నలుగురి కోసం 274 మందిని చంపేశారు, ఇజ్రాయెల్ బందీల రక్షణపై గాజా ఆరోగ్యశాఖ ఆరోపణ

ఇజ్రాయెల్, హమాస్, గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నుసేయిరత్‌లో ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌లో సామాన్య పౌరుల మృతితో ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం
    • రచయిత, థామస్ మెకింతోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నలుగురు బందీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ సైన్యం నుసేరత్ శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో 274 మంది చనిపోయినట్లు గాజాలో హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

చనిపోయిన వారిలో పిల్లలతో పాటు సాధారణ పౌరులు ఉన్నారని తెలిపింది.

నుసేరత్ శరణార్థి శిబిరంలో ఉన్న బందీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మీద వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి.

బందీలుగా ఉన్న ఈ నలుగురిని 2023 అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు కిడ్నాప్ చేశారు. తాజా ఆపరేషన్‌తో ఈ నలుగుర్నీ ఇజ్రాయెల్ సైన్యం విడిపించింది.

విడిపించే ప్రయత్నంలో 100కంటే తక్కువ మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ సైన్యం అంచనా వేస్తోంది.

అయితే గాజాలోని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా చెబుతున్న లెక్కలే నిజమైతే ఈ ఆపరేషన్‌ ఇప్పటి వరకు జరిగిన వాటిలో అతి పెద్దదిగా భావించవచ్చు.

జనసాంద్రత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇక్కడ జరిగిన బాంబుదాడులు, తుపాకీ కాల్పుల బీభత్సం గురించి వివరించారు.

తాను మార్కెట్‌లో కూరగాయలు కొంటున్న సమయంలో ఫైటర్ జెట్లు దాడులు చేశాయని, ఆ తర్వాత తుపాకుల మోత ప్రారంభమైందని అబ్దెల్ సలామ్ డార్విష్ అనే వ్యక్తి బీబీసీతో చెప్పారు.

“తర్వాత చూస్తే ఏముంది ప్రజల శరీరాలు ముక్కలై వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానెల్
ఇజ్రాయెల్ తుపాకి కాల్పులు, బాంబు దాడులు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ బాంబు దాడిలో ధ్వంసమైన ప్రాంతం

ఇజ్రాయెల్ చేరుకున్న బందీలు తమవారిని కలుసుకోవడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. బందీలను విడిపించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాధినేతలు స్వాగతించారు.

అయితే, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ల వల్ల సాధారణ పౌరులు చనిపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల చీఫ్ జోసెఫ్ బోరెల్ తాను ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

“ పౌరుల ఊచకోత గురించి గాజా నుంచి వస్తున్న నివేదికలు భయంకరంగా ఉన్నాయి” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘‘హమాస్ బందీలను జనం మధ్య దాచి పెట్టడాన్ని ఖండించాల్సిందిపోయి ఇజ్రాయెల్ తన పౌరులను కాపాడుకోవడాన్ని యూరోపియన్ యూనియన్ విమర్శిస్తోంది’’ అని ఇజ్రాయెల్ మంత్రి ఒకరు అన్నారు.

నుసీరత్ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల దృశ్యాల్లో బాంబుదాడులు చాలా తీవ్రంగా జరిగినట్లు, మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

గాజాలోని అల్ అక్సా, అల్ అవద్ ఆసుపత్రులు, తమ వద్దకు వచ్చిన వాటిలో ఈ దాడులకు సంబంధించి 70 మృతదేహాలు ఉన్నట్లు చెప్పాయి.

హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ 274 మందిలో 80 మంది పేర్లను విడుదల చేసింది.

రెండు గంటల ఆపరేషన్‌లో వారందరినీ చంపేశారని పాలస్తీనీయులు చెప్పారు.

నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో జరిపిన ఈ హై రిస్క్ కాంప్లెక్స్ మిషన్‌లో వందమంది కంటే తక్కువే చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు.

తీవ్రస్థాయిలో జరుగుతున్న ఎదురు కాల్పుల మధ్య ప్రత్యేక బలగాలు ఆపరేషన్ నిర్వహించి బందీలను కాపాడాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో గాయపడిన ఓ సైన్యాధికారి ఆసుపత్రిలో చనిపోయారు.

ఇజ్రాయెల్, గాజా, హమాస్, బందీలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శిధిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉండవచ్చంటున్న బాధితులు

దాడి తర్వాత గాజాలో తీసిన వీడియోలు మారణ హోమం జరిగినట్లు చూపిస్తున్నాయి.

అల్ అక్సా ఆసుపత్రిలో అనేకమంది ప్రజలు తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్న దృశ్యాలు ఉన్నాయి. గాడపడిన వారంతా పడి ఉండటంతో నేలంతా రక్తంతో ఎర్రగా మారింది. డాక్టర్లు వారి మధ్య నుంచి నడిచే పరిస్థితి కూడా లేదు.

కొన్ని వీడియోలలో కార్లు, అంబులెన్సుల్లో గాయపడిన వారిని ఒక ప్రవాహం మాదిరిగా ఆసుపత్రికి తీసుకువస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

నుసీరత్‌లోని అల్ అవ్డా ఆసుపత్రికి శనివారం రోజంతా చనిపోయిన వారి మృతదేహాలు వస్తూనే ఉన్నాయని ఆసుపత్రి డైరెక్టర్ బీబీసీకి చెప్పారు.

ఆసుపత్రికి తీసుకువస్తున్న మృతదేహాలను భద్రపరిచేందుకు ఆసుపత్రిలో మార్చురీ కూడా లేదని డాక్టర్ మార్వాన్ అబు నస్సీర్ చెప్పారు.

ఇజ్రాయెల్ గాజా హమాస్

ఫొటో సోర్స్, reuters

ఫొటో క్యాప్షన్, గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకు వస్తున్న బంధువులు

అక్టోబర్‌లో గాజా మీద ఇజ్రాయెల్ దాడి మొదలైన తర్వాత తన కుటుంబంలో 40 మందిని కోల్పోయానని, ఈ దాడిలో తన ఇల్లు ధ్వంసమైనందని ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

“పిల్లలు, మహిళలు ఇంట్లోకి రాగానే బాంబు దాడులు జరిగాయి. ఇంట్లో ఉన్న వాళ్లందరి ప్రాణాలు పోయాయి” అని చెప్పారు.

“ఈ ఇంట్లో దాదాపు 30 మంది ఉండేవారు. తర్వాత ఆ సంఖ్య 50కి పెరిగింది. ఆ ఇంటి మీద బాంబు వేశారు. నేను, మా నాన్న, మా ఆవిడ, మరో యువకుడు మాత్రమే ప్రాణాలతో మిగిలాం. 50 మందిలో బతికి బయటపడింది మేమే.” అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఈ రక్తపాతాన్ని చూసి గాజాలో ప్రజలు హమాస్‌పై విమర్శలు చేస్తున్నారు

“ఒక ఇజ్రాయెల్ బందీకి సమానంగా 80 మంది పాలస్తీనీయుల్ని ఎలాంటి రక్తపాతం లేకుండా విడిపించారు. వందమందిని కోల్పోవడం కంటే అదే మంచిది.” అని 37 ఏళ్ల హస్సన్ ఒమర్ అన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో అమాయాకులే ప్రాణాలు కోల్పోయారని ఆయన బీబీసీతో చెప్పారు.

“నష్టాన్ని ఆపడం లాభంలో భాగం, ఖతార్ హోటళ్ల నుంచి మనల్ని నియంత్రించే వారి నుంచి మనం బయట పడాలి, హమాస్‌కు ఇదే నా సందేశం.” అని ఆయన అన్నారు.

కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందంపై ఇజ్రాయెల్- హమాస్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల బందీలను రక్షించింది.

యుద్ధం విషయంలో ఒక ఒప్పందానికి రావాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు అన్నారు. అయితే బందీలను విడిపించేందుకు సైనిక చర్య మాత్రమే మార్గమని అతివాద మిత్ర పక్షాలు చెబుతున్నాయి. ఆయన ప్రతిపాదనలను వారు వ్యతిరేకిస్తున్నారు.

ఈ యుద్ధంలో శనివారం నాటి ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ సైనికులు బందీలను విడిపించడం విజయవంతంగా ముగిసింది. ఇది ప్రధానమంత్రి నెతన్యాహు పై అంచనాలను మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

అయితే పాలస్తీనీయుల భద్రతకు హామీ లభించనంత వరకు కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రూప్ అంగీకరించదని హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియా చెప్పారు. చెప్పారు.

హమాస్ తీసుకెళ్లిన ఇజ్రాయెలీ బందీలలో ఇంకా 116 మంది పాలస్తీనా ప్రాంతంలో ఉన్నారు.

నవంబర్‌లో వారం రోజుల కాల్పుల విరమణతో పాటు 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసినందుకు హమాస్ 105 మంది బందీలను విడుదల చేసింది.

యుద్దం మొదలైన తర్వాత ఇప్పటి వరకు గాజాలో 37,084 మంది చనిపోయారని శనివారం హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)