లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ వ్యూహం ఎలా ఫలించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూన్ 1న చివరి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రాగా.. ఉత్తరప్రదేశ్‌లో పోరు వన్‌సైడ్‌గా అనుకున్నారు. చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి దాదాపు 70 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఉత్తరప్రదేశ్‌లో కథ మారిపోయింది.
ప్రధాని నరేంద్ర మోదీ 400 దాటాలన్న నినాదం ఇచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధిక సీట్లు గెలవాలన్నది బీజేపీ కోరిక. అయితే ఇది జరగలేదు.
అయోధ్యలో రామమందిరంపై బీజేపీ భారీ స్థాయిలో ప్రచారం చేసింది, అయినా ఆ పార్టీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ అయోధ్యలోనే షాక్ ఇచ్చారు.
ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కంటే ఇండియా కూటమి సీట్లు అధికంగా సాధించింది.
సమాజ్‌వాదీ పార్టీ యూపీలో 62 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించాయి. దీంతో బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. 543 సీట్లున్న లోక్‌సభలో పూర్తి మెజారిటీ కోసం బీజేపీకి 272 సీట్లు రావాలి. కానీ, ఆ పార్టీకి ఈసారి 240 స్థానాలే వచ్చాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ 63 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ 9, సమాజ్‌వాదీ పార్టీ 5, అప్నా దళ్ (సోనేలాల్) 2, కాంగ్రెస్ 1 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 2019ని పునరావృతం చేయలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అనూహ్య ఓటములు
అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. గాంధీ- నెహ్రూ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మ అక్కడ గెలిచారు.
2019లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు, దీంతో నెహ్రూ- గాంధీ కుటుంబ వారసుడు ఒక సాధారణ బీజేపీ నాయకురాలి చేతిలో ఓడిపోయారనే సందేశం పంపారు. ఈసారి స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేయలేదు, కానీ, కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దించి, విజయం సాధించారు.
ప్రారంభంలో ప్రధాని మోదీ కూడా బనారస్ (వారణాసి)లో వెనుకంజలో కనిపించారు. తర్వాత రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని సంపాదించారు. అయితే ఈసారి బనారస్ నుంచి మోదీ గతంలో మాదిరి భారీ విజయమైతే నమోదు చేయలేకపోయారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బనారస్‌లో దాదాపు నాలుగు లక్షల 80 వేల ఓట్లతో విజయం సాధించారు మోదీ. 63 శాతం ఓట్లు వచ్చాయి.
2014లో 56 శాతంతో 5,81,022 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాకు 2,09,238 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు.
ఉత్తరప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ బనారస్ నుంచి, రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారు. రాజ్‌నాథ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆయన సతీమణి డింపుల్ యాదవ్ కూడా పోటీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం, రాజ్యాంగం బలహీనపడటం వంటి అంశాలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు లేవనెత్తాయి. రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రిజర్వేషన్‌ను అంతం చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. దీనితో పాటు, భారత ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు.
యూపీలో బీజేపీ 33 సీట్లకు తగ్గిపోవడం ప్రధాని మోదీకి ఎదురుదెబ్బే కాదు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా చేదువార్త అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
యోగీపై ప్రభావం పడనుందా?
బీజేపీకి 50 సీట్లు వస్తాయని అనుకున్నా కానీ 33 సీట్లకు తగ్గడం వల్ల ప్రధాని మోదీ, అమిత్ షాల అహంకారానికి ప్రజలు జవాబిచ్చారని శరత్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు. దళితులు, వెనుకబడిన కులాలు, సామాన్య ప్రజలను ఒప్పించడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయని ఆయన తెలిపారు.
"మోదీ బలపడితే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని దళితుల్లో ఎక్కువగా మాయావతికి బదులుగా ఇండియా అలయన్స్‌కి ఓటు వేశారు. బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు బలహీనపడవచ్చు అనే సందేశం దళితులలో చాలా లోతుగా వెళ్ళింది. మాయావతికి చెందిన జాతవ్ కులానికి చెందిన ప్రజలు కూడా ఇండియా కూటమికి ఓటు వేశారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"యూపీలో 33 సీట్లకు బీజేపీ పడిపోవడం కూడా యోగిపై ప్రభావం చూపుతుంది. అమిత్ షా, నరేంద్రమోదీలు కావాలంటే ఈ ఓటమికి యోగిపై నిందలు వేసి సీఎం కుర్చీ నుంచి దించవచ్చు కూడా" అని శరత్ అనుమానం వ్యక్తంచేశారు.
"యూపీలో తన కంటే పెద్ద నాయకుడు లేడని, హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరని యోగి అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆయనను తప్పుగా నిరూపించాయి. భారత ప్రజలు నియంతృత్వాన్ని ఇష్టపడరు. ఇక, స్మృతి ఇరానీని మోదీ స్టైల్‌లోనే ఓడించారు, అంతగా పాపులర్ కాని ఒక నాయకుడితో స్మృతిని ఓడించడం.. రాహుల్ మంచి వ్యూహం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యూపీలో బీజేపీ ఎందుకు వెనుకబడింది?
దీనిపై శరత్ ప్రధాన్ మాట్లాడుతూ "ఈ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి రెండు ముఖ్యమైన సందేశాలు ఉన్నాయి. మాయావతికి మొదటి సందేశం దళితులు ఆమె కట్టు కార్మికులు కాదని, రెండో సందేశం మోదీకి.. హిందూ-ముస్లిం కార్డుతో ప్రతి ఎన్నికల్లో గెలవలేరని. మాయావతి పూర్తిగా బీజేపీ శిబిరంలో ఉన్నారు, ఆమె తన మేనల్లుడిని తొలగించినప్పుడు, అది జనాల్లోకి తప్పుడు సందేశాన్ని పంపింది’’ అని అన్నారు.
అలహాబాద్ నుంచి ఎంపీగా ఉన్న రీటా బహుగుణ, గతంలో యోగీ కేబినేట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి రీటాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నేత కేశ్రీనాథ్ త్రిపాఠి కుమారుడు నీరజ్ త్రిపాఠికి టికెట్ లభించింది. అయితే, ఆయన కూడా ఓడిపోయారు.
యూపీలో ఈసారి బీజేపీ 33 సీట్లకే ఎందుకు పరిమితమైందని రీటా బహుగుణ జోషిని అడిగితే... "మేం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అయితే 2014, 2019 తరహా విజయాన్ని అందుకోలేమని స్పష్టమవుతోంది. మేము యూపీలో అభివృద్ధి చేశాం, కానీ ఉపాధికి సంబంధించిన ప్రశ్న మా ఎదురుగా ఉంది. మేం అయోధ్యలో కూడా వెనుకబడిపోయాం. ఇలా ఎందుకు జరిగిందో ఆలోచించాలి’’ అని రీటా అన్నారు.
యూపీ ఫలితాలు యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ప్రభావం చూపుతాయా అని రీటా బహుగుణను అడిగితే.. " మాకు సంపూర్ణ మెజారిటీ ఉంది, ప్రభావం ఉంటుందని నేను అనుకోను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
అఖిలేశ్ స్ట్రాటజీ..
ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాన్ని పలువురు విశ్లేషకులు కూడా ప్రశంసిస్తున్నారు. టిక్కెట్ల పంపిణీలో యాదవేతర కులాలపై అఖిలేష్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ముస్లింలు, యాదవులు సమాజ్‌వాదీ పార్టీకి ఓటు బ్యాంకుగా పరిగణిస్తారు, అయితే ఈసారి అఖిలేష్ యాదవ్ 62 మందిలో ఐదుగురికి మాత్రమే యాదవులకు టికెట్లు ఇచ్చారు. వారందరూ ఆయన కుటుంబానికి చెందినవారే.
2019లో బహుజన్ సమాజ్ పార్టీ, జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్‌తో ఎస్పీ పొత్తు పెట్టుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేసి 10 మంది యాదవ అభ్యర్థులను నిలబెట్టింది.
2014లో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ యూపీలోని 78 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది, వారిలో మొత్తం 12 మంది యాదవ అభ్యర్థులు, నలుగురు ములాయం కుటుంబానికి చెందినవారున్నారు.
అలహాబాద్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన పంకజ్ కుమార్ కూడా టికెట్ పంపిణీపై అఖిలేష్ యాదవ్‌ను ప్రశంసించారు.
"సమాజ్‌వాదీ పార్టీ చాలా బాగా టికెట్లు పంపిణీ చేసింది. అయోధ్యలో దళితుడికి టికెట్ ఇవ్వడం చాలా తెలివైన నిర్ణయం. అవధేష్ ప్రసాద్ పాత ఎస్పీ సభ్యుడు. బల్లియాలో సనాతన్ పాండేకి టిక్కెట్ ఇవ్వడం తెలివైన నిర్ణయం" అని పంకజ్ కుమార్ అన్నారు.
"అన్ని కులాలను కలుపుకొనిపోయే పీడీఏ గురించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు. మరోవైపు బీజేపీ ముస్లిం, ముస్లిం అంటోంది. టికెట్లు కూడా బీజేపీ చాలా దారుణంగా పంపిణీ చేసింది. ఈ విషయంలో యోగిని సంప్రదించారని నేను అనుకోను. కౌశాంబిలో రాజా భయ్యా తన వ్యక్తికి టికెట్ ఇవ్వమని అడిగారు, కానీ అమిత్ షా అంగీకరించలేదు, నీరజ్ త్రిపాఠికి టికెట్ ఇచ్చారు. అమిత్ షా దిల్లీ నుంచి టిక్కెట్లు పంపిణీ చేశారు’’ అని పంకజ్ అన్నారు.
యూపీలో బీజేపీ పనితీరు.. యోగి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని పంకజ్ కుమార్‌ను అడగగా ఆయన స్పందిస్తూ "యోగిపై నిందలు వేయవచ్చు. యోగి లోపం ఏమిటంటే ఆయన కార్యకర్తలతో టచ్‌లో లేరు. గుజరాత్ మోడల్‌లో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. బ్యూరోక్రాట్ల సహకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల కంటే పోలీసులనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ ఎన్నికల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ కూడా వెనక్కు తగ్గిందనుకుంటున్నా. మోదీ బలపడుతున్నారని, ఇది సంఘ్‌కు మంచిది కాదని ఆర్‌ఎస్‌ఎస్ కూడా భావించింది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాయావతి పరిస్థితేంటి?
ఈ ఎన్నికల్లో మాయావతి పూర్తిగా పక్కదారి పట్టారని, ఇప్పుడు ఆమె పునరాగమనం కష్టమని పంకజ్ అభిప్రాయపడ్డారు.
"మాయావతి స్థానాన్ని చంద్రశేఖర్ ఆజాద్ భర్తీ చేయగలరు. నగీనా స్థానం నుంచి ఆయన విజయం కూడా దీనిని చూపిస్తుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవమైన పనితీరు నరేంద్ర మోదీ తన మూడో దఫా కోసం వేసిన అనేక సన్నాహాలను బ్రేక్ చేయగలదు.
దీంతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు కుంచించుకుపోతున్న సమయంలో అఖిలేష్ యాదవ్ బలమైన నాయకుడిగా ఎదిగారు.
అమేథీ, రాయ్‌బరేలీలో కూడా కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. నరేంద్రమోదీ, అమిత్ షాలు కోరుకోనప్పటికీ ఇది జరిగింది.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














