చైనాలోని ఆ ఎత్తైన జలపాతంలో నీరు ‘ఫేక్’.. హైకర్ పెట్టిన వీడియోతో రహస్యం బట్టబయలు

ఫొటో సోర్స్, Yuntai Mountain Net
- రచయిత, ఫాన్ వాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
చైనాలోని అత్యంత ఎత్తైన జలపాతంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది.
చివరకు సంబంధిత జలమండలి అధికారులు దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
చైనాలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన యుంటాయ్ జలపాతంలో నీరు సహజసిద్ధంగా కాకుండా ఓ పైప్ నుంచి వస్తున్నట్లు చూపించే వీడియోను ఓ పర్వతారోహకుడు పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ఆ వీడియోను సోమవారం పోస్ట్ చేయగా ఇప్పటివరకు 70వేలమందికి పైగా లైక్ చేశారు
అయితే వేసవికాలంలో ఈ జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు నిరుత్సాహపడకుండా ఉండేందుకు, చిన్నపాటి మార్పు చేశామని యుంటాయ్ టూరిజం పార్కు నిర్వాహకులు చెప్పారు.
‘‘నేను ఎంతో కష్టపడి యుంటాయో జలపాతం మూలం చూద్దామని వెళ్లింది కేవలం ఒక పైపును చూడటానికా’’ అంటూ ఫార్సివోవ్ అనే యూజర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘‘యుంటాయ్ జలపాతం మూలం కేవలం కొన్ని పైపులు’’ అనే టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండవడం మొదలైంది.
ఆ వీడియోను వీబోలో కోటి నలభై లక్షలమంది డౌయిన్‌లో కోటిమంది చూడటంతో ఈ అంశంపై దుమారం రేగింది.
ఈ విషయంపై విచారణ జరిపేందుకు స్థానిక అధికారులు రంగంలోకి దిగారు.
ఈ ఘటన నుంచి నిర్వాహకులు పాఠం నేర్చుకోవాలని, చేసిన మార్పులపై పర్యాటకులకు ముందుగానే తెలపాలని నిర్వాహకులను కోరినట్టు ప్రభుత్వ ప్రసార మాధ్యమం సీసీటీవీ తెలిపింది.


ఫొటో సోర్స్, Douyin
‘ నా స్నేహితుల కోసమే’
తరువాత జలపాతమే మాట్లాడుతున్నట్టుగా నిర్వాహకులు ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ ప్రతిఒక్కరిని ఇలాంటి పరిస్థితులలో కలుసుకుంటానని ఊహించలేదు. మీరు వచ్చిన ప్రతిసారీ నేను ఒకేలాగా ఉంటానని హామీ ఇవ్వలేను’’ అని తెలిపింది.
‘‘వేసవిలో నేనో చిన్న మార్పు చేసుకున్నాను. దాని వల్ల నా స్నేహితులకు చక్కగా కనిపించగలుగుతాను’’ అని జలపాతం చెబుతున్నట్టుగా పోస్టు పెట్టారు.
సెంట్రల్ హెవాన్ ప్రావిన్స్‌లోని ఈ 312 మీటర్ల యోంటాయ్ జలపాతం యునెస్కో గ్లోబల్ జియోపార్క్ అయిన యుంటాయ్ మౌంటెన్ జియోపార్క్ లోపల ఉంది.
వేలాది సంవత్సరాల కిందట సహజసిద్ధంగా ఏర్పడిన భౌగోళిక వింతలను చూసేందుకు ఏటా లక్షలాదిమంది సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు.
పైపుల సహాయంతో తాము పంపేది ఊట నీరని పార్కు అధికారులు సీసీటీవీకి చెప్పారు.
ఇది సహజత్వాన్ని ఏ మాత్రం దెబ్బతీయదని తెలిపారు.
చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగానే కనిపించారు.
‘‘యుంటాయ్ పార్క్: ఈ వ్యక్తికి చేయడానికి వేరే మంచి పనులే లేవా’’? అంటూ ఫార్సివోవ్‌ను ఉద్దేశించి ఒకరు చేసిన వ్యాఖ్యను దాదాపు 40,000మంది డౌయిన్‌లో చదివారు.
‘‘ ఇది మంచి పనే అనుకుంటాను. లేకపోతే అక్కడికి వెళ్లిన వారికి చూడటానికి ఏమీ లేక నిరుత్సాహపడతారు’’ అని ఓ యూజర్ వీబోలో చెప్పారు.
అయితే ఈ విషయంపై కేవలం సమర్థింపులే కాదు, విమర్శలూ వచ్చాయి.
‘‘ఇది ప్రకృతి ధర్మాన్ని అగౌరవపరచడమే కాదు, పర్యాటకులను కూడా అవమానపరచడం’’ అని వీబోలో ఓ యూజర్ రాశారు.
‘‘ దానిని నెంబర్ 1 జలపాతమని ఇకపై ఎలా పిలవగలం’’ అని మరో యూజర్ డౌయిన్‌లో రాశారు.
చైనాలో ప్రసిద్ధ జలపాతాల వద్ద ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.
నైరుతి గుయిజౌ ప్రావిన్స్ లోని హువాంగ్‌గౌషో జలపాతం వేసవిలో ఎండిపోకుండా 2006 నుంచి సమీంపంలోని ఓ డ్యామ్ నీటిని జలపాతానికి మళ్లిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరమైందా, జగన్ ఎక్కడ కూర్చుంటారు?
- ఆంధ్రప్రదేశ్: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?
- తెలుగుదేశం పార్టీ విజయానికి దారులు వేసిన 5 పరిణామాలివే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేల జాబితా..
- దిల్లీ: చంద్రబాబు, నితీశ్‌లపై కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














