అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో లేదు, చేతులు కలిపింది: అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ హిందుత్వ శక్తులతో చేతులు కలిపిందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావితో ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
రామ జన్మ భూమి - బాబ్రీ మసీదు అంశంపై కాంగ్రెస్ సందిగ్ధంలో ఉందని విలేకరులు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారని, నిజానికి కాంగ్రెస్ మొదటి నుంచి ఈ అంశంపై మైనారిటీలను మభ్యపెడుతూనే వస్తోందని అన్నారు. మొదటి నుంచి సాఫ్ట్ హిందుత్వకి ఊతమిస్తూనే ఉందని ఆరోపించారు. ”వారు ఈ నేరంలో భాగస్వాములు అని నేనారోపిస్తున్నాను” అన్నారు.
"బాబ్రీ మసీదు విషయంలో మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల పాత్ర గురించి మాట్లాడుతూ వివాదాస్పద ప్రాంతంలో తాళాలు తెరవడం దగ్గర నుంచి మసీదు ధ్వంసం చేసేవరకు ఉన్న మొత్తం వివాదం... కాంగ్రెస్ బ్రెయిన్ చైల్డ్" అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విషయంపై అవలంబించిన వైఖరి ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. చాలా మంది హిందువులు కూడా తాము ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నామని చెబుతూ ఆయనకు ఈ-మెయిళ్లు, సందేశాలు పంపిస్తున్నారని చెప్పారు. సెక్యులరిజం పునాదులపై ఏర్పడిన పార్టీలు కూడా వారి రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను మోసం చేశాయని ఆయన అన్నారు.
"కేంద్రంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రి, ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటే జిల్లా మేజిస్ట్రేట్ వారి మాట వినలేదంటే ఎలా నమ్మాలి? ఇది నమ్మశక్యంగా ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Asaduddinowaisi/FACEBOOK
కొన్ని సంవత్సరాలుగా సంఘ్ పరివార్ సాధించాలనుకుంటున్న హిందూ రాజ్య స్థాపనకు బుధవారం జరిగిన భూమి పూజ పునాది అని ఆయన అన్నారు.
వివిధ వర్గాల వారు సుహృద్భావంతో మెలగాలని ప్రధాని మోదీ ప్రసంగంలో ప్రస్తావించారని అన్నారు.
“కానీ, అసమానత, అన్యాయం ద్వారా సుహృద్భావం సాధ్యం కాదు. భూమి పూజ దగ్గర ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన ప్రసంగమే ప్రభుత్వం మెజారిటీ అభిప్రాయాన్ని రుద్దాలని చూస్తోందనడానికి తార్కాణం. ఇది ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి సరైన మార్గం అయితే కాదు” అన్నారు.
“ఒక మతపరమైన కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి హాజరు కావడం ఆయన పాటించే వ్యక్తిగత భావజాలమే, దేశ భావజాలం, మతం అనే సందేశాన్ని పంపిస్తున్నాయి. ఆయన దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి. ఆయన దేశంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించి ఆయన పదవీ ప్రమాణానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉంది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Asaduddinowaisi/FACEBOOK
“భారత ప్రభుత్వానికి ఎలాంటి మతమూ లేదు. కానీ, మనమిప్పుడు మతపరమైన రాజ్యం వైపు ప్రయాణిస్తున్నాం. చట్టాన్ని వ్యతిరేకించిన వారికి పట్టం కట్టి చట్టం దానికున్న విశ్వాసాన్ని కోల్పోయింది” అని ఆయన వక్కాణించారు.
“మోదీ భూమి పూజ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆగస్టు 5న కొత్త స్వాతంత్య్ర దినోత్సవం అని పదే పదే చెప్పడం ఎంతో మంది స్వాతంత్య్ర సమారయోధుల ప్రాణాలను త్యాగం చేసి తెచ్చిన భారత స్వాతంత్య్రానికి అవమానకరం” అని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు, రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను ఈ ప్రయత్నం తక్కువ చేస్తోందని అన్నారు.
“ప్రసంగంలో మోదీ భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పారు. నేను కూడా భావోద్వేగానికి లోనవుతున్నాను. నాలాగే చాలా మంది హిందువులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. మేం ఆ మసీదు దగ్గర గత 450 సంవత్సరాలుగా ప్రార్థనలు చేశాం. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం, శాంతియుత జీవనానికి ఇప్పుడు ముప్పు వాటిల్లుతుండటంతో మేం కూడా భావోద్వేగానికి లోనవుతున్నాం” అన్నారు.
హిందుత్వ శక్తులు దీని తర్వాత కాశి, మధుర లాంటి మిగిలిన ప్రాంతాల మీద కూడా పడతాయేమోననే భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాలు సురక్షితంగా ఉంటాయని ప్రభుత్వం హామీ ఇస్తుందా అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Asaduddinowaisi/FACEBOOK
మతపరమైన ప్రదేశాలను కాపాడటానికి 1991లో చట్టాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, అవన్నీ తమవేనని చెప్పుకోవడానికి ఓ కొత్త చట్టం తీసుకొస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ప్రాంతీయ పార్టీల పాత్రను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ ఒకవైపు సాఫ్ట్ హిందుత్వకి మద్దతు తెలుపుతూనే, మరోవైపు ముస్లింలలో భయాన్ని కలిగించింది. దాంతో ముస్లింలు ఆ పార్టీని ఆశ్రయించగలిగేలా చూసుకుంది.
"ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా అవకాశంగా తీసుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ తనని తాను మౌలానా ములాయంగా, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను మౌలానా లాలూ అని ప్రకటించుకుని వారు మాత్రమే వెనుకబడిన వర్గాల వారికి, అణచివేతకు గురైనవారికి, మైనారిటీలకు రక్షణ కల్పిస్తామనే తప్పుడు భావాన్ని కలిగించారు.”
“ఈ ప్రాంతీయ పార్టీలు వెనకబడిన వర్గాల వారిని రక్షిస్తామనే పేరుతో, వారి రాజకీయాలను బలపర్చుకుంటూ, వారి స్థానాలు కోల్పోకుండా చూసుకుంటూ రాజకీయాలను అధః పాతాళంలోకి తోసేశాయి.”
ఈ అవకాశవాద రాజకీయాలతో, నాయకులతో చాలా మంది హిందువులు కూడా విసుగెత్తిపోయారని ఆయన అన్నారు. భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, “రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న ముస్లింలతో సహా మిగిలిన వర్గాల వారు కూడా ప్రజాస్వామిక పద్దతుల ద్వారా భిన్న సంస్కృతులతో కూడిన, ప్రజాస్వామ్య కూడిన దేశాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ప్రణాళిక చేయాలని ఆశిస్తున్నాను” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








