ఎన్నికల్లో మోదీ బలం తగ్గడాన్ని పొరుగు దేశాలు, అమెరికా ఎలా చూస్తాయి?

లోక్‌సభ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ (పాత చిత్రం)

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సంపాదించుకోలేకపోయింది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీని సాధించింది.

ప్రచారమంతా ప్రధానమంత్రి కేంద్రంగా జరిగిన ఈ ఎన్నికలలో బీజేపీ, ఎన్డీయే కూటమికి సంపూర్ణ మెజారిటీ 272 కంటే కొన్ని సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి.

గత రెండు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచాయి. ఎందుకంటే, ఈసారి ప్రధాని మోదీ భారీ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి తిరిగి రావాలని చాలా దేశాలు ఆశించాయి.

అయితే, ఫలితాల అనంతరం ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంత సమర్థంగా జాతీయ, అంతర్జాతీయ విధానాలను నిర్ణయించగలరు అన్నది ప్రశ్న.

మరి, ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పొరుగు దేశాలు, అమెరికా ఈ ఫలితాలను ఎలా చూస్తున్నాయి?

భారత అంతర్జాతీయ సంబంధాలపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం గురించి బీబీసీ ప్రతినిధులు, నిపుణుల అభిప్రాయాలను చదవండి.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
ఫొటో క్యాప్షన్, షుమైలా జాఫ్రీ, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

పాకిస్తాన్‌ స్పందన ఎలా ఉంది?

భారత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆధిక్యం సాధించిందన్న వార్తలపై పాకిస్తాన్‌లో పెద్దగా స్పందన లేదు. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సాధించిన ఆధిక్యం చాలా తక్కువగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

పాకిస్తాన్ ప్రజలు భారతదేశ సార్వత్రిక ఎన్నికల పట్ల ఉదాసీనంగా ఉండటానికి మరొక కారణం, వాళ్లు తమ అంతర్గత రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో పోరాడుతుండటం.

ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యం చేసుకున్న తీరు కారణంగా భారతీయ ముస్లింల పట్ల పాకిస్తాన్‌లో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం భారత ముస్లింలకు అంత మంచి వార్త కాదని సాధారణ పాకిస్తానీయులు భావిస్తున్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ప్రజలు ఆశించడం లేదు. అయినప్పటికీ, కొంతమంది సోషల్ మీడియాలో మోదీ హయాంలో భారత దేశ ఆర్థిక వృద్ధిని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలలో అభివృద్ధిని ప్రశంసించారు.

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే, పాకిస్తాన్ మరింత దూకుడుతో ఉన్న, ఆత్మవిశ్వాసంతో కూడిన భారత్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇస్లామాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లోని ఇండియా సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఖుర్రం అబ్బాస్ అన్నారు. కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, సింధు జలాల ఒప్పందంపై ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఈ సమయంలో పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడం వల్ల ఎలాంటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఉండవన్న రాజకీయ, వ్యూహాత్మక అభిప్రాయం భారతదేశంలో ఏర్పడింది. పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే విధానాన్ని భారత్ కొనసాగిస్తుంది’’ అని ఆయన అన్నారు.

బలూచ్ తిరుగుబాటుదారులకు, పాకిస్తాన్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు భారతదేశం రహస్యంగా మద్దతునిస్తోందని ఖుర్రం అబ్బాస్ భావిస్తున్నారు. పాకిస్తాన్ మరొక ఆందోళన ఏమిటంటే, వాళ్ల గడ్డపైనే వాళ్ల పౌరులు హత్యలకు గురి కావడం. దీనికి కారణంగా పాకిస్తాన్ భారత్ వైపు వేలు చూపిస్తోంది.

భారత్‌తో వాణిజ్యం ప్రారంభించాలని పాకిస్తాన్ సంకేతాలు ఇచ్చింది, కానీ ఖుర్రం అబ్బాస్ దీనిపై సందేహాలు వ్యక్తం చేశారు.

ఇస్లామాబాద్‌కు చెందిన మేధో సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీజినల్ స్టడీస్‌లో భారతదేశ విశ్లేషకులు మరియం మస్తూర్ మాట్లాడుతూ.. 2019లో మోదీ పుల్వామా దాడి విషయంలో, పాకిస్తాన్ వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారని, తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్, ‘భారతీయ ముస్లింలు పాకిస్తాన్‌ అనుకూలురు’ అని ఆరోపించి, అవమానించారని అన్నారు.

"నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే, ఆయన ప్రధానిగా ఉండటం ఇది చివరిసారి అవుతుంది. ఆయన వెళ్లే ముందు తన వారసత్వాన్ని వదిలి వెళ్లాలనుకుంటారు. పాకిస్తాన్ విషయంలో ఆయన ఆలోచనలు, ఆయన ఎలాంటి వారసత్వాన్ని వదిలివెళ్లాలనుకుంటున్నారు? అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. సానుకూలమైన శాంతిదూతా లేక విభజించి పాలించే ప్రతికూల వారసత్వమా?" అని అబ్బాస్ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ ముక్తెదార్ ఖాన్, అంతర్జాతీయ అధ్యయనాల నిపుణులు, యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్‌, అమెరికా

భారత లోక్‌సభ ఫలితాలను అమెరికా ఎలా చూస్తోంది?

భారత్ పట్ల అమెరికా విధానం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశాన్ని చాలా ముఖ్యమైనదిగా అమెరికా పరిగణిస్తుంది, ముఖ్యంగా చైనాను బ్యాలెన్స్ చేయడంలో. అయితే, తులసీ గబార్డ్ వంటి కొందరు సంప్రదాయవాద నాయకులు తప్ప, అమెరికా రాజకీయ నాయకులు మోదీని పెద్దగా ఇష్టపడరు.

అయితే భారత్‌తో సంబంధాలను, చాలా మంది అమెరికన్ నాయకులు ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత ముఖ్యమైన బంధమని చెప్పారు.

చైనాకు వ్యతిరేకంగా భారత్ అమెరికా వైపు నిలబడితే, 21వ శతాబ్దమంతా పాశ్చాత్య, అమెరికా ప్రపంచాధిపత్యం కొనసాగుతుంది. కానీ భారత్ అమెరికాకు వ్యతిరేకంగా మారి, చైనా- రష్యాలతో చేతులు కలిపితే ఈ శతాబ్దంలో పాశ్చాత్య ఆధిపత్యం అంతం అవుతుంది. అందుకే అమెరికాకు భారత్ చాలా ముఖ్యం.

ఇప్పుడు మోదీని ఎదుర్కోవడం విదేశాలకు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే, భారత దేశ విదేశాంగ విధానం చాలా దూకుడుగా మారింది, ఉదాహరణకు విదేశాలలో హత్యల వివాదం. ఇప్పుడు మోదీ బలహీనంగా మారితే వాళ్లు మునుపటి కంటే ఎక్కువ సంతోషిస్తారు.

గత జులైలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అయితే, ఆ తర్వాత అమెరికా, కెనడాలలో ఖలిస్తానీలపై దాడులు భారత్, మోదీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసింది. దీనిపై పాశ్చాత్య దేశాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం భారత్- అమెరికా సంబంధాలలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుత పరిణామాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానం బలహీనపడుతుంది. మరోవైపు విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ, శశిథరూర్ వంటి నేతల గొంతులు మరింత బలంగా వినిపించనున్నాయి.

ఈ ఎన్నికలపై అమెరికా మీడియాలోనూ చర్చ జరుగుతోంది, మోదీ గెలిచారు కానీ ఇప్పుడు ఆయన మరింత మెతక వైఖరి అవలంబించాల్సి ఉంటుందనేది వారి అభిప్రాయం.

ఈ ఫలితాలతో అమెరికాలోని భారతీయ సమాజం ఒకింత నిరుత్సాహానికి లోనయినా, ఈసారి కూడా మోదీ ప్రధాని కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా ప్రభుత్వం భారతదేశాన్ని అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా పరిగణిస్తుంది.

బంగ్లాదేశ్‌‌తో సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

(అక్బర్ హుస్సేన్, బీబీసీ ప్రతినిధి, ఢాకా)

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు బంగ్లాదేశ్‌కూ చాలా ముఖ్యమైనవి.

2009లో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌, భారత్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.

ఆ సమయంలో ఇండియాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు అలాగే కొనసాగాయి.

వాస్తవానికి ఈ కాలంలో, దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలు కూడా కొన్ని పరిష్కారమయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు చేసుకుంది, నరేంద్ర మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేసింది.

షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ, తాము భారతదేశంలో పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వంతో సంబంధాలను కొనసాగించడంపై ఎక్కువ దృష్టి పెడతామని ఎప్పుడూ చెబుతుంటుంది.

భారతదేశంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, షేక్ హసీనాను అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా, అదేవిధంగా, షేక్ హసీనా ప్రభుత్వం భారతదేశాన్ని అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా పరిగణిస్తుంది.

అయితే, పౌరసత్వ సవరణ చట్టం ప్రవేశపెట్టాక, మోదీ ప్రభుత్వం హయాంలో భారత ముస్లింల విషయంలో వ్యవహరిస్తున్న తీరు బంగ్లాదేశ్‌లో కొంత అలజడి సృష్టించింది. ఎందుకంటే భారతదేశంలో ఏం జరిగినా అది బంగ్లాదేశ్‌పైనా ప్రభావం చూపుతుంది.

బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశం. మోదీ ప్రభుత్వ హయాంలో ముస్లింల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరిని అక్కడి సాధారణ ప్రజలూ విమర్శిస్తున్నారు.

అంతేకాకుండా, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య ప్రక్రియలో భారతదేశం కలుగజేసుకుంటోంది అన్న విమర్శలూ వ్యక్తం అయ్యాయి. దీంతో, గత దశాబ్ద కాలంలో బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది.

బంగ్లాదేశ్‌లో జరిగిన గత మూడు సార్వత్రిక ఎన్నికలలో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి భారత మోదీ ప్రభుత్వం బహిరంగంగా మద్దతు ఇచ్చింది. దీనిపై ఆ దేశంలో చాలా విమర్శలు వ్యక్తం అయ్యాయి.

అయితే రానున్న రోజుల్లో భారత్ అంతర్గత విధానంలో చోటు చేసుకునే మార్పులను బంగ్లాదేశ్ ప్రజలు గమనిస్తూ ఉంటారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ నేపాల్‌లో తన రెండవ ద్వైపాక్షిక విదేశీ పర్యటన చేసినప్పుడు, 2015లో నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు భారతదేశం సహాయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి.

సమస్యల పరిష్కారం కోసం నేపాల్

దిల్లీలో వర్షం పడితే నేపాల్‌లో గొడుగులు తెరుచుకుంటాయని నేపాల్‌లో అంటారు. నేపాల్‌లోని ప్రజలు కూడా భారత ఎన్నికలను ఎంతో ఉత్సుకతతో గమనించడానికి బహుశా ఇదే కారణం కావచ్చు.

అయితే, దిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా, రెండు దేశాల మధ్య ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలపై చెప్పుకోదగ్గ ప్రభావం కనిపించడం లేదు. భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో రెండు దేశాల మధ్య సంబంధాలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.

దేశంలో హిందుత్వ అజెండా ఉన్న పార్టీ అధికారంలో ఉండటంతో, బీజేపీ లేదా మోదీ దాని గురించి బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా, నేపాల్‌లోనూ పురాతన హిందూ వారసత్వాన్ని పునరుద్ధరించాలనే ఆసక్తిని చాలామంది కనబరిచారు.

గత కొంతకాలంగా, భారతదేశం-నేపాల్ సంబంధాలు గడియారంలోని ముల్లులా ఒక చివర నుంచి మరొక చివరకి ఊగుతున్నాయి.

2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నేపాల్‌లో తన రెండవ ద్వైపాక్షిక విదేశీ పర్యటన చేసినప్పుడు, 2015లో నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు భారతదేశం సాయంగా నిలిచింది, రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి.

కానీ అదే సంవత్సరంలో నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించినప్పుడు, భారతదేశపు సరిహద్దులో అప్రకటిత దిగ్బంధనంలాంటిది ఏర్పడింది. 2020 తర్వాత, సరిహద్దు మ్యాప్‌పై ఇరు దేశాల మధ్య మొదలైన వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.

ఇవే కాకుండా సైన్యంలో అగ్నివీర్ పథకం కారణంగా భారత సైన్యంలో నిలిచిపోయిన గూర్ఖా సైనికుల నియామకం, వాణిజ్య లోటు పెరగడం, కొన్ని విమాన సేవలు నిలిచిపోవడం వంటి అనేక వివాదాస్పద అంశాలు ఉన్నాయి.

నేపాల్ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఇప్పటికీ రూ. 5 కోట్ల విలువైన పాత భారతీయ కరెన్సీ నోట్లు ఉన్నాయి, 2016లో నోట్ల రద్దు తర్వాత వాటిని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
ఫొటో క్యాప్షన్, సందీప్ దత్తా, సీఈఓ, యూఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఏఈ చాప్టర్)

యూఏఈతో సంబంధాలు

(రోనక్ కొటేచాకు ఇచ్చిన ఇంటర్వ్యూ)

యూఏఈ, భారతదేశాల మధ్య సంబంధం చాలా పురాతనమైనవి, బలమైనవి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెండు దేశాల మధ్యా వాణిజ్యం సజావుగా సాగుతుంది.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం దాదాపు 835 వేల కోట్ల రూపాయలు కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లక్ష్యం రూ. 625 వేల కోట్లు. ఈ రెండు లక్ష్యాలను పరిశీలిస్తే, అవి వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నాయి.

రెండు దేశాల మధ్య 'సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం'పై మొదటి 90 రోజులలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అలాగే ఉంటే, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం వంటి అనేక రంగాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు.

అందువల్ల, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు ఇదే విధంగా కొనసాగుతాయి, నిజం చెప్పాలంటే మరింత బలంగా మారతాయి.

ఇతర దేశాలతో పోల్చితే యుఏఈలో భారతీయ సంతతి ప్రజలు అత్యధికంగా ఉన్నారు. సాంస్కృతికంగాను రెండు దేశాల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇటీవల యూఏఈలో ఒక దేవాలయాన్నీ నిర్మించారు. ఏ ప్రభుత్వం వచ్చినా యూఏఈ, భారత్‌ల మధ్య సంబంధాల్లో ఎలాంటి తేడా ఉండబోదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)