చంద్రశేఖర్ ఆజాద్ విజయం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

చంద్రశేఖర్ ఆజాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రశేఖర్ ఆజాద్
    • రచయిత, సీటూ తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లోక్‌సభ ఎన్నికల్లో, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తరప్రదేశ్‌లోని నగీనా (రిజర్వ్‌డ్) స్థానం నుంచి బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై 1.5 లక్షల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు.

ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ 13 వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

2019లో బీఎస్పీ అభ్యర్థి గిరీష్ చంద్ర ఇక్కడి నుంచి గెలిచారు.

తన విజయం తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ బీబీసీతో మాట్లాడుతూ, "నా చివరి శ్వాస వరకు నగీనా ప్రజలకు సేవ చేస్తాను. నాకు ఓటు వేసిన వారికి నా చివరి శ్వాస వరకు సేవ చేసి, వారి రుణం తీర్చుకుంటాను’’ అన్నారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 36 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ సాధించిన ఈ విజయం పర్యవసానాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని బహుజన సమాజ్ పార్టీపై ఈ ప్రభావం ఎలా ఉండనుందన్న చర్చ ఒకటి ఉంది.

"జాతీయ రాజకీయాల్లో మాయావతి ప్రాబల్యం క్రమంగా తగ్గిపోయి, చంద్రశేఖర్ ఆజాద్ విజయం సాధించడంతో, భారతదేశం అంతటా ఆయన పార్టీని బలోపేతం చేసే అవకాశాన్ని ఇచ్చాయి. చంద్రశేఖర్‌కు ఇది చాలా మంచి అవకాశం. వయసు, ఆరోగ్యం రీత్యా పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి" అని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ శీతల్ పి సింగ్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
చంద్రశేఖర్ ఆజాద్

ఫొటో సోర్స్, ANI

దళిత రాజకీయాల ముఖచిత్రం

ఉత్తర భారత దళిత రాజకీయాల్లో చంద్రశేఖర్‌ది యువ ముఖం. ఆయన వీధుల్లోకి రావడానికి వెనుకాడరు. పలు పోరాటాలలో జైలుకూ వెళ్లారు.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా బెహత్ తహసీల్‌కు చెందిన చంద్రశేఖర్ 2012లో హేమవతి నందన్ బహుగుణ గాడ్వాల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు.

చంద్రశేఖర్ 2015లో భీమ్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి వార్తల్లో నిలిచారు. కులపరమైన దాడులు, అల్లర్లకు వ్యతిరేకంగా గళం విప్పడం, దళిత పిల్లల్లో విద్యను ప్రోత్సహించడం తమ లక్ష్యమని భీమ్ ఆర్మీ పేర్కొంది.

2015 నుంచి, భీమ్ ఆర్మీ దేశంలోని వివిధ ప్రాంతాలలో దళితుల అణచివేతకు వ్యతిరేకంగా స్వరం వినిపించడంలో చురుకుగా ఉంది.

15 మార్చి 2020న, చంద్రశేఖర్ ఆజాద్ జాతీయ అధ్యక్షుడిగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)ని స్థాపించారు.

ఈ పార్టీ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, సంత్ రవిదాస్, సంత్ కబీర్, గురునానక్ దేవ్, అశోక చక్రవర్తి మొదలైన వారిని ఆదర్శంగా భావిస్తుంది.

పార్టీ వెబ్‌సైట్ ప్రకారం, పార్టీ లక్ష్యం: "దేశంలోని వనరులు, పరిశ్రమలు, వ్యాపారాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల భాగస్వామ్యం ఉండేలా చూడడం’’

కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీలను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో ఇలా రాశారు: “‘చేయి’ నిరంతరం మలినాలను సృష్టిస్తూ, ‘కమలం’ వికసించే అవకాశం కల్పిస్తున్న తరుణంలో, మన సమాజంలో చాలా మంది నాయకులు బంధుప్రీతితో, వృద్ధాప్యంలోని 'మాయ'ను కాపాడేందుకు రాజీపడి, మనువాదుల కీలుబొమ్మలుగా మారారు”

చంద్రశేఖర్ ఆజాద్

ఫొటో సోర్స్, @BHIMARMYCHIEF

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ర్యాలీలో చంద్రశేఖర్ ఆజాద్

చంద్రశేఖర్ రాజకీయాలు

చంద్రశేఖర్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్‌పీ) ఛత్తీస్‌గఢ్, బిహార్, దిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో తన అభ్యర్థులను నిలబెట్టింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ చిత్తోడ్ బీబీసీతో మాట్లాడుతూ.. "యూపీలోనూ పార్టీ నాలుగు చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. కానీ, మేం నగీనా స్థానంలో మాత్రమే గెలిచాం. మేం సంస్థను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం" అని చెప్పారు.

"ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, మేం ప్రజల హక్కుల కోసం పోరాడతాం. గతంలో అనేకమందిని మీసాలు తిప్పినందుకు, గుర్రం ఎక్కినందుకు కొట్టారు, అవమానించారు, కొందరిని కొట్టి చంపారు. ఇలాంటి అన్యాయాలు జరిగితే ప్రభుత్వం చంద్రశేఖర్ ఆజాద్‌ను ఎదుర్కోవాలి’’ అని చంద్రశేఖర్ హెచ్చరించారు.

‘‘ప్రభుత్వం ఏమైనా చేసి, మనుషుల హత్యలను అరికట్టాల్సిందే. కులమతాల ప్రాతిపదికన అన్యాయాలను జరగనివ్వబోం. అలా జరిగితే చంద్రశేఖర్ ఆజాద్‌తో తలపడాల్సి వస్తుంది’’ అని అన్నారు.

యూపీలో చంద్రశేఖర్ యువ దళిత నాయకుడిగా ఆవిర్భవిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ దళిత మేధావి, కాలమిస్ట్, 'కాన్షీరామ్ కే దో చెహ్‌రే' సహా అనేక పుస్తకాల రచయిత కన్వల్ భారతిది భిన్నమైన అభిప్రాయం.

"చంద్రశేఖర్ దళిత రాజకీయాలకు కొత్త ముఖం అవుతారు. కానీ, దళితుల విముక్తి కోసం ఆయన దగ్గర ఎలాంటి దృక్పథం లేదు. అందువల్ల మనం ఆయన నుంచి పెద్దగా ఆశించలేం. తక్షణ పరిస్థితులకు అనుగుణంగా ఆయన స్పందిస్తారు. కానీ ప్రైవేటీకరణ, సరళీకరణ, దళితులను హిందుత్వ గుప్పెట్లోంచి బయటకు తీసుకురావడానికి ఆయన దగ్గర ఎటువంటి భావజాలం లేదు" అని ఆయన అన్నారు.

కార్యకర్తలు

ఫొటో సోర్స్, ANI

చంద్రశేఖర్ గెలుపు బీఎస్పీకి ఎదురుదెబ్బేనా?

ఫార్వర్డ్ ప్రెస్ హిందీ ఎడిటర్, 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ కాస్ట్స్' పుస్తక రచయిత నావల్ కిషోర్ కుమార్ కూడా చంద్రశేఖర్ సంస్థాగత సామర్థ్యాన్ని ప్రశ్నించారు.

‘‘నగీనాలో మైనారిటీలు, దళితుల జనాభా ఎక్కువగా ఉంది. బీఎస్పీ ఓట్లను విభజించడానికి లేదా తన ఉనికిని చాటుకోవడానికి తప్ప ఎన్నికల్లో గెలవడానికి పోటీ చేయలేదు. ఈ పరిస్థితుల్లోనే చంద్రశేఖర్ గెలిచారు. ఆయన దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే, ఇప్పుడు ఆయన బాధ్యతాయుతంగా ఉండాలి. ఆయన తన మీసాలతో కంటే, విచక్షణతో ఎక్కువ పని చేయాలి" అని అన్నారు.

"బిహార్‌లోని పూర్నియా స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ విజయం సాధించినట్లే, నగీనాలో చంద్రశేఖర్ గెలుపునూ చూడాలి. ఇది దళిత రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపదు" అని నావల్ కిషోర్ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగిన మాయావతి ఇప్పుడు అప్రస్తుతం అయిపోయారా? గత కొన్ని ఎన్నికల్లో ఆమె పార్టీ పనితీరు చూసి పలువురు నిపుణులు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

1984లో ఏర్పాటైన బీఎస్పీకి షెడ్యూల్డ్ కులాలే ప్రధాన ఓటు బ్యాంకు. బీఎస్పీ అనేక రాష్ట్రాల ఎన్నికల రాజకీయాలలో చురుకుగా ఉన్నా, పార్టీ విస్తృత పునాది మాత్రం ఉత్తర ప్రదేశ్‌లోనే ఉంది.

ఎన్నికల ఫలితాల అనంతరం మాయావతి మాట్లాడుతూ, "దళిత ఓటర్లలో, నా స్వంత కులానికి చెందిన చాలా మంది బీఎస్పీకి ఓటు వేయడం ద్వారా తమ ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చారు. వారికి నా కృతజ్ఞతలు. అలాగే, ముస్లిం వర్గాలకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చాం. కానీ, వాళ్లు బీఎస్పీని సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నారు. అందువల్ల భవిష్యత్తులో పార్టీ పెద్దగా నష్టపోకుండా చూసుకున్న తర్వాతే వారికి అవకాశం ఇస్తుంది’’ అన్నారు.

మాయావతి తన ప్రకటనలో చంద్రశేఖర్ ఎదుగుదల గురించి వ్యాఖ్యానించలేదు. అదే సమయంలో, ఆమె తన కులానికి చెందిన ప్రధాన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ, ముస్లింల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాయావతి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మాయావతి

బలహీనపడుతున్న బీఎస్పీ

" మాయావతి ప్రధాన ఓటర్లు మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు. కానీ బీఎస్పీ తన పునాదిని, ప్రజల నమ్మకాన్ని రెండూ కోల్పోయింది. మాయావతి ఇప్పుడు బీజేపీ తరఫున ఆడుతున్నారు. ఆమె దళితుల అణచివేత, మతోన్మాదం, రిజర్వేషన్ సమస్యలపై మౌనంగా ఉంటూ, ఇండియా కూటమి అభ్యర్థులను ఓడించడానికే తన అభ్యర్థులను నిలబెడుతున్నారు’’ అని దళిత మేధావి కన్వల్ భారతి అన్నారు.

గణాంకాలను పరిశీలిస్తే బీఎస్పీ ఓటు బ్యాంకు క్రమంగా చెదిరిపోతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి 19.43 శాతం ఓట్లు రాగా, ఆ పార్టీ 10 సీట్లు గెలుచుకుంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం 12.88 శాతానికి పడిపోయి ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం 9.39 శాతానికి పడిపోయి, ఖాతా కూడా తెరవలేకపోయింది.

మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ పనితీరును పరిశీలిస్తే, ఇక్కడ ఆ పార్టీకి 2018లో 5.01 శాతం ఓట్లు వచ్చాయి. అది 2023 నాటికి 3.40 శాతానికి తగ్గింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం మెరుగుపడినా, అది చాలా స్వల్పం. 2017 ఎన్నికలలో 1.5 శాతం ఓట్లు వస్తే, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పంగా పెరిగి అది 1.77 శాతానికి చేరింది.

నావల్ కిషోర్ మాట్లాడుతూ, “బీఎస్పీ పని ఇంకా అయిపోలేదు. ఇప్పటికీ దాని 9 శాతం ప్రధాన ఓటర్లు దాని వైపు ఉన్నారు. కానీ బీఎస్పీ జాతవ్ కాని వారికీ పార్టీలో గౌరవం ఇవ్వాలి. 2007లో యూపీలో మాయావతి అధికారంలోకి వచ్చినప్పుడు వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, జాతవ్, నాన్-జాతవ్ ఇలా అందరూ ఆమె వెంటే ఉన్నారు’’ అని చెప్పారు.

"కానీ, పార్టీ విధానపరమైన అంశాలు, పార్టీ నిర్మాణంలో ఆమె సన్నిహితుడు సతీష్ మిశ్రా ప్రభావం పెరగడంతో, పార్టీలోని జాతవ్, జాతవేతర నాయకులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. వీరిలో బాబు సింగ్ కుష్వాహా, ఓం ప్రకాష్ రాజ్‌భర్‌, దద్దు ప్రసాద్ ఉన్నారు. అందుకే 2012 తర్వాత, ఆమె అధికారంలోకి రాలేకపోయారు."

దళిత ఓటర్లు

ఫొటో సోర్స్, ANI

దళిత ఓటర్ల మద్దతు

యూపీలో షెడ్యూల్డ్ కులాల జనాభా దాదాపు 25 శాతం. వాళ్లు ప్రధానంగా జాతవ్, జాతవేతరులు. యుపీలోని జాతవ్‌లు మొత్తం షెడ్యూల్డ్ కులాల్లో దాదాపు 54 శాతం ఉండగా, జాతవేతరుల్లో పాసి, ధోబి, ఖటిక్, ధానుక్ మొదలైనవాళ్లు 46 శాతం ఉన్నారు.

యూపీ అసెంబ్లీలో 86 రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఈ సంఖ్య చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ దళిత ఓటు బ్యాంకు సాయంతోనే మాయావతి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.

భీమ్ ఆర్మీని ఏర్పాటు చేసిన తర్వాత, చంద్రశేఖర్ బీఎస్పీని తన పార్టీగా పిలిచేవారు. అయితే 2020లో ఆయన సొంత పార్టీని స్థాపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్‌పై చంద్రశేఖర్ పోటీ కూడా చేసి ఓడిపోయారు.

చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు చేయలేకపోయారు. కానీ, వీధుల్లో తన పోరాటాన్ని కొనసాగించారు. కాగా, మాయావతి కూడా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తన వారసుడిగా చేశారు.

నగీనాలో ఎన్నికల ర్యాలీలో ఆకాష్ ఆనంద్, చంద్రశేఖర్ ఆజాద్‌ను టార్గెట్ చేశారు. అయితే ఎన్నికల ర్యాలీలో ఆకాశ్ ఆనంద్ బీజేపీ ప్రభుత్వంపై దాడి చేయడం మాయావతికి కోపం తెప్పించిందని భావిస్తున్నారు. ఆ తర్వాత జాతీయ సమన్వయకర్త పదవి నుంచి ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు.

బీఎస్పీ మద్దతుదారు సంతోష్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, "ఇలా చేయడం ద్వారా, బెహెన్‌జీ బీజేపీ సూచనల మేరకు నడుచుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిలో, ఆమె ఓటు శాతం ఖచ్చితంగా తగ్గుతుంది. యువతకు చోటు కల్పించడం ద్వారా మాత్రమే. పార్టీ ముందుకు వెళుతుంది, దాని మద్దతుదారులు మళ్లీ పార్టీలో చేరతారు" అని అన్నారు.

"ఆకాష్ ఆనంద్‌ను తొలగించడం భ్రూణహత్యతో సమానం. ఇప్పుడు చంద్రశేఖర్ పార్లమెంటుకు వెళుతున్నారు. ఉత్తర భారతదేశంలోని దళిత యువకులు ఇప్పటికే ఆయనతో సంఘటితమయ్యారు. ఇప్పుడు అవకాశం లభించడంతో, ఆయన తన పార్టీని విస్తరించాలని వాళ్లు భావిస్తున్నారు" అని జర్నలిస్ట్ శీతల్ సింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)