లోక్‌సభ ఎన్నికలు: అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలోని విశాలమైన, అందమైన రోడ్లు, నగరంలోకి స్వాగతం పలుకుతున్నాయి. నగరంలోకి అడుగు పెట్టాక భవనాల మీద కాషాయ రంగు, భవనాల గోడల మీద రామాయణ ఘట్టాలను వివరించే దృశ్యాలు, ఇప్పటికీ కొనసాగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి.
అయోధ్యలోకి ప్రవేశించిన తర్వాత రామాలయాన్ని నిర్మించిన భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా ఓడిపోతుందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది.
స్థానిక ప్రజలతో మాట్లాడటం ద్వారా మనం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చు.
లతా మంగేష్కర్ చౌక్‌లో పెద్ద వీణ ఏర్పాటు చేశారు. దాని చుట్టూ విద్యుత్ దీపాలు ఉన్నాయి.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహిళా యాత్రికులు పక్కనే ఉన్న పార్కులో బట్టల్ని ఆరబెట్టుకుంటున్నారు.


బీజేపీ పరాజయం
చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చినవారిలో హోటళ్లు తీసుకునేందుకు ఆర్థికంగా స్థోమత లేనివారు రోడ్ల మీద, పార్కుల్లో ఉంటున్నారు. రోడ్ల మీద, పార్కుల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ రాముడి దర్శనం అయినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు.
లతా మంగేష్కర్ చౌక్ నుంచి ఫైజాబాద్ వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన రోడ్డుని కూడా అలంకరించారు. విశాలంగా, పరిశుభ్రంగా ఉన్న ఫుట్‌పాత్ మీద కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ధగధగల్ని వెదజల్లుతున్నాయి. ఆ కాంతుల్లో గోడల మీద చిత్రీకరించిన రామాయణ గాథలోని దృశ్యాలు మెరుస్తున్నాయి.
టీ కొట్టు దగ్గర కూర్చున్న హృతిక్ సింగ్, అయోధ్యలో బీజేపీ ఓటమి పట్ల విషాదంతో ఉన్నారు.
“బీజేపీ ఓడిపోయిందని తెలిశాక, నాకు చనిపోవాలని అనిపించింది. అయితే కుటుంబంలో నేనొక్కడనే కుమారుడిని. అందుకే చనిపోలేను. చాలా బాధ పడుతున్నాను. ఎంత బాధ పడుతున్నానంటే ఎవరికీ చెప్పలేను” అని హృతిక్ చెప్పారు.
“బాధ పడటం ఎందుకు? నేను సంతోషంగానే ఉన్నాను. అయోధ్య ప్రజల్ని పట్టించుకోకపోతే ఇలాంటి ఫలితమే వస్తుంది” అని హృతిక్ సింగ్ పక్కనే కూర్చుని ఉన్న సత్యం త్రిపాఠి అన్నారు.
“ప్రజల్ని నిరాశ్రయుల్ని చేశారు. దుకాణాల్ని కూలగొట్టి పరిహారం ఇవ్వలేదు. వారికి వేరే చోట పునరావాసం కల్పించలేదు. బీజేపీ నాయకులకు అహంకారం పెరిగింది. తాము ఏం చేసినా ప్రజలు నోరెత్తకూడదని వాళ్లు అనుకుంటున్నారు” అని త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని మారుస్తారన్న ప్రకటనలు
ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవదేష్ ప్రసాద్ 40 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2014 నుంచి ఇక్కడ ఆయనే ఎంపీగా ఉన్నారు.
2024 జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశంలోని న్యూస్ చానళ్లు రోజంతా నిరంతరాయంగా ప్రసారం చేశాయి. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అని రాసి ఉన్న జెండాలను ఎగరవేశారు.
కేంద్రంతో పాటు ఉత్తర ప్రదేశ్‌లోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ డివిజన్‌లో ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా గెలవలేదు.
స్థానికులతో మాట్లాడిన తర్వాత వారి ఓటమికి కొన్ని కారణాలు తెలిశాయి.
ఉదాహరణకు ఫైజాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ పోలింగ్‌కు ముందే విజయం తనదే అని భావించారు. ఈ అతి విశ్వాసంతో ఆయన కనీసం నియోజకవర్గంలో ప్రజలను ఓట్లు అడిగేందుకు కూడా రాలేదు.
బీజేపీ నాలుగు వందలకు పైగా సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన చేసిన ప్రకటనలు దళితులు, బలహీన వర్గాల ఓటు బ్యాంకు ఇండియా కూటమి వైపు మొగ్గేలా చేశాయి. బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతుందని దళితులు, వెనుకబడిన వర్గాలు భావించాయి.
స్థానికంగా మెజారిటీ ప్రజల సమస్యల్ని కూడా బీజేపీ అభ్యర్థి పట్టించుకోలేదు.

ప్రస్తుతం అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక్కడ వ్యాపారం పెరిగింది. నగరంలో ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ ఇక్కడ బీజేపీ ఎందుకు ఓడిపోయిందా అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు.
“ఇక్కడి వాతావరణం అంతా కాషాయమయంగా కనిపిస్తోంది. బీజేపీ వారి గొంతు మాత్రమే వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ ఓడిపోయిందంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది” అని లతా మంగేష్కర్ చౌక్ దగ్గర యాత్రికుల ఫోటోలు తీస్తున్న సందీప్ యాదవ్ చెప్పారు.
“గతంలో మాకు ఉపాధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. ఇప్పుడు ఫోటోగ్రఫీతో పాటు మేము ట్రావెల్ ఏజన్సీ కూడా నిర్వహిస్తున్నాం. చాలా తేలిగ్గా నెలకు 50వేల రూపాయలకు పైనే సంపాదిస్తున్నాం. నాలాగే చాలా మందికి ఉపాధి లభించింది. అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతోంది. ఇంత పని చేసినా ఇక్కడ బీజేపీ ఓడిపోయింది” అని సందీప్ యాదవ్ చెప్పారు.

ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తోంది. అయితే నిరాశ్రయుల్లో ఆగ్రహం కనిపిస్తోంది.
“స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియా ప్రస్తావించి ఉంటే, వాటి గురించి చర్చ జరిగి నాయకులు సీరియస్‌గా తీసుకునేవారు, అయితే టీవీలలో బీజేపీ రాముడిని తీసుకొచ్చింది అని చెప్పారే తప్ప, అయోధ్యలో ప్రజరలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే దానిపై చర్చించలేదు” అని ఓ మహంత్ చెప్పారు.
రామ మందిరం నిర్మించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు అయోధ్య కేంద్రంగా మారింది.
ప్రస్తుతం భక్తులు గతంలో కంటే భారీ సంఖ్యలో వస్తున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యడం అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది.
“అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ప్రజలంతా ఆనందించారు. అందరూ దీపాలు వెలిగించారు. రోడ్ల విస్తరణ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అందరూ మంచిదే అనుకున్నారు. అయితే ప్రభుత్వం మరోసారి అహంకారంతో వ్యవహరించింది. ఎవరి మాట పట్టించుకోలేదు. స్థానికుల దుకాణాలను పగల గొట్టారు. వారికి పరిహారం చెల్లించలేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా జనాలను వీధుల్లోకి విసిరేశారు. ప్రభుత్వ వ్యవహార శైలి మీద స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. వాళ్లు తమ గోడు చెప్పుకున్నప్పుడు ఎవరూ వినలేదు” అని బీజేపీ మద్దతుదారుడు ఎంకే మిశ్రా చెప్పారు

వివిధ ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టిన పోలీసులు
భక్తుల భద్రత దృష్ట్యా అయోధ్యలో పోలీసులు వివిధ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరంలోకి రావడానికి, పోవడానికి పాసులు ఇస్తున్నారు. అయితే ఈ బారికేడ్ల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
“వీఐపీలు సాయంత్రం 7 గంటలకు వస్తుంటే, పోలీసులు మధ్యాహ్నం 12 గంటల నుంచే బారికేడ్లు పెడుతున్నారు. మేము స్కూళ్ల నుంచి మా పిల్లల్ని తీసుకు రాలేకపోతున్నాం. మా ఇళ్లు కళ్ల ముందే కనిపిస్తున్నా, ఇంట్లోకి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని మేము స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. మోదీ పేరు చెబితే చాలు, ప్రజల్లోకి వెళ్లకపోయినా ఫర్వాలేదు అని స్థానిక నాయకులు భావించారు. ఇక్కడ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో అడిగేవాళ్లు ఎవరూ లేరు” అని మిశ్రా చెప్పారు.
సరయూ ఘాట్ నుంచి లతా మంగేష్కర్ చౌక్ మీదుగా రామ మందిరానికి వెళ్లే దారిని ప్రస్తుతం విస్తరిస్తున్నారు.
ఈ రోడ్డుకు రెండు వైపులా ఉన్న షాపులకు కాషాయ రంగు వేశారు. ఇక్కడకు వచ్చిన భక్తులు చాలా తేలిగ్గ రామ మందిరం చేరుకోవచ్చు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్ కూడా నిర్మించారు.
రోడ్ల విస్తరణ కోసం వందల కొద్దీ షాపుల్ని ధ్వంసం చేయాల్సి వచ్చింది. కొన్ని షాపులను పూర్తిగా పగలగొట్టారు. కొన్నింటిని పాక్షికంగా పగలగొట్టారు.
ఈ మార్గంలో ఉన్న దుకాణాల యజమానుల్లో అనేక మంది దగ్గర వారి దుకాణాలు ఉన్న స్థలాలకు సంబంధించిన పత్రాలు లేవు. ఇక్కడ ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం మహంతులు, ఆలయ ట్రస్ట్ స్వాధీనంలో ఉన్నాయి.
చాలా కుటుంబాలు ఇక్కడ తరతరాలుగా అద్దె కడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. కొంతమంది 70 ఏళ్ల నుంచి కూడా ఉంటున్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలో స్థలాలపై హక్కు సంపాదించుకున్నారు.
రోడ్ల విస్తరణ సమయంలో, అనేక మంది తమ భూమి హక్కు పత్రాలను చూపించలేదు. దీంతో వారికి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం దక్కలేదు.
“మా షాపు మొత్తం రోడ్డు విస్తరణలో పోయింది. మాకు ఒకటిన్నర లక్షల రూపాయలు మాత్రమే పరిహారంగా అందింది. ఇప్పుడు కొత్త షాపు ఒకటి అద్దెకు తీసుకున్నాం. అయితే ఆ షాపుకు అడ్వాన్స్ 20 లక్షల రూపాయల పైన చెల్లించాల్సి వచ్చింది. మూడు తరాలుగా ఆ షాపు మాదగ్గరే ఉంది. మేమిప్పుడు రోడ్డున పడ్డాం. మేము జీవితకాలం అంతా బీజేపీకి మద్దతిస్తూ వచ్చాం. ఇక్కడకు రాముడు వచ్చిన తర్వాత మేము ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు” అని విస్తరణలో షాపు కోల్పోయిన ఓ దుకాణదారుడు చెప్పారు. తన పేరు బయటపెట్టవద్దని ఆయన కోరారు.
విస్తరణలో షాపులు, ఇళ్లు కోల్పోయిన వందల మంది కథ ఇంచుమించు ఇలాగే ఉంది.

సోషల్ మీడియాలో...
అయోధ్య నగరంలో మెజార్టీ భాగం సరయు నది ఒడ్డున ఉంది. ఇక్కడే దశాబ్ధాల క్రితం ఓ కాలనీ అభివృద్ధి చెందింది.
సరయు నది ఒడ్డున ఇళ్లు నిర్మించుకున్న వారికి కొన్ని నెలల నుంచి నోటీసులు వస్తున్నాయి.
“బుల్డోజర్లు ఎప్పుడు వస్తాయో, మా నెత్తిన పైకప్పు ఎప్పుడు లేచిపోతుందో అని నిరంతరం భయపడుతూనే ఉన్నాం. మా ఇళ్లు తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. మాకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు” అని నది ఒడ్డున నివశిస్తున్న వారిలో అనేక మంది చెప్పారు.
ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. అయోధ్య నియోజకవర్గంలో మాత్రం ప్రత్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4వేల ఓట్లు అధికంగా వచ్చాయి.
ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓడిపోయిన తర్వాత, అయోధ్యలోని హిందువుల మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో తమ మీద వస్తున్న మెసేజ్‌లు చూసి స్థానిక హిందువులు బాధ పడుతున్నారు.
“శ్రీరాముడు, మోదీ, యోగిలను ప్రస్తుతిస్తూ నేను వందల కొద్దీ భజనలు పాడాను. అయితే బీజేపీ ఓటమి తర్వాత, అయోధ్య ప్రజల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. రాముడి పేరు జపించే అయోధ్య ప్రజలను నిందిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు” అని భజనలు చేసే రాజా శర్మ చెప్పారు.
“ప్రజల్లో బీజేపీ అభ్యర్థి మీద తీవ్ర ఆగ్రహం ఉన్నా, అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకు మెజార్టీ వచ్చింది. ప్రజలకు కోపంగా ఉన్నా, వాళ్లు బీజేపీకి ఓటు వేశారు. ఓటమికి లల్లూసింగ్‌దే బాధ్యత. ఆయన కనీసం ప్రజల్లోకి వచ్చి ఓటు వేయమని కూడా అడగలేదు” అని రాజా చెప్పారు.
ఈ ఆరోపణలపై వివరణ కోరేందుకు లల్లూసింగ్‌ని కలవడానికి బీబీసీ ప్రయత్నించింది. ఆయనను కలిసేందుకు ఆయన నివాసం వద్దకు వచ్చిన వారంతా బాధతో ఉన్నారు. వాళ్లు మాట్లాడేందుకు నిరాకరించారు. లల్లూ సింగ్ బీబీసీ ప్రతినిధిని కలిసేందుకు ఇష్టపడలేదు.
బీజేపీ ఓటమి హిందూత్వ రాజకీయాలకు ఓటమి అనే ప్రచారం జరుగుతోంది.
“ఇది హిందూత్వ రాజకీయాల ఓటమి కాదు. ఎన్నికల్లో స్థానిక అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మా ఎంపీ అభ్యర్థి ప్రకటనల వల్ల దళితులు, బీసీలు దూరమయ్యారు. వీఐపీ సంస్కృతి, అధికారుల వ్యవహార శైలితో అయోధ్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో వారి ఆగ్రహం కనిపించింది” అని హనుమంత్ గఢీకి చెందిన హిందూ సన్యాసి వరుణ్ మహరాజ్ చెప్పారు.
“ఇవాళ అయోధ్యవాసుల మీద కామెంట్లు చేస్తున్నారు. అయితే అయోధ్యలో ఎగసిన హిందూత్వ కెరటం దేశమంతా ఎగసిందని మర్చిపోతున్నారు. అయోధ్య వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయోధ్య ప్రజల మీద విమర్శలు చేస్తున్నవారు, వాస్తవానికి వాళ్లు రాముడిని విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎంపీగా గెలిచిన వ్యక్తి కూడా అయోధ్యకు చెందినవారే” అని వరుణ్ మహరాజ్ చెప్పారు.
హనుమాన్ గఢీకి చెందిన దేవాశిష్ ఆచార్య బీజేపీ ఓటమి పట్ల తాను ఆశ్చర్యపోవడం లేదని అన్నారు.

మతపరమైన విశ్వాసం
“ఓటమి పట్ల మేము చాలా విచారంతో ఉన్నాం. అయితే అదేమీ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. స్థానిక సమస్యల ఆధారంగా ఎన్నికలు జరిగాయి. వీఐపీ సంస్కృతితో అయోధ్య ప్రజలు విసిగిపోయారు. మా ఎంపీ అభ్యర్థి ప్రజలు చెప్పింది వినరు వారిని ఓట్లు అడగరు. హిందూత్వ పేరుతో, నరేంద్రమోదీ పేరుతో ఎంత కాలమని మీరు ఎన్నికల్లో గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. అది వినాలి.” అని దేవాశిష్ ఆచార్య అన్నారు.
రెండు దశాబ్ధాలుగా ఫైజాబాద్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టు అర్షద్ అఫ్జల్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు.
బీజేపీ ఓటమికి కారణాలను వివరిస్తూ “రామ మందిరం హిందువల నమ్మకానికి సంబంధించినది. అయోధ్యలో ప్రతీ ఒక్కరు రాముడిని నమ్ముతారు. రాముడి పేరు చెబితే బీజేపీకి ఓట్లు పడతాయని బయటి వాళ్లు అనుకుంటుంటారు. అయితే స్థానిక సమస్యలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి”అని అర్షాద్ ఖాన్ చెప్పారు.
“అయోధ్యలో చాలా అభివృద్ధి జరిగింది. అయితే అది రామ మందిరానికి నాలుగైదు కిలోమీటర్ల పరిథిలోనే జరిగింది. ఫైజాబాద్‌లోని గ్రామాలకు చేరలేదు. నాలుగైదేళ్లుగా అందరి దృష్టి రామమందిరం మీదనే ఉంది. స్థానిక అధికారులు, ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఆలయాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో పని చేశారు. దీంతో అయోధ్య చుట్టు పక్కల ఉన్న గ్రామాలు, గ్రామాల్లో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోలేదు. తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వారు భావించారు. వారి ఆగ్రహం వల్లనే బీజేపీ ఓడిపోయింది” అని ఆయన అన్నారు.

బీసీలు, దళితుల ఓట్లు కన్సాలిడేట్ కావడంతో దళితుడైన అవదేష్ ప్రసాద్ ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు.
“అఖిలేష్ యాదవ్ పీడీఎ నినాదం ఇక్కడ పని చేసింది. బీఎస్పీ బలహీనపడుతోంది. ఆ పార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గారు. హిందూత్వ ఓటర్లలో కొంతమంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే ముస్లింలు భారీ సంఖ్యలో ఒకే పార్టీకి ఓటు వేశారు. ఇండియా కూటమి గెలవడానికి ఇదే కారణం” అని అర్షాద్ ఖాన్ చెప్పారు.
ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన అవదేష్ ప్రసాద్ ప్రస్తుతం మిల్కీపుర్ నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన 9సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సమాజ్ వాదీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
“నాకు రాముడి ఆశీస్సులున్నాయి. ఇది బీజేపీ అహంకారానికి దక్కిన ఓటమి. అయోధ్యకు మేము రాముడిని తీసుకొచ్చాం అని వీళ్లంతా చెబుతున్నారు. అయితే శతాబ్ధాల క్రితమే రాముడు ఇక్కడ ఉన్నాడు” అని 79 ఏళ్ల్ అవదేష్ ప్రసాద్ చెప్పారు.

“అయోధ్యలో మోదీ అనేక రోడ్‌షోలు చేశారు. మోదీ అయోధ్య నుంచి పోటీ చేస్తారని అనుకున్నాను. నాపై ఆయన పోటీ చేసినా ఓడిపోయేవారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు. బీజేపీపై స్థానిక ప్రజలు పోటీ చేశారు. బీజేపీని ఓడించిన ఓటర్లే మోదీని కూడా ఓడించి ఉండేవారు”
అయోధ్యకు దగ్గర్లో ఉన్న ఓ గ్రామంలో పాసీ కులస్తుల( షెడ్యూల్డ్ కులం) ఆధిపత్యం ఎక్కువ. ఈ గ్రామంలో యువకుల్లో చాలా మందిలో నిరుత్సాహం కనిపిస్తోంది.
“ఇది గౌరవానికి సంబంధించిన ఎన్నిక. అఖిలేష్ యాదవ్ మా కులానికి చెందిన అవదేష్ ప్రసాద్‌కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన విజయానికి మా గుర్తింపుకు సంబంధం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ గెలిచేందుకు వందల మంది యువకులు రేయింబవళ్లు పని చేశారు. మాకు సంతోషంగా ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్లకు మేము గట్టి గుణపాఠం చెప్పాము. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎవరూ ధైర్యం చెయ్యరు” అని అక్కడున్న యువకుల్లో ఒకరు చెప్పారు.














