కనిపించకుండా పోయిన క్రిప్టో కరెన్సీ క్వీన్‌ ఆ 37 వేల కోట్ల రూపాయలను ఏం చేశారు? ఆమె ఎక్కడున్నారు?

రుజా ఇగ్నటోవా, క్రిప్టో కరెన్సీ, బల్గేరియా

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, 2017 అక్టోబర్ తర్వాత కనిపించకుండా పోయిన రుజా ఇగ్నటోవా
    • రచయిత, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్, పనోరమ టీం, ద మిస్సింగ్ క్రిప్టో‌క్వీన్ పాడ్‌కాస్ట్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్, బీబీసీ న్యూస్

క్రిప్టో క్వీన్‌గా పేరు పొందిన రుజా ఇగ్నటోవా గురించి 2019 సెప్టెంబర్‌లో బీబీసీ పాడ్‌కాస్ట్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో ఉన్న ఈ బల్గేరియన్ మహిళ అదృశ్యం కావడానికి ముందు నకిలీ క్రిప్టో కరెన్సీతో ఇన్వెస్టర్లను దాదాపు 37 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న విచారణతో ఆమె భవిష్యత్ ఎలా మారుతుందో తెలుసుకునే పనిలో ఉన్నాం. బల్గేరియాలో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యానికి నాయకుడిగా ఉన్న వ్యక్తితో ఆమెకున్న సంబంధాలపై సందేహాలు, ఆమెను కిరాతకంగా హత్య చేశారనే ఆరోపణల మీద బీబీసీ ‘ఐ’ ఇన్వెస్టిగేషన్, పనోరమ బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇగ్నటోవా నిజంగానే తాను దోచుకున్న వేల కోట్ల రూపాయలతో ఎంజాయ్ చేశారా? లేక తనను రక్షించేందుకు తన దగ్గర డబ్బులు తీసుకున్నవాళ్లే ఆమెను చంపేశారా?

బల్గేరియాలో పుట్టి జర్మనీలో పెరిగిన రుజా ఇగ్నటోవా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2014లో క్రిప్టో కరెన్సీ వన్ కాయిన్ ప్రారంభించక ముందు ఆమె ఆర్థిక వ్యవహారాలను కెరీర్‌గా ఎంచుకున్నారు.

వన్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆమె ఒప్పించారు. తొలినాళ్లలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి ఎలా లాభాలు వచ్చాయో, ఇందులోనూ లాభాలు వస్తాయని ఆమె నమ్మించారు.

కానీ, ఆ తర్వాత తెలివిగా పెట్టుబడిదారుల్ని మోసగించారు ఇగ్నటోవా.

2017 అక్టోబర్‌లో ఆమె మోసాలపై దర్యాప్తు చేసేందుకు జర్మనీ, అమెరికా దేశాల అధికారులు రంగంలోకి దిగారు. దీంతో ఆమె ఓ రోజు ఉదయం రియాన్ ఎయిర్ విమానంలో సోఫియా నుంచి ఏథెన్స్ వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆమె ఎన్నడూ కనిపించలేదు.

గతేడాది నుంచి, బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘ఐ’కి చెందిన ఇన్వెస్టిగేషన్ టీమ్, పనోరమ ఆమెకు ఏం జరిగింది? ఇంతకూ ఆమె బతికే ఉన్నారా లేరా? అనే దానిపై పరిశోధిస్తోంది.

ఇది తెలుసుకోవాలంటే ఆమెకు సన్నిహితులు ఎవరో తెలియాలి.

ఎఫ్‌బీఐతో పాటు అమెరికన్ రెవెన్యూ సర్వీస్ కోసం వన్ కాయిన్‌పై దర్యాప్తు ప్రారంభించిన రిచర్డ్ రీన్‌హార్ట్, మునుపెన్నడూ బహిరంగంగా పేర్లు వెల్లడించని కీలక వ్యక్తుల గురించి బీబీసీకి చెప్పారు.

వాట్సాప్ చానల్

ద మిస్సింగ్ క్రిప్టో క్వీన్

రుజా ఇగ్నటోవా గురించి కనుక్కునేందుకు చేసిన పరిశోధన అనూహ్య మలుపులు తిరిగి, ఆమె చనిపోయారనే కొత్త కథ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమె చనిపోలేదని, ఆమెను తాము చూశామని కొందరు చెబుతున్నారు.

రుజా ఇగ్నటోవాను కాపాడే బాధ్యతను హ్రిస్టొఫొరోస్ నికోస్ అమనాటైడిస్‌కు ఇచ్చినట్లు బీబీసీకి తెలిసింది. ఈయనను అందరూ టాకీ అని పిలుస్తారు.

“ఆమెను రక్షించే బాధ్యత ఒక పెద్ద మాఫియా డాన్‌కు ఇచ్చారని మాకు చెప్పారు” అని 2023లో రిటైరైన తర్వాత బీబీసీకి ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో రీన్‌హార్ట్ చెప్పారు.

“టాకీ పేరు ఒకసారి కాదు, చాలాసార్లు వచ్చింది. పదే పదే వస్తూనే ఉంది” అని ఆయన అన్నారు.

ఇది మా దగ్గర ఉన్న సమాచారాన్ని దృవీకరించింది. బల్గేరియాకు చెందిన ఒక పెద్ద నేరస్థుడు ఇగ్నటోవా భద్రతను పర్యవేక్షిస్తున్నారని 2019లో అమెరికన్ లాయర్లు కోర్టులో చెప్పారు. అయితే ఆ నేరస్థుడి పేరును వారు వెల్లడించలేదు.

“బల్గేరియాలో విజయవంతమైన మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుడిగా గుర్తింపు పొందిన వ్యక్తికి వన్‌ కాయిన్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆయన రుజా ఇగ్నటోవా వ్యక్తిగత రక్షకుడిగా పని చేశారు” అని అసిస్టెంట్ అటార్నీ కోర్టుకు చెప్పారు.

అమెరికా, బల్గేరియా, గ్రీస్
ఫొటో క్యాప్షన్, వన్ కాయిన్‌పై కేసు దర్యాప్తు చేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి రిచర్డ్ రీన్‌హార్ట్

“అయితే ఈ “హెడ్ సెక్యూరిటీనే” ఆమె “కనిపించకుండా పోవడంలో కీలకంగా ఉన్నారని” అంతకు ముందు అమెరికా ప్రభుత్వ లాయర్ కోర్టులో చెప్పారు.

ఇగ్నటోవా చాలా మంది అనుకునే దాని కంటే అధునాతన, తెలివైన నేరస్థురాలని రీన్‌హార్ట్ అన్నారు.

“ఇది ఎలాంటిదంటే ఒక వైట్ కాలర్ క్రిమినల్ మరో డ్రగ్ ట్రాఫికర్ లేదా స్టెరాయిడ్లు తీసుకునే మాఫియా డాన్‌తో కలవడం లాంటిది.”

యూరోపోల్‌ ద్వారా లీకైన డాక్యుమెంట్లు ఈ థియరీని బలపరుస్తున్నాయి. ఈ పత్రాలను బీబీసీ చూసింది. ఇందులో 2017లో ఇగ్నటోవా అదృశ్యం కావడానికి ముందు ఆమెకు టాకీతో సంబంధాలు ఉన్నట్లు బల్గేరియన్ పోలీసులు ధృవీకరించినట్లు ఈ పత్రాలలో ఉంది.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్మును వేరే మార్గాల్లోకి మళ్లించడానికి టాకీ వన్‌ కాయిన్‌ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నట్లు ఈ పత్రాలు స్పష్టం చేశాయి.

డ్రగ్ మాఫియా డాన్లు ఎల్ చాపో, పాబ్లో ఎస్కోబార్ మాదిరిగా బల్గేరియాలో టాకీ కూడా ఎక్కడా బయటకు కనిపించరు.

బల్గేరియాలో పెద్ద నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సహచరుల మీద దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్య లాంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి దర్యాప్తు జరిగింది. అయితే ఇందులో ఏ నేరానికి సంబంధించి కూడా ఆయనపై విచారణ జరగలేదు.

ఇంటర్ పోల్, ఎఫ్‌బీఐ, అమెరికా

ఫొటో సోర్స్, Interpol

ఫొటో క్యాప్షన్, టాకీకి రెడ్‌ నోటీస్ జారీ చేసిన ఇంటర్ పోల్

“మేము టాకీ గురించి మాట్లాడేటప్పుడు ఆయన బల్గేరియాలో మాఫియా అధిపతిగా ఉన్నారు. తను చాలా శక్తివంతుడు” అని బల్గేరియన్ మాజీ మంత్రి ఇవాన్ హ్రిస్టనోవ్ చెప్పారు. అవినీతిపరులైన అధికారులతో కలిసి టాకీ నేరస్తుల నెట్‌వర్క్‌ను నడుపుతున్నారన్న ఆరోపణలపై ఆయన 2022లో విచారణ జరిపారు.

“టాకీ ఒక దెయ్యం. అతన్ని మీరు చూడలేరు. అతని గురించి కేవలం వినాల్సి ఉంటుందంతే. ఇతరుల ద్వారానే అతను మీతో మాట్లాడతారు. మీరు వినకపోతే ఈ భూమి మీద మిగలరు. విదేశీ దర్యాప్తు సంస్థలతో సహా ఇతర విచారణల నుంచి ఆమెను రక్షించగల ఒకే ఒక వ్యక్తి టాకీ మాత్రమే” అని ఆయన చెప్పారు.

అవినీతిపరులైన అధికారులపై వచ్చిన ఆరోపణల గురించి బీబీసీ బల్గేరియా ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం స్పందించలేదు. “నేరాలను, నేరాలకు పాల్పడి ఉంటారని భావిస్తున్న వ్యక్తులను ఒక్కటిగా చెయ్యకండి” అని బల్గేరియా రాజధాని సోఫియాలోని ప్రాసిక్యూటర్ ఆఫీస్ సమాధానం ఇచ్చింది.

టాకీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నట్లు భావిస్తున్నారు. ఇగ్నటోవా దుబాయ్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. వన్ కాయిన్ ద్వారా ఆర్జించిన వేల కోట్ల రూపాయల అక్రమ సంపదనంతా దుబాయ్‌లోని ఆమె బ్యాంక్ అకౌంట్లకు తరలించినట్లు భావిస్తున్నారు.

టాకీ, ఇగ్నటోవా ఎలా కలిశారు? అతను మొదటి నుంచి వన్ కాయిన్‌తోనే ఉన్నారా అనేది తెలియలేదు. వాళ్లిద్దరి మధ్య వ్యక్తిగత సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె కుమార్తెకు అతనే గాడ్ ఫాదర్ అని తెలిసింది.

ఇగ్నటోవా తనను కాపాడేందుకు టాకీకి నెలకు 90 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని ఆమెకు సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు బీబీసీకి చెప్పారు.

వాళ్లిద్దరి మధ్య ఇతర ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

బల్గేరియాలోని నల్ల సముద్రం తీరంలో ఒక ప్లాట్‌ను అమ్మేందుకు క్లిష్టమైన ఒప్పందం జరిగింది. ఇది ఇగ్నటోవా కంపెనీలలో ఒక కంపెనీకి టాకీ భార్యకు సంబంధం ఉన్నట్లు యూరోపోల్ పత్రాలు ప్రస్తావించాయి.

పోలీసుల రహస్య పత్రాలను ఫ్రాంక్ షిండర్ బీబీసీకి అందించారు. ఆయన మాజీ గూఢచారి, ఇగ్నటోవాకు సలహాదారు.

తన మాజీ బాస్ “నేరగాళ్లు” “గ్యాంగ్‌స్టర్ల”తో కలిసి పనిచేశారని ఆయన చెప్పారు.

అమెరికా, బల్గేరియా, గ్రీస్
ఫొటో క్యాప్షన్, బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని నెలల తర్వాత అదృశ్యమైన ఫ్రాంక్ షిండర్

ఫ్రాన్స్‌లోని ఆయన నివాసంలో షిండర్‌ను మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆయన హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. వన్ కాయిన్ స్కామ్‌లో ఆయనను అమెరికాకు తరలించాల్సి ఉంది. మొదట తిరస్కరించినా చివరకు పేర్లు చెప్పేందుకు అంగీకరించారు.

“ఎవరనేది మీకు నేను చెప్పలేను. ఎందుకంటే నాకు కుటుంబం ఉంది. ఇది నిజంగానే వ్యవస్థీకృత నేరం”

అయితే చివర్లో ఇగ్నటోవా రక్షకుడికి కోపం వచ్చి ఉండవచ్చని అన్నారు.

2022లో బల్గేరియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు దిమితర్ స్టోయనోవ్, ఇన్వెస్టిగేటివ్ వార్తా సంస్థ బర్డ్. బీజీ న్యూస్‌లో పని చేస్తునన అతని సహచరుడికి ఓ పోలీస్ రిపోర్ట్ అందింది. ఓ బల్గేరియన్ పోలీస్ ఆఫీసర్‌ను అతని ఇంట్లోనే చంపేశారనేది ఆ రిపోర్ట్ సారాంశం.

ఆ డాక్యుమెంట్‌లో, 2018లో టాకీ ఆదేశాల మేరకే ఇగ్నటోవాను చంపేశామని టాకీ బావమరిది తాగి మాట్లాడిన మాటలు ఓ పోలీస్ ఇన్‌ఫార్మర్ విన్నట్లుగా ఉంది. చంపేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ పడవలో తీసుకెళ్లి ఇయోనియన్ సముద్రంలో విసిరేశామని అతను చెప్పాడు. ‘ఇది జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి’ అని స్టోయనోవ్ చెప్పారు.

పోలీస్ డాక్యుమెంట్ ప్రామాణికతను బల్గేరియన్ అధికారులు ధృవీకరించారు. టాకీ హత్య చేయించి ఉండవచ్చని అతని అనుచరులు చాలా మంది నమ్ముతున్నారని స్టోయనోవ్ చెప్పారు.

అయితే ఈ అంశాలను బీబీసీ దీనిని ధృవీకరించలేకపోయింది.

ఇగ్నటోవా మోస్ట్‌వాంటెండ్ జాబితాలో ఉండటం టాకీకి తలనొప్పిగా మారింది. టాకీ వన్‌కాయిన్ మోసాలతో తనకున్న సంబంధాన్ని తుడిచివేయాలని భావించాడు. అందుకే ఆమెను చంపి ఉండవచ్చని టాకీ సహచరులు భావించి ఉండవచ్చు.

అలా భావిస్తున్న టాకీ సహచరుల్లో కురోగా పిలిచే క్రసిమిర్ కమెనోవ్ ఉన్నారు. ఆయన హత్య అభియోగాల కింద ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు.

ఇగ్నటోవా ఎదుట టాకీ తన నేర వ్యాపారాల గురించి మాట్లాడినట్లు కురో తనతో చెప్పాడని స్టోయనోవ్ చెప్పారు. ఆమె వల్ల ముప్పు ఉంటుందని కురో టాకీని ప్రశ్నించినప్పుడు “ ఆందోళన వద్దు, ఆమె శవంతో సమానం” అని టాకీ సమాధానం ఇచ్చినట్లు స్టోయనోవ్ తెలిపారు.

ఇతర అంశాలతో పాటు ఇగ్నటోవాను హత్య చేయాలని టాకీ ఆదేశించాడన్న ఆరోపణ గురించి తాను సీఐఏతో చెప్పినట్లు కురో చెప్పారు. 2022లో కురో సీఐఏని కలిశాడనే విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు.

2023 మేలో కేప్‌టౌన్‌లో కురో ఇంట్లోనే ఆయననను హత్య చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన కోసం పని చేసే మరో ఇద్దర్ని కూడా చంపేశారు. ఈ హత్యలు చేసిన వారి కోసం దక్షిణాఫ్రికా పోలీసులు ఇప్పటికీ వెతుకుతున్నారు. అయితే కురో హత్యతో టాకీకి సంబంధం ఉన్నట్లు బల్గేరియా మాజీ మంత్రి హ్రిస్టనోవ్ నమ్ముతున్నారు.

“కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులను చంపేస్తారు ఎందుకంటే వారికి టాకీ గురించి ఎక్కువగా తెలుసు. ఇది మరణశిక్షను బహిరంగంగా అమలు చేయడం లాంటిది అంతే కాదు మీరు డీల్ చేస్తున్న వ్యక్తితో జాగ్రత్త అనే ప్రకనట కూడా ” అని ఆయన అన్నారు.

ఇగ్నటోవా హత్య గురించి వార్తలు ప్రచురించడం మొదలైన తర్వాత తనకు, తన సహచరుడిని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని దిమితర్ స్టోయనోవ్ చెప్పారు. దీంతో తన కెరీర్‌లో నాలుగోసారి బలవంతంగా బల్గేరియాను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

ఇగ్నటోవా హత్యకు కారణం ఏమై ఉండవచ్చనే విషయం తనకు తెలియదని స్టోయనోవ్ చెప్పారు. అయితే ఆమె కనిపించకుండా పోయినప్పటి నుంచి బల్గేరియాలో ఆమెకు సంబంధించిన ఆస్తులన్నీ టాకీతో సంబంధాలున్న వ్యక్తులు ఉపయోగించుకున్నట్లు ఆస్తి పత్రాలు, ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు స్టోయనోవ్ తెలిపారు.

టాకీ, డ్రగ్స్, బల్గేరియా
ఫొటో క్యాప్షన్, ఇగ్నటోవా భవంతిని టాకీ మనుషులు ఉపయోగించుకుంటున్నట్లు లభించిన ఆధారాలు

ఇగ్నటోవాను హత్య చేశారనే ఆరోపణల మీద టాకీని ఎప్పుడూ అరెస్ట్ చెయ్యలేదు. అమె మృతదేహం దొరకలేదు కాబట్టే టాకీని అరెస్ట్ చేసేందుకు తమ వద్ద ఆధారాలు ఏమీ లేవని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.

అయితే ఇగ్నటోవా చనిపోయి ఉండవచ్చని మాజీ ఐఅర్ఎస్ అధికారి రిచర్డ్ రీన్‌హార్ట్ భావిస్తున్నారు. టాకీనే ఆమెను హత్య చేశాడనేందుకు తనకు ఆధారాలేమీ లభించలేదని ఆయన చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు హత్య చేస్తే ఇలాగే ఉంటుందని అన్నారు.

“దొంగలకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. డ్రగ్ కార్టెల్స్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తాయో తెలుసు కాబట్టి, ఆమె తనకు ముప్పుగా మారుతుందని టాకీ భావించి ఉంటే ఆమెను పోలీసులు పట్టుకోకుండా కాపాడేవాడు” అని రిచర్డ్ చెప్పారు.

ఈ విచారణలో ఆరోపణల గురించి వివరణ కోసం బీబీసీ టాకీ న్యాయవాదుల్ని సంప్రదించింది. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

2022లో ఇగ్నటోవాను ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ఇప్పటికీ ఆమె పేరు ఉంది.

కనిపించకుండా పోయిన క్రిప్టో క్వీన్ ఇగ్నటోవా మీద పాడ్‌కాస్ట్ తర్వాత బీబీసీ బృందానికి అనేక సలహాలు, సూచనలు, కొంత సమాచారం అందింది. అందులో ఇగ్నటోవా ఎక్కడెక్కడకు వెళ్లారు, ఆమె హత్య గురించిన ఆరోపణలు, 2022లో గ్రీస్ పోలీసులు ఆమెను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు లాంటివి అందులో ఉన్నాయి.

అందరి దృష్టి మళ్లించేందుకే ఆమెను హత్య చేశారనే పుకార్లు పుట్టించి ఉంటారని భావిస్తున్నారు.

నిజంగా అలా జరిగి ఉంటే, ఏళ్లు గడిచే కొద్దీ, ఆమె ఎక్కువ కాలం అజ్ఞాతంలో ఉండటం కష్టం కావచ్చు.

“ఎక్కడో ఒక చోట ఎల్విస్ ప్రెస్లీ కూడా బతికే ఉండవచ్చు అని చెప్పవచ్చు, కానీ వాస్తవంగా అలా జరగదు” అని హ్రిస్టనోవ్ చెప్పారు.

“ఎఫ్‌బీఐ తమాషా కోసం వ్యక్తుల పేర్లను మోస్ట్ వాంటెడ్ జాబితాలో పెట్టదు” అని రీన్‌హార్ట్ చెప్పారు. వారికి ఎవరైనా చనిపోయారని ‘కచ్చితమైన సమాచారం’ ఉన్నప్పుడే జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే రుజా ఇగ్నటోవాను విషయంలో ఇలా జరిగి ఉండకపోవచ్చు.

దీనర్థం, ఇప్పటికీ కనిపించకుండా పోయిన క్రిప్టో క్వీన్ కోసం ఇంకా వేట కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)