WHO: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, వ్యాధుల నిర్మూలనలో దాని పాత్ర ఏంటి, విమర్శలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్య సంక్షోభం ఏర్పడినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా దేశాలు, ఆరోగ్య నిపుణులు, సాధారణ ప్రజలు చూసేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) వైపే.
అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం, "ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవితం.’’ అందించడానికి కృషి చేయడం తమ లక్ష్యమని డబ్యూహెచ్‌ఓ చెబుతుంది.
1948లో స్థాపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంది.
ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో భాగమైన డబ్యూహెచ్‌ఓకు, ప్రపంచ ప్రజల ఆరోగ్యం, బాగోగులను చూడటం లక్ష్యం.
వ్యాధుల నిర్మూలనలో డబ్యూహెచ్‌ఓ పని చేస్తుంది.


ఫొటో సోర్స్, Getty Images
డబ్యూహెచ్‌ఓకి నేతృత్వం వహిస్తున్న టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్
డబ్యూహెచ్‌ఓలో 194 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ సంస్థ టీకా ప్రోగ్రామ్‌లతోపాటు అనేక హెల్త్ ప్రాజెక్టులలో పాల్గొంటుంది.
అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయం చేస్తుంది. వారి ఆరోగ్య సంరక్షణ అంశాలలో వివిధ దేశాలకు సహకారం అందిస్తుంది.
ఆహార భద్రత, ఔషధ ప్రయోగాలకు సంబంధించిన విధానాలు, చికిత్సల ధ్రువీకరణ మొదలైన వాటిపై మార్గదర్శకాలను రూపొందించడంలోనూ కృషి చేస్తుంది.
ఇది తనకు కావాల్సిన నిధులను, విరాళాలను సభ్య దేశాల నుంచి సేకరించుకుంటుంది.
గత సంవత్సరం దీని బడ్జెట్ సుమారు 56 వేల కోట్ల రూపాయలు.
2017 నుంచి దీనికి ఇథియోపియా మాజీ అగ్ర దౌత్యవేత్త, ఆరోగ్య శాఖ మంత్రి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ నేతృత్వం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యవసర స్పందన
గాజా వంటి కల్లోలిత ప్రాంతాలలోని ప్రజలకు డబ్యూహెచ్‌ఓ సహకారం అందిస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు, మహమ్మారి వంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితులను అధిగమించడానికి డబ్యూహెచ్‌ఓ జాతీయ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డబ్యూహెచ్‌ఓ, వారి సొంత దేశంలోని ప్రజలకు శిక్షణ ఇచ్చి నర్సులు, ఆరోగ్య కార్యకర్తలను తయారు చేస్తుంది.
ఇది ప్రజా విధానాలను తెలియజేసే, ప్రభావితం చేసే ప్రధాన వ్యాధులకు సంబంధించిన డేటాను, ఫ్యాక్ట్ షీట్‌లను ప్రచురిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
టీకా కార్యక్రమాలు
మశూచి నిర్మూలన డబ్యూహెచ్‌ఓ సాధించిన అతిపెద్ద విజయగాథ.
డబ్యూహెచ్‌ఓ కార్యక్రమాలలో అంటువ్యాధులు, అంటువ్యాధులుకానివి, మానసిక ఆరోగ్య పరిస్థితులపై నిఘా, నివారణ, రోగ నిర్ధరణ, చికిత్స ఉన్నాయి.
డబ్యూహెచ్‌ఓ అనేక ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు నేతృత్వం వహించడం ద్వారా వ్యాధుల నిర్మూలనకు కృషి చేస్తుంది.
ఉదాహరణకు, 1974లో, డబ్యూహెచ్‌ఓ విస్తృతంగా రోగనిరోధకత కార్యక్రమం (EPI) ప్రారంభించింది. మొదట, ఈ కార్యక్రమం క్రింది ఆరు వ్యాధుల నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అవి:
• డిఫ్తీరియా
• పెర్టుసిస్ (కోరింత దగ్గు)
• ధనుర్వాతం (డీపీటీ)
• పోలియో
• తట్టు
• క్షయవ్యాధి
ఈ కార్యక్రమాన్ని తరువాత ప్రపంచవ్యాప్తంగా 13 సిఫార్సు చేసిన టీకాలకు విస్తరించారు. నిర్దిష్ట పరిస్థితుల కోసం 17 అదనపు వ్యాక్సిన్‌లను సిఫార్సు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాక్ రికార్డ్
ప్రపంచంలో పోలియో వ్యాధిని ఇంకా నిర్మూలించని రెండు దేశాలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్.
మశూచి నిర్మూలన డబ్యూహెచ్‌ఓ అతిపెద్ద విజయాలలో ఒకటి. ఇది ఒక ఘోరమైన వ్యాధి. దీన్ని నిర్మూలించక ముందు కొన్ని కోట్ల మంది మరణాలకు కారణమైంది.
మశూచి నిర్మూలన కోసం 1967లో డబ్యూహెచ్‌ఓ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కింద అనేక సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ రోగ నిరోధక, నిఘా కార్యక్రమాలను చేపట్టారు.
ఒక దశాబ్దానికి పైగా పని చేసిన తర్వాత, డబ్యూహెచ్‌ఓ 1980లో మశూచిని నిర్మూలించినట్లు ప్రకటించింది.
ఇలా నిర్మూలించిన ఏకైక అంటువ్యాధి ఇదే. ఇది "చరిత్రలో అత్యంత గుర్తించదగ్గ ప్రజారోగ్య విజయాలలో ఒకటి" అని డబ్యూహెచ్‌ఓ పేర్కొంది.
అయితే 1955లో ప్రారంభించిన మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని 1969లో నిలిపివేశారు. అప్పటి నుంచి దాని పురోగతి నెమ్మదిగా ఉంది.
తమ సభ్య దేశాల ప్రతినిధులు ఉన్న ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఏటా నిర్వహించే సమావేశాలలోని వివిధ తీర్మానాలు - 1955 నుంచి ఇటీవల 2015 వరకు, ఆ లక్ష్యాన్ని పునరుద్ఘాటించాయని డబ్యూహెచ్‌ఓ తెలిపింది.
2015 నుంచి, డబ్యూహెచ్‌ఓ ద్వారా 12 దేశాలను మలేరియరహితంగా ధృవీకరించారు. డబ్యూహెచ్‌ఓ "గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016–2030" ముఖ్య లక్ష్యం 2030 నాటికి కనీసం 30 దేశాలలో మలేరియాను నిర్మూలించడం.
2021లో, పిల్లలలో మలేరియాను నివారించడానికి డబ్యూహెచ్‌ఓ మొదటి మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేసింది.
2023లో, డబ్యూహెచ్‌ఓ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద, ఆఫ్రికాలోని 12 దేశాలు 2025 నాటికి మొట్టమొదటి 18 మిలియన్ డోసుల మలేరియా వ్యాక్సిన్‌లను అందుకోనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
విమర్శలు
డబ్యూహెచ్‌ఓ డేటా, ఎనాలిసిస్‌లను అందిస్తుంది. కానీ స్వతంత్రంగా చర్య తీసుకునే అధికారం ఆ సంస్థకు లేదు. సభ్య దేశం సహాయం కోరిన తర్వాత మాత్రమే ఇది పని చేస్తుంది.
కోవిడ్ మహమ్మారి నిర్వహణలో డబ్యూహెచ్‌ఓ తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన కొన్ని విమర్శలు అన్యాయమని సంస్థ మద్దతుదారులు అంటున్నారు.
2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి సందర్భంగా పేలవమైన కమ్యూనికేషన్, అసమర్థ సిబ్బందితో డబ్యూహెచ్‌ఓ వేగంగా స్పందించడంలో విఫలమైందని ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి.
2020లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం డబ్యూహెచ్‌ఓ నుంచి బయటకు వస్తుందని హెచ్చరించారు. కోవిడ్ -19 వ్యాప్తిని ఆపడానికి సంస్థ తగినంత కృషి చేయలేదని, ఈ సంస్థ చైనా నియంత్రణలో ఉందని ఆరోపించారు.
డబ్యూహెచ్‌ఓకు అతి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్న దేశం అమెరికా, కాబట్టి ఇది సంస్థకు పెద్ద దెబ్బ.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే జో బిడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన చర్యలను వెనక్కి తీసుకున్నారు. 2021లో అమెరికా రాజకీయ మద్దతు, నిధులపై డబ్యూహెచ్‌ఓకి హామీ ఇచ్చారు.
డబ్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల బృందం మహమ్మారిని నివారించి ఉండగలిగే వాళ్లమని, డబ్యూహెచ్‌ఓ, ప్రపంచ ప్రభుత్వాలు కలిసి చాలా అసమర్థంగా ప్రతిస్పందించాయని నిర్ధరించింది.
ఈ మహమ్మారి చైనాలో వ్యాప్తి చెందుతుండగా, డబ్యూహెచ్‌ఓ అత్యవసర కమిటీ ఒక వారం ముందుగానే అంతర్జాతీయంగా ఎమర్జెన్సీని ప్రకటించి ఉండాల్సిందని ఈ బృందం వాదించింది.
తదుపరి మహమ్మారిని ఎదుర్కోవడానికి మెరుగైన గ్లోబల్ గవర్నెన్స్, డబ్యూహెచ్‌ఓకు మరిన్ని నిధుల అవసరం ఉందని నిపుణుల బృందం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి: కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోయిన కెరటం
- చంద్రబాబు నాయుడు: ‘ప్రజలే నడిపించాలి’
- మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్
- ‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?
- దోషిగా తేలిన డోనల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యకుడు కావొచ్చా? 5 కీలక ప్రశ్నలు- సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














