కేరళలో బీజేపీ విజయం సీపీఎం,‌ కాంగ్రెస్‌లకు హెచ్చరికేనా?

గోపి సురేష్

ఫొటో సోర్స్, BJP Keralam

ఫొటో క్యాప్షన్, బీజేపీ అభ్యర్థి సురేశ్‌ గోపీ విజయం సాధించారు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కేరళలోని త్రిసూర్‌లో తొలిసారిగా బీజేపీ విజయం సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచింది.

క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను పెద్దఎత్తున సాధించడంతోపాటు లెఫ్ట్ ఫ్రంట్ సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ద్వారా బీజేపీ ఈ విజయం సాధించింది.

సీపీఐ అభ్యర్థి వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై రాజకీయ నాయకుడిగా మారిన నటుడు, బీజేపీ అభ్యర్థి సురేశ్‌ గోపీ 74,686 ఓట్ల తేడాతో గెలుపొందారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే. మురళీధరన్ ఈసారి మూడో స్థానంలో నిలిచారు. దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మురళీధరన్‌ ప్రకటించారు.

కానీ, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంతకుముందు కేరళలోని దాదాపు డజను అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయి. దీంతో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో ఆందోళనలు పెరిగాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి దాదాపు 17 శాతం ఓట్లు వచ్చాయి, గతంలో కంటే 4 శాతం ఎక్కువ.

కేరళలో బీజేపీ సాధించిన ఈ విజయం, తిరువనంతపురం పార్లమెంటు స్థానంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నుంచి శశి థరూర్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంత గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చిందో చూపిస్తోంది.

రాజీవ్ చంద్రశేఖర్‌పై శశిథరూర్ కేవలం 16 వేల 77 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, 2019లో ఇదే స్థానంలో శశిథరూర్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కేరళలో లెఫ్ట్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌)ల ఓటు బ్యాంకును బీజేపీ ఎంతగా చీల్చిందో దీన్నిబట్టి తెలుస్తోంది.

వాట్సాప్
కేరళలో బీజేపీ విజయం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేరళలో గోపీ సురేశ్ ఎంపీగా విజయం సాధించారు.

అభ్యర్థిని మాత్రమే చూసి ఓటేశారా?

అట్టింగల్ స్థానంలో మరో కేంద్రమంత్రి వి. మురళీధరన్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. అయితే చివరి రౌండ్ ఓటింగ్ ముగిసిన తర్వాత మురళీధరన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఈసారి కేరళలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 20 స్థానాలకు గాను 18 గెలుచుకుంది. 2019 కంటే ఒకటి తక్కువ. ఆలత్తూరు స్థానాన్ని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన కె. రాధాకృష్ణన్ గెలుచుకున్నారు.

బీజేపీ విజయంపై కేరళ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, రాజకీయ పరిశీలకుడు ప్రొఫెసర్ జె.ప్రభాస్ బీబీసీతో మాట్లాడుతూ.. 'ఉన్నత కులాలు, అగ్రవర్ణ క్రైస్తవులు త్రిసూర్‌లో సురేష్ గోపీకి మాత్రమే ఓటు వేశారని బీజేపీకి కాదని చెబుతున్నారు. కానీ క్రైస్తవులకు ఇపుడు బీజేపీ అంటరానిది కాదు. సీపీఎంతో పాటు బీజేపీ కూడా నాయర్ హిందూ ఓటు బ్యాంకుకు గండి కొట్టిందని దీనర్థం’’ అన్నారు.

కేరళలో బీజేపీ విజయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళలో గోపీ సురేశ్ బీజేపీ విజయం

హిందువుల ఓట్ల కోసం..

లెఫ్ట్ ఫ్రంట్ నుంచి ఎలావా, నాయర్ వర్గాల ఓట్ల చీలిక చాలా ముఖ్యం. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ కేరళలలో హిందువులను సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఎలావా, నాయర్, మత్స్యకారుల సంఘాల మూడు వేర్వేరు సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. కానీ, ఈ మూడు వర్గాలను హిందువులుగా కలపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు, వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఐక్యత లేమి కూడా ఈ వర్గాలపై లెఫ్ట్ ఫ్రంట్ పట్టు ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపలేదు. దీనిపై ఒక రాజకీయ విశ్లేషకుడు బీబీసీతో మాట్లాడుతూ.. 'కేరళలో సీపీఎంను హిందూ పార్టీగా పరిగణిస్తున్నారని అందరికీ తెలుసు’ అని అన్నారు.

పినరయి విజయన్

ఫొటో సోర్స్, Getty Images

ముస్లింలతో ముఖ్యమంత్రి పినరయి భేటీ..

ఈ ఎన్నికల్లో కొన్ని సంఘాలు బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చొరవ తీసుకుని ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపారు. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది.

వాస్తవానికి, ఈ సమావేశాల ద్వారా పినరయి విజయన్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్‌తో కాకుండా సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌తో కలవడం ద్వారా ముస్లిం సమాజానికి రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాలనుకున్నారు.

అయితే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఎం చేస్తున్న ప్రచారంతో క్రైస్తవ సమాజం కూడా అసౌకర్యానికి గురవుతోంది. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలావా వర్గం మళ్లీ ఎల్‌డీఎఫ్‌కే ఓటేస్తుందో లేదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అజిత్ శ్రీనివాసన్ బీబీసీతో అన్నారు.

'హిందువుల ఓట్లను సంఘటితం చేసేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా పినరయి విజయన్‌పై పలు ఆరోపణలు రావడంతో ఆయనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది' అని ఆయన అన్నారు.

మొత్తం మీద, కేరళలో బీజేపీ ఒక సీటులో విజయం సాధించడంతో రాష్ట్ర సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. అయితే, త్రిసూర్ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించడంతో, కేరళలో ఎన్నికల పోటీ ఇప్పుడు త్రిముఖంగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)