దిల్లీ: చంద్రబాబు, నితీశ్‌లపై కాంగ్రెస్‌ ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకుంది?

చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్

2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఆ కూటమి కేవలం నామమాత్రమే. అన్నింటిలో బీజేపీయే పెద్దన్న.

2014-2020 మధ్య, ఎన్‌డీఏలో నుంచి అనేక ముఖ్యమైన మిత్రపక్షాలు విడిపోయాయి. 2020లో శిరోమణి అకాలీదళ్, శివసేన 2019లో ఎన్‌డీఏ నుంచి వైదొలిగాయి. ( అప్పటికి శివసేన రెండు ముక్కలు కాలేదు.)

కానీ, ఈసారి బీజేపీ అవసరం వల్ల హఠాత్తుగా ఎన్‌డీఏ కూటమిలోని పార్టీలకు ప్రాధాన్యత పెరిగింది. ఎన్‌డిఏలో అన్ని పార్టీలు కావాలి బీజేపీకి.

జనతాదళ్ (యు) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుల సహకారం లేకుండా మోదీ మూడోసారి ప్రధాని కాలేరు. అయితే చంద్రబాబు కూడా గతంలో చాలాసార్లు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, నితీశ్‌లు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కాగా బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి.

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 16 సీట్లు, జేడీయూకి 12 సీట్లు దక్కగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వాటి 28 సీట్లు కీలకం కానున్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు తాము ఎన్‌డీఏతోనే ఉన్నామని బహిరంగంగానే చెప్పారు.

అయితే వాళ్లు తాము అనుకున్నది సాధించుకుంటారని, తమ సొంత నిబంధనలపైనే ఇద్దరూ ఎన్‌డీఏలో కొనసాగుతామనీ చెబుతున్నారు.

ఎన్డీయేలో తమమాట చెల్లుబాటు కాకపోతే నితీశ్, చంద్రబాబునాయుడుకు ఇండియా కూటమి అంటరానిదేమీ కాదు. వీరిద్దరి కోసం కాంగ్రెస్ కూడా తలుపులు తెరిచే ఉంచింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.

"మోదీ ఇప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రి. దేశం ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, ఆయన డెమోక్రసీని డెమో-కుర్సీగా మార్చాలనుకుంటున్నారు" అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వాట్సాప్ చానెల్
మోదీతో చంద్రబాబు, నితీశ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మోదీతో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్

కాంగ్రెస్ సంకేతాలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది.

సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ, ఈ భేటీలో పలు సూచనలు వచ్చాయన్నారు. సరైన సమయం వస్తే ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇండియా కూటమి వెనకాడదని ఆయన పరోక్షంగా సూచించారు.

‘‘బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పును అమలు చేసేందుకు తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఖర్గే అన్నారు.

ఈ సమావేశానికి కూటమిలోని 21 పార్టీలకు చెందిన 33 మంది నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌లకు తలుపులు తెరిచి ఉంచాలని, సరైన సమయం, అవకాశం కోసం వేచి ఉండాలని ఈ నేతలు అన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

ఫొటో సోర్స్, congress

ఫొటో క్యాప్షన్, మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

బీజేపీ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చే విషయంలో ఇండియా కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలని నాయకులందరూ అభిప్రాయపడ్డారని, దాని వల్ల ఇండియా కూటమికి కొత్త అవకాశాలు రావచ్చనే అభిప్రాయం వ్యక్తం అయిందని ఆంగ్ల వార్తాపత్రిక ది హిందూ రాసింది.

"బ్రాండ్ మోదీ" ఇమేజ్‌ను బద్దలు కొట్టడంలో ఇండియా కూటమి విజయవంతమైందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నట్లు హిందూ తెలిపింది.

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఎన్నికలలో గెలిచిన చాలా మంది బీజేపీ నాయకులు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

ఎన్డీయే సమావేశం తర్వాత తీసిన ఫోటో
ఫొటో క్యాప్షన్, ఎన్డీయే భాగస్వాముల సమావేశం తర్వాత తీసిన ఫోటో

బీజేపీ ఐక్యతా ప్రదర్శన

బుధవారం దిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్‌డీఏ కీలక సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన తొలి ఎన్‌డీఏ సమావేశం ఇది.

ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన 21 మంది నేతలు హాజరయ్యారు. బీజేపీ తరపున నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా దీనిలో పాల్గొన్నారు.

టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూకు చెందిన నితీశ్ కుమార్, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఏక్‌నాథ్ షిండే, జనతాదళ్ సెక్యులర్‌ నుంచి హెచ్‌డీ కుమారస్వామి, లోక్ జనశక్తి పార్టీ తరపున చిరాగ్ పాశ్వాన్, రామ్ విలాస్, హెచ్‌ఏఎంకు చెందిన జితన్ రామ్ మాంఝీ, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్ చౌదరి, ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్, అస్సాం గణ పరిషద్‌కు చెందిన ప్రమోద్ బోరో ఇందులో పాల్గొన్నారు.

జైరాం రమేశ్ ట్వీట్

ఫొటో సోర్స్, Jairam Ramesh

కాంగ్రెస్ 'తెరిచిన తలుపులు'

కుల గణన, బిహార్‌కు ప్రత్యేక హోదా వంటి అంశాల్లో ప్రధాని మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్య విభేదాలపై జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

ఎన్‌డీటీవీ ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, "కుల గణన అనేది కులం పేరుతో దేశాన్ని విభజించే రాజకీయం అన్న ప్రకటనకు నరేంద్ర మోదీ కట్టుబడి ఉంటారా?" అని ప్రశ్నించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత కింగ్ మేకర్ స్థానానికి చేరుకున్న నితీశ్, దేశంలో కుల గణన, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

జేడీయూ నేత కేసీ త్యాగి ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, దేశంలో కుల గణన నిర్వహించాలని రాబోయే ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు.

జైరాం రమేష్ అక్కడితో ఆగలేదు. ఆయన ఫిబ్రవరి 2019 నాటి మోదీకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అందులో చంద్రబాబు నాయుడు తన రాజకీయ కార్యక్రమాల కోసం ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని మోదీ ఆరోపించారు.

వీడియోలో మోదీ, “నా ప్రభుత్వం వారిని జవాబుదారీతనం అడుగుతోంది. ఇంతకుముందు వాళ్లు దిల్లీ కారిడార్‌లలో ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీకు ఇచ్చిన మొత్తంలో ప్రతి పైసాకు లెక్క చెప్పమని మోదీ కోరుతున్నారు’’ అని అన్నారు.

‘‘ప్రజలు తిరస్కరించిన తర్వాత బీజేపీ, అధికారం కోసం నాయుడిని తమతో ఉండమని బతిమాలుకుంటోంది’’ అని జైరాం రమేష్ అన్నారు.

కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, ‘‘నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు మాకు కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడు నాకు మంచి మిత్రుడు, ఆయన నాకు 1996 నుంచి తెలుసు. మేం మా స్నేహితులతో టచ్‌లో ఉన్నాం" అని అన్నారు.

జైరాం రమేశ్ ట్వీట్

ఫొటో సోర్స్, Jairam Ramesh

నితీశ్ – బీజేపీ - కాంగ్రెస్

నితీశ్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్, బీజేపీ కలిసి ఉన్నాయి.

2022లో బీజేపీ నుంచి వైదొలిగి ఆర్జేడీ (కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది)తో చేతులు కలిపారు. ఏడాది తర్వాత ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకుని ఆయన మళ్లీ బీజేపీతో జత కట్టారు.

గత ఏడాది జూన్‌లో పట్నాలో ఇండియా కూటమి తొలి సమావేశం జరిగింది. ఇందుకోసం నితీశ్ కుమార్ చొరవ తీసుకున్నారు. పట్నాలోని ఆయన నివాసంలోనే ఈ సమావేశం జరిగింది.

ఆ సమయంలో ఆయన, ‘‘కేంద్రంలో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు నేతలంతా అంగీకరించారు’’ అని చెప్పారు.

అయితే ఆరు నెలల తర్వాత నితీశ్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో కలిశారు.

నితీశ్ తరచుగా అటుఇటు మారే అంశాన్ని కాంగ్రెస్ గుర్తు చేసుకుంటోంది. బహుశా ఆ పార్టీ ఆశలూ దీనిపైనే ఉన్నాయి.

ఫలితాలు వెలువడ్డాక బిహార్‌లో నితీశ్ పార్టీ పెట్టిన పోస్టర్లపై ‘నితీశ్ అందరి వాడు’ అని రాసి ఉంది. దీనిని ఒక సంకేతంగా పరిగణించవచ్చు.

నితీష్ కుమార్

ఫొటో సోర్స్, X

చంద్రబాబునాయుడు - బీజేపీ

టీడీపీ తొలిసారిగా 1996లో ఎన్డీయేలో చేరింది. అప్పట్లో చంద్రబాబు ఐటీ గవర్నెన్స్ విషయంలో మంచి పేరు సంపాదించారు. 2018లో ఎన్డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు.

2018లో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు, 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 23 సీట్లే గెలుచుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్డీఏలో చేరిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 135 స్థానాలు గెలుచుకోవడంతోపాటు, 16 లోక్‌సభ స్థానాలలో గెలిచింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కూడా ఆయన ఎజెండాలో ఉంది. అక్కడ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలనేది ఆయన లక్ష్యం.

టీడీపీపై ఆధారపడటం వల్ల బీజేపీ తన సొంత అజెండాలు చాలా వాటికి స్వస్తి చెప్పాల్సి వస్తోందని అంటున్నారు. డీలిమిటేషన్, హిందీ భాష విషయంలోనూ బీజేపీ వెనకడుగు వేయాల్సి రావచ్చు.

అయితే తాను ఎన్డీఏతోనే కొనసాగుతానని చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

ఎన్డీయే సమావేశంలో నితీశ్ కుమార్ బహిరంగంగా ఏమీ డిమాండ్ చేయలేదని, అయితే ఆయన రైల్వే శాఖను కోరే అవకాశం ఉందని అంటున్నారు.

వాజ్‌పేయి ప్రభుత్వంలో నితీశ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. అధికారంలో కొనసాగడానికి బీజేపీ ఎన్‌డీఏపై ఆధారపడినప్పుడల్లా, నితీశ్ కుమార్ రాడికల్ హిందుత్వ విధానాన్ని ముందుకు సాగనివ్వలేదు.

ఎన్‌డీఏలోని పార్టీల కారణంగా రామమందిరం, ఆర్టికల్ 370, యూనిఫాం సివిల్ కోడ్‌లపై వాజ్‌పేయి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

నితీశ్ కుమార్ ఎప్పుడూ హిందుత్వ రాజకీయాలతో ఏకీభవించలేదు. నితీశ్ రాజకీయాలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కాంగ్రెస్ తలుపు తెరిచి ఉంచితే, నితీశ్‌కూ అక్కడ సైద్ధాంతిక స్థాయిలో ఎలాంటి సమస్యా ఉండదన్నది ఒక అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)