టీ20 వరల్డ్‌కప్: పాకిస్తాన్, అమెరికా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు ఎలా దారితీసింది?

ఫొటో సోర్స్, Getty Images
టీ 20 మ్యాచ్ ఎలా ఉండాలో అలాగే సాగింది పాకిస్తాన్, అమెరికా మ్యాచ్.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా జట్టు పాకిస్తాన్‌ను మట్టికరిపించడం, అదీ సూపర్ ఓవర్‌లో నెగ్గడంతో క్రికెట్ అభిమానులు టీ20 మజాను ఆస్వాదించారు.
టీ20 ప్రపంచకప్- 2024లో భాగంగా గ్రూప్-ఏలో అమెరికాలోని డాలస్ వేదికగా జరిగిన అమెరికా, పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ దారితీసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సరిగ్గా 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.
దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.


ఫొటో సోర్స్, Getty Images
చివరి ఓవర్ మ్యాజిక్
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 12 పరుగులకే ఓపెనర్ స్టీవెన్ టేలర్ వికెట్‌ను పోగొట్టుకుని కష్టాల్లో పడింది.
కానీ కెప్టెన్ మోనాక్ పటేల్ 38 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో అర్థసెంచరీ సాధించడం, వన్‌డౌన్ బ్యాటర్ అండ్రీస్ గౌస్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ 35 పరుగులు ఆరోన్ జోన్స్ 19 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులు, నితీష్ కుమార్ 14 బంతుల్లో 14 పరుగులు చేసి రాణించారు.
ఇక చివరి ఓవర్‌లో గెలుపు కోసం అమెరికాకు15 పరుగులు అవసరమయ్యాయి.
మొదటి ఐదు బంతుల్లో కేవలం 4 సింగిల్స్, ఓ సిక్స్ రావడంతో పది పరుగులు వచ్చాయి. చివరి బంతికి నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి.
దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
పాక్ బౌలర్లలో మహ్మద్ అమిర్, నసీమ్ షా, హరిస్ రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు..

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ దూకుడు
తొలుత బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ బాబర్ అజామ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో ఒక ఫోర్ 3 సిక్సులతో దూకుడుగా ఆడి 40 పరుగులు చేశాడు.
ఇఫ్తికార్ అహ్మద్ 18, షాహీన్ అఫ్రిదీ 23 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
అమెరికా బౌలర్లలో కెంజిగె 3, నేత్రవల్కర్ 2, అలీఖాన్ జస్డీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ ఓటమితో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ తరువాత కెనడా, ఐర్లాండ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలలో ఉన్నాయి.
షోయబ్ నిరాశ
పాకిస్తాన్ ఓటమిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తంచేశారు.
సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్న ఆయన పాకిస్తాన్ ఓటమితో నిరాశ చెందానన్నారు. 1999 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పై జరిగినదే పాకిస్తాన్ పునరావృతం చేసిందని చెప్పారు.
అమెరికా చాలా బాగా ఆడిందని షోయబ్ మెచ్చుకున్నారు. అమెరికా ముందు నుంచి ఆధిపత్యంలోనే ఉందని, అమిర్, షహీన్ బాగా ఆడారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ ఓవర్ లో ఏమైంది?
సూపర్ ఓవర్‌లో అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఇందులో 7 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి.
పాక్ బౌలర్ మొహ్మద్ అమీర్ ఒక బౌండరీనే ఇచ్చినా వైడ్ల రూపంలో 7 పరుగులు ఇవ్వడమే కీలకంగా మారింది.
సూపర్ ఓవర్‌లో 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ వికెట్ నష్టపోయి 13 పరుగులే చేయగలిగి 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
దీంతో అమెరికా విజేతగా నిలిచింది.
ఈ టోర్నీలో అమెరికాకు ఇది రెండో గెలుపు.
ఈ గెలుపుతో 4 పాయింట్లు సాధించిన అమెరికా టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోపక్క రెండు పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరమైందా, జగన్ ఎక్కడ కూర్చుంటారు?
- ఆంధ్రప్రదేశ్: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?
- తెలుగుదేశం పార్టీ విజయానికి దారులు వేసిన 5 పరిణామాలివే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేల జాబితా..
- దిల్లీ: చంద్రబాబు, నితీశ్‌లపై కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














