మూడోసారి ప్రధానిగా మోదీ, మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారంటే...

ఫొటో సోర్స్, ANI
భారత ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం చేశారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. 2019లో రెండోసారి, ఇప్పుడు 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు.
మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

క్యాబినెట్ మంత్రులు వీరే..
- రాజ్‌నాథ్ సింగ్
- అమిత్ షా
- నితిన్ గడ్కరీ
- జగత్ ప్రకాశ్ నడ్డా
- శివరాజ్‌సింగ్ చౌహాన్
- నిర్మలా సీతారామన్
- డాక్టర్ ఎస్.జైశంకర్
- మనోహర్‌లాల్ ఖట్టర్
- హెచ్‌డీ కుమారస్వామి
- పీయూష్ గోయల్
- ధర్మేంద్ర ప్రదాన్
- జీతన్ రామ్ మాంఝీ
- రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్)
- సర్వానంద సోనోవాల్
- డాక్టర్ వీరేంద్ర కుమార్
- కింజరాపు రామ్మోహన్ నాయుడు
- ప్రహ్లాద్ జోషి
- జుయెల్ ఒరామ్
- గిరిరాజ్ సింగ్
- అశ్విని వైష్ణవ్
- జ్యోతిరాదిత్య సింధియా
- అన్నపూర్ణ దేవి
- గజేంద్రసింగ్ షెకావత్
- కిరెన్ రిజిజు
- భూపేందర్ యాదవ్
- హర్దీప్ సింగ్ పూరి
- జి.కిషన్ రెడ్డి
- డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
- చిరాగ్ పాశ్వాన్
- సీఆర్ పాటిల్
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
- ఇంద్రజీత్ సింగ్
- డాక్టర్ జితేందర్ సింగ్
- అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
- ప్రతాప్‌రావ్ గణపతిరావ్ జాదవ్
- జయంత్ చౌధురి
సహాయ మంత్రి
- జితిన్ ప్రసాద్
- శ్రీపాద్ నాయక్
- పంకజ్ చౌధురి
- క్రిషన్ పాల్
- రాందాస్ అథవాలే
- రామ్‌నాథ్ ఠాకూర్
- నిత్యానంద్ రాయ్
- అనుప్రియా పటేల్
- వి.సోమన్న
- చంద్రశేఖర్ పెమ్మసాని
- ఎస్పీ సింగ్ బఘేల్
- శోభా కరంద్‌లాజె
- కీర్తివర్ధన్ సింగ్
- బీఎల్ వర్మ
- శంతను ఠాకూర్
- సురేశ్ గోపి
- డాక్టర్ ఎల్ మురుగన్
- అజయ్ టంటా
- బండి సంజయ్ కుమార్
- కమలేశ్ పాశ్వాన్
- భాగీరథ్ చౌధురి
- సతీశ్‌చంద్ర దూబే
- సంజయ్ సేథ్
- రవ్‌నీత్ సింగ్ బిట్టు
- దుర్గా దాస్ వుయికే
- రక్షా నిఖిల్ ఖడ్సే
- సుకాంత్ మజుందార్
- సావిత్రి ఠాకూర్
- తోఖన్ సాహు
- డాక్టర్ రాజ్‌భూషణ్ చౌధురి
- భూపతిరాజు శ్రీనివాస వర్మ
- హర్ష్ మల్హోత్రా
- నీలూబెన్
- మురళీధర్ మోహోల్
- జార్జి కురియన్
- పబిత్ర మార్గరిటా
క్యాబినెట్‌లో కొందరు ప్రముఖులు

రాజ్‌నాథ్ సింగ్..
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్‌నాథ్ సింగ్ గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.
2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ హోంమంత్రి అయ్యారు.
రాజ్‌నాథ్ సింగ్ లఖ్‌నవూ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
అమిత్ షా

అమిత్ అనిల్ చంద్ర షా మూడో స్థానంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గత ప్రభుత్వంలో అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి అమిత్ షా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
నితిన్ గడ్కరీ

ఫొటో సోర్స్, ANI
నితిన్ గడ్కరీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
జేపీ నడ్డా

బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జేపీ నడ్డా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఆయన గతంలోనూ మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ఎస్.జైశంకర్

ఫొటో సోర్స్, ANI
బీజేపీ నేత, గత ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఎస్.జైశంకర్ మరోసారి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గుజరాత్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతంలో ఆయన పలుదేశాలకు భారత రాయబారిగా వ్యవహరించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన బీజేపీలో చేరారు.
శివరాజ్‌సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని విదిశా లోక్‌సభ స్థానం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ఎన్నికయ్యారు.
మనోహర్ లాల్ ఖట్టర్

హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మనోహర్ లాల్ ఖట్టర్ తొలిసారిగా క్యాబినెట్ మంత్రి అయ్యారు. హరియాణా సీఎం పదవికి ఖట్టర్ మార్చిలో రాజీనామా చేశారు.
హరియాణాలోని కర్నాల్ లోక్‌సభ స్థానం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపీగా ఎన్నికయ్యారు.
హెచ్‌డీ కుమారస్వామి

ఫొటో సోర్స్, ANI
జేడీఎస్‌కు చెందిన హెచ్‌డీ కుమారస్వామి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కుమారస్వామి కర్ణాటక మాజీ సీఎం. 18వ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి కుమారస్వామి విజయం సాధించారు.
కుమారస్వామి భారత మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు

టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు.
ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మూడుసార్లు గెలిచారు.
పీయూష్ గోయల్

పీయూష్ గోయల్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర ముంబయి లోక్ సభ స్థానం నుంచి పీయూష్ గోయల్ ఎంపీగా ఎన్నికయ్యారు.
పీయూష్ గోయల్ నరేంద్ర మోదీ మొదటి, రెండు ప్రభుత్వాల్లోనూ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.
నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, ANI
నిర్మలా సీతారామన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
నిర్మల గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగానూ కూడా ఉన్నారు. ఆమె రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ధర్మేంద్ర ప్రదాన్

ఒడిశా బీజేపీ నేత ధర్మేంద్ర ప్రదాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ధర్మేంద్ర ప్రదాన్ గతంలో ప్రధాని మోదీ రెండు ప్రభుత్వాల్లోనూ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. పెట్రోలియం మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఒడిశాలోని సంబల్‌పూర్ స్థానం నుంచి లోక్ సభ ఎంపీగా ధర్మేంద్ర ప్రదాన్ ఎన్నికయ్యారు.
జితన్ రామ్ మాంఝీ

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జితన్ రామ్ మాంఝీ తొలిసారిగా క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఆయన గయా లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
రాజీవ్ రంజన్ సింగ్(లల్లన్ సింగ్)

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్(లల్లన్ సింగ్)కి క్యాబినెట్‌లో చోటుదక్కింది. ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
లల్లన్ సింగ్ తొలిసారి క్యాబినెట్ మంత్రి అయ్యారు. బిహార్‌లోని ముంగేర్ లోక్‌సభ స్థానం నుంచి లల్లన్ సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు.
బిహార్ ప్రభుత్వంలో లల్లన్ సింగ్ మంత్రిగా ఉన్నారు.
అశ్విని వైష్ణవ్

క్యాబినెట్ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
గత ప్రభుత్వంలో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జ్యోతిరాదిత్య సింధియా

మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో నాలుగోసారి మంత్రి అయ్యారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రెండోసారి మంత్రి కావడమే కాకుండా రెండు యూపీఏ ప్రభుత్వాలలోనూ సింధియా మంత్రిగా పనిచేశారు.
2020లో సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుణ నుంచి సింధియా ఓడిపోయారు.
గజేంద్రసింగ్ షెకావత్

గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన గజేంద్రసింగ్ షెకావత్ మరోసారి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఎంపీగా ఎన్నికయ్యారు.
జి.కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ నేత క్యాబినెట్ మంత్రిగా జి.కిషన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణలోని సికింద్రాబాద్ స్థానం నుంచి లోక్ సభ ఎంపీగా జి.కిషన్‌రెడ్డి ఎన్నికయ్యారు. కిషన్ రెడ్డి మోదీ గత ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా ఉన్నారు.
చిరాగ్ పాశ్వాన్

లోక్ జనశక్తి (రామ్ విలాస్)కి చెందిన చిరాగ్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
చిరాగ్ పాశ్వాన్ తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని హాజీపూర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
18వ లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌జేపీ (రామ్‌విలాస్)కు చెందిన ఐదుగురు ఎంపీలు విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Reuters
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరిని ఆహ్వానించారు?
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలను ఆహ్వానించారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అరిఫ్, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, మారిషస్ ప్రధానమంత్రి ప్రవిండ్ జగన్నాథ్, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఆహ్వానాలు పంపినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వీరంతా ఆహ్వానాన్ని స్వీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ప్రకటన ప్రకారం, భారత నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనా, మియన్మార్ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న వివిధ దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
భారత ప్రభుత్వం “పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు, సాగర్ విజన్” కింద ఆయా దేశాల నేతలను ఆహ్వనించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 8 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథుల జాబితాను తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం వారందరికీ ఆహ్వానాలు పంపింది.
ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో న్యాయవాదులు, డాక్టర్లు, కళాకారులు, సాంస్కృతిక కళాకారులు, సామాజిక కార్యకర్తలు ఉన్నాట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
(ఈ వార్త అప్డేట్ అవుతోంది.)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














