టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్ పై భారత్ విజయం...పాకిస్తాన్ సూపర్ 8కు చేరుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
చేసింది తక్కువ స్కోరు. మ్యాచ్‌లో ఇక భారత్ పనైపోయిందని అభిమానులందరూ ఉసూరుమంటున్న మ్యాచ్ అనూహ్యంగా మారిపోయింది.
పాకిస్తాన్ గెలుపు ఖాయమనుకుంటున్న సమయంలో బౌలర్లు పట్టు విడవకుండా చేసిన ప్రయత్నం ఫలించింది.
ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కున్న గెలుపు రికార్డును పదిలం చేస్తూ ఆదివారం న్యూయార్క్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ సంచలన విజయం నమోదు చేసింది.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పై భారత్‌దే ఆధిపత్యం అనే మాటను నిలబెట్టుకోవడానికి ఇండియా టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
తొలుత భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ స్వల్పస్కోరును కాపాడుకుంటూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత బౌలర్ల గొప్ప ప్రదర్శన కారణంగా భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ గెలుపుతో భారత్ 4 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. భారత్ తరువాత స్థానంలో 2 పాయింట్లతో అమెరికా ఉంది.
పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడి సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.


ఫొటో సోర్స్, Getty Images
ఆదుకున్న పంత్
బౌలర్లకు స్వర్గధామంగా మారిన న్యూయార్క్ పిచ్ పై తొలుత టాస్ నెగ్గిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మారు ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.
అయినా భీకరమైన భారత బ్యాటింగ్ లైనప్‌పై అభిమానుల అంచనాలకు తగినట్టే రోహిత్ తొలి ఓవర్లోనే షహీన్ అప్రీదీ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు.
కానీ ఇంతలోనే వర్షం కురవడంతో మ్యాచ్ అరగంటసేపు నిలిచిపోయింది.
వర్షం తరువాత మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వగానే కోహ్లీ (3 బంతుల్లో ఒక ఫోర్‌తో 4 పరుగులు) నసీమ్ షా బౌలింగ్‌లో ఉస్మాన్ చేతికి చిక్కడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
తరువాతి ఓవర్లోనే రోహిత్ శర్మ (12 బంతులు ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 13 పరుగులు ) కూడా షహీన్ బౌలింగ్ లో హారిస్ రవూఫ్‌కు దొరికిపోవడంతో అవుటయ్యాడు.
దీంతో మూడు ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ కాసేపు పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడి కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.
మరోపక్క రిషభ్ పంత్ పరుగులు తీయడానికి కొంత ఇబ్బందిపడినా తరువాత కుదురుకున్నాడు. రవూఫ్ వేసిన పదో ఓవర్లో పంత్ వరుసగా మూడు ఫోర్లు సాధించాడు.
బ్యాటింగ్ గాడిన పడుతోందనే తరుణంలో అక్షర్ పటేల్‌ను నసీమ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
పటేల్ 18 బంతులు ఆడి 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించి 20 పరుగులు చేశాడు.
పటేల్ అవుటైన తరువాత పంత్‌కు సహకరించేవారు కరవయ్యారు. సూర్యకుమార్ (7), దూబే (3) పరుగులే చేసి నిరాశపరిచారు.
ఫలితంగా 14 ఓవర్లలో భారత్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 96 పరుగుల వద్ద ఉంది. అప్పుడే అమిర్ వరుస బంతుల్లో పంత్, ( 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు ) జడేజాలను ఔట్ చేశారు.
ఆ తరువాత హార్థిక్, బుమ్రా డకౌట్లుగా వెనుదిగారు.
చివరలో అర్ష్‌దీప్ 9 పరుగులు, సిరాజ్ 7 పరుగులతో స్కోరును 120 పరుగులకు చేర్చారు.
అయితే 19వ ఓవర్ చివరి బంతికి అర్షదీప్ ను బాబర్ ఆజామ్ రనౌట్ చేయడంతో మరో ఓవర్ మిగిలుండగానే భారత్ ఆలౌటైంది.

ఫొటో సోర్స్, Getty Images
తొలి 10 ఓవర్లు అలా..మిగతా ఇలా..
స్వల్ప లక్ష్య ఛేదనే కావడంతో పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. పైగా బుమ్రా బౌలింగ్‌లో రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను శివం దూబే వదిలేయడం పాకిస్తాన్‌కు కలిసొచ్చింది.
పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజామ్, రిజ్వాన్ చక్కగా ఆడుతున్న దశలో బాబర్ వికెట్ (13 పరుగులు) తీసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు బుమ్రా.
కానీ తరువాత రిజ్వాన్, ఉస్మాన్(13)తో కలిసి జాగ్రత్తగా ఆడటంతో పది ఓవర్లకు పాకిస్తాన్ 1 వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది.
ఇక మిగిలిన 10 ఓవర్లలో 63 పరుగుల చేస్తే చాలు. పైగా చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఇక అందరూ పాకిస్తాన్ గెలుపు లాంఛనమే అనుకున్నారు.
సరిగ్గా అప్పుడే ఉస్మాన్‌ను అక్షర్ ఎల్బీగా అవుట్ చేశాడు. కానీ భారత శిబిరానికి ఫకార్ జమాన్ రూపంలో ఎదురుదాడి ఎదురైంది. అతను 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ కొట్టి 13 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ స్కోరు 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 72 పరుగులకు చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడి నుంచి భారత్ తిరిగి రేసులోకి రాగలిగింది.
ఫకార్ జమాన్‌ను హార్టిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఫలితంగా పాకిస్తాన్ 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినట్టయింది.
వికెట్ల ముందుకు పాతుకుపోయిన రిజ్వాన్ ను 14.1 ఓవర్‌లో బుమ్రా బౌల్డ్ చేయడంతో పాకిస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 80 పరుగులుగా నిలిచింది.
ఇక అక్కడి నుంచి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం మొదలైంది.
తరువాత షాదాబ్ ఖాన్ 7 బంతుల్లో 4 పరుగులే చేసి హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో రిషభ్‌పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం, ఇఫ్తికార్ అహ్మద్ 9 బంతుల్లో 5 పరుగుల చేసి, జస్ప్రత్ బుమ్రా బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ చేతికి చిక్కడంతో పాకిస్తాన్ 19 ఓవర్లలో 102 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
ఇక చివరి ఓవర్లో ఆ జట్టు తొలి బంతికి ఇమాద్ వసీమ్ (23 బంతుల్లో 15 పరుగులు, 1 ఫోర్) వికెట్ కోల్పోయింది.
ఆ సమయంలో పాకిస్తాన్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు.
దీంతో విజయానికి చివరి 5 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో నసీమ్ షా 2 ఫోర్లు సాధించడంతో కొంత ఉత్కంఠ పెరిగినప్పటికీ చివరి బంతికి సింగిలే రావడంతో భారత్ విజయం సాధించింది.
కేవలం మూడు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా 4 ఓవర్లలో 24 పరుగులకు 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
టేబుల్ టాపర్ ఇండియా
పాకిస్తాన్‌పై విజయంతో భారత్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ లో గ్రూప్ ఏలో భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.
ఇండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు నమోదుచేసి 1.455 నెట్ రన్ రేట్‌తో 4 పాయింట్లతో టాపర్ గా కొనసాగుతోంది.
ఇక అమెరికా కూడా రెండు మ్యాచ్లు నెగ్గి 0.626 నెట్ రన్‌రేట్‌తో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.
ఇక కెనడా 2 మ్యాచ్‌లు ఆడి 2 పాయింట్లతో మైనస్ 0.274 నెట్ రన్‌రేట్‌తో , పాకిస్తాన్ 2 మ్యాచ్‌లు ఆడి రెండూ ఓడి మైనస్ 0.150 నెట్ రన్‌రేట్‌తో సున్నా పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ తరువాత ఐర్లాండ్ ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడి మైనస్ 1.712 నెట్ రన్‌రేట్‌తో సున్నాపాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ 8 అవకాశాలు క్లిష్టంగా మారాయి. పాకిస్తాన్ సూపర్ 8కి చేరడం అమెరికా గెలుపోటములపై ఆధారపడి ఉంది.
పాక్ ఇంకా కెనడా, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్ తప్పక నెగ్గాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- 2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














