సంజనా జాటవ్: ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకున్నారు, కానీ ఎంపీ అయ్యారు...

సంజనా జాటవ్
ఫొటో క్యాప్షన్, సంజనా జాటవ్
    • రచయిత, మోహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ హిందీ, అళ్వర్ జిల్లా సమూచీ గ్రామం నుంచి..

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని నుంచి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలోని అల్వార్ జిల్లాలో సమూచీ గ్రామం ఉంది. దళిత జనాభా ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో, రెండంతస్తుల భవనమే అతిపెద్ద ఇల్లు.

ఆ ఇంటి బయట చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. చెట్టుకింద సంప్రదాయ దుస్తులు ధరించిన కొంతమంది మహిళలు కూర్చుని ఉన్నారు. వారు ముఖం కనిపించకుండా కప్పుకుని ఉన్నారు. ఇంట్లో కొంతమంది మాట్లాడుకుంటూ కనిపించారు.

ఈ ఇల్లు భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఇటీవల ఎంపీగా ఎన్నికైన సంజనా జాటవ్‌ది. చిన్నవయసులోనే పార్లమెంట్‌కి ఎన్నికైన సంజనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు.

బంగారు అంచు ఉన్న చీర కట్టుకుని, చేతికి గడియారం, మామూలు చెప్పులు ధరించి ఉన్నారు ఎంపీ సంజనా జాటవ్.

దేశంలోని అత్యున్నత సభకు ఎన్నికైన ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకున్న సంజనా

భరత్‌పూర్ జిల్లాలోని వైర అసెంబ్లీ నియోజకవర్గం భుసావర్ గ్రామంలో 1998 మే ఒకటిన సంజనా జాటవ్ పుట్టారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత భరత్‌పూర్ సమీపంలోని అల్వార్ జిల్లా సమూచీ గ్రామానికి చెందిన కప్తాన్ సింగ్‌తో 2016లో ఆమెకు వివాహమైంది.

ఆమె భర్త రాజస్థాన్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. భర్త స్ఫూర్తితో సంజనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నారు.

''మా అత్తమామలు నన్ను సొంతకూతురిలా చూసుకుంటారు. వాళ్లే నన్ను చదివించారు. నా భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిని కావాలని అనుకున్నా. కానీ, విధిరాత మరోలా ఉంది'' అని సంజనా జాటవ్ బీబీసీతో అన్నారు.

‘‘పెళ్లి తర్వాత గ్రాడ్యుయేషన్ కొనసాగించమని చెప్పా. మహిళల పట్ల మా కుటుంబానికి సానుకూల దృక్పథం ఉంది. సంజనా పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాలని కోరుకోలేదు కానీ, ఆమె రాజకీయాల ద్వారా కుటుంబానికి, మా ఊరికి పేరు తీసుకురావాలని అనుకున్నాం'' అని సంజనా భర్త కప్తాన్ సింగ్ బీబీసీతో అన్నారు.

'' పెళ్లి తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నా భర్త'' అని ఆమె చెప్పారు.

సంజనా జాటవ్
ఫొటో క్యాప్షన్, తన ఇద్దరు పిల్లలతో ఎంపీ సంజనా జాటవ్

ఇద్దరు పిల్లల తల్లి

అత్తమామలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న 26 ఏళ్ల సంజనా జాటవ్ ఒక భార్యగా, కోడలిగా, ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గ్రామంలోని రెండంతస్తుల ఇంటికి సమీపంలోనే వారికి మరో ఇల్లు ఉంది. వంటింట్లో పాత్రలు శుభ్రం చేస్తూ, ''పెళ్లైన రెండేళ్లకు బాబు పుట్టాడు. ఇప్పుడు వాడికి ఆరేళ్లు. నాలుగేళ్ల కూతురు ఉంది'' అని చెప్పారు సంజనా.

''నేను రాజకీయ కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో పిల్లలను మా అత్తయ్య చూసుకుంటారు. ఇంటి పనులు చూసుకుంటూనే, రాజకీయాలకు కూడా సమయం కేటాయిస్తా'' అన్నారామె.

''సంజనా చాలా మంచి అమ్మాయి. నన్ను ఏ పనీ చేయనివ్వదు'' అన్నారు ఆమె అత్తయ్య రామవతి.

ఇకపై దిల్లీ వెళ్సాల్సి ఉంటుంది. మరి పిల్లలకు, కుటుంబానికి సమయం ఎలా కేటాయిస్తారని అడిగినప్పుడు, ''దిల్లీలో ఉంటే అక్కడ చేయాల్సిన పనులు చేస్తా. భరత్‌పూర్‌లో ఉంటే నా పిల్లలు, కుటుంబ సభ్యులకు, ఇంటికీ సమయం కేటాయిస్తా'' అని సంజనా చెప్పారు.

సంప్రదాయ దుస్తులు ధరించి, చిరునవ్వుతో కనిపిస్తున్న ఆమె అత్త రామవతి మాట్లాడుతూ, ''సంజనా చాలా మంచి అమ్మాయి. ఆమె వచ్చినప్పటి నుంచి కుటుంబాన్ని బాగా చూసుకుంటోంది. అందరికీ మంచి చేస్తుంది'' అన్నారు.

ఎన్నికల్లో విజయం తర్వాత సంజనా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. దీనికి ఆమె నవ్వుతూ, అది సంతోషకర సమయం, అందుకే డ్యాన్స్ చేశానన్నారు. అందరూ డ్యాన్స్ చేశారని ఆమె అత్తయ్య రామవతి చెప్పారు.

సంజనా జాటవ్

జిల్లా పరిషత్ సభ్యురాలి నుంచి ఎంపీ వరకు..

''మా నాన్న ఒక ట్రాక్టర్ డ్రైవర్. మా పుట్టింటి తరఫు వారిలో ఎవరూ రాజకీయాల్లో లేరు. పెళ్లై అత్తారింటికి వచ్చేప్పటికి మా మావయ్య సర్పంచ్. ఈ ఇంటికి వచ్చిన తర్వాతే నాకు రాజకీయాల గురించి తెలిసింది'' అని సంజనా జాటవ్ చెప్పారు.

ఆమె అల్వార్ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు. రాజకీయంగా ఇదే ఆమె తొలిఅడుగు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ప్రియాంక గాంధీ చేపట్టిన 'ఐ యామ్ ఏ గర్ల్, ఐ కెన్ ఫైట్' ( నేనొక అమ్మాయిని, నేనూ పోరాడగలను) కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అళ్వర్‌ జిల్లాలోని కఠుమర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచిన బాబూలాల్ బైర్వాకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించింది. సంజనా జాటవ్‌పై నమ్మకముంచి ఆమెకు టిక్కెట్ కేటాయించింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె 409 ఓట్లతో ఓడిపోయారు.

భరత్‌పూర్ ఎంపీగా గెలవడాన్ని ఎలా చూస్తారు? అని ఆమెను అడిగినప్పుడు, ''నాకిది చాలా పెద్ద విజయం. ఎందుకంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో 409 ఓట్లతో ఓడిపోయా. కాబట్టి ప్రతి ఓటూ ముఖ్యమైనదేనని నాకు బాగా తెలుసు.''

''అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్‌తో మా నాన్న చనిపోయారు'' అని సంజనా చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తామన్న దీమా ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ''ప్రజల ప్రేమ, ప్రోత్సాహం ఎంతో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానన్న బాధే దరిచేరనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా నా గత ఓటమిని పట్టించుకోకుండా ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. పార్టీ నాపై ఉంచిన నమ్మకం వల్లే నేనిప్పుడు ఇక్కడ ఉన్నా'' అన్నారామె.

సీఎం సొంత జిల్లాలో బీజేపీ ఓటమి

చిన్నవయసులో ఎంపీగా ఎన్నికవడంతో సంజనా జాటవ్ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ, రాజస్థాన్‌లో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే, బీజేపీ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత జిల్లా అయిన భరత్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ రామ్‌స్వరూప్ కోలీని ఓడించడం.

సీఎం భజన్ లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో బీజేపీని ఓడించడం గురించి ఏమనుకుంటున్నారు? అని అడిగినప్పుడు, ''ఆయన్ను ఓడించింది నేను కాదు, ప్రజలు. ఆయన సొంత జిల్లాలో మాత్రమే కాదు, ఆయన సొంతూరు అట్టారీలోనూ ఆయన్ను ఓడించారు. ఆ ఊళ్లో కూడా మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి'' అని సంజనా అన్నారు.

సంజనా జాటవ్‌కు 5,79,890 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోలీకి 5,27,907 ఓట్లు వచ్చాయి. సంజనా 51,983 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

భరత్‌పూర్ లోక్ సభ పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కఠుమర్, మామాన్, నగర్, డీగ్ - కుమ్హెర్, నద్బయీ, వైర, బయానాలో బీజేపీ అభ్యర్థి కంటే సంజనా జాటవ్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఒక్క భరత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోలీకి మెజార్టీ వచ్చింది.

మీ ఓటమికి పార్టీలో అంతర్గత కలహాలే కారణమా? అని అడిగినప్పుడు, ''మా పార్టీ వాళ్లే మాకు సహకరించలేదు'' అని రామ్‌స్వరూప్ కోలీ సమాధానం ఇచ్చారు.

బీజేపీ నేతల నుంచి మీకు లోపాయికారీ మద్దతు లభించిందా? అని సంజనాను ప్రశ్నించినప్పుడు, ''అది అస్సలు నిజం కాదు. వాళ్లు మాపై కుట్రలు చేశారు. మమ్మల్ని వేధించారు. మా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి, కానిస్టేబుల్ అయిన నా భర్తను మానసికంగా వేధించారు. మాకు ప్రజల మద్దతు, పార్టీ మద్దతు ఉన్నాయి'' అని ఆమె సమాధానమిచ్చారు.

సంజనా జాటవ్

'జాట్ - గుర్జర్ల రిజర్వేషన్ల అంశం లేవనెత్తుతా'

''భరత్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. అంతేకాకుండా ఉపాధి కల్పించేలా ఎలాంటి భారీ పరిశ్రమలూ లేవు. చదువుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా'' అని సంజనా జాటవ్ చెప్పారు.

''బీజేపీ పాలనలో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగియి, మహిళల తరఫున వారి సమస్యలపై గళం విప్పుతా. వారికి అండగా ఉంటా.'' అని ఆమె అన్నారు.

దళిత సామాజికవర్గం నుంచి వచ్చారు, ఇప్పుడు ఎంపీగా మీ సామాజికవర్గానికి ఏం చేయబోతున్నారు? అని అడిగినప్పుడు, ''నా సామాజికవర్గం కోసమే కాదు, అందరి కోసం పనిచేస్తా. అందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు'' అన్నారు.

''లోక్ సభలో మొదట జాట్‌లు, గుర్జర్ల రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తుతా. వారికి అన్యాయం జరిగిందని నేను నమ్ముతున్నా. అన్ని జిల్లాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడు, భరత్‌పూర్, ధోల్పూర్‌లో మాత్రమే జాట్‌లను ఎందుకు వదిలేయాలి'' అని సంజనా ప్రశ్నించారు.

భరత్‌పూర్, ధోల్పూర్‌లో జాట్‌ల రిజర్వేషన్ల డిమాండ్‌కి సంబంధించి చాలాకాలంగా వివాదం నడుస్తోంది. గత అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అది నెరవేరలేదు.

రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఒక కమిటీని వేసింది. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

అయినప్పటికీ, ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో బీజేపీకి ఓటు వేసేది లేదని ఎన్నికలకు ముందు జాట్‌లు ప్రతిజ్ఞ చేశారు. కానీ, జాట్‌లు తనకే ఓటు వేశారని రామ్‌స్వరూప్ కోలీ అంటున్నారు.

సంజనా జాటవ్
ఫొటో క్యాప్షన్, సచిన్ పైలట్‌తో సంజనా జాటవ్

సచిన్ పైలట్ కూడా 26 ఏళ్లకే ఎంపీ

లోక్‌ సభ ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు సంజనా జాటవ్‌కి 26 ఏళ్లు వచ్చాయి. గతంలో సచిన్ పైలట్ కూడా 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై, అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా రికార్డు సృష్టించారు.

దీనిపై సంజనా జాటవ్ మాట్లాడుతూ, రెండు రికార్డులూ దేనికదే అన్నారు.

ఇదే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు సచిన్ పైలట్ సమాధానమిస్తూ, ''నేను కూడా 26 ఏళ్ల వయసులో ఎంపీ అయ్యా. నా కంటే చిన్నవయసులోనే ఎంపీ అయ్యారని ఎవరో చెప్పారు. కొత్త రికార్డులు నమోదుతో పాత రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. ఒక దళిత, సామాన్య కుటుంబానికి చెందిన మహిళ ఎంపీ కావడం సంతోషకరం'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)