టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?

జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు

ఫొటో సోర్స్, FACEBOOK

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి? గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు కనిపిస్తోంది? ఎవరికి తగ్గాయి? ఎవరికి పెరిగాయి? అన్నది చూద్దాం.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏకంగా 53 లక్షల 72 వేల 166 ఓట్ల తేడా ఉంది. ఒక్క టీడీపీతో పోల్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 21లక్షల 442 ఓట్లు తక్కువ పడ్డాయి.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి.

ఈ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ‌‍ఇందులో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11స్థానాలకే పరిమితం అయ్యింది.

మెజార్టీల పరంగానూ టీడీపీ, జనసేన, బీజేపీ అ‌‍భ్యర్థులు ‌‌‌భారీ విజయాలను నమోదు చేశారు. టీడీపీకి చెందిన పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, నారా లోకేష్.. ఏకంగా 91వేలకుపైగా మెజార్టీ సాధించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ప్రకటించిన లెక్కలను బట్టి చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 55.29శాతం ఓట్లు సాధించాయి.

మూడు పార్టీలు కలిపి 1 కోటి 86 లక్షల 56 వేల 300 ఓట్లు దక్కించుకున్నాయి.

ఇందులో టీడీపీది ఎక్కువ శాతం వాటా.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు కలిసి వెళ్లడంతోనే భారీ విజయాన్ని నమోదు చేసినట్లు కూటమి నేతలు చెబుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానెల్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, ECI

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లను ఒక్కసారి పరిశీలిస్తే…

ఏపీ ఎన్నికలు
ఓటు మేసిన మహిళ

2019తో పోల్చితే వైసీపీకే ఎక్కువ

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా ప్రధాన పార్టీలన్నీ వేర్వరుగా పోటీ చేశాయి.

ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ 23 స్థానాలు, జనసేన ఒక చోట గెలుపొందాయి.

అప్పట్లో పార్టీ వారీగా వచ్చిన ఓట్లు, శాతాలను ఒకసారి గమనిస్తే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతంగా 1,56,88,569 ఓట్లను దక్కించుకుంది. 49.95శాతం ఓట్లను సాధించింది.

పార్టీల వారీగా తీసుకుంటే టీడీపీకి ప్రస్తుతం వచ్చిన ఓట్ల కంటే 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పుడు 144 స్థానాలలో పోటీ చేసిన టీడీపీకి సొంతంగా వచ్చిన ఓట్ల కంటే అప్పట్లో 175 సీట్లలో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3,03,993 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

ఆ ఎన్నికల్లో టీడీపీకి 39.17శాతం ఓట్ల శాతంతో 1,23,04,668 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టిడిపి కూటమి 29.67 లక్షల ఓట్లను వైసీపీ కంటే అధికంగా దక్కించుకుంది.

పోలింగ్ సింబల్

ఫొటో సోర్స్, Getty Images

జనసేన, బీజేపీలకు పెరిగిన ఓట్లు

2019లో జనసేన పార్టీ 137 చోట్ల పోటీ చేసింది. 5.53శాతంతో 17,36,811 ఓట్లను దక్కించుకుంది.

ఈసారి ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో (21 సీట్లు)నే పోటీ చేసినా.. ఓట్లు మాత్రం జనసేనకు పెరిగాయి.

2019తో పోల్చితే ఈసారి 5,80,936 ఓట్లు ఎక్కువగా సాధించింది. అప్పుడు బీజేపీ 173 సీ‌ట్లతో పోటీ చేయగా...౦.84శాతం ఓట్లతో 2,64,437 ఓట్లు సాధించింది.

ప్రస్తుత ఎన్నికల్లో కమలం పార్టీకి ఓట్లు నాలుగింతలు పెరిగాయి. 9,53,977 ఓట్లను ఆ పార్టీ దక్కించుకుంది.

ఈ లెక్కలను బట్టి జనసేన, బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో వారి ‌‍ఓటు బ్యాంకు జనసేన, బీజేపీలకు బదిలీ అయినట్లుగా స్పష్టమవుతోంది.

ఏపీ ఎన్నికలు

ఫొటో సోర్స్, ECI

‘మేం అనుకున్నట్టే జరిగింది’: పట్టాభిరామ్

ఈ విషయంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బీబీసీతో మాట్లాడారు.

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ అనుకున్నట్లుగా జరగడంతోనే కూటమికి ఓట్ల శాతం అధికంగా వచ్చిందని ఆయన అన్నారు.

‘‘మూడు పార్టీల మధ్య పొత్తు కార్యకర్తలు, ప్రజలు కోరుకున్నది. పొత్తు ప్రకటన చేసినప్పట్నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తగ్గట్టుగా కిందిస్థాయి నుంచి అందరూ కలిసి పనిచేశారు.’’ అన్నారు పట్టాభిరామ్.

‘‘జగన్ పాదయాత్ర సమయంలో ఇంటింటికి వె‌‍ళ్లి పరామర్శించారు కానీ, ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజలను పలకరించలేదు. ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకతను తీసుకువచ్చాయి. అదే సమయంలో టీడీపీ వస్తే ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారు. దాని ఫలితమే ఓట్ల రూపంలో కనిపించింది. ఏకపక్షంగా టీడీపీ కూటమికి ప్రజలు ఓట్లు వేశారు.’’ అని పట్టాభిరామ్ విశ్లేషించారు.

ప్రజలు అయోమయానికి గురయ్యారు: మల్లాది

ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీబీసీతో మాట్లాడారు.

‘‘మూడు పార్టీలు కలిసి సాధించిన ఓట్లుగా చూడవచ్చు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేసినప్పుడు సాధించిన ఓట్లు ఒకసారి గమనించాలి. ఈసారి మూడు పార్టీలు కలిసి ముప్పేట దాడి చేయడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఆ పరిస్థితుల్లో వచ్చిన ఓటమిగానే చూడాలి.’’ అన్నారాయన.

‘‘అబద్దాలతో కూడిన మేనిఫెస్టోతో రావడం, ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు వారికి ఓట్లు వేశారు’’ అని మల్లాది విష్ణు చెప్పారు.

పోలింగ్

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్, ఇతర పార్టీలకు ఓట్లు పెరిగాయా?

కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నేత్రత్వం వహించారు. ఆమె స్వయంగా కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. 1,41,039 ఓట్లు దక్కించుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే...ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి 2019తో పోల్చితే స్వల్పంగానే ఓట్లు పెరిగాయని చెప్పవచ్చు.

అప్పట్లో 3,68,909 ఓట్లు వచ్చాయి. 174 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 1.17శాతం ఓట్లు దక్కించుకుంది. ఈసారి ఓట్ల శాతం కేవలం 1.72శాతమే. .

ఇక గత ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఏఐఎఫ్బీ, ఎస్పీ వంటి పార్టీలు ఎలాంటి ప్రభావం కనబరచలేదు.

నోట్: ఓట్లు, ఓట్ల శాతానికి ఆధారం ఎన్నికల కమిషన్ గణాంకాలు .

వీడియో క్యాప్షన్, బాబు, జగన్, పవన్‌లకన్నా మెజారిటీ సాధించింది వీరే?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)