నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవిపై అంతటా చర్చ.. ఇంతకీ ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?

ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘శ్రీనివాస వర్మకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పడు నేను ఆశ్చర్యపోయాను. ఒక మామూలు వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారు బీజేపీ వాళ్లు. తరువాత ఎంక్వైరీ చేస్తే పార్టీ కోసం పనిచేశారని తెలిసింది. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తను బీజేపీ వారు గుర్తించారు. మనం కూడా అలా చేస్తాం.’’ ఇదీ.. కొత్త కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గురించి ఎమ్మెల్యేల సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు అన్న మాటలు.
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి పదవులు పొందిన వారిలో అందరికంటే ఎక్కువ ఆసక్తికర చర్చ జరుగుతున్నది నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గురించే.
ఆయనకు టికెట్ రావడం మొదలు, ఇప్పుడు మంత్రి పదవి వరకూ అంతా సంచలనమే.
తాజాగా ఆయనకు పదవి రాగానే సోము వీర్రాజును కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇంతకీ శ్రీనివాస రాజుకు పదవి వెనుక ఏం జరిగింది?
మునిసిపల్ కౌన్సిలర్‌గా పని చేసిన నాయకుడు ఏకంగా కేంద్ర మంత్రి ఎలా అయ్యారు?


ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
పార్టీనే ఇంటి పేరుగా..
శ్రీనివాస వర్మ బీజేపీలో ఎంత కాలం పనిచేశారు అంటే, సంవత్సరాలు లెక్కవేయకుండా, మరో పద్ధతిలో చెప్పవచ్చు. ఆ ఊరిలో ఆయన్ను అందరూ బీజేపీ వర్మ అనే పిలుస్తారు. భీమవరంలో బీజేపీ కార్యాలయం కూడా వర్మ సొంత స్థలంలో వర్మ సొంత ఖర్చుతో నిర్మించిన భవనంలోనే ఉంటుంది. తన పార్టీ పేరే తన పేరుగా మారినంత కాలంగా ఆయన ఆ పార్టీలో పనిచేస్తున్నారు.
1990 నుంచి.. అంటే సుమారు 34 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వర్మ, ఆ పార్టీలో జిల్లా, పట్టణ అధ్యక్షుల పదవుల నుంచి రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యవర్గ సభ్యుడి పదవుల వరకూ వెళ్లారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఆయన గెలిచింది కేవలం భీమవరం మునిసిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ గా మాత్రమే. అంతకు మించి ఆయన ఏ పదవులూ చేయలేదు.
2009లో ఒకే ఒక్కసారి నరసాపురం ఎంపీగా (భీమవరం పట్టణం నరసాపురం ఎంపీ పరిధిలోకి వస్తుంది.) పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ ఎంపీగా గెలిచి వెంటనే కేంద్ర మంత్రి అయిపోయారు.
ఈ ఎన్నికల్లో అంటే 2024లో ఆయన నరసాపురం ఎంపీ కానీ ఉండి ఎమ్మెల్యే టికెట్ కానీ కావాలని ప్రయత్నించారు.
కానీ, బీజేపీ నుంచి అదే సీటును అక్కడి వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఆశించారు. ఆర్ఆర్ఆర్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన రఘురామ రాజు మాజీ సీఎం జగన్‌ని వ్యతిరేకించడం, దిల్లీలో బీజేపీ పెద్దలతో చాలా సన్నిహితంగా తిరగడం .. రెండూ అందరికీ తెలిసినవే. దీంతో రఘురామ బీజేపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు.

ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
అనూహ్యంగా రేసులోకి వర్మ
కానీ, తెరవెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బీజేపీ టికెట్ జాబితాలో నరసాపురం స్థానం నుంచి శ్రీనివాస వర్మ పేరు కనిపించింది. దీంతో రఘురామరాజు టీడీపీలో చేరి ఉండి శాసన సభ స్థానం నుంచి పోటీ చేశారు.
ఇక ఏపీలో బీజేపీ 6 సీట్లకు పోటీ చేసింది. కానీ అంత వేవ్ ఉన్నప్పటికీ 3 సీట్లలో ఓడిపోయి, 3 సీట్లలోనే గెలిచింది.
పోటీ చేసిన ఆరుగురిలో వర్మ ఒక్కరే అందరి కంటే ముందు నుంచీ బీజేపీలో ఉన్నది. మిగిలిన ఐదుగురూ 2014 తరువాత పార్టీలో చేరిన వారే.
గెలిచిన ముగ్గురిలో కూడా ఇద్దరు, అంటే సీఎం రమేశ్, పురంధేశ్వరిల కంటే పార్టీలో ముందు నుంచీ ఉన్నది వర్మ.

ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
వర్మకు పదవి రావడానికి కారణంగా అందరూ చెబుతోన్నది, పార్టీ సొంత మనిషి అని మాత్రమే. దాదాపు 34 ఏళ్లు పార్టీలో పనిచేయడం, పదవులు లేకపోయినా పార్టీనే నమ్ముకుని ఉండడం అనే రెండు కారణాలే వర్మను ఆ పార్టీలో ఈ స్థాయికి తెచ్చాయనేది బీజేపీ నాయకులు చెబుతున్నమాట. దానికి ఊతం ఇచ్చేలా వారొక ఉదాహరణ చెబుతున్నారు.
రాజమండ్రిలో కూటమి ప్రచార సభ జరిగినప్పుడు మోదీ, వర్మను పిలిచి మీ సంగతేంటని ప్రశ్నించారనీ, తాను గెలుస్తానని వర్మ చెప్పారనీ, అలా అయితే, ''గెలిచిరా, నీకేం చేయాలో నేను అది చేస్తా'' అని మోదీ వర్మకు మాటిచ్చారనీ భీమవరంలో అంతా మాట్లాడుకుంటున్నారు.
ఇదంతా కూడా వర్మ పార్టీ సేవలకు దక్కిన గుర్తింపుగా వారు చెబుతున్నారు. అటు బీజేపీ నాయకత్వం అంతా కార్యకర్తలకు తామిచ్చే గుర్తింపుగా దీన్ని చూపిస్తున్నారు.
అయితే దీని వెనుక వేరే కథ కూడా ఉండొచ్చని భీమవరంలోనూ, బీజేపీలోనూ చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
వీర్రాజు, గంగరాజు
ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక ఆంధ్రా బీజేపీకి చెందిన ఇద్దరు నాయకులు.. ఒకరు సోము వీర్రాజు, మరొకరు గోకరాజు గంగరాజు ఉండే అవకాశం ఉందన్నది ఆ చర్చ సారాంశం.
అప్పుడు వర్మకు ఎంపీ టికెట్ వచ్చినప్పుడూ, ఇప్పుడు కేంద్ర మంత్రి అయినప్పుడూ ప్రత్యేకంగా వినిపిస్తోన్న పేరు సోము వీర్రాజుది. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. వీర్రాజుకూ వర్మకూ వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది. వారిది మూడు దశాబ్దాల పరిచయం.
నిన్న కేంద్ర మంత్రి పదవి ప్రకటన రాగానే, శ్రీనివాస వర్మ సోము వీర్రాజును హత్తుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు. వీర్రాజు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.
‘‘ఇది ఏపీలో బీజేపీ కార్యకర్తల విజయం. నన్ను మీరు గైడ్ చేయండి’’ అంటూ వీర్రాజుతో అన్నారు శ్రీనివాస వర్మ.
ఈ పదవి దక్కడం వెనుక కారణం ఏంటని బీబీసీ శ్రీనివాస వర్మను అడిగినప్పుడు దానికి సమాధానం చెబుతూ కూడా సోము వీర్రాజు గురించి ప్రస్తావించారాయన. ‘‘ఇది 34 ఏళ్ల కష్టఫలం. రాత్రికి రాత్రి సులువుగా వచ్చింది కాదు. 34 ఏళ్లు పార్టీ కోసం పనిచేశాను. కార్యకర్తలను గుర్తించాలనే పార్టీ నిర్ణయంతో నాకు పదవి వచ్చింది.
1990లో సోము వీర్రాజు బీజేపీ యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ప్రోత్సాహంతో నేనుకూడా బీజేవైఎంలో చేరాను. అప్పటి నుంచి ఒక్కసారి కూడా గ్యాప్ లేకుండా బీజేపీ కోసం పనిచేస్తూనే ఉన్నాను’’ అని బీబీసీతో చెప్పారు వర్మ.

ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
దిల్లీతో సంబంధాలు
సోము వీర్రాజు, గోకరాజు రంగరాజు – ఈ ఇద్దరికీ దిల్లీ స్థాయిలో సంఘ్ పరివార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరే శ్రీనివాస వర్మ పదవి కోసం బాగా లాబీ చేసి ఉంటారని కొందరు బీజేపీ నాయకుల మాట.
‘‘రఘురామ రాజు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా మారినప్పుడే, గోకరాజు గంగరాజు బంధువులు కొందరు వైయస్సార్సీపీకి దగ్గరయ్యారు. ఒక దశలో రఘురామకు బీజేపీ టికెట్ వస్తే ఆయనపై వైఎస్సార్సీపీ తరఫున గోకరాజు గంగరాజు మనుషులు లేదా స్వయంగా గంగరాజు కుమారుడు పోటీలో ఉంటారనే ప్రచారం పశ్చిమ గోదావరిలో జరిగింది. మరోవైపు రఘురామకు టికెట్ రాకుండా సోము వీర్రాజు ప్రయత్నం చేశారనే వాదన కూడా అప్పట్లో నడిచింది.
అదే సమయంలో శ్రీనివాస వర్మ అటు వీర్రాజుతో పాటు ఇటు గంగరాజుకు కూడా సన్నిహితులు. కాబట్టి ఆయన పదవి వెనుక వీరి పాత్ర ఉందనే ప్రచారం బలంగా వచ్చి ఉంటుంది’’ అని బీబీసీతో చెప్పారు పశ్చిమ గోదావరికి చెందిన బీజేపీ నాయకులు ఒకరు.
అయితే, ఈ వాదనతో విభేధిస్తున్నారు మరికొందరు నాయకులు.
‘‘వర్మ బీజేపీ కోసం పడ్డ కష్టం చాలా మందికి తెలియదు. ఆయన 12 ఏళ్ల పాటు వరుసగా ప.గో జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి, ఎవరి దగ్గరా చందాలు తీసుకోకుండా పార్టీని నడిపించారు. ఈ ఎన్నికల ముందు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల బీజేపీ కార్యాలయాలూ ఆన్లైన్లో భీమవరం నుంచే ప్రారంభించారు. భీమవరం పార్టీ కార్యాలయం కూడా వర్మ సొంత ఆస్తే. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎగ్జిగ్యూటివ్ మీటింగులు ఐదుసార్లు భీమవరంలో జరిగాయి. అవన్నీ వర్మ చేతుల మీదుగానే జరిగాయి. ఖర్చుతో సహా.
ఆ రకంగా వర్మ పార్టీకి చేసిన సేవలను ఇన్నాళ్లకు పార్టీ గుర్తించింది. అందువల్ల వచ్చిన పదవిని ఎవరికో ఆపాదించకూడదు. ఒక కార్యకర్త కష్టాన్ని పార్టీ గుర్తించిందని గమనించాలి’’ అని బీబీసీతో అన్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో బీజేపీ నాయకులు.
‘‘వీర్రాజుతో వర్మకు సాన్నిహిత్యం ఉన్నది వాస్తవమే. సోము వీర్రాజు రాజమండ్రి కేంద్రంగా, 20 ఏళ్లుగా బీజేపీలో చురుగ్గా ఉన్నారు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని బీజేపీ వారందరి గురించీ ఆయనకు అవగాహనా, పరిచయం, వాళ్ల పరిస్థితులు వీర్రాజుకు తెలుసు. అంతే’’ అని ఆ నాయకుడు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Srinivasa Varma Bhupathiraju-Bjp Varma/facebook
వివాదరహితుడిగా పేరు..
1999లో కృష్ణం రాజు, 2014లో గోకరాజు గంగరాజు నరసాపురం ఎంపీలుగా చేసినప్పుడు వారి కోసం వర్మ పనిచేశారు. అందునా ప్రత్యేకంగా గోకరాజు గంగరాజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తరఫున నియోజకవర్గ వ్యవహారాలు వర్మే చక్కబెట్టారు. పైగా ఆయనకు ఎవరితోనూ ఎప్పుడూ వివాదాలు లేవు. పార్టీ కోసం కష్టపడ్డాడు. ఖర్చు పెట్టాడు. అదీ కూడా వర్మకు కలసి వచ్చింది అని చెబుతారు.
నిజానికి ఈసారి నరసాపురం బీజేపీ ఎంపీ టికెట్ కోసం సినీ నటులు కృష్ణంరాజుకు మేనల్లుడు అయ్యే నరేంద్ర కూడా ప్రయత్నించారనే ప్రచారం కూడా ఉంది. అయితే, బీజేపీ మాత్రం వర్మవైపే మొగ్గు చూపింది. అటు వర్మకూడా నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు ఆర్థికంగా బాగా సహకరించారు.
శ్రీనివాస వర్మ రెండు ఎంఏలు, లా చదువుకున్నారు. రొయ్యల చెరువుల సాగుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.
ఇవి కూాడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- మొదటిసారి పోటీ చేసి, గెలిచి, కేంద్ర మంత్రి పదవి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
- పవన్ కళ్యాణ్ జీతం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














