మోదీ కొత్త మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీరి గురించి ఈ 5 విషయాలు తెలుసా..

ఫొటో సోర్స్, FB/Kishan Reddy, Bandi Sanjay
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.
వీరిలో ముగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందిన నాయకులు.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.
ఇక తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కుమార్ కూడా మంత్రులయ్యారు.
వీరిలో పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తొలిసారి ఎంపీలుగా గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వరుసగా రెండోసారి ఎంపీలుగా గెలిచారు.
మోదీ 2.0 ప్రభుత్వంలో కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.


ఫొటో సోర్స్, FB/gkishanreddy
గంగాపురం కిషన్ రెడ్డి.. వరుసగా రెండోసారి
- కిషన్ రెడ్డి తాజా ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లోనూ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలిచారు. అప్పుడు 62,114 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందగా.. ఈసారి మెజార్టీ స్వల్పంగా తగ్గింది.
- 2019లో మోదీ రెండోసారి గెలిచినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2021లో కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా కేబినెట్ మంత్రి అయ్యారు. పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను పర్యవేక్షించారు.
- 1980లో బీజేపీలో చేరిన కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. యువ మోర్చాతోపాటు పార్టీలో అనేక పదవుల్లో పనిచేశారు. గతంలో 2010 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ పోరుయాత్ర పేరుతో 22 రోజులపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరుతూ యాత్ర నిర్వహించారు. తెలంగాణ ఏర్పడ్డాక రెండేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ అధిష్టానం వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.
- కిషన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి. అంతకుముందు ఆయన 2004లో హిమాయత్ నగర్, 2009, 2014లో అంబర్ పేట నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేతగానూ పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ కూడా కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు.
- కిషన్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం. హైదరాబాద్‌లోని సీఐటీడీలో టూల్ డిజైన్‌లో డిప్లొమా పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, FB/Bandi Sanjay
బండి సంజయ్ కుమార్..
- బండి సంజయ్ వరుసగా రెండోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుపై 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో సాధించిన 89,508 ఓట్ల మెజార్టీ కంటే మించి సాధించారు.
- బండి సంజయ్ చిన్నప్పట్నుంచే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నారు. ఏబీవీపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. యువ మోర్చాతోపాటు పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టారు. కేరళ, తమిళనాడు ఇన్‌ఛార్జీగా పనిచేశారు. ప్రస్తుతం కిసాన్ మోర్చా జాతీయ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
- రెండుసార్లు (1994, 1999) కరీంనగర్ సహకార బ్యాంకు డైరెక్టర్‌గా, కరీంనగర్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా రెండుసార్లు గెలిచారు. 2014, 2018, 2023లలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
- 2020 మార్చి 11న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ 47 కార్పొరేటర్ సీట్లు సాధించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలో పలు దఫాలుగా పాదయాత్ర చేశారు.
- బండి సంజయ్ ప్రసంగాలు రెచ్చగొట్టే ధోరణిలో ఉంటాయని, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రసంగాలు చేస్తారనే విమర్శలున్నాయి. ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై 42 కేసులు ఉన్నట్లు చూపించారు. గతేడాది ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలయ్యారు. బీజేపీ అధిష్టానం 2023లో ఆయన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించింది.
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














