2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జక్కుల బాలయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్నికల్లో ఎన్నో విశేషాలు, అరుదైన ఘటనలు నమోదయ్యాయి.
భారీ మెజారిటీలు, పార్లమెంట్‌కు ఎన్నికైన సినీ తారలు, చిన్నవయసులోనే ఎన్నికల బరిలో సత్తాచాటిన యువతీయువకులు...ఇలా ఎన్నో విశేషాలు.
ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలను ఏలిన నేతలు కొందరు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూడగా, మరికొందరు ఎంపీలుగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.
మరి ఈ ఎన్నికల్లో అలాంటి విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం..

ఫొటో సోర్స్, Shankar Lalwani/facebook
కనివినీ ఎరుగని మెజార్టీ..
పార్లమెంట్ ఎన్నికల చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెజార్టీ నమోదయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వాణీ దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు.
ఆయన 11 లక్షల 75 వేల 92 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి సంజయ్ సోలంకిపై ఆయన ఇలా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2014 ఎన్నికల్లో ప్రీతమ్ ముండే సాధించిన 6.96 లక్షల మెజారిటీ ఇప్పటి వరకూ దేశంలోనే రికార్డ్ మెజారిటీగా ఉండేది. ఆ ఎన్నికల్లో ఆమె మహారాష్ట్రలోని బీడ్ పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు. ఈమె దివంగత నేత గోపీనాథ్ ముండే కూతురు.
ప్రీతమ్ రికార్డును లాల్వాణీ బ్రేక్ చేసి, కొత్త రికార్డు నెలకొల్పారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో, ఆ పార్టీకి అభ్యర్థి లేకుండా పోయారు. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోవడంతో ఈ భారీ మెజార్టీ సాధ్యమైంది.
పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం అక్షయ్ కాంతి బామ్ బీజేపీలో చేరడం ఇక్కడ మరో విశేషం.


ఫొటో సోర్స్, Getty Images
'నోటా' రికార్డ్
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేనిపక్షంలో ఓటర్లు నోటా (నన్ ఆఫ్ ది అబౌ)కు ఓటు వేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో నోటా విషయంలోనూ సరికొత్త రికార్డ్ నమోదైంది.
ఇది కూడా మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నియోజకవర్గంలోనే జరిగింది. నోటాకు అత్యధికంగా 2,18,674 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకూ నమోదైన నోటా ఓట్లలో ఇదే అత్యధికం. ఇవి రెండో స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ.
చివరి క్షణంలో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ పోటీ నుంచి వైదొలగడంతో, నోటాకు ఓట్లు వేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో ఓటర్లు నోటా బటన్ నొక్కారు.

ఫొటో సోర్స్, JANASENA PARTY /FB
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి..
సినీ రంగం నుంచి ఇప్పటికి ఎంతోమంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగునాట కూడా ఆ లిస్టు పెద్దదే. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభలకు ఎన్నికయ్యారు.
ఇప్పుడు వారి వరుసలో చేరారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. నిజానికి ఆయన 2009లోనే ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన్పపటికీ, తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి చట్టసభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలాగే, మలయాళ నటుడు, సినీ హీరో సురేశ్ గోపి భారతీయ జనతా పార్టీ తరఫున త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కేరళలో బీజేపీ బోణీ కొట్టిన సీటు ఇదే.
ఈయన సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై 74,686 ఓట్లతో విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Kangana Ranaut/facebook
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజకీయ రంగప్రవేశం చేశారు. మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంగనా ఎంపీగా గెలిచారు.
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగనా, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈయన హిమాచల్ ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు.

ఫొటో సోర్స్, Priya Saroj/facebook
పాతికేళ్లకే పార్లమెంటుకి..
కేవలం పాతికేళ్ల వయసులోనే పార్లమెంటుకి ఎన్నికయ్యారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌కి ఎన్నికైన పిన్నవయస్కులుగా వీరు రికార్డు సృష్టించారు.
యూపీలోని మచిలీషహర్ నుంచి పోటీ చేసిన పాతికేళ్ల ప్రియా సరోజ్ 35 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఎంపీగా విజయం సాధించారు.
కౌశంబి లోక్ సభ నియోజకవర్గం నుంచి పుష్పేంద్ర సరోజ్ ఎంపీగా విజయం సాధించారు. ఈయన వయసు కూడా 25 ఏళ్లు.
సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన ఈ ఇద్దరు యువ నేతలు అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడించి, పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.

ఫొటో సోర్స్, TR BAALU/facebook
పార్లమెంట్‌లో పెద్దాయన..
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి 18వ లోక్ సభలో అడుగుపెట్టనున్న పెద్దవయసు వ్యక్తిగా టీఆర్ బాలు రికార్డు నమోదు చేశారు.
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన బాలు ఏఐఏడీఎంకే అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌పై విజయం సాధించారు.
ఈయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, Mayawati/facebook
జాతీయ పార్టీకి సున్నా సీట్లు
గతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన పార్టీ, జాతీయ పార్టీ హోదా కలిగిన బహుజన సమాజ్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కనీసం బోణీ కొట్టలేకపోయింది.
యూపీ మాజీ సీఎం కుమారి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్ సభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది.

ఫొటో సోర్స్, ANI
జైలు నుంచి పార్లమెంటుకి..
పంజాబ్‌కి చెందిన ఖలిస్తాన్ అనుకూల సంస్థ 'వారిస్ పంజాబ్ దె' అధినేత అమృత్‌పాల్ సింగ్ జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్‌పై లక్షా 97 వేల 120 ఓట్ల మెజార్టీతో అమృత్‌పాల్ గెలుపొందారు.
గత ఏడాది ఫిబ్రవరి 23న పంజాబ్‌లోని అజ్నాల పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి, బారికేడ్లు తోసుకుంటూ ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి నాయకత్వం వహించిన వ్యక్తే అమృత్‌పాల్ సింగ్.
పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అమృత్‌పాల్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు. జైలు నుంచే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
అలాగే, జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాపై స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన అబ్దుల్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జైలు నుంచే పోటీ చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఓడించారు.

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/GETTYIMAGES
ఎంపీలుగా మాజీ ముఖ్యమంత్రులు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. విదిశ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌భాను శర్మపై 8 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
ఈ కోవలోకే వస్తారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు హెడ్‌డీ కుమారస్వామి, బసవరాజ బొమ్మై, జగదీష్ శెట్టర్‌లు. మండ్య నుంచి పోటీ చేసిన జేడీఎస్ నేత కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థిగాపై విజయం సాధించారు.
బీజేపీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన బసవరాజ బొమ్మై హవేరి నుంచి, జగదీష్ శెట్టర్ బెళగావి నుంచి ఎంపీలుగా గెలుపొందారు.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఒమర్ అబ్దుల్లా (బారాముల్లా), మెహబూబా ముఫ్తీ (అనంత్‌నాగ్ - రాజౌరి) నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చవిచూశారు.

ఫొటో సోర్స్, Digvijaya Singh/facebook
మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్
మధ్యప్రదేశ్‌లోని పార్లమెంట్ స్థానాలనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని 29కి 29 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ఛింద్వాడా స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ ఓడిపోయారు.
రాజ్‌గఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














