ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమవుతోంది.

జూన్‌ 12 బుధవారం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే..

వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలకు గుర్తుగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్మించిన ‘నవరత్నాల గుడి’లోని విగ్రహాలను జూన్ 8 రాత్రి గుర్తుతెలియని కొందరు ధ్వంసం చేశారు. శిలాఫలకాలను పగలగొట్టారు.

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరులో వైఎస్‌ఆర్‌ అక్షరాలను తొలగించి తిరిగి ఎన్టీఆర్ అని రాశారు కొందరు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది.

విశాఖ బీచ్ రోడ్డులోని వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరును తొలగించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాన్ని అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌గా మార్చారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనల్లో ఇవి కొన్ని.

బీబీసీ న్యూస్ తెలుగు
ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఓట్ల లెక్కింపు రోజు, ఆ తర్వాత ఏం జరిగింది?

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ రోజు మధ్యాహ్నానికి అత్యధిక సీట్లలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం కనిపిస్తోంది.

ఆ సమయంలోనే విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలపై ఇద్దరు వ్యక్తులు టీడీపీ జెండాలు ఎగరేశారు. బాణాసంచా పేల్చారు. ఆ తర్వాత మరికొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి.

  • ఏపీలోని పలు ప్రాంతాల్లో వైసీపీ రంగులున్న సచివాల భవనాలకు సున్నం వేశారు.
  • జూన్ 7న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో వైసీసీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేరున్న శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
  • విశాఖ సిరిపురం దగ్గర టైకూన్ జంక్షన్ వద్ద పెట్టిన బారికేడ్లను టీడీపీ, జనసేన నాయకులు బుల్ డోజర్లతో తొలగించారు.

సుమారు 10 నెలల కిందట టైకూన్‌ జంక్షన్ వద్ద అడ్డంగా బారికేడ్లు వేసి ఒకవైపు రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాన్ని మూసివేశామని జీవీఎంసీ, పోలీసు అధికారులు అప్పట్లో చెప్పారు.

అయితే, ఆ జంక్షన్ ఎదురుగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు వాస్తు దోషమనే కారణంగానే దానిని మూసివేసినట్లు విమర్శలు వచ్చాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

లోకేశ్‌ ఫోటోకు క్షమాపణలు

జూన్ 8న వైసీపీ మద్దతుదారులు పాలేటి కృష్ణవేణి భర్త రాజకుమార్‌పై మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో కొందరు దాడి చేసి, ఆయనతో నారా లోకేశ్‌ ఫోటోకు క్షమాపణలు చెప్పించారు.

తనను, తన కుటుంబ సభ్యులను క్షమించాలంటూ లోకేశ్‌ ఫోటో ముందు పాలేటి రాజశేఖర్ వేడుకోవడం సోషల్‌ మీడియాలో తిరుగుతున్న వీడియోలో కనిపిస్తోంది.

పాలేటి రాజ్ కుమార్, అతని భార్య కృష్ణవేణి నారా లోకేశ్‌పై గతంలో విమర్శలు చేశారని, అందుకు బదులుగానే కొందరు ఈ చర్యకు పాల్పడినట్లు ఈ ప్రాంతంలో చర్చ జరుగుతోంది.

ఇలాంటి ఘటనల వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రంగులు, పేర్ల మార్పిడి వంటివి టీడీపీ నాయకులే చేయిస్తున్నారని అంటోంది.

“రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులతో భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే ల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది” అని సీఎం జగన్ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

అయితే, ఈ ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు.

‘‘కూటమి విజయం సాధించిన ఆనందంలో జెండాలతో ర్యాలీలు చేయడం, సంబరాలు చేసుకోవడం జరుగుతుందే తప్ప, దాడులు వంటివి జరగడం లేదు” అని టీడీపీ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ బీబీసీతో జూన్ 6న చెప్పారు.

‘‘వైసీపీ కానీ, జగన్ కానీ వ్యక్తిగతంగా నాకు శత్రువులు కారు. ఇది కక్షసాధింపులకు సమయం కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పని చేసే సమయం ఇది” అని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.

కక్ష సాధింపులు ఉండవని కూటమిలోని నాయకులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు.

“ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఏపీలో దాడులు జరుగుతున్నాయి. మేం పెట్టిన ప్రతి పేరు మార్చేయాలని అనుకుంటే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాం. అది మార్చమనండి. విశాఖలోని సీతకొండ ప్రాంతానికి వైఎస్సార్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టాం. అబ్దుల్ కాలం వ్యూ పాయింట్ అనేది ఎక్కడా లేదు. కూటమి నాయకులు వీటిపై దృష్టి పెట్టాలి” అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: పోలీసులు

ఈ ఘటనలపై పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసింది బీబీసీ.

శ్రీకాళహస్తి నవరత్నాల గుడిని ధ్వంసం వారిని గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని శ్రీకాళహస్తి సీఐ రారాజు బీబీసీతో చెప్పారు.

ఈ సంఘటనపై తమకి ఎవరూ ఫిర్యాదు చేయలేదని, మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్న స్థలం కావడంతో ఆ శాఖ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రారాజు అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా ఊపేక్షించబోమని సీఐ చెప్పారు.

మంగళగిరి మండలంలో జరిగిన దాడి ఘటనలో తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, అందువల్ల ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మంగళగిరి పోలీసులు చెప్పారు.

రుషికొండపై టీడీపీ జెండా ఎగరేసిన వారిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

ప్రజల ఆకాంక్షల కోసం జరిగే రాజకీయ ఆందోళనలను తప్పుపట్టబోమని, అయితే రాజకీయాలను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఇవి సరైన రాజకీయాలు కావు: ఊహ మహంతి

‘‘రాజకీయ నాయకులు వ్యక్తిగత పగలు పెంచుకుని, నువ్వు కూల్చేశావు కదా, నేను కూల్చేస్తాను, నువ్వు రంగులు మార్చావు కదా, నేను మార్చేస్తాననే తరహా రాజకీయాలు చేస్తున్నారు. ఆ పర్సనల్ గొడవల్ని రాజకీయాల్లోకి తెచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవి సరైన రాజకీయాలు కావు’’ అని రాజకీయ విశ్లేషకులు ఊహ మహంతి బీబీసీతో అన్నారు.

‘‘ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఏపీలో పోలవరం, రైల్వే జోన్, రాజధాని, ప్రత్యేక హోదా వంటి అంశాలను సాధించే పనిలో ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పని చేయాలి’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)