మియన్మార్: ‘టాటూ ఉందని చర్మం కోసేశారు.. దాహమేస్తుందంటే మూత్రం సీసాలిచ్చారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోనాథన్ హెడ్
- హోదా, బీబీసీ న్యూస్
హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
మియన్మార్ సైన్యానికి, అరాకాన్ ఆర్మీకి మధ్య రఖైన్ రాష్ట్రంలో నెలల తరబడి ఘర్షణలు జరుగుతున్నాయి.
రఖైన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో కిందటివారం మియన్మార్ సైన్యం జరిపిన దాడిలో కనీసం 50మంది చనిపోయారని , స్థానికులు,ప్రత్యర్థి బలగాలు చెప్పాయి.
సైన్యం కొందరి కళ్లకు గంతలు కట్టి, వారిపై పెట్రోల్ పోసిందని, వారిలో కొందరిని మూత్రం తాగాల్సిందిగా బలవంతం చేసిందని.. రెండున్నర రోజులపాటు గ్రామస్థులంతా భయాందోళనలకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో చెప్పారు.
మియన్మార్‌లో తిరుగుబాటుదారుల గ్రూపులలో ప్రభావవంతంగా ఎదిగిన అరాకాన్ ఆర్మీ (ఏఏ) మద్దతుదారుల కోసం సైన్యం వెతికిందని తెలిపారు.
15 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్న 51మందిని ‘‘దారుణంగా హింసించి చంపారు’’ అని జాతీయ ఐక్య కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే మృతుల సంఖ్య 70కి పెరగొచ్చని అరాకాన్ ఆర్మీ అంచనా వేసింది.
మూడేళ్ల మియన్మార్ అంతర్యుద్ధంలో అత్యంత దారుణమైన అణచివేతల్లో ఒకటిగా పేర్కొంటున్న ఈ సంఘటనను మియన్మార్‌లో పాలక సైనిక కూటమి (జుంటా) కొట్టిపారేసింది.
‘‘వారు(సైనికులు) గ్రామంలో అరాకాన్ ఆర్మీ ఉందా అని పురుషులను అడిగారు’’ అని ఓ మహిళ బీబీసీకి చెప్పింది.
‘‘వారేం చెప్పారో తెలియదు కానీ సైనికులు మాత్రం వారిని కొట్టారు’’ అని ఆమె చెప్పారు.
ఆరునెలల వ్యవధిలో అరాకాన్ ఆర్మీ రఖైన్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుని సైన్యాన్ని వెనక్కి తగ్గేలా చేసింది.
సైన్యంతో కాల్పుల విరమణ ఒప్పందం అరాకాన్ ఆర్మీకి కిందేటడాదితో ముగిసింది.


ఫొటో సోర్స్, REUTERS
‘రోజంతా ఎండలో నిలబెట్టారు’
2021 ఫిబ్రవరిలో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న జుంటాను గద్దెదించడమనే సామూహిక లక్ష్యాన్ని సాధించేందుకు అరాకాన్ ఆర్మీ దేశంలోని ఇతర తిరుగుబాటుదారులతో చేతులు కలిపింది.
‘‘నా భర్తను మిలటరీ వాహనంలో తీసుకువెళ్లడం నా కళ్లతో చూశాను. నా కుమారుడిని మా నుంచి వేరు చేశారు. అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. నా భర్త, కుమారుడు బతికున్నారో లేదో తెలియడం లేదు’’ అని ఆ మహిళ బీబీసీకి చెప్పారు.
భద్రత దృష్ట్యా మేం సాక్షుల పేర్లు వెల్లడించడం లేదు.
కేవలం వెయ్యి ఇళ్లున్నఈ గ్రామంలో ప్రజలను తినడానికి, తాగడానికి ఏమీ లేకుండా ఎండలో నిలబెట్టారని, చాలామంది పురుషులను కట్టేశారని,కళ్లకు గంతలు కట్టారని, మరికొంతమందిని విచారించేందుకు ట్రక్కులలో తరలించారని, చాలామంది గ్రామానికి తిరిగి రావాల్సి ఉందని చెప్పారు.
‘‘రోజంతా ఎండలో నిలబెట్టడం వల్ల వారు దాహంతో అల్లాడుతూ మంచినీటి కోసం అడుక్కున్నారు. సైనికులు మూత్రాన్ని నింపిన సీసాలను ఇచ్చారు’’ అని ఆ మహిళ బీబీసీకి చెప్పారు.
‘‘కాల్పుల శబ్దాలు విన్నాను. కానీ మేం తలవంచుకునే ఉండాల్సి రావడం వల్ల ఎవరు కాల్చారో తెలియదు.’’ అని ఆమె తెలిపారు.
‘‘చూడటానికి నాకు ధైర్యం సరిపోలేదు. నా దగ్గరలో నుంచున్న వ్యక్తిని వారు పిలిచారు. ఆ తరువాత తుపాకీ పేలిన శబ్దం విన్నాను. అతను తిరిగి రాలేదు.’’
ఆమె మాట్లాడుతున్నంతసేపు తన కొడుకు, భర్త గురించి తలుచుకుని ఏడుస్తూనే ఉన్నారు. ‘‘వారు బతికున్నారో లేదో తెలియదు. ‘బుద్ధా దయచేసి వారిని కాపాడు’’ అని వారికోసం ప్రార్థిస్తున్నాను.
శవాలను పూడ్చిపెట్టేందుకు సైనికులు తమను పారలు అడిగారని బతికి బయటపడ్డవారు చెబుతున్నారు.
కొంతమంది సైనికులు తప్పతాగారని చెప్పారు.
100మంది సైనికుల దాడి

ఫొటో సోర్స్, REUTERS
రఖైన్ రాష్ట్ర రాజధాని సితవే శివారు గ్రామమైన బయాయ్ ప్యూ గ్రామంపై వందమంది సైనికులు దాడి చేసినట్లు చెప్తున్నారు.
రెండులక్షల మంది జనాభా, పెద్ద ఓడరేవు, విమానాశ్రయం ఉన్న సితవే బర్మీస్ సైనికులకు పట్టు ఉన్న ప్రాంతాలలో ఒకటి. కానీ తిరుగుబాటుదారులకు ఇది దగ్గరగా ఉంది. పైగా రఖైన్ జనాభాలో ఎక్కువమంది వారి పట్ల సానుభూతితో ఉన్నారు.
అరకాన్ ఆర్మీకి మద్దతుగా టాటూ వేయించుకున్న వ్యక్తిపై సైనికులు దాడిచేసి టాటూ ఉన్న చర్మాన్ని ఒలిచేశారని, దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
కిందటేడాది చివరలో ఉత్తరాదిన ఉన్న షాన్ రాష్ట్రంలో సైన్యం తీవ్రంగా నష్టపోయిందని, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ గ్రామానికి వచ్చినట్టు ఓ సైనికాధికారి చెప్పిన విషయాన్ని మరో ప్రత్యక్ష సాక్షి గుర్తు చేసుకున్నారు.
బంగ్లాదేశ్ సరిహద్దులోని రఖైన్ రాష్ట్రాన్ని పోగొట్టుకోవడం సైనిక దళాలకు తీరని అవమానంగా ఉంది. 1948లో స్వాతంత్రం పొందినప్పటి నుంచి సైనిక బలగాలకు ఈ ప్రాంతంపై ఆధిపత్యం ఉంది.
శుక్రవారం నాడు మార్కెట్ వద్ద నిలుచుకున్నవారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులను ఏవైనా కొన్ని వస్తువులను తీసుకువెళ్ళిపోవాల్సిందిగా సైన్యం ఆదేశించింది. అప్పటికే సైన్యం తమ ఇళ్ళలోని బంగారం, సౌరఫలకాలను తదితర విలువైన వస్తువులను దోచుకున్నట్టు తెలుసని చెప్పారు. స్థానికులను తొలుత సితవేలోని స్టేడియానికి తరలించారు.
బై పైయు గ్రామంపై సైన్యానికి ఇంకా నియంత్రణ ఉందని, వెనక్కి వచ్చేందుకు ఎవరినీ అనుమతించడం లేదని బీబీసీ అర్ధం చేసుకుంది.
గ్రామంలో చాలా భాగం కాలిపోయిందనే వార్తలు ఉన్నాయి.
బై పైయులో యుద్ధనేరాలకు పాల్పడినవారిని బోనెక్కిస్తామని జాతీయ ఐక్య ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఫాసిస్ట్ మిలటరీ కౌన్సిల్ దుర్మార్గానికి పాల్పడిందని, కొంతమంది మహిళలను గ్యాంగ్ రేప్ చేసిందని అరకాన్ ఆర్మీ తెలిపింది.
కానీ జుంటా ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఆ గ్రామంలో ఇసుక బస్తాల బంకర్లు చూసిన తరువాత శాంతిభద్రతల చర్యలు మాత్రమే తీసుకున్నామని తెలిపింది. సితవే ప్రాంతం నుంచి అరాకాన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేస్తోందని ఆరోపించింది.
బై పైయు గ్రామంలో ఏం జరిగిందనే విషయంపై స్వతంత్ర విచారణ జరపడం సమీప భవిషత్తులో అసాధ్యంగా కనిపిస్తోంది.
- ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరమైందా, జగన్ ఎక్కడ కూర్చుంటారు?
- ఆంధ్రప్రదేశ్: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?
- తెలుగుదేశం పార్టీ విజయానికి దారులు వేసిన 5 పరిణామాలివే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేల జాబితా..
- దిల్లీ: చంద్రబాబు, నితీశ్‌లపై కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














