ఇజ్రాయెల్‌ను ఒప్పించడమా, శిక్షించడమా, అమెరికాకు ఏది మార్గం...

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
    • రచయిత, రఫీద్ జబౌరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఘర్షణ మళ్లీ తీవ్రతరమవుతోంది. తాజాగా టెల్ అవీవ్ మీద హమాస్ బాంబు దాడులు చేసింది. మరోవైపు రఫాలోని హమాస్ శిబిరమే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.

అయితే, కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఇరువురి ఘర్షణను తగ్గించడానికి అమెరికా ఏం చేస్తోందనేదానిపై అందరి చూపు ఉంది.

ఇజ్రాయెల్‌కు పలు ఆయుధాలు, పరికరాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన ప్రకటన చాలామందిని ఆశ్చర్యపరిచింది.

అమెరికా ఇజ్రాయెల్‌కు సూత్రప్రాయంగా మద్దతు ఇస్తోంది, ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో తోడుగా నిలుస్తోంది.

కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం అమెరికా విధానాన్ని పక్కకు పెట్టినట్లు కనిపిస్తోంది. బైడెన్ నిర్ణయం గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ తన పద్దతులను మార్చుకోవలసి ఉంటుందనే బలమైన, స్పష్టమైన సందేశంగా పరిగణిస్తున్నారు.

ఇది మాత్రమే కాదు, రఫా నగరంలో ఇజ్రాయెల్ లక్ష్యాలను నియంత్రించాలనే ఒత్తిడి కూడా పెరిగింది.

2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ప్రారంభమైన ఇజ్రాయెల్ ప్రతీకార చర్య పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లను నిరాశ్రయులు చేసింది. వీరిలో ఎక్కువ మంది రఫాలో ఆశ్రయం పొందుతున్నారు.

గాజా యుద్ధానికి సంబంధించి బైడెన్, నెతన్యాహు ప్రభుత్వాలకు మధ్య ఉన్న విభేదాలు ఇటీవల సీఎన్ఎన్​ ఇంటర్వ్యూలో బయటపడ్డాయి.

"నివాస ప్రాంతాలు, ఇతర విధానాలలో ఈ బాంబులను వాడాల్సిన అవసరం లేదు. వాటిని ఉపయోగించడంతో గాజాలో సాధారణ ప్రజలు చనిపోయారు" అని సీఎన్ఎన్‌ ఇంటర్వ్యూలో యూఎస్ అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.

అదే ఇంటర్వ్యూలో రఫాపై దాడి గురించి ఇజ్రాయెల్ చర్యలను ఎత్తిచూపారు. కాల్పుల విరమణ, బందీల విడుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని బైడెన్​ కోరారు.

అంతేకాదు, యుద్ధం తర్వాత పాలస్తీనియన్లు, అరబ్ దేశాల సమన్వయంతో గాజా అభివృద్ధి కోసం వ్యూహాన్ని రూపొందించాలనుకుంటున్నారు.

కానీ, హమాస్‌ను నాశనం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు ముందుకెళుతున్నారు. దీనికోసం యుద్ధాన్ని కొనసాగించడం, రఫాపై దాడి చేయడం తప్ప నెతన్యాహుకు వేరే మార్గం లేదు.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా విధానాలు, నిర్ణయాలలో వైరుధ్యాలు

ఆయుధాలు, సామగ్రి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే, ఇజ్రాయెల్‌కు ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆయుధ ప్యాకేజీని పంపుతున్నట్లు యుఎస్ కాంగ్రెస్‌కు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

ఈ ప్యాకేజీలో ఇజ్రాయెల్ కోసం ట్యాంకులు, మోర్టార్ ఫిరంగి, రవాణా వాహనాలు ఉన్నాయి. దీంతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానాలలో వైరుధ్యం కనిపిస్తోంది. ఎందుకంటే వారు సంక్లిష్టమైన, రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచి మిడిల్ ఈస్ట్ సంఘర్షణల నుంచి దూరం వెళుతూ, చైనా, రష్యాలపై ఎక్కువ శ్రద్ధ చూపారు.

కానీ, గాజా యుద్ధం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానాలకు చెక్ పెట్టింది. మధ్యప్రాచ్యం ఇప్పుడు దాని ప్రాధాన్యత జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో ఉంది, అధ్యక్షుడు బైడెన్ ఆ దేశాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హమాస్ దాడి తర్వాత, అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ వెళ్లారు. నెతన్యాహుకు మద్దతు ఇచ్చారు. ఈ సానుభూతికి కారణం ఉంది. ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయారు, కొంతమంది కిడ్నాప్‌కు గురికావడం అమెరికన్లు చూశారు.

అయితే, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అఫ్గానిస్తాన్, ఇరాక్‌లలో యుద్ధంతో అమెరికా చేసిన అదే తప్పును చేయవద్దని బెంజమిన్ నెతన్యాహుకు బైడెన్ సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

కానీ, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది, దానికి అమెరికా మొదట మద్దతు ఇచ్చింది. ఎప్పటిలాగే, ఇజ్రాయెల్ పూర్తిగా అమెరికన్ ఆయుధాలపై ఆధారపడింది.

కానీ, తర్వాత యుద్ధం మరింత క్లిష్టంగా, రక్తపాతంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు అమెరికా రూ.2వేల కోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసింది.

ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల్లో ఈ ఆయుధాలు ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించాయి.

బైడెన్, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

బైడెన్‌పై రాజకీయంగానూ ఒత్తిడి

కానీ సొంత దేశంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు పరిస్థితి కష్టంగా మారుతోంది. యుద్ధంలో చనిపోతున్న పౌరుల సంఖ్య పెరగడం, గాజాలో విధ్వంసంతో దేశం వెలుపల, బయట బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అంతర్జాతీయ వేదికపై అమెరికా ఒంటరైపోతోంది. దీనికి కారణం కూడా ఉంది. గాజాలో పాలస్తీనా ప్రజల కష్టాలకు స్వస్తి పలకాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తుండగా, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు పలుకుతోంది.

ప్రస్తుతం, అధ్యక్షుడు బైడెన్ దేశీయంగా అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గాజా యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంపై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీతో సహా, సాధారణ అమెరికన్లలో కొంతమందిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికన్ యూనివర్శిటీ క్యాంపస్‌లలో విద్యార్థుల నిరసనలే దీనికి సాక్ష్యాలు.

అదే సమయంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, సామగ్రి సరఫరాను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంపై రిపబ్లికన్ పార్టీలోని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడంతో బైడెన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.

అమెరికాలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పలు అమెరికన్ యూనివర్శిటీ క్యాంపస్‌లలో విద్యార్థులు నిరసనలు తెలియజేశారు.

అమెరికాలో నిరసనలు

అమెరికా కాంగ్రెస్ ఇజ్రాయెల్‌కు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఇందులో అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల రాజకీయ నాయకులూ ఉన్నారు.

ఇజ్రాయెల్ కోసం 15 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని కాంగ్రెస్ ఆమోదించింది. అయితే ఇటీవలి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు బైడెన్ మధ్య విభేదాలు తలెత్తాయి.

రఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్యను బైడెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. లక్షలాది పాలస్తీనియన్లు రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రజలను సేఫ్ జోన్‌కి వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించింది.

అయితే, పౌరులను అక్కడి నుంచి తరలించే వరకు రఫాపై ఎటువంటి దాడి చేయకూడదని నెతన్యాహుకు బైడెన్ సూచించారు.

అంతేకాదు కాల్పులు విరమణ, ఇజ్రాయెల్ బందీల విడుదలకు అమెరికా, ఖతార్‌ చొరవతో ఈజిప్టులో జరిగిన శాంతి చర్చలు కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

రఫాపై దాడికి ఇజ్రాయెల్ పట్టుబట్టడంతో ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాను నిలిపివేస్తామని బైడెన్ ప్రకటించారు.

ఇది ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తుందని, తన పంథా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటుందని బైడెన్ ఆశించారు. అంతేకాకుండా స్వదేశంలో తన మద్దతుదారులను శాంతింపజేయవచ్చనుకున్నారు.

అయితే, ఆయుధాల సరఫరా నిలిపివేతపై రిపబ్లికన్ పార్టీ నుంచి బైడెన్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధం మధ్యలో అలాంటి చర్యలు సరికావని వారు భావిస్తున్నారు.

ఆయుధాల నిలిపివేత నిర్ణయంపై వారి సొంత డెమొక్రటిక్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక తెలిపింది.

తాజాగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇజ్రాయెల్‌కు మరో బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను పంపబోతున్నట్లు మళ్లీ కాంగ్రెస్‌కు చెప్పనున్నట్లు విశ్వసిస్తున్నారు.

ఇది బైడెన్​ ఎదుర్కొంటున్న​ క్లిష్ట రాజకీయ పరిస్థితిని సూచిస్తోంది.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌కు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆయుధాల సరఫరాను కొనసాగించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.

ఇజ్రాయెల్, హమాస్‌ల యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరుకుంది. రఫా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తోంది.

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ ప్రకటనలున్నట్లు భావిస్తున్నా, ఆయన రాజకీయ అనిశ్చితిలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు బైడెన్ విధానం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే సాంప్రదాయిక సూత్రం, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మధ్య ఊగిసలాడుతోంది.

బైడెన్ అనుకున్నట్లు జరగకపోతే అమెరికా ఇకపై ఇజ్రాయెల్, పాలస్తీనియన్లు, అరబ్ దేశాల మధ్య ముఖ్యంగా యుద్ధానంతర పరిస్థితులలో మధ్యవర్తిగా ఉండటం కష్టం.

బైడెన్ ఇజ్రాయెల్‌ను శిక్షించకుండా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చే స్థితిలో ఉండాలనుకుంటున్నారు. అవసరమైతే ఆ దేశానికి సైనికంగా కూడా సహాయం చేయవచ్చు. తన సందేశం చేరిందని బైడెన్ ఆశిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక సంక్షోభాన్ని సృష్టించింది.

దగ్గర్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. తన పార్టీ మద్దతును ఆయన కూడగట్టుకోవాలి.

స్వతంత్ర ఓటర్ల మనుసులను గెల్చుకోవాలి. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే ఆయన ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించడం కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)