బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?

ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీజేపీ, 'ఇండియా' కూటమి హవాకు ఎదురొడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి సత్తాచాటారు ఏడుగురు.

ఎన్నికల్లో ప్రధాన పార్టీల హవాను తట్టుకుని నిలబడడం అంత సులువైన వ్యవహారమేమీ కాదు. అందులోనూ హేమాహేమీ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడం కత్తిమీదసాముగానే చెప్పాలి.

2024 ఎన్నికల్లో బీజేపీ, ప్రతిపక్ష పార్టీల కూటమి 'ఇండియా' నువ్వానేనా అన్నట్టుగా పోటీపడ్డాయి.

ఎన్నికల ముందు కమలం పార్టీదే హవా అని ప్రీపోల్ సర్వేలు చెప్పినా, పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే మాట వినిపించినా ఫలితాలు విడుదలయ్యాక మాత్రం పోటీ ఏకపక్షం కాదన్నది స్పష్టమయింది.

బీజేపీ పట్టు తగ్గి, కూటమి బలం పెరిగినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను ఒంటరిగా చేరుకులేకపోయాయి. బీజేపీ 240 సీట్లకు పరిమితమైతే, కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించింది. ఇక వాటి మిత్రపక్షాలను కలుపుకుని ఎన్డీయే 290 సీట్ల వరకూ సాధించగా, ఇండియా కూటమి 230 సీట్లు కైవసం చేసుకుంది.

ప్రధాన పక్షాల మధ్య ఇంతటి రసవత్తర పోరు కొనసాగినప్పటికీ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తాచాటారు. ఏడు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఇంతకీ ఎవరా ఏడుగురు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పప్పూ యాదవ్

ఫొటో సోర్స్, FACEBOOK@RAJESHRANJANPAPPUYADAV

ఫొటో క్యాప్షన్, రాజేశ్ రంజన్ (పప్పూ యాదవ్)

పప్పూ యాదవ్ (బిహార్)

1990లలో మనీ, మజిల్ పవర్(ధన, కండ బలం)తో ఎదిగి, రాబిన్‌హుడ్ ఇమేజ్‌తో రాజకీయాల్లోకి ప్రవేశించిన బిహారీ నేతల్లో రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ఒకరు.

బిహార్‌లోని పూర్నియా లోక్ సభ స్థానం నుంచి పప్పూ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.

ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతల్లో ఒకరైన పప్పూ యాదవ్ ఆ తర్వాత ఆయనకు దూరమయ్యారు. కేసులు, జైలు శిక్షలతో వార్తల్లో నిలిచిన యాదవ్, పూర్నియా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.

తన సమీప ప్రత్యర్థి, జనతాదళ్ అభ్యర్థి సంతోష్ కుమార్‌పై 23,847 ఓట్లతో విజయం సాధించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ్ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్థి బీమా భారతి 5,40,436 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

హోరాహోరీగా సాగిన ముక్కోణపు పోటీలో బాహుబలి లీడర్ పప్పూ యాదవ్‌నే విజయం వరించింది.

ఈయన 1990లలో రాజకీయాల్లోకి వచ్చారు. సీమాంచల్ ప్రాంతంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పప్పూ యాదవ్ పలుమార్లు శాసన సభ, లోక్ సభకు ఎన్నికయ్యారు.

1991, 1996, 1999లో పూర్నియా నుంచి ఎంపీగా, ఆ తర్వాత 2004, 2014లో మాధేపురా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

పప్పూ యాదవ్ గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచారు. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ తరఫున కూడా పోటీ చేసి గెలిచారు. ఆయన సొంతంగా జన్ అధికార్ పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1998లో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అజిత్‌ సర్కార్‌ను హత్య చేసిన కేసులో ఆయనకు 2008లో కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దీంతో ఆయన చాలా ఏళ్లు జైలులో ఉన్నారు.

పప్పూ యాదవ్‌పై అనేక ఇతర నేరారోపణలు కూడా ఉన్నాయి. ఆయన భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు.

అబ్దుల్ రషీద్ షేక్

ఫొటో సోర్స్, WASEEM ANDRABI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2016 జనవరిలో శ్రీనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఇంజినీర్ రషీద్

ఇంజినీర్ రషీద్ (జమ్మూ కశ్మీర్)

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు అబ్దుల్ రషీద్ షేక్. ఈయన ఇంజినీర్ రషీద్‌గా సుపరిచితులు.

జైలు నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఈయన కూడా ఒకరు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.

బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రషీద్‌‌ 4,72,481 ఓట్లు సాధించారు. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా రెండో స్థానంలో, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సాజద్ గని మూడో స్థానంలో ఉన్నారు.

మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షల ఓట్ల మెజార్టీతో అబ్దుల్ రషీద్ గెలుపొందారు.

తీవ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారన్న అభియోగాలతో ఇంజినీర్ రషీద్‌ను అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు.

ఇంజినీర్ రషీద్‌పై మోసిన అభియోగాలను ఆవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యతిరేకించింది. ఇదంతా రాజకీయ కుట్రగా ఆ పార్టీ అభివర్ణించింది. ఆవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుల్లో రషీద్ కూడా ఒకరు. ఆవామీ ఇత్తెహాద్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో బారాముల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన రషీద్ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

శ్రీనగర్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రషీద్ దాదాపు 25 ఏళ్లపాటు ప్రభుత్వ శాఖలో ఇంజనీర్‌గా పనిచేశారు.

కశ్మీర్‌లో భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ ఆయన ఆందోళనలు నిర్వహించావారు. ఆర్టికల్ 370 రద్దును రషీద్ తీవ్రంగా వ్యతిరేకించారు.

2008లో కుప్వారాలోని లంగేట్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2014లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, SANDHUAMRIT1984/INSTAGRAM

ఫొటో క్యాప్షన్, సిక్కు మతబోధకుడిగా మారక ముందు, తర్వాత అమృత్‌పాల్ సింగ్

అమృత్‌పాల్ సింగ్ (పంజాబ్)

పంజాబ్‌కి చెందిన ఖలిస్తాన్ అనుకూల సంస్థ 'వారిస్ పంజాబ్ దె' చీఫ్ అమృత్‌పాల్ సింగ్.

పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అమృత్‌పాల్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్‌పై లక్షా 97 వేల 120 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు అమృత్‌పాల్ సింగ్.

ఖడూర్ సాహిబ్‌ స్థానం నుంచి పోటీ చేసిన అమృత్‌పాల్‌ కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాను ఓడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లల్జీత్ సింగ్ భుల్లార్ మూడో స్థానంలో నిలిచారు.

అమృత్‌పాల్ సింగ్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన అమృత్‌పాల్ నామినేషన్ల ముగింపు సమయానికి కొద్దిగంటల ముందు నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు.

2023 ఫిబ్రవరి 23న పంజాబ్‌లోని అజ్నాల పోలీస్ స్టేషన్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టి పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి 'వారిస్ పంజాబ్ దె' సంస్థ నేతృత్వం వహించింది. ఆ సమయంలో అమృత్‌పాల్ సింగ్ జాతీయ వ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచారు.

అమృత్‌సర్‌లోని జల్లుఖేడా గ్రామానికి చెందిన అమృత్‌పాల్ సింగ్ చాలాకాలం దుబాయ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్‌కు వచ్చేసిన ఆయన సిక్కు మత ప్రచారకుడిగా మారారు.

శరబ్‌జీత్ సింగ్ ఖల్సా

ఫొటో సోర్స్, BHARAT BHUSHAN

ఫొటో క్యాప్షన్, శరబ్‌జీత్ సింగ్ ఖల్సా

సరబ్‌జీత్ సింగ్ ఖల్సా (పంజాబ్)

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారిలో సరబ్‌జీత్ సింగ్ ఖల్సా ఒకరు. ఈయన భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన ఇద్దరు అంగరక్షకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు.

సరబ్‌జీత్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు.

తన సమీప ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కరమ్‌జీత్ సింగ్ అన్మోల్‌‌పై 70 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమర్‌జీత్ కౌర్ ఓట్లతో మూడు స్థానంలో నిలిచారు.

సరబ్‌జీత్ గతంలో మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఖడూర్ సాహిబ్ నుంచి పోటీ చేసిన అమృత్‌పాల్ సింగ్ ప్రభావం ఫరీద్‌కోట్ స్థానంపై కూడా పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సరబ్‌జీత్ సింగ్ ఖల్సా తండ్రి బియాంగ్ సింగ్, ఆయన సహచరుడు సత్వంత్ సింగ్‌తో కలిసి 1984 అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపారు. అప్పట్లో వారిద్దరూ ఆమె బాడీగార్డులు.

విశాల్ పాటిల్

ఫొటో సోర్స్, Vishal Patil/facebook

ఫొటో క్యాప్షన్, విశాల్ పాటిల్

విశాల్ పాటిల్ (మహారాష్ట్ర)

మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విశాల్ పాటిల్ (విశాల్‌దాదా ప్రకాశ్‌బాపు పాటిల్) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు.

దశాబ్దాలుగా తమ కుటుంబానికి పట్టున్న సంగ్లీ లోక్‌సభ సీటును శివసేన (ఉద్దవ్ ఠాక్రే)కి కేటాయించడాన్ని విశాల్ పాటిల్ తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగారు.

మాస్ లీడర్‌గా పేరున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ మనవడే ఈ విశాల్ పాటిల్.

ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన విశాల్ పాటిల్‌ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత సంజయ్ పాటిల్‌పై లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శివసేన నుంచి పోటీ చేసిన చంద్రహార్ సుభాష్ పాటిల్‌ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

1962 నుంచి సంగ్లీలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2014, 2019 మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

1980ల నుంచి వసంత్‌దాదా పాటిల్ కుటుంబం సంగ్లీ నుంచి గెలుస్తూ వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్, ఆయన భార్య షాలినీ పాటిల్, కుమారుడు ప్రకాశ్‌బాపు పాటిల్ సంగ్లీ నుంచి ఎంపీలుగా గెలుపొందారు. ఆ తర్వాత మూడోతరం నాయకులు మదన్ పాటిల్, ప్రతీక్ పాటిల్ సంగ్లీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

2014, 2019లో బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకా పాటిల్ రెండుసార్లు విజయం సాధించారు.

ఈసారి సంగ్లీ సీటును మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా శివసేన (ఉద్దవ్ ఠాక్రే) పార్టీకి కేటాయించడంతో పాటిల్ కుటుంబం నుంచి టిక్కెట్ ఆశించిన విశాల్ పాటిల్‌కు భంగపాటు ఎదురైంది.

చివరివరకూ ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో విశాల్ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ప్రతీక్ పాటిల్ సోదరుడు విశాల్ పాటిల్.

ఉమేశ్‌భాయి పటేల్

ఫొటో సోర్స్, Umesh Babubhai Patel/facebook

ఫొటో క్యాప్షన్, ఉమేశ్‌భాయి పటేల్

ఉమేశ్‌భాయి పటేల్ (దమన్ అండ్ దియూ )

కేంద్రపాలిత ప్రాంతమైన దమన్ అండ్ దియూ నుంచి ఉమేశ్‌భాయి పటేల్ స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు.

2009 నుంచి 2014 వరకూ హ్యాట్రిక్ విజయాలు సాధించిన బీజేపీ నేత లాలూభాయి పటేల్‌ను ఉమేశ్‌భాయి పటేల్ ఓడించారు. ఈ ఎన్నికల్లో 42,523 ఓట్లతో ఉమేశ్‌భాయి విజయం సాధించారు.

బీజేపీ అభ్యర్థి లాలూభాయి పటేల్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతన్ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు.

మొహమ్మద్ హనీఫా (లద్దాఖ్)

ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన మరో నేత మొహమ్మద్ హనీఫా. లద్దాఖ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన హనీఫా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి హనీఫాకు 65,259 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి త్సెరింగ్ నాంగ్యాల్ 37,397 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. హనీఫా 27,862 ఓట్ల మెజార్టీతో లద్దాఖ్ ఎంపీ స్థానం నుంచి విజయం సాధించారు.

బీజేపీ నుంచి పోటీ చేసిన తషి గ్యాల్సొన్ 31,956 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)