లోక్‌సభ ఎన్నికలు 2024: బీజేపీకి పేదలు దగ్గరయ్యారా, దూరమయ్యారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, NarendraModi/X

    • రచయిత, సంజయ్ సింగ్ , సీఎస్‌డీఎస్
    • హోదా, బీబీసీ కోసం

తాజా ఎన్నికలలో బీజేపీ గతంలో కన్నా తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ వివిధ సామాజిక వర్గాలలో ఆ పార్టీకి ఉన్న మద్దతు పెద్దగా మారలేదని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ పోస్ట్‌పోల్ సర్వే సమాచారం వెల్లడించింది.

2019 లోక్‌సభ ఎన్నికలలో 303 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికలలో 240 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది.

కానీ 2019- 2024 మధ్యన ఆయా వర్గాలలో బీజేపీకి ఉన్న మద్దతులో పెద్దగా మార్పు కనిపించలేదు. అగ్రకులాల్లో బీజేపీకి ఉన్న మద్దతు ఈసారి కూడా చెక్కుచెదరలేదు.

2019మాదిరే 2024లోనూ ఆ పార్టీకి హిందూ అగ్రవర్ణాలు 53% మంది ఓటు వేశారు.

హిందూ అగ్రవర్ణాల నుంచి కాంగ్రెస్ స్వల్పంగానే లాభపడింది, అయితే దాని మిత్రపక్షాలు మాత్రం గణనీయమైన మద్దతు పొందాయి.

హిందువులలోని ఓబీసీలో ఉన్నతవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ 20%, దాని మిత్రపక్షాలు 15% ఓట్లతో రెండూ 5 నుంచి 6 శాతం లాభపడగా, అదే సమయంలో బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు హిందూ ఓబీసీ ఉన్నత వర్గాల నుంచి 2% ఓట్లను కోల్పోయాయి.

ఇక ఓబీసీలలోని దిగువ కులాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు స్వల్ప మార్పును మాత్రమే పొందగా, 2019తో పోల్చుకుంటే కాంగ్రెస్ 3శాతం, దాని భాగస్వామ్యపక్షాలు 7శాతం లాభపడ్డాయి.

లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ డేటా
ఎన్నికలు
ఎన్నికలు

ఫొటో సోర్స్, RahulaGandhi/X

2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే జాతీయ స్థాయిలో బీజేపీ 3% దళితుల ఓట్లను కోల్పోయింది, దాని మిత్రపక్షాలు కూడా రెండు ఎన్నికల మధ్య 2% మద్దతును కోల్పోయాయి. ఇక కాంగ్రెస్ గత ఐదేళ్లలో 1% దళితుల మద్దతును కోల్పోయింది.

అయితే దళితుల ఓట్లను కాంగ్రెస్ మిత్రపక్షాలు చేజిక్కించుకోగా, యూపీలోని సమాజ్ వాదీ పార్టీ దళితుల ఓట్ల ద్వారా పెద్దఎత్తున ప్రయోజనం పొందింది.

ఉత్తరప్రదేశ్ దళితుల్లో బీజేపీకి మద్దతు గణనీయంగా తగ్గిందని, మరికొన్ని రాష్ట్రాల్లో స్వల్ప నష్టం వాటిల్లిందని రాష్ట్ర స్థాయి గణాంకాలు సూచిస్తున్నాయి.

ఆదివాసీలలో కాంగ్రెస్ పార్టీ జారవిడుచుకున్న మద్దతును ఆ పార్టీ మిత్రపక్షాలు 2 శాతం పొంది, కొంతమేర నష్టాన్ని భర్తీ చేసినట్టుగా కనిపిస్తోంది.

బీజేపీకి 2024 ఎన్నికలలో ఆదివాసీల ఓట్లు పెరగడం ఆ పార్టీకి శుభవార్తే.

ఈసారి ఆదివాసీల ఓట్లు 2019 ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీకి 5%మేర పెరిగాయి.

బీజేపీకి ముస్లింలలో 1 శాతం మద్దతు తగ్గిపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు కానీ ఆ మేరకు ఈనష్టాన్ని దాని భాగస్వామ్యపక్షాలు భర్తీ చేశాయి.

కాంగ్రెస్ పార్టీకి ముస్లింలలో 5 శాతం మేర మద్దతు పెరిగింది. కానీ ముస్లింల నుంచి అసలైన లబ్ధిని కాంగ్రెస్ మిత్రపక్షాలు (15శాతం) పొందాయి. వీటిల్లో ఎక్కువ భాగం యూపీలో సమాజ్ వాదీ పార్టీ, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ పొందాయి.

దిల్లీలో కాంగ్రెస్, ఆప్ కూటమికే ముస్లిం ఓట్లలో ఎక్కువభాగం పడ్డాయి.

ముస్లింల మద్దతు ఇండియా కూటమికి గణనీయమైన ప్రయోజనం చేకూర్చినట్టు కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో బీజేపీ పెద్ద మొత్తంలో సీట్లు నష్టపోయినా, వివిధ సామాజికవర్గాల నుంచి దానికి లభిస్తున్న మద్దతు విషయంలో పెద్దగా మార్పు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీనికి సమాధానం సులభమే. బీజేపీకి జాతీయ ఓటు షేర్‌లో పెద్ద మార్పేమీ సంభవించలేదు.

2024లో ఆ పార్టీకీ 36.6 శాతం ఓట్లు రాగా, 2019లో ఆ మొత్తం 37.6 శాతంగా ఉంది. సీట్లు ముఖ్యం. సీట్ల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ సీట్ల సంఖ్యకు మించిన కథ ఇంకా ఉంది.

లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ డేటా

బీజేపీ బలం పెరిగిందా?

ఈసారి (2024) పార్లమెంటు ఎన్నికలలో పేదలు, అల్పాదాయ వర్గాల ఓట్లలో గణనీయమైన మార్పు కనిపించింది.

గతంలో (2104, 2019 లోక్‌సభ ఎన్నికలు), పేదలు, ధనికుల ఓట్ల మధ్యన బీజేపీకి మద్దతు విషయంలో పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉండేది.

పేదలు, అల్పాదాయవర్గాలతో పోల్చినప్పుడు ధనికులు, మధ్యతరగతి ఓటర్లు బీజేపీకి ఎక్కువగా ఓటు వేశారు.

కానీ 2024లో బీజేపీకి ఓటు వేసే విషయంలో పేదలు, ధనికుల మధ్య ఈ అంతరం భారీగా తగ్గిపోయింది.

భారతీయ జనతా పార్టీ 2024 సాధారణ ఎన్నికలలో మెజార్టీ సాధించకపోయినా ఆర్థికంగా బలహీనమైన వర్గాలలో గణనీయమైన ఓట్లు ఆ పార్టీకే పడ్డాయని లోక్‌నీతి -సీఎస్‌డీఎస్ పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడైంది.

పేదలలో 37శాతం బీజేపీకి ఓటు వేయగా, 21 శాతం కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు.

కానీ బీజేపీ మిత్రపక్షాలు పేదల ఓట్లను చాలా తక్కువ నిష్పత్తిలో (6శాతం) పొందాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం పేదల నుంచి 14శాతం ఓట్లు పొందాయి.

అదే విధంగా దిగువ వర్గాల నుంచి బీజేపీ 35శాతం ఓట్లు సాధించింది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లకన్నా 13 పర్సంటేజీ పాయింట్లు ఎక్కువ.

మధ్యతరగతి ఓటర్ల విషయంలో దిగువ వర్గాల మాదిరే కాంగ్రెస్ పై బీజేపీ ఆధిక్యం కనపరిచింది. అయితే ఉన్నత వర్గాల (41%) నుంచి బీజేపీ అత్యధిక నిష్పత్తిలో ఓట్లు సాధించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2019తో పోల్చినప్పుడు బీజేపీకి ఓటు వేసిన ఉన్నతవర్గాల (41%) నిష్పత్తిలో తగ్గుదల కనిపించింది.

ఈ ఎన్నికలలో మధ్యతరగతి నుంచి బీజేపీకి లభించిన మద్దతులో కూడా 3 పర్సంటేజీ పాయింట్ల స్వల్ప తగ్గుదల కనిపించింది.

ఇక దిగువ వర్గాలలో 35 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. 2019లో ఈ మొత్తం 36 శాతంగా ఉంది.

2014 నుంచి బీజేపీ పేదల ఓట్లు పొందడంలో స్థిరమైన వృద్ధిని సాధిస్తోందని గమనించాలి. 2024 ఎన్నికల్లో అది స్వల్పంగా పెరిగి బీజేపీ వాటా 37 శాతానికి పెరిగింది.

బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రత్యేకించి ఎక్కువమంది పేదలకు ఉచిత రేషన్ పథకం అనేది బీజేపీకి అనుకూలంగా పనిచేశాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)