ములాయం సింగ్ యాదవ్: ఎన్నో ప్రభుత్వాలను నిలబెట్టి, పడగొట్టిన రాజకీయ మల్లయోధుడు

ములాయం సింగ్ యాదవ్:

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది ములాయం సింగ్ యువకుడిగా ఉన్నప్పటి మాట.. ఒక్కసారి ములాయం చేయి ప్రత్యర్థి నడుము వరకూ చేరింది అంటే.. ఆ ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా సరే, ఎంతటి ఒడ్డూ, పొడుగూ ఉన్నా సరే.. అతడు తనంతట తానుగా పట్టు నుంచి వదిలించుకోవడం ములాయంకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని అంటుంటారు.

తన చేతులను ఉపయోగించకుండానే ఒక మల్ల యోధుడిని ములాయం సింగ్ యాదవ్ తన 'కొరుకుడు పళ్ల'తో చెడుగుడు ఆడేసిన సంఘటనను ఆయన గ్రామస్థులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

ములాయం సింగ్ యాదవ్ బంధువు, ప్రొఫెసర్ రామ్ గోపాల్ బీబీసీతో ఒక సంఘటనను పంచుకున్నారు. ''ములాయం కుస్తీ పోటీ చివరి దశకు చేరుకుంటే మేం కళ్లు మూసుకునేవాళ్లం. 'అయిపోయింది.. అయిపోయింది' అని జనాలంతా అరుస్తున్నప్పుడే మా కళ్లు తెరుచుకునేవి. మావాడు మల్ల యోధుడిని మట్టి కరిపించేశాడు అని మేం అనుకుంటూ కళ్లు తెరిచేవాళ్లం.

పాఠాలు చెప్పడం మొదటు పెట్టిన తర్వాత ములాయం కుస్తీ పోటీలను పూర్తిగా వదిలేశారు. కానీ, జీవితాంతం ఆయన తన గ్రామం సైఫయీలో కుస్తీ పోటీలను నిర్వహిస్తూనే ఉన్నారు.

ములాయం సింగ్ యాదవ్‌కు రాజకీయంగా ఎలాంటి నేపథ్యమూ లేదు. కానీ, కుస్తీ పోటీల్లోని కిటుకుల కారణంగానే ఆయన రాజకీయ పోటీల్లో కూడా విజయం సాధించాడని ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను విశ్లేషించే రాజకీయ నిపుణులు అంటుంటారు.

ములాయం సింగ్‌లోని టాలెంట్‌ను గుర్తించింది ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు నాథూ సింగ్. 1967 ఎన్నికల్లో జస్వంత్ నగర్ అసెంబ్లీ టికెట్ ములాయంకు ఇచ్చారు ఆయన.

అప్పటికి ములాయం సింగ్ యాదవ్ వయసు 28 ఏళ్లు మాత్రమే. అప్పటికి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యంత తక్కువ వయసులో ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా ములాయం సింగ్ యాదవ్ రికార్డు నెలకొల్పారు. ఎమ్మెల్యే అయిన తర్వాతే ఆయన తన ఎమ్.ఏ. చదువును పూర్తి చేశారు.

1977లో ఉత్తర ప్రదేశ్‌లో రామ్ నరేశ్ యాదవ్‌ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ములాయం సింగ్ సహకార శాఖ మంత్రి అయ్యారు. అప్పుడు ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే.

ములాయం సింగ్ యాదవ్:

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యమంత్రి రేసులో అజిత్ సింగ్‌ను ఓడించి..

చౌధరీ చరణ్ సింగ్ తన రాజకీయ వారసుడిగా ములాయం సింగ్ యాదవ్‌ను, తన చట్టబద్ధమైన వారసుడిగా సొంత కొడుకు అజిత్ సింగ్‌ను పిలిచేవారు.

చరణ్ సింగ్‌కు తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు అజిత్ సింగ్ అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చారు. అప్పుడు అజిత్ సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేయాలంటూ ఆయన మద్దతుదారులు చరణ్ సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.

దీంతో ములాయం సింగ్, అజిత్ సింగ్ మధ్య పోటీ మొదలైంది. కానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాత్రం ములాయం సింగ్‌కే దక్కింది.

1989 డిసెంబర్ 5వ తేదీన లఖ్‌నవూలోని కేడీ సింగ్ స్టేడియంలో ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ''ఒక పేదవాడి కొడుకును ముఖ్యంత్రి చేయాలన్న లోహియా ఒకప్పటి కల ఇప్పుడు నిజం అయ్యింది'' అని ఆ సందర్భంగా ములాయం సింగ్ గద్గద స్వరంతో అన్నారు.

ములాయం సింగ్ యాదవ్:

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1980లో దిల్లీలో తీసిన ఫొటో ఇది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, చౌధరీ చరణ్ సింగ్

‘బాబ్రా మసీదుపై పిట్ట కూడా చనిపోదు’

ముఖ్యమంత్రి అయిన వెంటనే ములాయం సింగ్.. ఉత్తర ప్రదేశ్‌లో వేగంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.

అప్పట్లో ములాయం సింగ్ తరచుగా అనే మాట.. ''ఇకపై బాబ్రీ మసీదుపై ఒక్క పిట్ట కూడా చనిపోదు'' అని. ఈ మాటే ఆయనను ముస్లింలకు దగ్గరివాడిని చేసింది.

1990 నవంబర్ 2వ తేదీన కరసేవకులు బాబ్రీ మసీదువైపు దండుగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు.. వారిపై లాఠీ ఛార్జి జరిగింది. తర్వాత పోలీసు కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మందికి పైగా కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత బీజేపీ నాయకులు ములాయం సింగ్ యాదవ్‌ను ''మౌలానా ములాయం'' అని విమర్శించేవాళ్లు.

1992 అక్టోబర్ 4వ తేదీన ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. పెరిగిపోతున్న భారతీయ జనతా పార్టీ గ్రాఫ్‌ను తాను ఒక్కడినే ఆపలేనని కూడా ఆయన భావించారు.

అందుకే ఆయన కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. పారిశ్రామిక వేత్త జయంత్ మల్హోత్రా దిల్లీలోని అశోకా హోటల్‌లో కాన్షీరామ్, ములాయం భేటీని ఏర్పాటు చేశారు.

1993లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం సింగ్ పార్టీ 260 సీట్లలో పోటీ చేయగా 109 సీట్లలో గెలిచింది. కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ 163 సీట్లలో పోటీ చేసి 67 సీట్లలో గెలిచింది. బీజేపీ 177 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీల మద్దతులో ములాయం సింగ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీబీసీ రెడ్ లైన్
వీడియో క్యాప్షన్, ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఇదీ..

ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ప్రస్థానం

  • 1967లో తొలిసారి ఉత్తర ప్రదేశ్ జస్వంత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే
  • 1996 వరకు జస్వంత్ నగర్ ఎమ్మెల్యేగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు
  • 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు
  • 1993లో రెండోసారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు
  • 1996లో మొయిన్‌పురీ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి పార్లమెంటుకు పోటీ చేశారు
  • 1996 నుంచి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు
  • తర్వాత ములాయం సింగ్ యాదవ్ సంభల్, కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి కూడా ఎంపీగా గెలుపొందారు
  • 2003లో మరొకసారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2007 వరకూ కొనసాగారు
  • మధ్యలో 2004లో ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలిచారు. కానీ, రాజీనామా చేశారుః
  • 2009లో మొయిన్‌పురీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 2014లో ఆజమ్‌గఢ్, మొయిన్‌పురీ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. మొయిన్‌పురీ స్థానాన్ని వదులుకున్నారు
  • 2019లో మరొకసారి ఆయన మొయిన్‌పురీ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు
బీబీసీ రెడ్ లైన్
కాన్షీరామ్

ఫొటో సోర్స్, BADRINARAYAN

ఫొటో క్యాప్షన్, కాన్షీరామ్

ములాయంను నాలుగు గంటలు వెయిట్ చేయించిన కాన్షీరామ్..

కానీ బహుజన్ సమాజ్ పార్టీ తన కూటమిలో మిత్రపక్షం ఎదుట చాలా డిమాండ్లు పెట్టడంతో ఈ పొత్తు ఎక్కువ కాలం కొనసాగలేదు.

మాయావతి ములాయం పనులపై ఒక కన్నేసి ఉంచారు. అవకాశం దొరికినప్పుడల్లా వాటిని బహిరంగంగా విమర్శించడానికి కూడా వెనుకాడేవారు కాదు. కొన్ని రోజుల తర్వా కాన్షీరామ్ కూడా ములాయం సింగ్ యాదవ్‌ను అవమానించడం ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టీఎస్ ఆర్ సుబ్రమణ్యం తన జర్నీస్ త్రూ బాబుడమ్ అండ్ నేతాల్యాండ్ అనే పుస్తకంలో ఇదంతా రాశారు.

ఒక సారి కాన్షీరామ్ లఖ్‌నవూ వచ్చారు. సర్క్యూట్ హౌస్‌లో ఉన్నారు. ముందే ఆయన అపాయింట్‌మెట్ తీసుకున్న ములాయం ఆయన్ను కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో కాన్షీరాం తన రాజకీయ సహచరులతో చర్చల్లో ఉన్నారు. ఆయన స్టాఫ్ ములాయంతో పక్కనున్న గదిలో కూర్చుని, కాన్షీరామ్ ఫ్రీ అయ్యేవరకూ వెయిట్ చేయమని చెప్పారు.

కాన్షీరాం సమావేశం రెండు గంటలు నడిచింది. కాన్షీరాం సహచరులు బయటకు వెళ్లిపోయిన తర్వాత ములాయం ఇక తనను పిలుస్తారులే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. గంట తర్వాత ములాయం లోపలేం జరుగుతోందని అడిగినప్పుడు. కాన్షీరామ్ షేవింగ్ చేసుకుంటున్నారని, తర్వాత ఆయన స్నానం చేస్తారని చెప్పారు. ములాయం వేచిచూస్తూనే ఉన్నారు. ఈలోపు కాన్షీరాం కొందరిని కలిశారు కూడా. నాలుగు గంటల తర్వాత ఆయన ములాయం సింగ్‌ను కలవడానికి బయటికొచ్చారు.

వాళ్ల చర్చల్లో ఏం జరిగిందో తెలీదు, కానీ ములాయం గది నుంచి బయటకు వచ్చినపుడు ఆయన ముఖం కందిపోయి ఉందని ఆ సమయంలో అక్కడున్న నాకు తెలిసిన వారు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రితో కనీసం ఆయన కారు వరకైనా వెళ్లాలని కూడా కాన్షీరాం అనుకోలేదు.

అదే రోజు సాయంత్రం కాన్షీరామ్ బీజేపీ నేత లాల్జీ టాండన్‌ను కలిశారు. కొన్ని రోజుల తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ ములాయం ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంది.

అంతకు ముందు జూన్ 2న మాయావతి లఖ్‌నవూ వచ్చినపుడు ములాయం మద్దతుదారులు స్టేట్ గెస్ట్ హౌస్‌లో మాయావతిపై దాడి చేశారు. ఆమెను అవమానించడానికి ప్రయత్నించారు.

ఆ తర్వాత వారిద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది. దానిని రెండు దశాబ్దాలకు పైగా పూడ్చలేకపోయారు.

మాయావతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాయావతి

అమర్ సింగ్‌తో ములాయం స్నేహం

2003 ఆగస్టులో ములాయం సింగ్ యాదవ్ మూడోసారి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈలోపు అమర్‌సింగ్‌ ఆయనకు మంచి స్నేహితుడయ్యారు.

ములాయం అమర్ సింగ్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. తర్వాత ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. దాంతో పార్టీలోని బేణీప్రసాద్ వర్మ లాంటి చాలా మంది అగ్ర నేతలు ములాయం సింగ్ యాదవ్‌కు దూరం జరిగారు.

‘‘నేను ములాయం సింగ్‌ను చాలా ఇష్టపడేవాడ్ని. ఒకసారి రామ్‌నరేష్ యాదవ్‌ను తొలగించిన తర్వాత నేను చరణ్ సింగ్‌తో ములాయంను ముఖ్యమంత్రిగా చేద్దామని సిఫారసు చేశాను. కానీ చరణ్ సింగ్ నా సలహాకు నవ్వి, ఇంత పొట్టి వ్యక్తిని ఎవరు తమ నేతగా ఒప్పుకుంటారని అన్నారు. అప్పుడు నేను ఆయనతో నెపోలియన్, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పొట్టివారే, వాళ్లు నేతలుగా ఎదిగినప్పుడు ములాయం ఎందుకు కాలేరు అన్నా. చరణ్ సింగ్ నా వాదనకు ఒప్పుకోలేదు’’ అని ఒకసారి బీబీసీతో మాట్లాడిన బేణీ ప్రసాద్ వర్మ చెప్పారు.

అమర్‌సింగ్‌తో బేణీ ప్రసాద్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమర్‌సింగ్‌తో బేణీ ప్రసాద్ వర్మ

ప్రధానమంత్రి పదవి జస్ట్ మిస్..

ములాయం 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రి అయ్యారు. ప్రధానమంత్రి పదవికి దేవగౌడ రాజీనామా చేసిన తర్వాత ఆయన భారత ప్రధాని అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు.

2022 సెప్టెంబర్ 22న ఇండియన్ ఎక్స్‌ ప్రెస్ పత్రికలో 'ములాయం ఈజ్ ద మోస్ట్ పొలిటికల్’ ఆర్టికల్లో ప్రధాని పదవి కోసం జరిగిన అంతర్గత ఓటింగ్‌లో ములాయం సింగ్ యాదవ్ జీకే మూపనార్‌ను 120-20 ఓట్ల తేడాతో ఓడించారు అని శేఖర్ గుప్తా పేర్కొన్నారు.

‘‘కానీ ఆయన ప్రత్యర్థులైన ఇద్దరు యాదవ్‌లు అంటే లాలూ, శరద్ ఆయన దారిలో అడ్డుపుల్లలు వేశారు. చంద్రబాబు నాయుడు కూడా వారితో కలిశారు. దాంతో ములాయం ప్రధానమంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. ఆయనకు ఆ పదవి దక్కుంటే ఆయన గుజ్రాల్ కంటే ఎంతో ఎక్కువ కాలం కూటమిని కాపాడుండేవారు’’ అని శేఖర్ గుప్తా రాశారు.

ములాయం సింగ్ యాదవ్:

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1996లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావాలో తీసిన ఫొటో ఇది. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ రక్షణ మంత్రిగా ఉన్నారు

విశ్వసనీయతపైనే ప్రశ్నలు

భారత రాజకీయాల్లో ములాయంను ఎవరూ, ఎప్పుడూ నమ్మకస్తుడైన సహచరుడుగా భావించలేదు. ఆయన ఎప్పుడూ చంద్రశేఖర్‌ను తన నేతగా చెబుతూ వచ్చారు. కానీ 1989లో ప్రధానమంత్రి ఎంపిక విషయానికి వస్తే, ఆయనకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌ను మద్దతిచ్చారు.

కొన్ని రోజుల తర్వాత వీపీ సింగ్‌కు ముఖం చాటేసిన ఆయన మళ్లీ చంద్రశేఖర్‌కు మద్దతు పలికారు.

2002లో ఎన్డీయే రాష్ట్రపతి పదవికి ఏపీజే అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించినపుడు, దాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు కెప్టెన్ లక్ష్మీ సైగల్‌ను కలాంకు పోటీగా బరిలో నిలిపాయి.

చివరి నిమిషంలో వామపక్షాలకు మద్దతు ఉపసంహరించిన ములాయం, కలాం అభ్యర్థిత్వానికి తన ఆమోద ముద్ర వేశారు.

2008లో కూడా అణు ఒప్పందం అంశంపై లెఫ్ట్ యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉఫసంహరించుకున్నప్పుడు, ములాయం వారితోపాటూ వెళ్లకుండా ప్రభుత్వానికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గట్టెక్కింది.

2019 సాధారణ ఎన్నికల సమయంలో కూడా "నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నా" అని చెప్పిన ఆయన ఎంతోమంది రాజకీయ పండితులను ఆశ్చర్యపరిచారు.

అమర్ సింగ్, చంద్రశేఖర్‌లతో ములాయం సింగ్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమర్ సింగ్, చంద్రశేఖర్‌లతో ములాయం సింగ్ యాదవ్

సోనియా గాంధీకి నో చెప్పడం వెనుక కథ

1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ తమకు మద్దతివ్వాలని ములాయం సింగ్‌ను కోరింది.

ఆయన హామీ ఇచ్చిన తర్వాతే సోనియా గాంధీ తనకు 272 సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. కానీ తర్వాత ఆయన తన మాట నుంచి తప్పుకోవడంతో, సోనియా గాంధీ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

లాల్ కృష్ణ అడ్వాణీ తన ఆత్మకథ ‘మై కంట్రీ, మై లైఫ్‌’ పుస్తకంలో ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఒక విషయం చెప్పారు.

"ఏప్రిల్ 22న అర్థరాత్రి జార్జ్ ఫెర్నాండెజ్ నాకు ఫోన్ చేసారు. లాల్జీ నా దగ్గర మీకో శుభవార్త ఉంది అన్నారు. సోనియా గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. విపక్షాల్లోని ఒక కీలకమైన వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. కానీ ఈ సమావేశం మీ ఇంట్లోగానీ, నా ఇంట్లో గానీ జరక్కూడదు. ఈ సమావేశం జయా జైట్లీ సుజాన్ సింగ్ పార్క్ ఇంట్లో జరుగుతుంది. జయా మిమ్మల్ని తన కారులో పికప్ చేసుకుంటారు" అని రాశారు.

అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

రెండు పెళ్లిళ్లు చేసుకున్న ములాయం

1957లో ములాయం సింగ్ యాదవ్ మాలతీ దేవిని పెళ్లాడారు. 2003లో ఆమె మరణంతో ములాయం సాధనా గుప్తాను రెండో వివాహం చేసుకున్నారు. దీన్ని చాలా రోజులపాటు రహస్యంగా ఉంచారు. పెళ్లికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.

ములాయం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన అఫిడవిట్‌లో ఆయనకు మరో భార్య ఉన్నారని చెప్పినప్పుడే, ఈ పెళ్లి గురించి అందరికీ మొదటిసారి తెలిసింది.

2003లో ములాయం సాధనా గుప్తాను పెళ్లాడిన సమయానికి, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్‌కు పెళ్లైపోవడమే కాదు, ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యారు.

బంధుప్రీతిని పెంచి పోషించారనే ఆరోపణలు

ములాయం సింగ్ యాదవ్ బంధుప్రీతిని పెంచి పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్‌లో కేవలం ఐదు స్థానాలే లభించాయి. ఈ ఐదుగురు ఎంపీలూ యాదవ్ కుటుంబానికి చెందినవారే.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్‌ను తన వారసుడుగా చేశారు. కానీ ములాయం రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడిపారనే విమర్శలు చుట్టుముట్టడంతో అఖిలేష్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అఖిలేష్ ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ములాయం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు.

ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం తన కొడుకేనని చెప్పిన ములాయం "అఖిలేష్ నన్ను అవమానించాడు. కొడుకుకే తండ్రి పట్ల విశ్వాసం లేనపుడు, వేరే ఎవరి నమ్మకాన్నీ పొందలేం" అన్నారు.

ములాయం ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లిన అఖిలేష్, మాయావతితో పొత్తు పెట్టుకుని 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దానికి ఏడాది ముందు వరకూ ఈ పొత్తు అసలు ఊహలకే అందనిది.

ఈ కూటమి కూడా ఎక్కువ రోజులు నిలవలేదన్నది వేరే విషయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)