నరేంద్ర మోదీ: ‘విపక్షాలన్నీ ఏకమైనా, బీజేపీ సొంతంగా సాధించినన్ని సీట్లను గెలుచుకోలేకపోయాయి’

ఫొటో సోర్స్, ANI
విపక్షాలన్నీ ఏకమైనా, బీజేపీ సొంతంగా సాధించినన్ని సీట్లను గెలుచుకోలేకపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు.
బీజేపీ కార్యకర్తలకు, నేతలకు, అభ్యర్థులందరికీ ధన్యవాదాలు చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత, రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వమే మూడోసారి తిరిగి అధికారంలోకి రాబోతుందన్నారు.
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒడిశాలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. జగన్నాథుడి భూమిపై తొలిసారి బీజేపీ అభ్యర్థి సీఎం కాబోతున్నారని అన్నారు.
కేరళలో కూడా బీజేపీ గెలిచిందని, ఆ రాష్ట్రంలోని కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ఎన్నో తరాలుగా సామాన్య ప్రజలకు సేవలందించేందుకు వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు.
ఎన్నికల సంఘానికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఎంతో సమర్థవంతంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికను నిర్వహించిందని అన్నారు.
‘అమ్మ లేని లోటును తీర్చారు’
ఈరోజు చాలా ఎమోషనల్ డే అని, అమ్మ చనిపోయిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అమ్మ లేని లోటును ఈ దేశ ప్రజలు తీర్చారని అన్నారు. ఈ దేశ తల్లులు, అక్కాచెల్లెళ్లు తనకు సరికొత్త ప్రేరణను కలిగించారని చెప్పారు.
















