ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సీట్లు ఎందుకు తగ్గాయి? యోగి ఏం చేయబోతున్నారు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నడిబొడ్డున దాదాపు 50 ఎకరాల్లో నిర్మించిన గోరఖ్‌నాథ్ ఆలయంలో పెద్ద ఆసుపత్రి, ఆయుర్వేద ఔషధ కేంద్రం, సంస్కృత పాఠశాల, ఆధునిక హాస్టళ్లు ఉన్నాయి.
ఆలయానికి సమీపంలో ఎరుపు-గులాబీ రంగులో రెండు అంతస్తుల పాత ఇల్లు ఉంది, దాని మొదటి అంతస్తులోని ఒక గదిలో ఆలయ మహంత్, ఎంపీ అవైద్యనాథ్ నివసించేవారు. ఆయన మరణానంతరం, యోగి ఆదిత్యనాథ్ ఆలయ ప్రధాన మహంత్ అయ్యారు. అనంతరం తన గురువు గదికి మారారు.
గత వారం జూన్ 3న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యథావిధిగా తెల్లవారుజామున నిద్రలేచి, సిద్ధమై, తన నివాసం పక్కనే ఉన్న శక్తిపీఠం ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వచ్చారు.
అప్పుడు ఆయన గోశాలకు వెళ్లి అదే రోజు రాజధాని లఖ్‌నవూ తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
ఎంపీగా ప్రజలతో మమేకమైన ఆయన నివాసంలో ఒక రెడ్‌రూమ్ ఉంది, నేటికీ ఆ పద్ధతి కొనసాగుతోంది. రెడ్ రూమ్‌లోంచి వెళుతుండగా, ఓ పాత ఉద్యోగి "మహారాజ్ జీ, రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, ఆ మరుసటి రోజు మీ పుట్టినరోజు. ఆ తర్వాత మిమ్మల్ని చూడగలమా?" అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ నవ్వుతూ ముందుకు సాగారు. రాబోయే కొద్ది రోజులు ఎంత 'సవాల్'గా ఉండబోతున్నాయో బహుశా ఆయన ఊహించి ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మారిన ఎత్తులు
జూన్ 4 ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. లోక్‌సభలో పూర్తి మెజారిటీ సాధించాలంటే 272 సీట్లు గెలవాలి. కానీ, బీజేపీ సొంతంగా ఈ సంఖ్యను సాధించలేకపోయింది, 32 సీట్లు తగ్గాయి.
80 లోక్‌సభ స్థానాలున్న యూపీ నుంచి బీజేపీ గతంలో మాదిరిగా 60 కంటే ఎక్కువ స్థానాలను ఆశించింది, అయితే పార్టీ అక్కడ వెనుకబడిపోయింది.
సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది, బీజేపీ కేవలం 33 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
బీజేపీ-ఎన్డీఏ కూటమికి 36 సీట్లు, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమికి 43 సీట్లు వచ్చాయి.
ఇది బీజేపీకి పెద్ద దెబ్బ ఎందుకంటే గత ఎన్నికల్లో ఎన్డీయేకు 64 సీట్లు వచ్చాయి.
యోగి ఆదిత్యనాథ్ గత లోక్‌సభ, మునుపటి అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో తిరిగి సీఎం పీఠం కైవసం చేసుకున్నారు, అయితే ఈ ఫలితాలు ఆయనకు షాక్‌కు గురిచేసి ఉంటాయి. యోగిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ 37 స్థానాలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 6 స్థానాల్లో విజయం సాధించారు.
రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ వీర్ సంఘ్వీ.. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంటే, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు నేరుగా మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నాయి, ముఖ్యంగా యూపీలో బుల్డోజర్ ప్రభుత్వ చిహ్నంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ ముస్లింలకు అనుకూలమని బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది, అయితే, హిందూ జనాభా మెజారిటీ ఉన్న యూపీలో అదే ఎస్పీ అత్యధిక ఓట్లు సాధించింది. అంతేకాదు రామాలయం నిర్మించిన అయోధ్య(ఫైజాబాద్)లో బీజేపీ ఓడిపోయింది’’ అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 49.6 శాతం ఓట్లు రాగా, అది 2024లో 41.4 శాతానికి పడిపోయింది. మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధ్యత ఎవరిది?
లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్‌లో ఉన్న బీజేపీ కార్యాలయం రూపురేఖలు 2014 నుంచి చాలా మారాయి. ఎత్తైన పైకప్పులు, పెద్ద తలుపులు, తడి గోడలతో కనిపించే ఆ పాత భవనం చాలా మైలురాళ్లను చూసింది.
ఆ కార్యాలయం 1990 నుంచి 2004 వరకు స్థానిక ఎంపీగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ తరువాత కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా చూసింది.
2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 'ఇండియా షైనింగ్' నినాదంతో అధికారం చేపట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన విఫల ప్రయత్నాన్ని కూడా ఆ పాత కార్యాలయం చూసింది.
2014 తర్వాత యూపీలో బీజేపీ ప్రచారానికి ఇన్‌ఛార్జ్‌గా అమిత్ షా బాధ్యతలు చేపట్టడంతో ఈ కార్యాలయం రూపు రేఖలు మారిపోయాయి. ఆ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ఈ కొత్త కార్యాలయం మొదటి అంతస్తులో 'వార్ రూమ్' ఏర్పాటుచేశారు. ఈ కార్యాలయం యూపీలో కొత్త ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్)ని కూడా చూసింది. దశాబ్దం తర్వాత 2024 జూన్ 4 ఉదయం ఎన్నికల ఫలితాల సరళి తెలియడం ప్రారంభమవడంతో ఈ కార్యాలయం మళ్లీ నిశ్శబ్దం, వైఫల్యాన్ని అనుభవించింది.
యూపీలో బీజేపీకి అధిక సీట్లు దక్కకపోవడంపై గోరఖ్‌పూర్‌లోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మహేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "దీనికి ప్రధాన కారణం ఎన్నికల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు తక్కువగా పాల్గొనడం" అని అన్నారు.
ఈ దఫా ఎన్నికల ప్రచారంలోనూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగాలలో 'నేరస్తులు, అక్రమార్కులపై బుల్డోజర్లను ఉపయోగించడం' అంశాన్ని పదేపదే పునరుద్ఘాటించారు.
2024 మే 23న బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ "నేను రాకముందే ఇక్కడికి బుల్డోజర్లను తెచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మాఫియా, ఉగ్రవాదులకు ఇదే అత్యుత్తమ చికిత్స" అని అన్నారు.
న్యాయ ప్రక్రియ పూర్తికాకముందే ఒకరి ఇల్లు లేదా ఆస్తులను బుల్డోజ్ ద్వారా బలప్రయోగం చేసే విధానాన్ని ఓటర్లు తిరస్కరించినట్లు స్పష్టమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
టికెట్ల పంపిణీ
యూపీ ఎన్నికలను చాలాసార్లు కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ నిధి రజ్దాన్ మాట్లాడుతూ "ఈసారి 400 ప్లస్ అనే మోదీ హామీలో యూపీలోని ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఒంటరయ్యారు’’ అని అభిప్రాయపడ్డారు.
"టికెట్ల పంపిణీలో కేంద్ర నాయకత్వ పాత్ర ఎక్కువగా కనిపించింది, ఇది ప్రతికూలమని రుజువైంది. భవిష్యత్తులో యోగి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనే ఎవరూ ధ్రువీకరించని వార్తలు వస్తూనే ఉన్నాయి"అని తెలిపారు నిధి.
ఈ ఎన్నికల్లో పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, బిహార్, ఝార్ఖండ్‌లలో మంచి పనితీరు కనబరిచిన బీజేపీ.. తన 'కంచుకోట' అయిన యూపీలో తక్కువ సీట్లకే పరిమితమైంది.
ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ పర్యటన తర్వాత తిరిగి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ సబా నఖ్వీ మాట్లాడుతూ "నింద ఎవరో ఒకరిపై పడాల్సి వస్తోంది. ఫలితాలకు యూపీలో యోగి పేలవమైన పనితీరు కారణమని నిందిస్తున్నారు" అని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన దళిత నాయకుడు ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. యూపీలోని 80 సీట్లలో కనీసం 25 స్థానాల అభ్యర్థులను కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. యోగి అక్కడ వేరే వారిని కోరుకున్నారు. మరోవైపు ఈసారి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థుల ఎంపికపై అఖిలేష్ యాదవ్ ఎక్కువ శ్రద్ధ చూపారు, టిక్కెట్ల పంపిణీలో చాణక్యుడి పాత్ర పోషించారు’’ అని తెలిపారు.
ఓవైపు యోగి, బీజేపీ అగ్ర నాయకత్వానికి మధ్య సీట్ల సర్దుబాటుపై భిన్నాభిప్రాయాలుండగా మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి టికెట్ల విషయంలో దాని సన్నిహితులనూ తిరస్కరించిన విషయం గుర్తుంచుకోవాలి. కూటమికి అలాంటి కొన్ని టిక్కెట్లు ట్రంప్ కార్డుగానూ మారాయి.
ఉదాహరణకు, ఎస్పీ అఖిలేష్ యాదవ్ ఐదుగురు యాదవ్ అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వడం(వారందరూ తన కుటుంబానికి చెందినవారే అయినా) లేదా ఐదారుగురు ముస్లిం అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వడం పరిశీలిస్తే ఆయన లెక్కలు వేసుకొని మరీ ఎన్నికల బరిలోకి దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అంటే, ఇండియా కూటమి ఓబీసీ-దళిత కార్డును ఏ విధంగా ఉపయోగించిందనేది బీజేపీకి ఆలస్యంగా అర్థమైంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ ప్రతినిధి స్పందిస్తూ “బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, కొత్త భారతదేశాన్ని సృష్టిస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ప్రతిపక్షాలు ప్రజలకు చెబుతూనే ఉన్నాయి. ఇది మొదటి దశ ఓటింగ్‌లోనే గ్రహించాల్సి ఉంది, కానీ అలా జరగలేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యోగి ఏం చేయబోతున్నారు?
జూన్ 4 సాయంత్రం నాటికి, ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు బీజేపీపై తక్కువ విశ్వాసం చూపించారని స్పష్టమైంది. వేల కోట్ల రూపాయలతో రామమందిరం కట్టడం, అయోధ్య పునరుద్ధరణ, బుల్ డోజర్ల ద్వారా న్యాయం చేయడం వంటి అంశాలు పెద్దగా ప్రభావం చూపలేదు.
ఈ పజిల్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్థం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవడానికి జూన్ 7న ప్రయాగ్‌రాజ్‌లోని రాష్ట్ర సివిల్ సర్వీసెస్ కమిషన్‌తో మాట్లాడారు.
జూన్ 8న యోగి ఆదిత్యనాథ్ లక్నోలో కేబినేట్ సమావేశం ఏర్పాటుచేసి "ఇక చాలు. వీఐపీ సంస్కృతికి దూరంగా ఉండండి. మీ నియోజకవర్గాలకు వెళ్లండి, ప్రజలతో మళ్లీ కనెక్ట్ అవ్వండి" అని మంత్రులకు సూచించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దిగువ స్థాయి ప్రభుత్వ నియామకాలు వాయిదా వేస్తూ ఉచిత రేషన్, ఉచిత గ్యాస్ వంటి పథకాలపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపడంపై యూపీ యువతలో కోపం ఉంది.
కుల సమీకరణల ప్రాతిపదికన టికెట్లు పంచి ఇండియా కూటమి లాభపడిందని, యువత కూడా వీరికే ఎక్కువ ఓట్లు వేశారని ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది.
స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, మహేంద్ర పాండే, అజయ్ మిశ్రా తేని, సంజీవ్ బలియన్, కౌశల్ కిషోర్, బీపీఎస్ వర్మ సహా అనేకమంది కేంద్ర మంత్రులు, యోగి కేబినెట్ మంత్రులు ఉత్తర ప్రదేశ్‌లో ఓటమిని ఎదుర్కొన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అగ్నివీర్ నియామకం, ప్రభుత్వ పరీక్షల్లో పేపర్ లీక్, ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ఆలస్యం ఈ సమస్యలన్నీ యూపీ యువ ఓటర్లను ప్రభావితం చేశాయి.
అయితే, యోగి ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్-ఎస్పీ షాక్ ఇచ్చాయా లేదా మరెవరికైనా షాక్ ఇచ్చారా? అనేది ముఖ్యమైన అంశం.
యోగి ఆదిత్యనాథ్‌తో సన్నిహితంగా ఉన్నవారు "రాష్ట్రంలో బీజేపీ తన విశ్వసనీయతను తిరిగి పొందాలంటే, యోగి మాత్రమే చేయగలరు" అని అంటున్నారు.
కానీ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు "యోగి చాలా త్వరగా ముందుకు వెళ్లాలని కోరుకున్నారు, అయితే రాజకీయాల్లో ప్రతిదీ ఓపికతోనే సాధ్యమవుతుంది" అని స్పష్టంచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














