షార్ట్స్ వేసుకుందని పరీక్ష రాయనివ్వని టీచర్, కాళ్లకు కర్టెన్ చుట్టుకుని ఎగ్జామ్ రాసిన అమ్మాయి

జుబిలీ తమూలి
ఫొటో క్యాప్షన్, జూబ్లీ తమూలి

అస్సాంకు చెందిన 19 సంవత్సరాల జూబ్లీ తమూలి షార్ట్స్‌ వేసుకుని ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లారు. కానీ పరీక్ష రాసేందుకు టీచర్ అనుమతించలేదు.

జూబ్లీ పరీక్ష రాసేందుకు 70 కిలోమీటర్ల దూరంలోని తేజ్‌పుర్‌కు తన తండ్రితో కలిసి వెళ్లారని స్థానిక మీడియా పేర్కొంది.

కానీ షార్ట్స్ వేసుకుని పరీక్ష రాసేందుకు టీచర్ జూబ్లీని అనుమతించలేదు.

దీంతో ప్యాంటు కొనుక్కుని రావడానికి ఆమె తండ్రి పరుగు పరుగున మార్కెట్‌కు వెళ్లారు.

కానీ సమయం మించిపోతుండటంతో ఆమె అక్కడే ఉన్న ఒక కర్టెన్‌ను కాళ్లకు చుట్టుకుని పరీక్ష రాశారు.

"ఇది నా జీవితంలోనే అత్యంత అవమానకరమైన సంఘటన" అని ఆమె చెప్పారు.

"షార్టు ధరించి పరీక్ష రాసేందుకు వెళ్లడం నేరమా? అని ఆమె పరీక్షా కేంద్రం బయట నిల్చున్న రిపోర్టర్‌లను ప్రశ్నించారు.

"అమ్మాయిలందరూ షార్ట్స్ వేసుకుంటారు. ఒకవేళ మేము షార్ట్స్ ధరించకూడదంటే, ఆ నియమం గురించి పరీక్షా నిబంధనల్లో చెప్పి ఉండాల్సింది" అని ఆమె అన్నారు.

ఇదంతా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరేందుకు గిరిజానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు జరిగిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తమ కథనంలో పేర్కొంది.

"వాళ్లు కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవీ పాటించలేదు. మాకు మాస్కులున్నాయో లేదో చూడలేదు. కనీసం టెంపరేచర్ కూడా చూడలేదు. కానీ నేను వేసుకున్న షార్ట్స్ గురించి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు" అని ఆమె అన్నట్లు పత్రిక పేర్కొంది.

పరీక్షకు సంబంధించిన పత్రాల్లో డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన నియమాలు ఏవీ లేవని జూబ్లీ చెప్పారు.

సెక్యూరిటీ గార్డులు ఆమెను పరీక్షా కేంద్రం లోపలికి రానిచ్చారని కానీ, పరీక్ష హాలులోకి వెళ్లేందుకు టీచర్ ఒప్పుకోలేదని చెప్పారు.

తన తండ్రితో మాట్లాడేందుకు అనుమతించమని కోరినప్పటికీ ఆ టీచర్ ఒప్పుకోలేదని అన్నారు.

ఈ సంఘటన చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. టీచర్ ప్రవర్తన "ఆగ్రహం తెప్పించేదిగా, హాస్యాస్పదంగా, అనవసరమైన నైతిక పర్యవేక్షణ" చేస్తున్నట్లు ఉందంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

దేశవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ధరించే దుస్తుల విషయంలో చాలాసార్లు అనేక రకాల నిబంధనలు వినిపిస్తూ ఉంటాయి.

పితృస్వామ్యాన్ని సమర్ధించేవారు యువత నైతికంగా పతనం కావడానికి పాశ్చాత్య దుస్తులే కారణమని నిందిస్తూ ఉంటారు.

ఇలాంటి అభిప్రాయాలు మహిళలకు ఒక్కోసారి ప్రమాదకరమైన పరిణామాలను తెచ్చిపెడతాయి.

ఈ ఏడాది జులైలో ఉత్తర్‌ప్రదేశ్‌లో 17 సంవత్సరాల అమ్మాయి జీన్స్ ధరించిందని ఆమె కుటుంబ సభ్యులే కొట్టి చంపేశారనే వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)