టీ20 వరల్డ్‌ కప్‌లో అమెరికా తరఫున ఆడుతున్న ఈ భారతీయ ప్లేయర్ కథేంటి?

సౌరభ్ నేత్రవల్కర్‌

ఫొటో సోర్స్, SAURABH NETRAVALKAR/USA CRICKET

ఫొటో క్యాప్షన్, సౌరభ్ నేత్రవల్కర్‌
    • రచయిత, జాన్వీ మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒకప్పుడు భారత్ అండర్-19 జట్టుకు ఆడిన సౌరభ్ నేత్రవల్కర్‌ అమెరికా తరఫున టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. అయితే ఆయన అమెరికా జట్టులో చేరిన కథ ఆసక్తికరంగా ఉంది.

టీ-20 ప్రపంచకప్‌లో అమెరికా ఏడు వికెట్ల తేడాతో కెనడాను ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో కెనడా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

కెనడా తరఫున నవనీత్ ధలీవాల్ అత్యధికంగా 61 పరుగులు చేశారు.

ఆరోన్ జోన్స్ దూకుడు బ్యాటింగ్‌తో అమెరికా జట్టు 18వ ఓవర్‌లో మూడు వికెట్లకు 197 పరుగులు చేసి విజయం సాధించింది. జోన్స్ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. బార్బడోస్‌లో జన్మించిన జోన్స్, అమెరికన్ జట్టులో కీలక ఆటగాడిగా మారారు.

ముంబైకి చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్‌కూ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది.

ముంబైకి చెందిన సౌరభ్ ఒకప్పుడు అండర్-19 భారత జట్టులో సభ్యుడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినప్పుడు తన క్రికెట్ కెరీర్ ముగిసిందని భావించారు.

కానీ క్రికెట్‌పై ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉండిపోయింది. అమెరికాలో చదువుతూ కూడా అవకాశం దొరికితే క్రికెట్ ఆడుతుండేవాడు. ఇప్పుడు ఐసీసీ-టీ20 వరల్డ్ కప్ రూపంలో అదృష్టం ఆయన తలుపు తట్టింది.

బీబీసీ వాట్సాప్ చానెల్
సౌరభ్ నేత్రవల్కర్‌

ఫొటో సోర్స్, Getty Images

అండర్-19 జట్టులో అరంగేట్రం

సౌరభ్ నేత్రవల్కర్ 16 అక్టోబర్ 1991న ముంబైలో జన్మించారు. మలాడ్‌లో పెరిగిన సౌరభ్ 10 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడటం ప్రారంభించారు.

2008-09 సీజన్‌లో తొలిసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. కూచ్ బెహార్ ట్రోఫీ-19 క్రికెట్ టోర్నమెంట్‌లో సౌరభ్ ఆరు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టారు. ముంబై ఒకప్పుడు బ్యాట్స్‌మెన్‌కు పేరుగాంచింది, కాబట్టి ఈ యువ ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ వెంటనే ప్రజల దృష్టిని ఆకర్షించింది. సన్నగా, పొడవుగా ఉండే సౌరభ్ ఎడమచేతి వాటం బౌలర్‌గా వెలుగులోకి వచ్చారు.

ఆ తర్వాత 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో సౌరభ్ ఎనిమిది వికెట్లు తీయగా, ఆ తర్వాత న్యూజిలాండ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టారు.

ఆ సమయంలో అండర్-19 జట్టులో సౌరభ్‌తో పాటు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనాద్కత్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ భారత జట్టులోకి రాగలిగినా, సౌరభ్‌కు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు.

సౌరభ్‌కు క్రికెట్‌తో పాటు చదువుపైనా మక్కువ ఎక్కువ. ఆయన 2009-13లో ముంబైలోని సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

‘‘2013లో నాకు పుణెలో ఉద్యోగం వచ్చింది. నేను కనీసం రెండేళ్లు పని చేయకుండా, క్రికెట్‌కే సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నా. ముంబై జట్టుకు ఆడాలనుకున్నా. ఆ సంవత్సరం ముంబై రంజీ జట్టుకు ఎంపిక కూడా అయ్యాను." అని సౌరభ్ తెలిపారు.

రెండేళ్లపాటు ప్రయత్నించినా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించలేకపోయారు సౌరభ్. ఐపీఎల్‌లోనూ అవకాశం లభించలేదు.

సౌరభ్ నేత్రవల్కర్‌

ఫొటో సోర్స్, Getty Images

క్రికెటర్ నుంచి యాప్ డెవలపర్ వరకు

నిజానికి ఒక క్రికెటర్ కెరీర్ 22-23 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే ఈ వయసులో సౌరభ్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

‘‘క్రికెట్‌ని వదిలి చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలా వద్దా అనే డైలమా ఏర్పడింది’’ అని సౌరభ్ అన్నారు.

ముంబై రంజీ జట్టులో తన స్థానంపై భరోసా లేదు, భవిష్యత్తులో భారతదేశం తరపున ఆడే అవకాశం లేదు. దాంతో సౌరభ్ చదువుపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

“2015లో నేను అమెరికాలో మాస్టర్స్‌కి ప్రవేశ పరీక్ష రాశాను. మాస్టర్స్ కోసం, నేను న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నాను.’’ అని సౌరభ్ తెలిపారు.

చదువు పూర్తయ్యాక సౌరభ్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగంలో చేరారు.

ఈ సమయంలో, సౌరభ్ క్రికెట్‌పై ఒక యాప్‌ను కూడా రూపొందించారు. అతని యోగా, పాటల వీడియోలూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయ్యాయి.

‘‘అమెరికా వెళ్లాక క్రికెట్‌తో నా బంధం తెగిపోతుందని అనుకున్నా, కానీ అలా జరగలేదు. కాలేజ్‌లో కొంతమంది పిల్లలు సరదాగా క్రికెట్ ఆడేవారు. మేమంతా కలిసి కాలేజ్ క్రికెట్ క్లబ్‌ని ఏర్పాటు చేసుకున్నాము. కాలేజ్ స్థాయిలో పోటీలు నిర్వహించేవాళ్లము." అని సౌరభ్ తెలిపారు.

ఒరాకిల్‌లో ఉద్యోగం రావడంతో సౌరభ్ శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. అక్కడ వారాంతంలో క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లు జరిగేవి. ఐదు రోజులు పని చేసి, శని, ఆదివారాల్లో మ్యాచ్‌లు ఆడేవారు సౌరభ్‌.

అయితే ఆ టోర్నీలు భారత్‌ స్థాయిలో ఉండేవి కావని సౌరభ్ తెలిపారు. ‘‘ఇక్కడ మామూలు మట్టి పిచ్‌లు లేవు, సింథటిక్‌ మ్యాట్‌లను పోలిన పిచ్‌లు ఉంటాయి. అయితే, లాస్‌ఏంజెల్స్‌లోని ఒక పార్క్‌లో భారత్‌లో మాదిరి ఉండే మూడు లేదా నాలుగు పిచ్‌లు ఉన్నాయి.’’ అన్నారు సౌరభ్.

సౌరభ్ నేత్రవల్కర్‌

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ ఆడేందుకు 6 గంటల పాటు డ్రైవింగ్

లాస్ ఏంజిల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఆరు గంటల ప్రయాణం. సౌరభ్ శుక్రవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి, శనివారం అక్కడ క్రికెట్ ఆడి, ఆదివారం శాన్ ఫ్రాన్సిస్కోకు తిరిగి వచ్చేవారు.

“ఆ క్లబ్‌లో ఆడుతున్నప్పుడు, నాతో పాటు అమెరికన్ జట్టులో ఆడుతున్న ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉండేవాళ్లు. నిజానికి అమెరికాకూ క్రికెట్ టీమ్ ఉందని అప్పుడే నాకు తెలిసింది.”

కానీ సౌరభ్‌కు అమెరికా జాతీయ జట్టుకు ఆడాలనే ఆశ లేదు, ఎందుకంటే అక్కడ జట్టు ఎంపిక నియమాలు చాలా కఠినంగా ఉండేవి.

ఆనాటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ సౌరభ్, "ఏడేళ్లు అమెరికాలో నివసించాలి, మీరు పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. నేను అప్పుడు వర్క్ వీసాపై ఉన్నాను. కాబట్టి అమెరికాకు ఆడటం చాలా కష్టం. నేను ఆ ఆటను కేవలం ఆస్వాదించడానికి మాత్రమే ఆడేవాణ్ని.’’ అన్నారు.

2018లో సౌరభ్ అమెరికాలో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు, అదే సమయంలో ఐసీసీ ఏడేళ్ల నియమాన్ని మూడేళ్లకు తగ్గించింది.

అమెరికా జట్టు శిక్షణ కోసం లాస్ ఏంజెల్స్ వచ్చినప్పుడు అక్కడ కోచ్‌కు సౌరభ్ ఆట నచ్చడంతో ఆయనకు అమెరికా జట్టు తలుపులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆయన అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ- 20ల్లో పాల్గొన్నారు.

సౌరభ్ నేత్రవల్కర్‌

ఫొటో సోర్స్, Getty Images

అసోసియేట్ క్రికెట్ పోరాటం

అమెరికాలో క్రికెట్‌ ఆడడం చాలా సులువని, చిన్న జట్లకు ఆడటం ఇంకా ఈజీ అని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదన్నారు సౌరభ్.

“అసోసియేట్ దేశాలలో క్రికెట్ చాలా కష్టం ఎందుకంటే సౌకర్యాలు చాలా పరిమితం. మాకు చాలా చోట్ల ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు లేదా సాధారణ పిచ్‌లు కూడా లేవు. మేము ఆఫీసు నుంచి ఐదు గంటలకు బయలుదేరి, రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు ఇంటిలో ప్రాక్టీస్ చేసేవాళ్లం.’’ అని తెలిపారు.

2019లో, ఐసీసీ సభ్యులందరికీ ట్వంటీ20 అంతర్జాతీయ హోదాను మంజూరు చేసింది. 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లోకి ప్రవేశించి, అమెరికా తాత్కాలిక వన్డే అంతర్జాతీయ హోదాను పొందింది. రానున్న మూడేళ్లలో అమెరికాలో క్రికెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సౌరభ్ అన్నారు.

"ఇక్కడ మంచి గ్రౌండ్‌లు నిర్మించారు. అకాడమీలు తయారవుతున్నాయి, కొత్త ఆటగాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇక్కడ 13-14 సంవత్సరాల వయస్సు గల ఆటగాళ్లు ఉన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో వారిని అంతర్జాతీయ ఆటకు సిద్ధం చేయడమే తదుపరి సవాలు.’’ అని సౌరభ్ అన్నారు.

భారత్‌పై ఆడటం కష్టమే

ఇప్పుడు అమెరికా జట్టు జూన్ 6న పాకిస్తాన్‌తో, జూన్ 12న భారత్‌తో ఆడనుంది. భారత్‌తో ఆడటం భావోద్వేగాలతో ముడిపడిన అంశం అని సౌరభ్ అన్నారు.

‘‘భారత్ తరఫున నేను అండర్-19 క్రికెట్ ఆడాను. ఒకప్పుడు నాతో కలిసి ఆడిన చాలా మంది ఇప్పుడు భారత జట్టులో ఉన్నారు. వాళ్లను మళ్లీ చూడటం ఆనందంగా ఉంది’’ అని సౌరభ్ తెలిపారు.

భారత్‌తో జరగబోయే మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ ‘‘టీ20లో ఏదైనా జరగొచ్చు, మేం సానుకూల ధోరణితో ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు ఆడబోయే మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచిస్తాం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)