గాజా: నిర్వాసితులుగా మారిన సగం మంది ప్రజలు, శాటిలైట్ చిత్రాలతో బయటపడ్డ నిజం

పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులుగా మారడంపై ఐక్యరాజ్య సమితి (యూఎన్) హెచ్చరికలు జారీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులుగా మారడంపై ఐక్యరాజ్య సమితి (యూఎన్) హెచ్చరికలు జారీ
    • రచయిత, లమీస్ అల్తలేబి, అహ్మద్ నూర్, అబ్దిరహీం సయీద్, పాల్ కుసియాక్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఐక్యరాజ్యసమితి ప్రకారం, గాజా జనాభాలో దాదాపు సగం మంది – దక్షిణ గాజాలో పది లక్షల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు, ఒక నెలలోనే నిర్వాసితులుగా మారారు.

గాజాలో ఏడు నెలల యుద్ధం తర్వాత మే 6న ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. రఫాను స్వాధీనం చేసుకోకుండా, మిగిలిన హమాస్ బెటాలియన్లను తొలగించకుండా విజయం అసాధ్యమని ఇజ్రాయెల్ నొక్కి చెబుతోంది.

ఇప్పుడు ఇంత తక్కువ వ్యవధిలో, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులుగా మారడంపై ఐక్యరాజ్య సమితి (యూఎన్) హెచ్చరికలు జారీ చేసింది. దీని వల్ల సహాయ పంపిణీలో విపరీత పరిణామాలు ఉంటాయని తెలిపింది.

"పౌష్టికాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు చనిపోతున్నారు" అని పాలస్తీనియన్ శరణార్థుల యూఎన్ ఏజెన్సీ (UNRWA) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియెట్ టౌమా బీబీసీతో అన్నారు.

మే 6న, ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రే, తూర్పు రఫాలోని పాలస్తీనియన్లను సమీపంలోని అల్-మవాసి నుంచి సెంట్రల్ టౌన్ డెయిర్ అల్-బలాహ్ వరకు " ఎక్స్‌పాండెడ్ హ్యుమానిటేరియన్ జోన్."కి తరలించాలని ఆదేశించారు. అక్కడ వాళ్లకు ఫీల్డ్ హాస్పిటళ్లు, టెంట్లు, ఆహారం, ఇతర సామాగ్రి అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పశ్చిమ, మధ్య రఫాలకు చెందిన ఉపగ్రహ చిత్రాలు
ఫొటో క్యాప్షన్, పశ్చిమ, మధ్య రఫాలకు చెందిన ఇటీవలి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించగా, నిర్వాసితులైన వారి కోసం నిర్మించిన వేల గుడారాలు అదృశ్యమైనట్లు తేలింది.

ఆ తర్వాత ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) ఈజిప్టుతో రఫా సరిహద్దులను స్వాధీనం చేసుకుంది. దీనిని తూర్పు రఫాలో హమాస్ కార్యకర్తలు, మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా "ఉగ్రవాద నిరోధక ఆపరేషన్"గా వర్ణించింది.

ఐడీఎఫ్ దళాలు రఫా కేంద్ర పరిసరాల్లోకి ప్రవేశించడంతో అక్కడ ఇతర ప్రాంతాలలోని పాలస్తీనియన్లు తమ తాత్కాలిక నిర్మాణాలను వదిలి పారిపోయారు.

పశ్చిమ, మధ్య రఫాలకు చెందిన ఇటీవలి ఉపగ్రహ చిత్రాలను బీబీసీ విశ్లేషించగా, కొన్ని వారాల క్రితం నిర్వాసితులైన వారి కోసం నిర్మించిన వేల గుడారాలు అదృశ్యమైనట్లు తేలింది.

జూన్ 1 నుంచి ఆకాశంలోంచి తీసిన చిత్రాలు, పశ్చిమ రఫాలో జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఇప్పుడు బోసిపోయినట్లు చూపించాయి. ఒక ప్రధాన శరణార్థి శిబిరం ఉన్న తాల్ అల్-సుల్తాన్ ఫోటలను బట్టి అక్కడ గుడారాలను తొలగించినట్లు అర్ధమైంది.

ఐడీఎఫ్ తూర్పు రఫాలోని ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించినప్పటికీ, మధ్య, పశ్చిమ భాగాలు అధికారిక తరలింపు ఆదేశాలకు లోబడి లేవు.

ఉపగ్రహ చిత్రాలు
ఫొటో క్యాప్షన్, జూన్ 1 నుంచి ఉపగ్రహ చిత్రాలన్నీ రఫా సమీపంలో అనేక సాయుధ వాహనాలు ఉన్నట్లు చూపుతున్నాయి.

అయితే మే 26న ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రజలు ఈ ప్రాంతాల నుంచి పారిపోయారు. దాడి ఫలితంగా తాల్ అల్-సుల్తాన్‌లో నిర్వాసితులైన పాలస్తీనియన్లు ఉంటున్న శిబిరంలో అగ్నిప్రమాదం జరిగింది. హమాస్ ఆధ్వర్యంలో నడిచే పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రమాదంలో 45 మంది మరణించారని, వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారని తెలిపింది.

ఈ దాడిని ప్రపంచ నాయకులు, మానవతా సహాయ సంస్థలు విస్తృతంగా ఖండించాయి, అయితే హమాస్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, ఆ దాడి జరిగిన పరిస్థితులను పరిశీలిస్తామని ఐడీఎఫ్ తెలిపింది.

ఇటీవలి వారాల్లో, ఇజ్రాయెల్ దళాలు క్రమంగా తూర్పు, దక్షిణం నుంచి రఫాలో నిర్మించిన ప్రాంతాలలోకి చొచ్చుకువస్తున్నాయి.

మే 28న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో, సెంట్రల్ అల్-అవ్దా రౌండ్‌అబౌట్‌లో ఒక సాయుధ వాహనం, ఇజ్రాయెలీ దళాలు కనిపించాయి. జూన్ 1 నుంచి ఉపగ్రహ చిత్రాలన్నీ రఫా సమీపంలో అనేక సాయుధ వాహనాలు ఉన్నట్లు చూపుతున్నాయి. జూన్ 1న తీసిన ఉపగ్రహ చిత్రం అల్-అబ్రార్ మసీదు విధ్వంసంతో పాటు సెంట్రల్ రఫాలో సమీపంలోని మార్కెట్ భవనాలకు సంభవించిన తీవ్ర నష్టాన్ని చూపింది.

దిగజారుతున్న మానవత్వం

నగరంపై దాడి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందని యూఎన్, ఇతర సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

"ప్రతిరోజూ ప్రజలు చనిపోతున్నారు. రిపోర్టుల ప్రకారం వీళ్లలో అత్యధికులు మహిళలు, పిల్లలే. వాళ్లలో చాలామంది వైద్య సహాయం లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా పిల్లలు చనిపోతున్నారు" అని టౌమా బీబీసీకి చెప్పారు.

"గాజాకు చాలా అవసరమైన ప్రాణరక్షణ సామాగ్రిని పంపడానికి క్రమబద్ధమైన సహాయం జరగాలి. ఎందుకంటే గాజాలోని ఇరవై లక్షల ప్రజల జీవితాలు దానిపై ఆధారపడ్డాయి" అని ఆమె అన్నారు.

ఈజిప్టు నుంచి సహాయానికి ప్రధాన ప్రవేశ కేంద్రంగా ఉన్న దక్షిణ గాజాలోని రాఫా క్రాసింగ్‌, మే ప్రారంభంలో ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత, దానిని పాలస్తీనా వైపు మూసివేశారు. దక్షిణాదిలోని మరో ప్రవేశ ద్వారం అయిన కెరెమ్ షాలోమ్ ద్వారా సహాయాన్ని అందజేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది, అయితే ఈ ద్వారం చాలా ప్రమాదకరమైనది అని ఐక్యరాజ్య సమితి చెప్పింది.

మరోవైపు, ఇజ్రాయెల్ సైనిక చొరబాటు, రఫాలో పెరిగిన పోరాటాలతో నగరంలోని మూడు ప్రధాన ఆసుపత్రులు మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) తెలిపింది.

ఫిలడెల్ఫీ కారిడార్
ఫొటో క్యాప్షన్, రఫాలో, ఫిలడెల్ఫీ కారిడార్ అని పిలిచే గాజా-ఈజిప్ట్ సరిహద్దు వెంబడి, వ్యూహాత్మకంగా ముఖ్యమైన బఫర్ జోన్‌ తమ ఆధీనంలోకి వచ్చిందని ఐడీఎఫ్ ప్రకటించింది.

రఫా – విస్తృత శరణార్థి శిబిరం

యూఎన్ ప్రకారం, అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమయ్యే ముందు రఫాలో రెండున్నర లక్షల మంది జనాభా ఉన్నారు.

తరువాతి నెలల్లో ఈ సంఖ్య 14 లక్షలకు పెరిగిందని, రఫాను ఒక విస్తృత శరణార్థి శిబిరంగా మార్చిందని యూఎన్ తెలిపింది.

అక్టోబరులో, గాజా నగరం, మధ్య ప్రాంతాలతో సహా ఉత్తరం వైపు ఉన్న పౌరులు వాడీ గాజా నదీ తీరానికి దక్షిణంగా తరలి వెళ్లాలని ఐడీఎఫ్ ఆదేశించింది.

గత కొన్ని వారాలలో రఫాలో, ఫిలడెల్ఫీ కారిడార్ అని పిలిచే గాజా-ఈజిప్ట్ సరిహద్దు వెంబడి, వ్యూహాత్మకంగా ముఖ్యమైన బఫర్ జోన్‌ తమ ఆధీనంలోకి వచ్చిందని ఐడీఎఫ్ ప్రకటించింది.

గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఇరువైపులా 36,000 మందికి పైగా ప్రజలు మరణించారు.

మే 24న, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఇజ్రాయెల్‌ను "తక్షణమే తన సైనిక దాడిని, రఫా గవర్నరేట్‌లో ఏ ఇతర చర్యలనైనా నిలిపేయాలి.’’ అని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)