చంద్రబాబు, నితీశ్ కుమార్‌ల డిమాండ్లు ఏంటి, మోదీ ప్రభుత్వానికి సమస్యలు తప్పవా?

ఫొటో సోర్స్, ANI
NDAలోని పలు పార్టీలతో బీజేపీకి సైద్ధాంతిక సారూప్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 16, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 12 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి.
శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం(7 సీట్లు), లోక్ జనశక్తి రామ్‌విలాస్ పాశ్వాన్ వర్గం (ఎల్‌జేపీ) ఐదు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో రెండు సీట్లు గెలుచుకుని పార్లమెంటులోకి వచ్చిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) కూడా బీజేపీకి ముఖ్యమైనవే. శివసేన మినహా ఈ పార్టీలతో బీజేపీ సంబంధాలు అంత సజావుగా లేవు.
జేడీయూ, టీడీపీ గతంలో బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. కొన్ని అంశాల్లో విభేదాల కారణంగా ఎన్డీయే నుంచి వైదొలిగాయి. ఎల్‌జేపీలో చీలిక తర్వాత చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేక వర్గం ఎన్డీయేలో భాగమైంది.
ఆర్ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి ఎన్డీయేలో చేరడానికి ముందు ఇండియా కూటమితో సంప్రదింపులు జరిపారు.
ఇలాంటి పరిస్థితిలో ఈ పార్టీలన్నింటినీ ఎన్‌డీయేలో కొనసాగేలా చేయడం మోదీకి కాస్త కష్టమేనని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే మిత్రపక్షాల డిమాండ్లకు బీజేపీ అంగీకరించాల్సి ఉంటుంది.
బుధవారం ఎన్డీయే సమావేశం అనంతరం వీటిని బలపరుస్తూ వార్తలు రావడం మొదలైంది.
అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలని జేడీయూ నేత కేసీ త్యాగి గురువారం అన్నారు.
కానీ విభేదాలే ఇక్కడ సమస్య కాదు. బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు, నితీశ్ ఇద్దరూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అగ్నిపథ్‌పై పట్టు
ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఎన్డీయేలోని రెండు భాగస్వామ్య పక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ వర్గం అగ్నిపథ్ పథకానికి సంబంధించి తమ అభిప్రాయాలు తెలియజేశాయి.
"అగ్నిపథ్ పథకం గురించి ఓటర్లలోని ఒక వర్గంలో ఆగ్రహం ఉంది. పథకంలోని లోపాలను సవరించాలని మా పార్టీ కోరుకుంటోంది" అని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి గురువారం వార్తా సంస్థ ఏఎన్ఐతో చెప్పారు.
అయితే ‘మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం’ అని కేసీ త్యాగి గతంలో చెప్పారు.
ఇదే విషయంపై ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, ఎన్డీటీవీతో మాట్లాడుతూ "నాకు తెలియదు, కానీ ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే, ఎన్డీఏలో చర్చించొచ్చు. ఏదైనా మాట్లాడటానికి అందుబాటులో ఉన్నానని ప్రధాని మోదీ కూడా చెప్పారు" అని అన్నారు.
‘’ఇది యువతకు సంబంధించింది. సమీక్షించాల్సి ఉంటుందని నమ్ముతున్నా. ఈ పథకం యువతకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఈ పథకంతో వారికి లాభం ఉంటే కొనసాగించాలి. లేకపోతే సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి" అని చిరాగ్ బదులిచ్చారు.
కేసీ త్యాగి ప్రకటన తర్వాత, బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరిని పాత్రికేయులు దీని గురించి అడగగా.. "రాజ్‌నాథ్ సింగ్ దీనిపై ప్రకటన ఇచ్చారు. సమీక్ష గురించి మాట్లాడారు" అని తెలిపారు.
"దేశమంతా దీనికి వ్యతిరేకంగా ఉంది, జేడీయూ ప్రకటన సరైంది. అగ్నిపథ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అయితే ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వండి" అని కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హుడా అన్నారు.
2022 జూన్ 14న సైన్యంలో సైనికుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది, అయితే, దీనిని కొందరు వ్యతిరేకించారు.
ఈ పథకం కింద సైన్యంలో చేరిన నాలుగేళ్ల తర్వాత 75 శాతం మంది యువకులు తిరిగి వెళ్లిపోతారు. మిగిలిన 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు.
సైన్యాన్ని, యువత దేశభక్తిని ఈ పథకం అవమానిస్తోందని, తమ ప్రభుత్వం ఏర్పడితే అగ్నిపథ్ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK / CHANDRA BABU NAIDU
టీడీపీ డిమాండ్లు
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజా ఇంటర్వ్యూ ఒకటి శుక్రవారం ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైంది.
“మేం బేషరతుగా ఎన్డీయేకి మద్దతిస్తున్నాం, అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయం కూడా ఆశిస్తున్నాం’’ అని ఆయన చెప్పినట్టు ఆ కథనం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమని, అందుకు కేంద్రం సహకరించాలని లోకేష్ కోరారు.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వంటి హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
అమరావతి డెవలప్‌మెంట్, అభివృద్ధి వికేంద్రీకరణతో ముడిపడి ఉందన్నారు లోకేష్. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, దీని కోసం కేంద్ర ప్రభుత్వ సహాయం ఆశిస్తున్నామని లోకేష్ తెలిపారు.
2018లో ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడానికి ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన ఆర్థిక సాయం అందకపోవడం ఒక కారణమని టీడీపీ నాయకులు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, ANI
జేడీయూ ఏం కోరుతోంది?
కుల గణన
కుల గణన అంశం కొన్ని రోజులుగా ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది.
కుల గణనకు కట్టుబడి ఉంటామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి గురువారం చెప్పారు.
దేశంలో ఏ పార్టీ కూడా కుల గణనను తిరస్కరించలేదని, అందరికీ బిహార్ మార్గం చూపిందని, అందుకే కుల గణన అవసరమని త్యాగి అభిప్రాయపడ్డారు.
2023 అక్టోబర్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం బిహార్‌లో కుల ఆధారిత సర్వే వివరాలను విడుదల చేసింది.
ఆ సమయంలో బిహార్‌లో జేడీయూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. బీజేపీ మినహా బిహార్‌లోని అన్ని పార్టీలు ఈ సర్వేను డిమాండ్ చేశాయి.
అయితే ఈ ఏడాది ప్రారంభంలో జేడీయూ 'ఇండియా' కూటమితో బంధాన్ని తెంచుకున్నప్పుడు, కులాల సర్వే క్రెడిట్ రాహుల్ గాంధీ తీసుకోవాలనుకున్నారని నితీశ్ ఆరోపించారు.
బిహార్‌కు ప్రత్యేక హోదా
నితీష్ కుమార్ ఎజెండాలో బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చాలా కాలంగా ఉంది.
ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ గత ఏడాది ఆయన మంత్రివర్గం ఒక ప్రతిపాదనను ఆమోదించింది.
"బిహార్‌కు ప్రత్యేక హోదా మా కోరిక, ఇది ప్రజల ప్రయోజనాల కోసం. ప్రత్యేక హోదా లేకుండా బిహార్ అభివృద్ధి కష్టం" అని త్యాగి అభిప్రాయపడ్డారు.
యూసీసీపై చర్చ
అధికారంలోకి వస్తే యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అయితే ఇప్పుడది అంత సులువు కాకపోవచ్చు.
‘‘మేం దీనికి వ్యతిరేకం కాదని, లా కమిషన్ ఛైర్మన్‌కు రాసిన లేఖలో ఇప్పటికే తెలియజేశాం’’ అని యూసీసీపై కేసీ త్యాగి తెలిపారు.
“అయితే ముఖ్యమంత్రి అయినా, వివిధ రాజకీయ పార్టీలైనా దాని భాగస్వాములందరితో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి” అని ఆయన బదులిచ్చారు.

ఫొటో సోర్స్, ANI
ఎల్జేపీ డిమాండ్లు
2021లో రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత చిరాగ్, ఆయన మామ పశుపతి పరాస్‌ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పార్టీ చీలిక తర్వాత పశుపతి ఎన్డీయేలో చేరగా, చిరాగ్ ఎన్డీయే నుంచి దూరమయ్యారు.
ఈ ఏడాది మార్చిలో బిహార్ ఎంపీ సీట్ల పంపకంలో పశుపతి కుమార్ పరాస్ పార్టీకి ఎన్డీయే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన ఎన్డీయే నుంచి బయటికొచ్చారు, అనంతరం చిరాగ్ మళ్లీ ఎన్డీయేలో చేరారు.
‘‘పార్టీ వైఖరి స్పష్టంగా ఉంది, కుల గణన జరగాలి. దేశంలోని అనేక పథకాలు కులం ప్రాతిపదికన ఇవ్వడమే ఇందుకు కారణం. దీని కోసం ప్రభుత్వం వద్ద కుల గణాంకాలు ఉండాలి. మేం దానికి అనుకూలం" అని కుల గణనపై చిరాగ్ పాశ్వాన్ ఎన్‌డీటీవీతో అన్నారు.
“బిహార్‌కు ప్రత్యేక హోదా రావాలని కచ్చితంగా కోరుకుంటున్నాం. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత, కొన్ని నిబంధనలు వచ్చాయి, ఇందులో మార్పులు చేస్తే, ఇది సాధ్యమవుతుంది" అని చిరాగ్ తెలిపారు.
ఏక్‌నాథ్ షిండే ఏం కోరుతున్నారు?
ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం కూడా ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ.
తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని షిండే అడుగుతున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం 7 స్థానాల్లో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, @AKHILESHYADAV @AKHILESHYADAV
ఆర్‌ఎల్‌డీది మరో కథ..
రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ చౌదరి కూడా తన డిమాండ్లను ముందుకు తెచ్చారు.
లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చ జరుగుతున్నప్పుడు, జయంత్ చౌదరి ఇండియా కూటమిలో చేరడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి, ఆయన అఖిలేష్ యాదవ్‌ను కూడా కలిశారు.
అయితే, ఒక రోజు తర్వాత జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించింది.
ఆ తర్వాత జయంత్ చౌదరి ఎన్డీయేలో చేరారు.
ఆర్‌ఎల్‌డీకి ఇండియా కూటమి ఏడు సీట్లను ఆఫర్ చేసింది. ఎన్డీయేతో సీట్ల పంపకంలో ఆర్‌ఎల్‌డీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి.
అనంతరం, జయంత్ చౌదరి, అఖిలేష్ యాదవ్‌లు ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ఇండియా కూటమి నుంచి వైదొలగడం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని జయంత్ చౌదరి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దోషిగా తేలిన డోనల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యకుడు కావొచ్చా? మరో 4 కీలక ప్రశ్నలు-సమాధానాలు
- ‘స్టార్ వార్ సినిమాలో చూపించినట్టు గాలి నుంచి నీటిని తయారు చేస్తున్నాం...’
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














