగా మరో ఎనిమిది రాష్ట్రాలకు కూడా హోదా కల్పించారు.

ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకూ ప్రత్యేక హోదా ఉంది.

దేశంలో ప్రస్తుతానికి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు.

ఇటీవల ఏపీతో పాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2013లో అప్పటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది.

ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటి?

ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

  • పర్వత ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు సరిగాలేని ప్రాంతాలై ఉండాలి.
  • జనసాంద్రత తక్కువగా ఉండాలి, గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండాలి.
  • సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలై ఉండాలి.
  • ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతమై ఉండాలి.
  • విదేశాలతో సరిహద్దులుండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలై ఉండాలి.
మోదీ, చంద్రబాబు, నితీశ్ కుమార్ ఫోటో

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/FB

ఫొటో క్యాప్షన్, రాజకీయంగా చంద్రబాబు, నితీశ్ కుమార్ బేరసారాలకు దిగే స్థితిలో ఉన్నారు.

ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారు?

ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ), కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సలహా మేరకు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటారు.

ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది.

ప్రత్యేక హోదా అనేది నిధుల కేటాయింపులతో సంబంధం ఉండటం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయం కూడా ఇందులో కీలకంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)