గే కన్వర్షన్ థెరపీ: ‘నా జీవితంలో చీకటి రోజులవి’

రొసారియో లొనెగ్రో

ఫొటో సోర్స్, Rosario Lonegro

    • రచయిత, డేవిడ్ గిగ్లోని
    • హోదా, బీబీసీ న్యూస్

రొసారియో లొనెగ్రో మత గురువు (ప్రీస్ట్) కావాలని అనుకున్నారు. సిసిలీలోని ఒక క్యాథలిక్ సెమినరీ (ప్రీస్ట్‌లకు శిక్షణ ఇచ్చే కాలేజీ)లో చేరినప్పుడు ఆయన వయస్సు 20 ఏళ్లు.

కానీ, అక్కడున్నప్పుడు ఆయన మరో పురుషుడి ప్రేమలో పడ్డారు. మతగురువు మార్గంలో కొనసాగాలనుకుంటే, వెంటనే తన లైంగిక ఆసక్తులను చెరిపేసే శస్త్రచికిత్స (కన్వర్షన్ థెరపీ) చేయించుకోవాలని ఆయన కాలేజీ ఉన్నతాధికారులు డిమాండ్ చేశారు.

2017లో తన సెమినరీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ తన జీవితంలో అవి చీకటి రోజుల గురించి బీబీసీతో ఆయన చెప్పారు.

క్యాథలిక్ చర్చి దృష్టిలో తాను పాపం చేసినవాడిగా మిగిలిపోతాననే భయాలు, అపరాధ భావం తనను వెంటాడాయని అన్నారు.

‘‘నా అసలైన స్వభావాన్ని అణుచుకోవడం తప్ప ఇంకో దారి లేదని అనిపించింది. నాలాగా కాకుండా మరో మనిషిలా జీవించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. ఎంత ప్రయత్నించినా అలా ఉండలేకపోయాను’’ అని ఆయన చెప్పారు.

ఏడాది కాలానికిపైగా సెమినరీలోనే కాకుండా బయట కూడా ఆయన పలు ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొన్నారు. చాలా రోజుల పాటు తన లైంగిక ప్రవృత్తిని తొలగించే బాధాకరమైన కార్యకలాపాల్లో పాల్గొనాల్సి వచ్చింది.

ఈ కార్యకలాపాల్లో ఆయనను చీకటి గదిలో ఉంచేవారు, సహచరుల ముందు బలవంతంగా నగ్నంగా ఉంచేవారు. సొంత అంత్యక్రియలు కూడా చేయాల్సి వచ్చింది.

నడుస్తున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘నా లైంగిక ప్రవృత్తిని మార్చుకోవాలనుకున్నా’’

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 1990లో మానసిక రుగ్మతల జాబితా నుంచి స్వలింగ సంపర్కాన్ని తొలగించింది. ఆ తర్వాత చేసిన చాలా శాస్త్రీయ పరిశోధనల్లో లైంగిక ధోరణిని మార్చే ప్రయత్నాలు పనిచేయవని, పైగా హాని కలిగిస్తాయని వెల్లడైంది.

ఫ్రాన్స్, జర్మనీతో పాటు క్యాథలిక్ ఆధిపత్య స్పెయిన్‌లోనూ కన్వర్షన్ థెరపీలను అధికారికంగా నిషేధించారు. ఇంగ్లండ్, వేల్స్‌లోనూ ఇలాంటి పద్ధతుల్ని చట్టవిరుద్ధంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటలీలో పలువురు స్వలింగ సంపర్కులైన పురుషులను ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. హెటరోసెక్సువల్స్‌గా వారిని మార్చేందుకు ఉద్దేశించిన వ్యక్తిగత థెరపీ సెషన్లు, మీటింగ్‌లలో తమకు ఎదురైన అనుభవాల గురించి వారు బీబీసీకి చెప్పారు.

ఇలాంటి సమావేశాలకు హాజరైన వారిలో 33 ఏళ్ల ఒక వ్యక్తి మాట్లాడుతూ, ‘‘నన్ను నేను మార్చుకోవాలనుకున్నా. స్వలింగ సంపర్కుడిగా నేను ఉండాలనుకోలేదు. దీన్నుంచి బయట పడాల్సిన అవసరం ఉందని నేను భావించా’’ అని ఆయన అన్నారు.

సమాజం నన్ను అంగీకరించడానికి ఉన్న ఏకైక మార్గంగా వాటిని నేను చూశాను. నేనేం మత బోధకుడిని కావాలని ప్రయత్నించలేదు. నేను కోరుకున్నదల్లా దైనందిన జీవితంలో అందరూ నన్ను ఆమోదించడం మాత్రమే’’ అని మరొకరు చెప్పారు.

స్వలింగ మార్పిడి (గే కన్వర్షన్) థెరపీలు ఇటలీలో కేవలం ఒక నిర్ధిష్ట ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి గ్రూప్ మీటింగ్‌లు, వ్యక్తిగత సెషన్లు జరుగుతాయి. లైసెన్స్ పొందిన కొందరు మానసిక వైద్యులు కూడా వీటిని నిర్వహిస్తారు. కొన్ని చోట్ల అనధికారికంగా, రహస్యంగా ఇవి జరుగుతాయి.

కొన్ని కోర్సులకు సంబంధించి బహిరంగ ప్రకటనలతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు.

జార్జియా మెలోని

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఆమెను ముద్దుపెట్టుకుంటే అసహజంగా అనిపించింది ’’

లైంగిక ధోరణిని మార్చుకునేందుకు 15 ఏళ్లు ప్రయత్నించిన స్వలింగ సంపర్కుడు, 36 ఏళ్ల మసిమిలియానో ఫెలిసెట్టి తన అనుభవాలను చెప్పారు.

‘‘ఈ విషయంలో నాకు అసౌకర్యంగా ఉండేది. నా కుటుంబం, సమాజం, చర్చి నన్ను ఎప్పటికీ అంగీకరించదని నేను అనుకున్నా. చాలా రకాలుగా నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నించా. సైకాలజిస్టులను కలిశాను. లైంగిక ప్రవృత్తిని మార్చే నిపుణులను సంప్రదించాను. రెండేళ్ల క్రితం ఇవన్నీ మానేయాలని నిర్ణయించుకున్నా’’ అని ఫెలిసెట్టి వెల్లడించారు.

ఫెలిసెట్టి పోరాటం గురించి తెలిసిన ఒక వ్యక్తి, ఎవరైనా ఒక మహిళతో డేటింగ్ చేయాలంటూ ఆయనను ప్రోత్సహించారు.

‘‘మొదటిసారి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు అసహజంగా అనిపించింది. అప్పుడే ఇక నటించడం మానేయాలని అనుకున్నా’’ అని ఫెలిసెట్టి చెప్పారు.

కొన్ని నెలల క్రితమే తాను స్వలింగ సంపర్కుడిని అనే విషయాన్ని తన కుటుంబానికి తెలియజేశారు.

‘‘ఇది చెప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ, మొదటిసారి నా గుర్తింపు పట్ల సంతోషం కలిగింది’’ అని ఆయన చెప్పారు.

ఇటలీ

ఇటలీలో మార్పిడి చికిత్సలను వ్యతిరేకించే బిల్లును తీసుకురావడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అక్కడ ఎలాంటి పురోగతి లేదు.

ఇటలీలో జార్జియా మెలోని నేతృత్వంలోని రైట్ వింగ్ ప్రభుత్వం, ఎల్జీబీటీ హక్కుల పట్ల శత్రు వైఖరిని అవలంబించింది. ఎల్జీబీటీ లాబీ, లింగ భావజాలం వంటి అంశాలను పరిష్కరిస్తానని స్వయంగా ప్రధాని జార్జియా మెలోని ప్రతిజ్ఞ చేశారు.

పశ్చిమ యూరప్‌లోని మిగతా దేశాలతో పోల్చితే మార్పును స్వాగతించే విషయంలో ఇటలీ చాలా నెమ్మదిగా ఉంటుందని పడోవా యూనివర్సిటీలో కంపారిటివ్ పబ్లిక్ లా రీసెర్చర్ మిచెల్ డి బారీ అన్నారు.

‘‘ఇదొక అంతుచిక్కని విషయం. లైంగిక ధోరణులను మార్చే కార్యక్రమాలను ఇటలీ సైకాలజిస్టులు నిషేధించారు. కానీ, ఇటలీ న్యాయ వ్యవస్థలో దీన్ని చట్టవిరుద్ధంగా పరిగణించట్లేదు. అలాంటి కార్యక్రమాలను చేపట్టే వ్యక్తులకు శిక్షలు లేవు’’ అని ఆమె అన్నారు.

స్వలింగ సంపర్కుల సమాజంతో సహా ప్రతీ ఒక్కరిని క్యాథలిక్ చర్చి స్వాగతిస్తుందని స్వయంగా పోప్ ప్రాన్సిస్ అన్నారు. నియమాలకు లోబడి ఆధ్యాత్మిక మార్గంలో వారితో నడవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

మతగురువులుగా స్వలింగ సంపర్కులను అనుమతించకూడదంటూ ఇటలీ బిషప్‌లతో జరిగిన ఒక సమావేశంలో ఎల్జీబీటీ కమ్యూనిటీ పట్ల పోప్ ఫ్రాన్సిస్ అత్యంత అవమానకర పదాన్ని వాడారని నివేదికలు వచ్చాయి.

సిసిలీని వదిలేసిన రొసారియో, మిలాన్‌లో నివసిస్తున్నారు. 2018లో ఎదుర్కొన్న మానసిక వ్యథ తర్వాత ఆయన సెమినరీకి వెళ్లడం మానేశారు. లైంగిక ధోరణి మార్పిడి సెషన్లకు కూడా వెళ్లడం లేదు.

ఇప్పటికీ దేవుడిని నమ్ముతున్నప్పటికీ, ఇక తాను మతగురువు కావాలని అనుకోవట్లేదు. ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆయన ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

‘‘ఆ చికిత్సలకు, సెషన్లకు హాజరైనప్పుడు ఒక మంత్రాన్ని చెప్పేవారు. అది ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. అదేంటంటే, ‘దేవుడు నిన్ను అలా తయారు చేయలేదు. దేవుడు నిన్ను స్వలింగ సంపర్కుడిగా పుట్టించలేదు. అది నాకు నేను చెప్పుకునే అబద్ధం మాత్రమే’ అని పదే పదే నాతో చెప్పించేవారు. ఈ మంత్రాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని రొసారియో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)