రాందాస్ అఠౌలే: లోక్‌సభలో సొంత ఎంపీలు లేని పార్టీ నేతకు మోదీ ప్రతిసారీ మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు

రాందాస్ అఠౌలే, మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాందాస్ అఠౌలే వరుసగా మూడోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు
    • రచయిత, గణేష్ పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘రాహుల్‌జీ... మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను మీతో ఉన్నాను. మీరు అధికారం కోల్పోయాక, గాలి ఎటు వీస్తోందో చూశాను... అందుకే నరేంద్రమోదీతో వెళ్లాను’’

2019 జూన్‌లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో మాట్లాడుతూ రాందాస్ అఠౌలే ఈ ప్రకటన చేసినప్పుడు సభలోని అధికార, ప్రతిపక్షంలోని వారంతా కొద్దిసేపు నవ్వుల్లో మునిగిపోయారు.

ఈ హాస్యాన్ని పక్కనపెట్టేస్తే , ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పై ప్రకటన రాందాస్ అఠౌలేకు సరిగ్గా సరిపోతుంది.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో మహారాష్ట్రకు చెందిన ఈ దళిత నేతకు సహాయమంత్రి పదవి లభించింది.

మోదీ కేబినెట్‌లో ఆయన వరుసగా మూడోసారి కూడా చోటు దక్కించుకున్నారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అఠౌలే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలవకపోయినా మంత్రిపదవి దక్కింది.

మరోవైపు మహారాష్ట్రలోని అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి ఓ రాజ్యసభ ఎంపీ, ఒక లోక్‌సభ ఎంపీ ఉన్నారు.

అలాగే మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ అజిత్ పవార్‌ పార్టీ నుంచి మోదీ కేబినెట్‌లో ఎవరికీ చోటు దక్కలేదు.

మరి ఎంపీల బలం, ఎమ్మెల్యేల బలం లేని రాందాస్ అఠౌలేకు బీజేపీ మంత్రి పదవి ఎందుకు ఇచ్చింది. దీనివల్ల బీజేపీ పొందే ప్రయోజనం ఏమిటి?

అఠౌలేను అంబేడ్కరిస్ట్ ముఖచిత్రంగా భావించడం వల్లే మంత్రి పదవి ఇచ్చారా?

రాందాస్ అఠౌలేను బీబీసీ మరాఠి ఇంటర్వ్యూ చేసింది.

మీ పార్టీ నుంచి ఒక్క ఎంపీ గెలవకపోయినా మీకు మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే

‘‘నన్ను మంత్రి మండలిలోకి తీసుకోవడం వల్ల దేశానికి ఓ సందేశం ఇచ్చినట్టవుతుంది. ఉత్తర భారతదేశంలో మా పార్టీ శాఖలు ఉన్నాయి. నాగాలాండ్‌లో మా పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు మంత్రి పదవి ఇవ్వడమనేది కేవలం లాంఛనప్రాయం కాదు’’ అని ఆయన చెప్పారు.

BBC News Telugu Whatsapp Channel
ప్రధాని మోదీ , రాందాస్ అఠౌలే

ఫొటో సోర్స్, YEARS

బీజేపీకి కలిగే ప్రయోజనం ఏమిటి

ఎన్నికలలో బీజేపీకి రాందాస్ అఠౌలే వల్ల కలిగే ప్రయోజనం గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ప్రస్తుతానికైతే ఆయన వల్ల ఎన్నికల ప్రయోజనం లభించినట్టుగా సమాచారం లభించడం లేదు.

ముంబయిలోని కొన్ని వార్డులలో మాత్రమే ఆయన ప్రభావం కనిపించింది. అంతకుమించి ఆయన ప్రభావం పెద్దగా కనిపించలేదు.

అయితే బీజేపీకి ఏ సమయంలోనైనా ఓ దళిత ముఖచిత్రంగా రాందాస్ అఠౌలే చాలా కీలకమని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడు హరీష్ వాంఖడే చెప్పారు.

‘‘ 2014 నుంచి బీజేపీ జాతీయస్థాయిలో తన ఇమేజ్‌ను మార్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. గతంలో బీజేపీ అగ్రవర్ణ పార్టీగా ముద్రపడింది. ఆ ముద్రను చెరిపేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నించింది’’ అని తెలిపారు.

‘సామాజిక న్యాయం, ఓబీసీలు, దళితుల ఓటర్లను ఎలా పొందాలనే విషయంపై వ్యూహం రూపొందించారు. ఇందులో భాగంగా ఆయన్ను బీజేపీ అంబేడ్కరిస్టు ముఖచిత్రంగా ఉపయోగించుకుంటోంది’’ అని హరీష్ వాంఖడే విశ్లేషించారు.

రాందాస్ అఠౌలే ఓట్ల రూపంలో బీజేపీకి ప్రయోజనం చేకూర్చలేదనేది స్పష్టం.

రాందాస్ అఠౌలే

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, రాందాస్ అఠౌలే

రాబోయే అసెంబ్లీ ఎన్నికలే కారణమా?

రాందాస్ అఠౌలేకు మంత్రి మండలిలో చోటు ఇవ్వడంలోని బీజేపీ ఆంతర్యమేమిటి... దీని వెనుక మరో ముఖ్యమైన కారణముందంటారు సీనియర్ జర్నలిస్ట్ మధు కాంబ్లే.

‘‘తాజా (2024) ఎన్నికలలో బీజేపీ మహారాష్ట్రలో భారీగా దెబ్బతింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అలాంటి సమయంలో రాందాస్ అఠౌలే లాంటి అంబేడ్కరిస్టు ప్రతినిధిని వదులుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీన్ని తట్టుకోవడానికి మోదీ మంత్రి మండలిలో అథవాలేకు చోటు కల్పించారు’’ అని కాంబ్లే చెప్పారు.

దీనికితోడు అథవాలే రాజకీయ మెతక వైఖరి కూడా మరో కారణమని తెలిపారు.

అథవాలేను నీలిరంగు జెండా ప్రతినిధిగా ఎన్నికల ప్రచారంలోనూ, రాజకీయా సమావేశాలలోనూ ఉపయోగించుకునే అవకాశం ఉంది అని తెలిపారు.

సోషల్ ఇంజినీరింగ్ ద్వారా దళితులలో బీజేపీ తన స్థానాన్ని విస్తరించుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో దళితల ఓటర్లను పొందడంలో బీజేపీ విజయం సాధించింది.

అంతేకాదు, హిందూ దళితల సమాజాన్ని హిందూ దళితులుగా, నయా బుద్ధిస్టులుగా విభజించడం ద్వారా సేన, బీజేపీ తమ స్థానాన్ని విస్తరించుకున్నాయి.

బీజేపీ తరచూ రాజ్యాంగాన్ని మార్చేస్తుందనే ఆరోపణలు,. దళితులను బీజేపీ అణిచివేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సమయంలో రాందాస్ అఠౌలే బీజేపీని సమర్థించారు.

ఓ దళిత రాజకీయ నేతగా ఆయన బీజేపీ పక్షం వహించడమనేది రాజకీయంగా ఓ బలమైన సందేశమే.

ప్రతిపక్షాలను అథవాలే విమర్శిస్తూ నరేంద్ర మోదీ రాజ్యాంగ పరిరక్షకునిగా చెప్పారు. అలాగే రాందాస్ అఠౌలే తాను సామాజిక న్యాయం, రిజర్వేషన్లకు ప్రతినిధినని మీడియా ముందు చెప్పారు.

అంబేద్కర్ బ్యాడ్జిల ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

దళిత పాంథర్స్‌తో మొదలు

అంబేడ్కర్ భావజాలం ఉన్న కుటుంబంలో 1959 డిసెంబర్ 25న సంగ్లీ జిల్లాలో అగల్‌గావ్‌లో జన్మించారు రాందాస్ అఠౌలే. ముంబాయిలో చదువు పూర్తి చేశారు.

దళిత పాంథర్ ద్వారా ఆయన సామాజిక సేవలోకి అడుగుపెట్టారు.

అమెరికాలోని బ్లాక్ పాంథర్స్ తరహాలో రాజా ధాలే 70లలో దళిత్ పాంథర్స్‌ను మహారాష్ట్రలో ప్రారంభించారు.

దళితులకు సామాజికంగా, సాంస్కృతికంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.

రాజా ధాలే తరువాత నమ్‌దేవ్ దశాల్, రాందాస్ అఠౌలే దళిత్ పాంథర్స్‌కు నాయకత్వం వహించారు.

ఔరంగాబాద్‌లోని మరట్వాడా యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో రాందాస్ అఠౌలే కీలక పాత్ర పోషించారు.

దళిత్ పాంథర్స్‌ను వీడి 90ల ప్రారంభంలో రాజకీయాలలోకి ప్రవేశించారు.

బాబా సాహెబ్ అంబేడ్కర్ నెలకొల్పిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోని అనేక గ్రూపులు పతనమడం మొదలైంది. దీంతో రాందాస్ అఠౌలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అఠౌలే గ్రూపు)ను స్థాపించారు.

తరువాత ఆయన శాసనమండలికి ఎన్నికయ్యారు. శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ, రవాణా,ఉపాధి హామీ మంత్రిగా పనిచేశారు.

శరద్ పవార్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన సేన, బీజేపీ కూటమి నుంచి గట్టి సవాల్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో పవార్ రాందాస్ అఠౌలేను ప్రోత్సహించారు.

అసలు అఠౌలేను శరద్ పవారే రాజకీయాలలోకి తెచ్చారని చెబుతారు.

రాందాస్ అఠౌలే మద్దతు దారులు

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, రాందాస్ అఠౌలే మద్దతు దారుల నిరసన (పాతచిత్రం)

అధికారానికి దగ్గరగా..

రాందాస్ అఠౌలే పార్లమెంటరీ రాజకీయాలు 12వ లోక్‌సభ నుంచి మొదలయ్యాయి. 1998లో ఆయన దాదర్ (ప్రస్తుతం ఈ నియోజకవర్గం ముంబాయి నార్త్ సెంట్రల్‌గా మారింది) లోక్‌సభ నుంచి గెలిచారు.

ఆ సమయంలో సేన, బీజేపీ కుల, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.

కానీ 2009లో ఆయన షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు.

అప్పటి నుంచి ఆయనకు అనేక సంవత్సరాలు శరద్ పవార్ మద్దతుకు దూరమయ్యారు.

దీని తరువాత బీజేపీకి అనుకూలంగా గాలివీచడం మొదలైంది.

తరువాత మోదీ ప్రభుత్వం రెండోసారి కేబినెట్ విస్తరణలో రాందాస్ అఠౌలేకు సహాయ మంత్రి పదవి లభించింది.

తాను అధికారంలోకి ఉంటే దళితులకు ప్రయోజనం కలుగుతుందని ఆ సమయంలో ఆయన భావించారు.

అఠౌలేకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో కచ్చితంగా ఓ గ్రూపు ఉండేది. 90లలో శివసేన తీవ్రమైన హిందూత్వ విధానం తీసుకున్నప్పుడు దేశంలో మండల్ రాజకీయాలు భగ్గమన్నాయి. ఆ సమయంలో అఠౌలే అంబేద్కరిస్టు ఓటర్లపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉన్నాడు.

కానీ ప్రస్తుతం రోజురోజుకు అంబేడ్కరిస్ట్ ఓటర్లపై అఠౌలే ప్రభావం తగ్గిపోతోంది.

‘‘ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే మహారాష్ట్రలో హింసాత్మక రాజకీయాలతో బీజేపీ దెబ్బతింది. దీంతో శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే సానుభూతి పొందారు. మరోపక్క బీజేపీ 400 సీట్లు గెలచుకుంటే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందేమోనని భయపడి అంబేద్కరిస్టుల ఓటర్లు భయపడ్డారు. ఈ కారణాలన్నింటివల్ల అంబేడ్కరిస్టుల ఓటర్లు ఈసారి ఎప్పటిలా ఓటు వేయలేదు’’ అని మధు కాంబ్లే చెప్పారు.

ప్రజలు ఈసారి ఎన్నికలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. అంబేద్కరిస్టు నాయకులు చెప్పినట్టు వారు ఓటు వేయలేదు అని కాంబ్లే వివరించారు.

‘‘కానీ అంతిమంగా బీజేపీకి ఓ దళిత ముఖచిత్రం కావాలి. రాందాస్ అఠౌలే అధికారానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితులలో ఆయన్ను రాజకీయాల్లోకి తెచ్చిన అంబేద్కరిస్ట్ ఆలోచనల సంగతి ఏమిటి? అని సమాధానం లేని ప్రశ్నను వేశారు ప్రొఫెసర్ హరీష్ వాంఖడే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)